హొయలుపోతూ వయ్యారపు నడక... అదిరేటి అధరాలు.. పొడవాటి మెడ.. నిగనిగలాడే మేని ఛాయ... అందానికి తగ్గ శరీర సౌష్టవం... ఇంకేం, న్యాయ నిర్ణేతలు ముగ్ధులయ్యారు. అంతటి సౌందర్యరాశిని ఈ ఏటి అందాల పోటీ విజేతగా ప్రకటించేశారు. ప్రైజ్‌మనీ కింద భారీ మొత్తం సైతం ముట్టజెప్పారు. ఇంతకీ ఆ కుందనపు బొమ్మ ఎవరో తెలుసా.. ఒక ఒంటె! అవాక్కయ్యారా.. పైన చెప్పిన ఆ వర్ణన అంతా దాని అందం గురించే..! ఈ పోటీ ప్రత్యేకతలు, విజేతగా ఆ ఒంటె ఎంపిక వెనక సాగిన తతంగం ఏమిటో తెలుసుకుందామా?
ఎక్స్‌రేలతో తనిఖీలు...
ఖతార్‌లోని అల్ షహనియా నగరంలో ఇటీవల జరిగిన ఒంటెల అందాల పోటీలో మంగియ గుఫ్రాన్ అనే ఒంటె విజేతగా నిలిచింది. సౌదీ అరేబియా, కువైట్, యూఏఈల నుంచి వచ్చిన వేలాది ఒంటెలతో పోటీపడుతూ వివిధ వడపోతలను దాటుకొని మరీ ట్రోఫీ సాధించింది. అయితే ఈ విజయం దానికి ఊరికే ఏమీ దక్కలేదు. ఇందుకోసం అది ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ముఖ్యంగా ఎక్స్‌రేల ద్వారా వెటర్నరీ వైద్యులు ఒంటె శరీరాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కృత్రిమంగా అందాన్ని మెరుగుపరిచే బ్యూటీ సర్జరీలు ఏమైనా చేశారా అనే విషయాన్ని తేల్చేందుకు ఈ పరీక్ష చేపట్టారు.
ఎందుకంటే... సౌదీ అరేబియాలో ఇటీవల నిర్వహించిన అందాల పోటీలో తమ ఒంటెలు అందంగా కనపడేందుకు కొందరు యజమానులు వాటికి బొటాక్స్ ఇంజెక్షన్లు ఇవ్వడంతోపాటు కాస్మెటిక్ సర్జరీలు సైతం చేయించారు. ఆ పోటీలో వారి ఒంటెలు గెలిస్తే అప్పనంగా భారీ నజరానా కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. అయితే ఈ విషయం చివరి నిమిషంలో బయటపడటంతో 43 ఒంటెలను అక్కడి నిర్వాహకులు పోటీల నుంచి బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో ఖతార్‌లో ఒంటెల అందాల పోటీ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఈ పరీక్షలో మంగియ గుఫ్రాన్ సులువుగానే గట్టెక్కింది. ఇక ఆ తర్వాత... ఒంటెల అందానికి కొలమానాలుగా పరిగణనలోకి తీసుకొనే తల సైజు, మెడ పొడవు, వీపుపై మూపురం ఉండాల్సిన ప్రదేశం, పెదవుల అందం వంటి కొలతల లెక్కల్లోనూ పాసైంది.
భారీ నజరానా...
మంగియ గుఫ్రాన్ న్యాయ నిర్ణేతలను మెప్పించడంతో నిర్వాహకులు దాన్ని ఈ అందాల పోటీ విజేతగా ప్రకటించారు. ఒంటె యజమాని ఫాహెద్ ఫర్జ్ అల్గుఫ్రానీకి 10 లక్షల ఖతారీ రియాళ్ల (సుమారు రూ. 2.10 కోట్లు) చెక్కును అందించారు. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు చిహ్నమైన ఒంటెలపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ వంటి క్రేజ్ ఉన్న టోర్నమెంట్లకు దీటుగా ప్రజామద్దతు కూడగట్టేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలిరావడంతో తమ ఉద్దేశం నెరవేరిందని చెప్పారు.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment