కాన్ఫిడెన్సే కిరీటం | Rajsthan Miss India Beauty Contest Winner Swapna | Sakshi
Sakshi News home page

కాన్ఫిడెన్సే కిరీటం

Published Mon, Dec 16 2019 12:07 AM | Last Updated on Mon, Dec 16 2019 12:07 AM

Rajsthan Miss India Beauty Contest Winner Swapna - Sakshi

‘మీకు ఒక అద్భుత శక్తి వచ్చి... చరిత్ర నుంచి ఎవరినైనా వెనక్కు తీసుకురావచ్చు అంటే మీరెవరిని తెస్తారు?’.. ఇది మహిళల అందాల పోటీలో ఒక కంటెస్టెంట్‌గా స్వప్నకు  ఎదురైన ప్రశ్న. అందుకు ఈమె ఇచ్చిన సమాధానమే ఆమెను విజేతను చేసింది. ఈవారం మనకు ఆమె ‘పరిచయం’ అయ్యేలా చేసింది.

‘‘ప్రతి మనిషిలోనూ వారికంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఒక వ్యక్తిని గొప్ప అని, మరొకరిని గొప్పకాదు అనడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ ఓ చరిత్ర ఉంటుంది. చారిత్రక వ్యక్తులంటూ కొందరికే గౌరవం ఇవ్వడం సరికాదు. ఏ వ్యక్తి అయినా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఒక ఇల్లు బాగుండాలంటే అందుకు తల్లి ప్రధానం. నేనైతే.. తల్లులు లేని ఇళ్లను వెతికి వాళ్లకు వారి తల్లులను తిరిగి తెచ్చిస్తాను. సమాజానికి దారి చూపే ప్రతి నాయకుడూ ఒక తల్లి తీర్చిదిద్ది్దన బిడ్డే. తల్లి బాగుంటే ప్రతి ఇల్లూ సమాజానికి ఒక లీడర్‌నిస్తుంది’’.. ఇది అందాల పోటీలో స్వప్న సమాధానం. ఏడేళ్ల కిందట దూరమైన తల్లిని తలుచుకుంటూ ఇచ్చిన సమాధానం. ఈ సమాధానమే ఆమెను ‘డ్యాజిల్‌ మిసెస్‌ ఇండియా వరల్డ్‌ 2019 ఎలీట్‌’ పోటీల్లో విజేతగా నిలిపింది. ఈ పోటీల్లో సెకండ్‌ రన్నర్‌ అప్‌ కిరీటం ధరించిన స్వప్న కోరిప తన విజయ ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు.

అందానికి భాష్యం
రాజస్థాన్‌ రాష్ట్రం పుష్కర్‌లో గత నవంబర్‌ తొమ్మిదవ తేదీన జరిగిన మిసెస్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో మిసెస్‌ బ్యూటీ రన్నర్‌ అప్‌ కిరీటాన్ని ధరించారు స్వప్న. అందం అంటే ముఖానికి మెరుగులు దిద్దుకునే మేకప్పులు కాదని, మహిళల దేహాకృతి– కొలతలు కాదని, ఆత్మవిశ్వాసమే అసలైన అందం అని అందానికి భాష్యం చెప్పారామె. ‘‘అందంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా తోటి వారితో వ్యవహరించే తీరు, ఒక అంశం మీద స్పందించే వైఖరి ఆధారంగా సాగే పోటీలివి. మనిషి లోపల భయం, ధైర్యం, అంతర్మధనం, అపరాధభావం, ఆత్మవిశ్వాసం వంటివన్నీ నడకలో ప్రతిబింబిస్తాయి.

