మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..! | Mandolin Srinivas affection with hyderabad | Sakshi
Sakshi News home page

మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!

Published Sun, Sep 21 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!

మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!

మాండలిన్‌పై సూఫీ గీతం!  
హరిహరన్‌తో వహ్వాలు అందుకున్న శ్రీనివాస్!


‘‘ఇక్కడ అస్తమించిన సూర్యుడు మరెక్కడో ఉదయిస్తాడు! శుక్రవారం చెన్నైలో నిశ్చలమైన మాండలిన్ శ్రీనివాస్ వేళ్లు మరెక్కడో వేళ్లూనుకుని సంగీత సుధలు పలికిస్తాయి! సరస్వతి ఆయన వేలి కొసలలోకి ప్రవహిస్తుంది కాబట్టే ‘హంసధ్వని’ మన చెవులకు సోకుతుంది! చూస్తూ ఉండండి.. మరేదో తంత్రీ వాయిద్యంతో ఆరేళ్లలో ‘కార్నెగీ హాల్‌లో’ ప్రపంచాన్ని విస్మయపరుస్తాడు’’ .. మాండలిన్ శ్రీనివాస్ వాద్యకచేరీని ప్రముఖ గాయకుడు హరిహరన్‌తో వీనులవిందుగా ఆలకించిన హైద్రాబాదీల మనోగతం అది!
 
ఏ సందర్భంలో?
పద్మవిభూషణ్, సంగీత్ మార్తాండ్ పండిట్ జస్‌రాజ్  తన తండ్రి, సోదరుల పేరుతో నెలకొల్పిన ‘పండిట్ మోతీరామ్ పండిట్ మణిరామ్ సంగీత్ సమారోహ్’ ఉత్సవాలలో పాల్గొనేందుకు మాండలిన్ శ్రీనివాస్ 2004లో నగరానికి విచ్చేశారు. శ్రీనివాస్ అంటే ఎవరు? సమకాలీన మొజార్ట్! సమకాలీన యహుది మెనుహిన్! మాండలిన్ పుట్టిన తర్వాత కర్ణాటక-హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన అనితరుడు!

తూర్పుపడమరల గాయకులు, వాద్యవేత్తలతో  వివిధ అంతర్జాతీయ వేదికలపై పాల్గొన్నవాడు! జాన్ మెక్‌లగిన్ - గిటార్, జకీర్ హుసేన్-తబలా, సెల్వగణేష్-కంజీర, ఘటం.. శంకర్ మహదేవన్ గాత్రంతో యు. శ్రీనివాస్ మాండలిన్‌ను విని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆయనను ప్రత్యక్షంగా చూసే అవకాశం విడుచుకుంటారా?

శ్రీనివాస్‌ను వినేందుకు, చూసేందుకు సంగీతాభిమానులైన హైద్రాబాదీలు కిక్కిరిసి పోయారు. 2004, డిసెంబర్ 20వ తేదీ, మంగళవారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమైన సంగీత సంగమం ప్రారంభమైంది. పద్మశ్రీ హరిహరన్’ ‘మోహము చెలిపై ముంచిన వాడా..’ తరహాలోని సూఫీ గీతాన్ని అందుకున్నారు!

‘‘మోహె అప్‌నెహీ రంగ్ మె రంగ్ దే
రంగీలా తూ తో సాహెబ్ మొర మెహబూబ్ హి ఇలాయీ...’’


పాటవిని ప్రేక్షకులు పరవశులైనారు! మాండలిన్‌పై శ్రీనివాస్ విన్పించాలి. క్రీ.పూ. 3వేల సంవత్సరాలనాటి తంత్రీ వాద్యం అనేక రూపాలలో పరిణామం చెందుతూ పేర్లను మార్చుకుంటూ ‘మాండలిన్’ అనే పాశ్చాత్యపరికరంగా రూఢి అయిన తర్వాత తొలిసారిగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన శ్రీనివాస్ సూఫీ గీతాన్ని ఎలా విన్పిస్తారు? చెవులు రిక్కించి ఉత్కంఠకు లోనైనారు రసహృదయులైన ప్రేక్షకులు!

ఏమా అనుభూతి?  ఆ శబ్దసౌందర్యానికి గాయకుడైన హరిహరన్ పులకించి పోయాడు. పలుమార్లు ‘వహ్వా’లను పలికారు. ప్రేక్షకుల సంగతి చెప్పాలా? బాలురు నృత్యం చేశారు! శ్రీనివాస్ ‘శిశుర్వేత్తి’ కదా!

- పున్నా కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement