మిస్ ఇండియా సెకండ్ రన్నరప్ శ్రేయా రావు (ఫేస్ బుక్ సౌజన్యంతో...)
సాక్షి, ముంబై: ఫెమినా మిస్ ఇండియా-2018 పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) రెండో రన్నరప్‌గా నిలిచి సత్తా చాటారు. ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.. ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.
‘అర్కిటెక్ అయిన నాకు మిస్ ఇండియా పోటీలకు యత్నించటం తొలుత కష్టంగానే అనిపించింది. ర్యాంప్ వాక్ అంటే ఏంటో నాకు అస్సలు తెలీదు. పైగా మేకప్ వేసుకోవటం కూడా నాకు రాదు. దీనికితోడు అందాల పోటీలు అనగానే నా పెరెంట్స్ ఒక్కసారిగా భయపడ్డారు. వారిలో తెలీని ఏదో ఆందోళన. నా అడిషన్స్ అన్నీ చూశాక వాళ్ల అభిప్రాయం మారింది. ఇది కేవలం ఒక్క అందాల పోటీలే కాదని, నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానన్న నమ్మకం వారికి ఏర్పడింది. అందుకే చివర్లో మంచి ప్రోత్సాహం అందించారు. సాధ్యమైనంత వరకు నా వ్యవహారాలు నేనే చూసుకున్నా’ని ఆమె తెలిపారు.
ఇప్పుడు తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని, ఇంత కంటే పెద్ద విజయాన్ని తన దేశానికి అందించాలనుకున్నట్లు శ్రేయా ధీమాతో చెబుతున్నారు. ‘నా కల తీరాక తిరిగి నా ప్రొఫెషన్‌కు వెళ్లిపోతా. విద్యాసంస్థలు నెలకొల్పటం నా కల. అది నెరవేరే దాకా కృషి చేస్తా. అంతేగానీ గ్లామర్ వరల్డ్‌లో మాత్రం అడుగుపెట్టదల్చుకోలేదు’ శ్రేయా రావు స్పష్టం చేశారు. కాగా, రెండో రన్నరప్ అయిన శ్రేయా.. మిస్ యునైటెడ్ కాంటీనెంట్స్ 2018 పోటీలకు భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment