- అందాల పోటీ విజేతగా పాకశాస్త్ర ప్రవీణ
- వరించిన మిసెస్ సౌత్ ఏషియా టైటిల్
- అంతర్జాతీయ అందాల శ్రీమతి పోటీలకు సిద్ధం
ఆమె గరిటె తిప్పితే... ఘమఘమలు నలుదిశలా పరిమళిస్తాయి. పాఠాలు చెప్పడం మొదలుపెడితే... చెఫ్‌లు కాబోయేవారంతా చెవులప్పగిస్తారు. పేరులోనే ‘రుచి’ని మేళవించుకున్న ఆ పాకశాస్త్ర ప్రవీణ... గ్లామర్ వరల్డ్‌లోనూ సత్తా చూపుతున్నారు. వంటలరాణిగా నగరానికి తెలిసిన మహిళ... అందాల శ్రీమతిగానూ ఆకట్టుకుంటున్నారు. మిసెస్ సౌత్ ఏషియా పోటీల్లో విజేతగా నిలిచిన రుచికాశర్మ... త్వరలో జరుగనున్న మిసెస్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్‌కూ సిద్ధమవుతున్నారు ఈ మాదాపూర్ నివాసి. ఈ నేపథ్యంలో ఆమె అంతరంగ ఆవిష్కరణ ఆమె మాటల్లోనే...
వంటలే ప్రపంచమై...
ఐఎస్‌బీ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ చేశాక... 15ఏళ్ల క్రితం చెఫ్‌గా కెరీర్ ప్రారంభించాను. అక్కడ నుంచి వంటలే నా ప్రపంచం అయిపోయింది. హైదరాబాద్ బిర్యానీ మీద భారతదేశపు తొలి కుకింగ్ వీడియోను రూపొందించి విడుదల చేశాను. కెన్‌వుడ్ ఇండియా చెఫ్స్ బోర్డ్‌లో సభ్యురాలిగా మారాను. ఫుడ్ క్రిటిక్‌గా, ఫీచర్స్ రైటర్‌గా వివిధ ఆంగ్ల, ప్రాంతీయ భాషా పత్రికల్లో, ఛానెల్స్‌లో పనిచేశాను. టీవీల్లో వంటల పోగ్రామ్స్ అయితే దాదాపు 700 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ప్యాకేజింగ్, రెసిపీ డెవలప్‌మెంట్ వంటి కళలతో ఫుడ్‌స్టైలిస్ట్‌గానూ పేరొచ్చింది. నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ, ఆర్మీ... తదితర శాఖలకు శిక్షణ తరగతులు నిర్వహించాను. నగరంలోని కంట్రీక్లబ్, సికింద్రాబాద్ క్లబ్, మహేశ్వరి మహిళా మండలి... ఇలా పలు సంస్థల కోసం కుకరీ వర్క్‌షాప్‌లూ నిర్వహించాను. ప్రస్తుతం నగరంలో రెండు ‘రుచిక క్యులినరీ ఇన్‌స్టిట్యూట్’లు కూడా నిర్వహిస్తున్నాను.
ఫిట్‌నెస్ సీక్రెట్స్...
రోజూ గంట పాటు యోగా... మరో గంట స్విమ్మింగ్ చేస్తాను. మితాహారం తీసుకుంటాను. జిమ్‌లో గంటన్నర వ్యాయామం.
నిరుపేద మహిళల స్వయం ఉపాధికి ఊతంగా...
హోమ్ అప్లయెన్సెస్‌కు సంబంధించిన డాక్యుమెంటరీలకు, అడ్వర్టయిజ్‌మెంట్లకు వర్క్ చేశాను. వంటల పుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్నాను. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది మధ్యతరగతి, నిరుపేద మహిళలకు కుకింగ్ ద్వారా స్వయం ఉపాధి పొందడం అనే అంశంలో శిక్షణ ఇచ్చాను. అలా నేను శిక్షణ ఇచ్చిన వారిలో కొందరు మహిళలు తయారు చేసిన చాక్లెట్లను ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో విక్రయిస్తుండడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో భాగంగా నన్ను ఆహ్వానిస్తే ఎటువంటి రుసుము తీసుకోకుండానే తరగతులు నిర్వహిస్తాను. ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేది మహిళల సమస్యల పరిష్కారానికి చాలా అవసరమని నా అభిప్రాయం.
వీల్‌చైర్ మార్చిన ‘నడక’...
అందాల పోటీ ఎప్పుడూ నా ఆలోచనల్లో కూడా లేదు. అనుకోని సంఘటనల నుంచే అనూహ్యమైన ఆలోచనలు వస్తాయంటారు. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్ మీద రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యుముఖంలోకి వెళ్లి వచ్చాను. ఏడెనిమిది నెలలు బెడ్ మీద ఉన్నాను. మరో మూణ్నెళ్లు వీల్‌చైర్ మీదే తిరిగా ను. నడక ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ర్యాంప్‌వాక్ నా దృష్టిని ఆకర్షించింది. ప్రమాదం కారణంగా నాలో పేరుకుపోయిన స్తబ్థతను వదిలించుకునేందుకు రొటీన్‌కు భిన్నంగా ఏదైనా చేయాలనిపించింది. అలా తొలిసారిగా గత ఏడాది గిల్మా ఇంటర్నేషనల్ నిర్వహించిన మిసెస్ ఇండియా క్వీన్ పోటీలో పాల్గొన్నాను. మోస్ట్ పాప్యులర్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్నాను. ఆ తర్వాత మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలకు దరఖాస్తు చేశాను. మిసెస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్‌గా ఎంపికయ్యాను. అదే క్రమంలోనే మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్‌గా నిలిచాను. జూలై 25న జరిగే మిసెస్ ఇంటర్నేషనల్ పోటీలకు హాజరుకాబోతున్నా.
భవిష్యత్తు ప్రణాళికలు..
అంతర్జాతీయ అందాల శ్రీమతిగా కిరీటాన్ని దక్కించుకుంటాననే నమ్మకంతో ఉన్నాను. అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాను. పోటీల నుంచి వచ్చాక వంటల వ్యాపకాన్ని వదలకుండానే మరిన్ని కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నా.
ముఖ్యంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడితే అది వారికి ఎంత బలాన్నిస్తుందో అది సమాజానికి ఎంత మేలు చేస్తుందో నాకు తెలుసు. అందుకే అలాంటి కార్యక్రమాలు వ్యక్తిగతంగా మరిన్ని చేపట్టాలని, లేదా ఏవైనా సంస్థలు చేస్తుంటే నా వంతు సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నాను.
అందాల శ్రీమతి పోటీ జరిగే తీరిది...
ఈ పోటీల్లో అసభ్యత ఉండదు. ఈ పోటీల్లో అందానికి ప్రాధాన్యం తక్కువే. బికినీ రౌండ్ లాంటివి ఉండవు. గృహిణులు తమ కుటుంబం కోసం మాత్రమే కాదు తోటి మహిళల కోసం ఏం చేస్తున్నారనేది కూడా పరిశీలిస్తారు. ఒక్కొక్కరికీ ఓ అంశాన్ని కేటాయించి అందులో వారి ప్రజ్ఞస్థాయిని అంచనా వేసేందుకు ఇంటర్వ్యూ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకు 50 మార్కులు, ఫిట్‌నెస్ వేర్‌కు 25 శాతం, ఈవెనింగ్ గౌన్‌కు మరో 25 శాతం మార్కులుంటాయి. గత పాతికేళ్లుగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 21 నుంచి 56 సంవత్సరాల మధ్యవయస్కులను మాత్రమే అనుమతిస్తారు. ఈ ఏడాది జూలై 25న టైమ్స్ యూనియన్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, జాక్సన్ విల్లే-ఫ్లోరిడాలో జరిగే ఈ పోటీలో 70 దేశాల వరకూ పాల్గొంటున్నాయి.
కుటుంబానికీ...
ఒక మహిళకు కుటుంబ విజయం ఎంతైనా కీలకం అని నా నమ్మకం. సుస్మితాసేన్ గౌన్‌లను నేను ఇష్టపడడం చూసి అచ్చం అలాంటివే నాకు కుట్టిన అమ్మ దగ్గర నుంచి నా ఇష్టాయిష్టాలు ఎప్పుడూ కాదనని భర్త వరకూ అందరూ నా విజయంలో భాగస్తులే. ఎంత బిజీగా ఉన్నా ఇంటి బాధ్యతల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఉదయమే మా అబ్బాయి రోషత్‌ని సిద్ధం చేసి, 2 రకాల టిఫిన్లు వండి బాక్స్‌లో పెట్టి స్కూల్‌కి పంపడంతోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. మా అబ్బాయి స్కూల్‌లో అందరికీ వాళ్ల మమ్మీ మంచి చెఫ్ అని తెలుసు కాబట్టి... నేను ప్రతిరోజూ వెరైటీ వంటకాలు వండాల్సిందే. మా వాడి ఫ్రెండ్స్ చెప్పే అభిప్రాయాలు వినాల్సిందే. ఇక ఎంత బిజీగా ఉన్నా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చే టైమ్‌కి తిరిగి ఇంటికి వచ్చేస్తాను.