ముఖంలో ప్రతిఫలిస్తాయి. అందుకే అడుగు తీసి అడుగు వేయడం నుంచి, ముఖ కవళికల వరకు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఇవన్నీ ద్వితీయాంశాలే. అసలైన పోటీ మన ఆలోచన తీరుదే. ఒక ప్రశ్నకు మనం ఏ సమాధానం చెప్పినా అది తప్పు కాదు. ఆ సమాధానంలో మన ఆలోచన తీరు వ్యక్తమవుతుంది. ఏ ప్రశ్నకూ ‘అవును, కాదు’ అనే పొడి సమాధానాలివ్వకూడదు. మన సమాధానంలో ఒక రీజనింగ్‌ ఉండి తీరాలి. ఆ సమాధానాన్ని విశ్లేషించి మార్కులు వేస్తారు’’ అని వివరించారు స్వప్న.

స్నేహపూర్వక పోటీ
‘‘మహిళలోని పరిపూర్ణత్వానికి ఈ పోటీ ఒక గీటురాయిగా ఉంటుందే తప్ప పోటీలో పాల్గొన్న వారి మధ్య పోటీతత్వం కనిపించదు. సాధారణంగా కనిపించే ఈర్ష్య, అసూయలు కూడా లేకుండా చాలా స్నేహపూర్వకంగా ఉంటారని తెలుసుకున్నాను’’ అన్నారు స్వప్న. ఆమె రాజస్థాన్‌లో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేను వేసుకున్న గాజు నా చీరకు సరిగ్గా మ్యాచ్‌ అవలేదు. మా పోటీలు జరిగిన రిసార్ట్‌ పుష్కర్‌ నగరానికి దూరంగా విసిరేసినట్లు ఉంది. ఏదైనా ఒక వస్తువు మర్చిపోతే బజారుకెళ్లి తెచ్చుకుందాం అనుకోవడానికి వీల్లేదు.

దాంతో నా దగ్గర ఉన్న గాజునే వేసుకున్నాను. అది చూసి అస్సాం నుంచి వచ్చి న‘మరోమి’ తన దగ్గరున్న బ్యాంగిల్‌ ఇచ్చింది. ఆ గాజు వేసుకున్న తర్వాత ఇప్పుడు పర్‌ఫెక్ట్‌గా ఉన్నారని కాంప్లిమెంట్‌ కూడా ఇచ్చింది. ఈ పోటీల్లో ఉండే వాళ్లందరూ బిడ్డల తల్లులే కావడంతోనే షేరింగ్, పరిణితి సాధ్యమైందనిపించింది. పోటీలకు వెళ్లేటప్పుడు తెలియలేదు, కానీ పోటీల అనుభవమే నాలో పరిపూర్ణత తెచ్చిందనిపిస్తోంది’’ అన్నారు స్వప్న.

‘మార్గదర్శక్‌’ విస్తృతం
సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ నిర్వహించే ట్రాఫిక్‌ సేఫ్టీ, ఉమెన్‌ సేఫ్టీ శిక్షణ తరగతుల్లో ‘ఉమెన్‌ సేఫ్టీ’ విభాగంలో ఆరువారాల పాటు శిక్షణ పొందారు స్వప్న. ఈ శిక్షణ పొందిన వారికి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌  ‘మార్గదర్శక్‌’ సర్టిఫికేట్‌ ఇస్తుంది. గృహహింసకు గురవుతున్న బాధిత మహిళలకు ఆలంబనగా ఉంటూ వారికి చట్టాల గురించి అవగాహన కల్పించడం, వారి అవసరాన్ని బట్టి షీ టీమ్స్, భరోసా సెంటర్‌ల ద్వారా మార్గనిర్దేశనం చేయడమే మార్గదర్శక్‌ ప్రధాన విధులు.

మిసెస్‌ బ్యూటీ విజయంతో వచ్చిన గుర్తింపును మార్గదర్శక్‌ సేవలను విస్తృతం చేయడానికి వినియోగించుకుంటానని చెప్పారు స్వప్న. ‘‘అమ్మ పోయిన తర్వాత ఏర్పడిన వెలితిని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న అనాథ శరణాలయం భర్తీ చేసింది. మా పాప పుట్టిన రోజు, అమ్మ పోయిన రోజుల్లో ఆ పిల్లల మధ్యనే గడుపుతున్నాను. వారికి బియ్యం, పుస్తకాలు, స్కూలు బ్యాగ్‌లు ఇవ్వడం వంటి చేతనైన సహాయం చేస్తున్నాను. ఈ చిన్న పనిలో ఎంత సంతోషం పొందుతున్నానో, బాధిత ఆడవాళ్లకు అండగా నిలవడం కూడా సంతోషం కలుగుతోంది’’ అన్నారు.

బిర్యానీ ల్యాండ్‌
ఈ కాంటెస్ట్‌లో మరో ముఖ్యమైన విషయం తమను తాము ఆవిష్కరించుకోవడం. సౌత్‌ ఇండియా కిరీటం గెలుచుకుని జాతీయ పోటీలకు హాజరైన స్వప్న ‘‘మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివి, ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగం చేస్తున్న నేను ‘ల్యాండ్‌ ఆఫ్‌ బిర్యానీ’ నుంచి వచ్చాన’’ని చెప్పగానే 22 మంది పార్టిసిపెంట్స్, ఆహుతులు ‘హైదరాబాద్, బిర్యానీ’ అని అరిచారు. ఆమె బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం హైదరాబాద్‌లోనే. కానీ ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, జలదంకి మండలం బ్రాహ్మణ క్రాకలో ఉన్నాయి. ‘‘తాత కోరిప అంకయ్య, నానమ్మ రమణమ్మ. మా చిన్నాన్న, పెద్దనాన్నలు ఆ ఊరిలో ఉన్నారు. నాన్నకు బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం కారణంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా తాత జ్ఞాపకంగా మా ఊరిలో ఏదైనా చేయాలనుంది. చేసి తీరుతాను’’ అని  స్వప్న ఆత్మవిశ్వాసంతో చెప్పారు.
– వాకా మంజులారెడ్డి ఫొటోలు: దేవేంద్రనాథ్‌ ఇసుకపట్ల

కూతురే కాంటెస్ట్‌కి పంపింది!

ఇంటర్‌ చదివే కూతుర్ని బ్యూటీ కాంటెస్ట్‌కి సిద్ధం చేయకుండా, 38 ఏళ్ల వయసులో తాను పాల్గొనడానికి వెనుక ఉన్న కారణాన్ని వివరించారు స్వప్న. ‘‘2008లో ఒక షోరూమ్‌ వాళ్లు చీరలకు మోడలింగ్‌ చేస్తారా... అని అడిగారు. చేయాలని చాలా ఉత్సాహంగా ఉండింది. కానీ మా పేరెంట్స్‌ వద్దన్నారు. అప్పటికి నేను పెళ్లయిన మూడు నెలలకే ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికి బయటపడి, అమ్మానాన్నల దగ్గర ఉన్నాను. నా భర్త వేధింపుల నుంచి నన్ను కాపాడుకోవడం కోసం మా అమ్మానాన్నలు కంటి మీద కునుకులేకుండా ఉన్న రోజులవి.

వాళ్లు వద్దనడానికి అదీ ఒక కారణమే. ఈ మధ్య ఓ రోజు మా అమ్మాయితో ఆ మాట చెప్పాను. అప్పటి నుంచి తను ఎలాగైనా నన్ను మోడలింగ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నించింది. అయితే ఈ కాలంలో మోడలింగ్‌ రంగంలోకి రావాలంటే అంతకంటే ముందు ఏదో ఒక గుర్తింపు ఉండాలని తెలిసి నన్ను బ్యూటీ కాంటెస్ట్‌కి పంపించింది. మా అమ్మాయికి ఊహ తెలిసినప్పటి నుంచి తను నా కన్నీళ్లను, కష్టాలను మాత్రమే చూసింది. రెండు–మూడేళ్ల నుంచి అప్పులు తీరి జీవితం గాడిన పడింది. నా ముఖంలో ఇంకా ఇంకా సంతోషం చూడాలని పట్టుపట్టి తను ఈ పని చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement