ఈ అచ్చ తెలుగు అమ్మాయి చెన్నైలోనే కాదు, అందాల పోటీల్లోనూ ఒక సంచలనం. మిస్ సౌత్ ఇండియా.. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా అందాల పోటీల్లో అదరగొట్టి ఇప్పుడు గ్లోబల్ టైటిల్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది. ‘‘అసలే మొండిదాన్ని.. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోను’’ అంటోంది అక్షర.
కుటుంబ నేపథ్యం
నాన్న సుధాకర్ రెడ్డి. అమ్మ గౌరి. చెన్నైలో స్థిరపడిన కుటుంబం. నన్ను ఇంట్లో ముద్దుగా గుగ్గుపాప అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచే బ్యూటీ కాంటెస్ట్‌లపై ఎక్కువ ఆసక్తి ఉండేది. 2011లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నాను. 2016లో మిస్ అమరావతి పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించా. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా 2019 పోటీల్లో విజేతగా నిలిచా. ఈ టైటిల్‌కు 22 రాష్ట్రాలకు చెందిన 240 మంది పోటీపడ్డారు. మిస్ సూపర్ గ్లోబ్ ఇండియా తర్వాత దుబాయ్‌లో జరిగే మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలకు భారత్ తరఫున సిద్ధమౌతున్నా.
అక్టోబర్‌లో జరిగే ఈ పోటీలలో 45 దేశాలకు చెందిన యువతులు పాల్గొంటారు. భారత్ తరఫున ఇంటర్నేషనల్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనాలన్నది నా కల. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ ద్వారా అది నెరవేరుతుండటం సంతోషంగా ఉంది. ప్రపంచ అందాల పోటీల్లో భారత ప్రతిష్టను మరింత పెంచాలన్నదే నా లక్ష్యం. దుబాయ్‌లో జరిగే పోటీల కోసం అందానికి మరిన్ని మెరుగులద్దుకోవడంతో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించా. మిస్ సూపర్ వరల్డ్ గ్లోబ్ పోటీలో పాల్గొనే మిగతా కంటెస్టెంట్‌లను వెనక్కినెట్టి టైటిల్ తీసుకువస్తానన్న నమ్మకం నాకుంది.
జీరోసైజు వద్దేవద్దు
ఫ్యాషన్ రంగంపై మోజుతో వచ్చే యువతకు నాదొకటే సలహా. మోడల్ కావాలనే ఆశతో డైటింగ్ అంటూ ఎక్సర్ సైజులతో జీరోసైజ్ కోసం ప్రయత్నిస్తారు. అవన్నీ అవసరం లేదు. మీ శరీరాకృతిపై మీ కంట్రోల్ ఉంటే చాలు. మరీ చబ్బీగా కాకుండా హెల్దీగా ఉంటే చాలు. అపనమ్మకాన్ని వదిలేయండి. మనలోని ప్లస్‌లు మైనస్‌లు బేరీజు వేసుకుని మన నుండి నెగిటివ్ థాట్స్ తీసేస్తే చాలు.. ఏ పోటీలోనైనా విజయం సాధ్యమే. నేను అలాగే ఉంటా. మీపై మీ నమ్మకమే విజయానికి చేరువ చేస్తుంది. నా రోల్ మోడల్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగటం నాపై నాకు బలమైన నమ్మకం ఏర్పడేలా చేసింది.
మిస్ ఇండియా సౌత్ కు ముందు తమిళ్‌లో ఓ చానెల్‌కు చేసిన ‘విల్లా టు విలేజ్’ అనే కార్యక్రమం.. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసానికి దోహదపడింది. అంతేకాదు.. ఆ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడైతే వెండితెర అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిమ్ ఇప్పుడు యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. తమిళంలో రెండు సినిమాలకు సంతకాలు చేశా. అవి ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. నా అభిమాన హీరో అజిత్ కుమార్. ఆయనతో ఒక్క చిత్రంలోనైనా నటించాలనుంది. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. కానీ.. ప్రపంచ పోటీలపై దృష్టి పెట్టా. టైటిల్ సాధించాక భవిష్యత్తు గురించి ఆలోచిస్తా’’ అని ముగించింది అక్షర.
సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి, సాక్షీటీవీ, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment