సరళీకృత కథనాలు! | Johnson book affected people | Sakshi
Sakshi News home page

సరళీకృత కథనాలు!

Published Sat, May 17 2014 5:13 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సరళీకృత కథనాలు! - Sakshi

సరళీకృత కథనాలు!

తాజా పుస్తకం
 
ఈ కాలానికి పనికిరాని రచన మరే కాలానికి పనికిరాదు అన్న జీన్ పాల్ సర్త్ హితోక్తిని పరిగణనలోకి తీసుకుంటే ముందుగా ‘ఈ కాలం’ ఎటువంటిది అని తెలుసుకోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు, తుపానులు దేశాల సరిహద్దులను దాటి ప్రభావం చూపుతున్నట్లే సరళీకృత ఆర్థిక విధానాలు ప్రపంచ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. వాటిని వెనక్కి మళ్లించడం సాధ్యం కాదని అందరూ అంగీకరిస్తోన్న నేపథ్యంలో వాటి పోకడలను అర్థం చేసుకోవడం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో జాన్‌సన్ చోరగుడి పుస్తకం ‘సొంత సంతకం’  పఠనీయం అవుతుంది. సాక్షి తదితర దినపత్రికల ఎడిట్ పేజీల్లో ప్రచురితమైన 80 వ్యాసాలను ఈ సంకలనంలో పొందుపరచారు.
 
 ఈ పుస్తకం ‘జాన్‌సన్’ సంతకమే అనడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ‘కృష్ణా-గోదావరి మండల మధ్యే’ కృష్ణాజిల్లాలో తాను పుట్టిన కోలవెన్ను గ్రామంలో నిల్చుని సరళీకృత వాతావరణాన్ని స్వానుభవంతో రిపోర్ట్ చేస్తున్నాడు.  ఇప్పుడు సరళీకృత విధానాలు అనుకుంటున్నవి ఎప్పుడూ వేర్వేరు పేర్లతో ఉన్నవేనని ‘నిన్న నుంచి పాఠకుడిని నేటి వరకూ తీసుకు వస్తారు’.  రాజధానిలో సచివాలయంలో ఉద్యోగం చేస్తూ ప్రవృత్తిరీత్యా నచ్చక రాజీనామా చేసి విశాఖ జిల్లా పాడేరుకు వెళ్లి, ప్రస్తుతం సమాచార శాఖలో ఉన్నతోద్యోగిగా చేస్తోన్న జాన్‌సన్ చోరగుడి ఈ వ్యాసాలను సిద్ధాంతాల నుంచి రాయలేదు. తన జీవితం నుంచే పర్యావలోకన చేసి రాశారు. సంస్కరణలను పూర్తిగా వ్యతిరేకించేవారు ఉన్నా  సంస్కరణల వలన అందుబాటులోకి రాగల అవకాశాలను  అణగారిన వర్గాలు, ప్రాంతాలు, దేశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటారు జాన్‌సన్!  సంస్కరణలు ఇచ్చే అవకాశాలను అందుకునే ఆలోచన చేయకుండా ముఖ్యంగా లెదర్ టెక్నాలజీ ఉపాధి అవకాశాలను మాదిగ యువత కాలదన్నుకుంటుందా అని ప్రశ్నిస్తూ,  ఎ-బి-సి-డి చిక్కుల్లో కూరుకుపోతోన్న సోదరుల పట్ల ఆవేదన చెందుతారు.
 
 ‘ఆడవాళ్లను వ్యభిచారానికి పంపుతాం, తాగి మత్తులో పడుకుంటాం, మమ్మల్ని బాగు చేయడం మీ వల్లేమవుతుంద’న్న సమూహాలలో ‘వెలుగు’లు నిండిన వైనం, బార్‌డాన్సర్లు కోర్టులకెక్కి అనుమతులు తెచ్చుకున్న చైతన్యాన్ని, కులపరంగా జరిగిన అత్యాచారాలను ఎదుర్కోవడంలో  సామాజిక సంస్థల ఉదాసీనతను, ఏ ప్రభుత్వ నివేదికలోనూ వెనకబడిన ప్రాంతంగా లేని అభివృద్ధి చెందిన జిల్లాల్లో సూక్ష్మరుణాల కారణంగా జరుగుతోన్న ఆత్మహత్యలను తనదైన దృష్టి కోణంలో పాఠకులకు చూపారు. ‘హరిజన వాడ’ పంచాయతీ రికార్డుల్లో అఫీసియల్‌గా వాడడం, ‘నాన్-బ్రాహ్మిన్’ అనేపదం పార్లమెంటులో అన్ పార్లమెంటరీగా పరిగణింపబడంలోని ఔచిత్యాన్నీ ఒక వ్యాసంలో ప్రశ్నిస్తారు. అంతేనా? ‘ఇజ్రాయిల్-పాలస్తీనాల పీటముడిని సడలించలేమా’ అనే వ్యాసం బహుశా మరెవరూ రాయలేనిది. శిశువు తండ్రిని పిలిచే తొలి పలుకు ‘అబా’. అబామీడియా ప్రచురణగా వెలువడిన  జాన్‌సన్ వ్యాసాలు పాఠకుడిని తండ్రి స్థానంలో ఉంచి తన నివేదనను వినమని కోరుతున్నవిగా భావించవచ్చు.
 
కాలచక్ర - 2006 ఉత్సవాలు జరిగాయి. 15 రోజుల ఉత్సవాలకు  జాన్‌సన్ మీడియా ఆఫీసర్.   ఇది మరెవరి మతమో అనుకున్న స్థానికుల గురించి, దలైలామా ఏమి చెబుతాడా అని చెవులు రిక్కించి విన్న విదేశీయుల గురించి, దలైలామాతో ఫొటోలు దిగి ఉడాయించిన మన వీఐపీల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. వృత్తి ప్రవృత్తిల పట్ల స్పష్టతకు ఈ వ్యాసాలు గీటురాళ్లు!
 - పున్నా కృష్ణమూర్తి
 సొంత సంతకం, జాన్‌సన్ చోరగుడి;
 వెల: రూ.250; కాపీలు: నవోదయ
 (abbamedia@gmail.com)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement