పడుచు ప్రపంచపు లబ్‌డబ్
13న యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్‌కు వీడ్కోలు
యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు ఎంపిక చేసిన 19 చిత్రాలను ‘వాయిసెస్ ఆఫ్ యూత్ (యువగళాలు)’ పేరిట మనదేశంలోని నగరాల్లో నిర్వహిస్తోన్న 19వ యూరోపియన్ యూనియన్ ఫిలిం ఫెస్టివల్’లో ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శిస్తున్నారు. ముంబై-జోధ్‌పూర్-కోల్‌కతాల మీదుగా ప్రయాణిస్తూ ఈ కదిలే చిత్రాల పండుగ ఈ నెల 4న హైదరాబాద్ విచ్చేసింది. 13న నగర
ప్రేక్షకులకు వీడ్కోలు పలికి పుణేకు తరలనుంది.
యూరోపియన్ మెయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో ఎక్కువ శాతం సామాజిక వాస్తవికతను ప్రతిఫలిస్తాయి. ప్రతి చిత్రం వెనుక ఏదో ఒక సందేశం మిళితమై ఉంటుంది. ఆస్ట్రియా చిత్రం ‘బ్రీతింగ్’ని డెరైక్టర్ కార్ల్ మార్కోవిజ్ క్షణం విసుగు రాకుండా ఆసక్తిగా చూపారు. 18 ఏళ్ల రోమన్ ‘కొగ్లర్’ హత్యానేరంపై బాలనేరస్తుల శిబిరంలో హత్యానేరానికి శిక్షను అనుభవిస్తూ తన తల్లిని గుర్తించే అన్వేషణలో విజయం సాధిస్తాడు.
నేటి సినిమాలు
మధ్యాహ్నం 3 గంటల నుంచి గోథె జెంత్రమ్‌లో...
లవ్ మి ఆర్ లీవ్ మి: స్లోవేకియా చిత్రమిది. దర్శకురాలు మేరియానా సెనెగెల్ సోల్‌కాన్‌స్కా ప్రతిభావంతంగా చిత్రీకరించారు. ఈ చిత్రం ఆ దేశపు మహిళల జీవితాలను స్పృసిస్తుంది. మూడు తరాలకు చెందిన మహిళలు సెలబ్రేషన్ చేసుకునేందుకు కలవడం అనే ఇతివృత్తంతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు.
లెసన్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ఈ జర్మనీ చిత్రం... వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 1874 ప్రాంతంలో జర్మన్ విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పేందుకు కొన్రాడ్ అనే యువ టీచర్ నానా శ్రమపడాల్సి వస్తుంది. ఫుట్‌బాల్ ఆడించడంతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్పుతాడు. సంప్రదాయవాదులు ఆ ఆట వద్దు, ఆ భాష వద్దు అని అడ్డంకులు పెడతారు.
ఫ్రెష్ ఎయిర్: ఇది హంగేరీ సినివూ. వయోలా, ఆమె కుమార్తె ఏంజెలా ఇరుకు ఇంట్లో నివసిస్తుంటారు. కలిసే జీవిస్తున్నా వారి ప్రపంచాలు వేరే. వయోలా తనకు నచ్చే పురుషుడి కోసం అన్వేషిస్తుంది. ఏంజెలా ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటుంది. ఇద్దరూ ‘ఇరుకు జీవితాల్లోంచి’ బయటపడి కొత్తగాలి పీల్చాలని తహతహలాడతారు.
- పున్నా కృష్ణమూర్తి