పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు. అయితే అ అననుకూలతలనే అవకాశాలుగా మార్చుకుని ఏకంగా మిసెస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది డాక్టర్ దివ్యా పాటిదార్ జోషి. గతేడాది జరగాల్సిన ‘మిసెస్ యూనివవర్స్ సెంట్రల్ ఏషియా–2021’ పోటీలను కరోనా కారణంగా ఇటీవల సియోల్‌లో నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న దివ్య 120 దేశాల అందాల రాశులను వెనక్కు నెట్టి మిసెస్ యూనివర్స్ సెంట్రల్ ఏషియా కిరీటాన్ని దక్కించుకుంది. కిరీటమేగాక తన ప్రతిభాపాటవాలతో ‘మిసెస్ యూనివర్స్ ఇన్‌స్పిరేషన్’ పురస్కారాన్ని కూడా గెలుచుకుని ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది.
మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన దివ్య చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే అమ్మాయి. డిగ్రీ చదివిన దివ్య హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. గిటార్‌ను చక్కగా వాయించడమేగాక, మంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ కూడా. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్, సామాజిక కార్యక్రమాలు, నటన, సంగీతం పోటీలలో ఎంతో చురుకుగా పాల్గొనేది. సరిగమపా టీవీషో, ఇండియన్ ఐడల్‌లలో పాల్గొని టాప్ –100 జాబితాలో కూడా నిలిచింది.
అత్తమామల ప్రోత్సాహంతో...
రత్లాంకు చెందిన మర్చంట్ నేవీ అధికారి ప్రయాస్ జోషితో 2013లో దివ్యకు పెళ్లయ్యింది. ముందు నుంచి దివ్యకు ఉన్న ఆసక్తి, ప్రతిభా నైపుణ్యాలు తెలుసుకున్న భర్త, అత్తమామలు పెళ్లి తరువాత మోడలింగ్, అందాల పోటీలలో పాల్గొనమని ప్రోత్సహించడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మోడలింగ్‌లో రాణిస్తూనే...‘మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ–2018’ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలో పాల్గొనే సమయంలో దివ్యకు ఏడాది బాబు ఉన్నాడు.
ఈ టైటిల్ తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం...‘‘మధ్యప్రదేశ్‌లో అత్యంత ప్రభావవంత మహిళ ’’గా నిలిచింది. మరుసటి ఏడాది ‘మిసెస్ యురేషియా’ టైటిల్‌ను గెలుచుకుంది. మోడలింగ్‌లో రాణిస్తూనే, పెళ్లి తరువాత ఇంగ్లిష్ సాహిత్యం, మ్యూజిక్‌లో మాస్టర్స్‌తోపాటు, మార్కెటింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎమ్‌బీఏ, సోషల్ వర్క్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి డాక్టరేట్‌ను పొందింది.
గౌను డిజైన్ చేసుకుని..
కరోనా సమయంలో దివ్య తండ్రి మరణించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న కూతుర్ని ఓదార్చే క్రమంలో ఆమె తల్లి రాధా పాటిదార్ ‘ఇవన్నీ మర్చిపోయి, అందాల పోటీలపై మనసుపెట్టు’ అని చెప్పింది. దీంతో తన మూడేళ్ల కొడుకు ఆర్యమన్‌ను చూసుకుంటూనే ఎంబ్రాయిడరీ, మిషన్ కుట్టడం బాగా తెలిసిన దివ్య.. మిసెస్ సెంట్రల్ ఏషియా పోటీలకు వేసుకోవాల్సిన గౌనును తనే స్వయంగా డిజైన్ చేసి కుట్టుకుని దానినే ధరించి, టైటిల్ విన్నర్‌గా నిలిచింది.
ఎన్జీవోలను నడుపుతూ...
మహిళలు, పిల్లల అభ్యున్నతే లక్ష్యంగా ‘ద గ్రోయింగ్ వరల్డ్ ఫౌండేషన్, ద గ్రోయింగ్ ఇండియా ఫౌండేషన్’ల పేరిట దివ్య ఎన్జీవోలను నడుపుతోంది. ఇవేగాక ఇతర ఎన్జీవోలతో కలిసి సామాజిక సేవ చేస్తోంది. బాలికల విద్యపై వివిధ కార్యక్రమాలు చేపడతూ బాలికల్లో అవగాహన కల్పించి, వారి అభ్యున్నతికి కృషిచేస్తోంది. పదకొండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికోసం పనిచేస్తోంది. గృహహింసపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల్లో ధైర్యం నింపుతోంది. ఇవేగాక వివిధ రకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా, రత్లాం మున్సిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛభారత్ మిషన్’కు అంబాసిడర్‌గా పనిచేస్తోంది. ఇన్ని కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికీ తన కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తోంది. వ్యక్తిగతంగా ఉన్నతంగా ఎదగడంతోపాటు, ఎన్నోవిజయాలు సాధిస్తూనే, సామాజికసేవలోనూ ముందుండి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది దివ్య.
నమ్మకం ఉంటే రోజూ అద్భుతమే
నన్ను వెన్నంటి ప్రోత్సహించిన వారిలో అమ్మ తొలివ్యక్తి. ఆమెకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎవరైనా తమ కలలను నిజం చేసుకునేందుకు కనిపించే ప్రతిదారిలో వెళ్లవచ్చు. కానీ ఆ దారి ఇతరులెవరికి హాని చేయనిదై ఉండాలి. దేనిని ప్రతిబంధకంగా భావించకూడదు. అది జీవితంలో ఒక భాగం. ఇక్కడ అందరం విద్యార్థులమే. మొదట మనం నేర్చుకుని తరువాత మనమే ఇతరులకు టీచర్‌లుగా మారి నేర్చుకున్నది పాఠాలుగా చెప్పగలగాలి. నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. నమ్మకం ఉన్నప్పుడు ప్రతిరోజూ అద్భుతాలు చూడగలుగుతాము.
– డాక్టర్ దివ్యాపాటిదార్ జోషి.
Comments
Please login to add a commentAdd a comment