అందం–తెలివి
అందాల పోటీల్లో నెగ్గడం ఎంత కష్టమో మీరు చూసే ఉంటారు. వందలు, వేల వడపోతల్లో నుంచి ఒకే ఒక్కరికి ‘అందాల సుందరి’ అయ్యే అదృష్టం దక్కుతుంది. అందం ఒక్కటే ఉంటే సరిపోదు. ఫైనల్ ఈవెంట్‌లో తెలివినీ ప్రదర్శించాలి. చిట్టచివరికి మిగిలిన ముగ్గురు అమ్మాయిలకు... జడ్జీలు మూడు ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు అక్కడికక్కడ సమయస్ఫూర్తితో తెలివైన సమాధానం చెప్పి, న్యాయనిర్ణేతల మనసు గెలుచుకోవాలి. అప్పుడే.. అందాల కిరీటం దక్కుతుంది. అయితే మరి... అందాల కిరీటం గెలుచుకున్న
‘మిస్’లు అందరూ ‘వండర్‌ఫుల్ ఆన్సర్స్’ ఇచ్చినట్లే అనుకోవచ్చా? అనుకోవచ్చో, లేదో ఈ సమాధానాలు చదివితే మీకే తెలుస్తుంది.
1. ప్రియాంకా చోప్రా (మిస్ వరల్డ్ 2000)
ప్రశ్న: ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఉమన్’ ఎవరు? ఎందుకు?
సమాధానం: మదర్ థెరిసా. ఎందుకంటే ఆమె అమిత కారుణ్యమూర్తి, దయామయి.
2. జీనీ ఆండర్సన్ (మిస్ ఫిలిప్పీన్స్ 2001)
ప్రశ్న: అందమా? అమోఘమైన తెలివితేటలా? మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు?
సమాధానం: అందం సహజసిద్ధంగా వస్తుంది కనుక అందాన్నే ఎంచుకుంటాను. తెలివితేటలు అలా కాదు. వాటిని జీవితానుభవాల నుంచి నేర్చుకోవలసి ఉంటుంది.
3. లారెన్ కేట్లైన్ ఆప్టన్ (మిస్ టీన్ యు.ఎస్.ఎ. 2007)
ప్రశ్న: అమెరికన్లకు భౌగోళిక పరిజ్ఞానం తక్కువుంటుంది ఎందుకు?
సమాధానం: ఎందుకంటే, అందరికీ మ్యాపులు అందుబాటులో ఉండవు.
4. గయోసీ కజరెలీ (మిస్ పనామా 2009)
ప్రశ్న: learning without thought is labour lost అని కన్‌ఫ్యూషియస్ చెప్పాడు. దీనర్థం ఏమిటో చెప్పండి.
సమాధానం: కన్‌ఫ్యూషియస్ కన్‌ఫ్యూజన్‌ని కనిపెట్టాడని అర్థం.
5. శాంజా పాపిక్ (మిస్ యూనివర్శ్ 2003)
ప్రశ్న: మీరు నిప్పు అవడానికి ఇష్టపడతారా? నీరు అవడానికి ఇష్టపడతారా?
సమాధానం: నేను మనిషిని. మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. నీటికి, నిప్పుకు ఎమోషన్స్ ఉండవు.
6. అలీషియా మోనిక్ బ్లాంకో (మిస్ యు.ఎస్. 2009)
ప్రశ్న: అమెరికా పౌరులందరికీ ఆరోగ్య భద్రత హక్కు ఉండాలా?
సమాధానం: అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయం. సరైనది కానిదాని నుంచి, పాలిటిక్స్ నుంచి.. సరైన దాన్ని ఎన్నుకోవడం కోసం నా కుటుంబ సభ్యులు నన్ను ఎంచుకున్నారు.
7. నాడీన్ టెనీగా (మిస్ హవాయి 1992)
ప్రశ్న: ఒక అమెరికన్‌గా మీరు గర్వించే సంగతి ఏమిటి?
సమాధానం: హవాయీ కల్లోల తీరాల నుంచి, అద్భుతమైన హవాయీ ఇసుక మేటల వరకు... అమెరికా మా ఇల్లు.
8. లీ సెసిల్ (మిస్ కాలిఫోర్నియా 2012)
ప్రశ్న: euthanasia (కారుణ్య మరణం) మీద మీ అభిప్రాయం?
సమాధానం: నాకు పూర్తిగా ఐడియా లేదు కానీ, అదొక వ్యాక్సిన్.
9. ఇరీన్ సోఫియా ఎస్సర్ క్వింటెరో (మిస్ యూనివర్స్ 2012)
ప్రశ్న: మీకు అవకాశం ఇస్తే మీరు ఎలాంటి చట్టం తెస్తారు? ఎందుకు?
సమాధానం: చట్టాలు, అలలు ఒకటే. నేను సర్ఫర్‌ని కాబట్టి నేను అవలీలగా తేలియాడేందుకు అనువైన అల కోసం ఎదురు చూస్తాను. ప్రజలకు అలాంటి చట్టం కావాలి.
10. మేరిస్సా పావెల్ (మిస్ యు.ఎస్.ఎ. 2013)
ప్రశ్న: మన సమాజంలో ఎందుకని మహిళలు, మగవాళ్ల కన్నా తక్కువ నేర్చుకుంటారు?
సమాధానం: దీన్ని మనం వెనక్కి వెళ్లి ‘చదువు’ అనే కోణంలోంచి చూడాలి. సరైన ఉద్యోగాలను ఎలా క్రియేట్ చేయాలో ఆలోచించాలి. నిజంగా అది పెద్ద సమస్య. నా ఉద్దేశం ఏమిటంటే... మగవాళ్లే అన్నిట్లోనూ లీడర్లుగా ఉంటున్నారు. సో... మంచి ఎడ్యుకేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
ఇప్పుడొక సందేహం వస్తోంది కదా! ఇంత సిల్లీగా సమాధానాలు చెప్పినప్పటికీ వీళ్లెలా అందాల రాణులు అయ్యారబ్బా అని!!
పోటీలో ఉండే మిగతా ఇద్దరు ఇంత కంటే ఘోరమైన అన్సర్లు ఇచ్చి ఉండాలి.