mandolin srinivas
-
గురవే నమహా...
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ తరం సంగీతదర్శకుల్లో ఓ సంచలనం. మరి.. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురువు ఎవరు? అంటే.. ‘మాండొలిన్ శ్రీనివాస్’. గురువారం టీచర్స్ డేని పురస్కరించుకుని తన గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కి ఓ పాట అంకితం ఇచ్చారు. ‘గురవే నమహా...’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన టీచర్స్, మన గురువులు.. మనకు చదువు చెప్పిన వాళ్లు, సంగీతం నేర్పిన వాళ్లు.. ఇలా అందరూ మనకు ముఖ్యం. టీచర్స్ డే సందర్భంగా నా గురువు మేస్ట్రో మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఒక చిన్న నివాళి. ఆయన దగ్గర నేర్చుకున్న మాండొలిన్ నాలెడ్జ్తోటే ఈ పాటను నేను కంపోజ్ చేశా. మీ అందరికీ నచ్చిన పాటే. తన జీవితంలో ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారాయన. అలాంటి గురువు గొప్పతనం మాటల్లో వర్ణించలేం. అందుకే సంగీతంతో నా భావాలను వ్యక్తం చేశా. నా గురువుకు బాగా ఇష్టమైన రాగాల్లో ఒకటైన కీరవాణి రాగంలో ఈ పాటని కంపోజ్ చేశా. జీవితాలకు అర్థం చెప్పిన ప్రతి గురువుకు ఈ పాట అంకితం’’ అన్నారు. -
విశ్వగీతం ఆలపిస్తాను - దేవిశ్రీ ప్రసాద్
ది గ్రేట్ మాన్డలిన్ : నేడు మాండలిన్ శ్రీనివాస్ జయంతి. ఈ సందర్భంగా, చెన్నై మ్యూజిక్ అకాడమీలో ‘ది గ్రేట్ మాండలిన్’ కార్యక్రమం జరుగుతోంది. హరిహరన్, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, విక్కు వినాయక్రామ్, ఇళయరాజా వంటి ప్రముఖ గాయకులంతా పాల్గొంటున్నారు. మాండలిన్ మనోహరుడు... శ్రీనివాస్. మెలడీల మాంత్రికుడు... దేవిశ్రీ ప్రసాద్. ఆయన గురువు. ఈయన శిష్యుడు. ఇవాళ గురువుగారి తొలి జయంతి. నివాళిగా దేవిశ్రీ ఇవ్వబోతున్నదేమిటి? ఈ సాయంత్రం... చెన్నై మ్యూజిక్ అకాడమీ హాల్లో... ఒక విశ్వ గీతాన్ని ఆలపించబోతున్నారు. అది గురుదక్షిణ. గురువుగారి చుట్టూ భక్తిగా ఓ ప్రదక్షిణ. ఈ సందర్భంగా... దేవిశ్రీ స్మృతించుకున్న కొన్ని శృతులు, గతులు... ‘ఫ్యామిలీ’ పాఠకులకు ప్రత్యేకం. -డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై మహోన్నత వ్యక్తిత్వం: చెన్నైలో మా ఇంటి దగ్గరే మాండలిన్ శ్రీనివాస్ గారి ఇల్లు. నేను ఆయన దగ్గర సుమారు ఇరవై సంవత్సరాలు సంగీతాభ్యాసం చేశాను. ఆయనను ‘అన్నయ్యా!’ అనే పిలిచేవాడిని. ఆయన మాతో పాటు సరళీ స్వరాల దగ్గర నుంచి అన్నీ వాయించేవారు. మా ఇంటి దగ్గర చిన్న వినాయకుడి గుడి ఉంది. ఆ గుడికి అన్నయ్య వస్తుంటే, ఆ వీధిలోని పెద్దపెద్ద వారంతా లేచి నిలబడి అన్నయ్యకు నమస్కారం చేసేవారు. అంతటి మహోన్నత వ్యక్తి, మాతో ఎంతో సామాన్యంగా ఉంటున్నారంటే అందుకు కారణం ఆయన ఔన్నత్యమే. ప్రముఖులు సైతం: అన్నయ్య కచేరీ ఉందంటే చాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజిఆర్, ఆ రోజు తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకునేవారు. రాజీవ్ గాంధీ అయితే మాండలిన్ కచేరీ పూర్తయ్యే వరకు నిరీక్షించి, అన్నయ్యను కలిసేవారు. ఒకసారి నారదగాన సభలో... ప్రముఖ హిందుస్థానీ విద్వాంసులు పండిట్ భీమ్సేన్ జోషీ సంగీతానికి సంబంధించిన ఎన్నో విషయాలు అన్నయ్యతో చర్చించారు. అప్పటికి నాకు ఆయనంటే ఎవరో తెలియదు. కేవలం ‘మిలే సుర్ మేరా తుమ్హారా’ లో చూశాను! అంతే! అలాగే తబలా కళాకారులు జాకీర్ హుస్సేన్... ఇలా ఎందరెందరో ఉద్దండ పండితులు అన్నయ్యను కలవడానికి వస్తుండేవారు. కంచి పీఠంలో జరిగిన కచేరీకి సైతం నేను అన్నయ్య వెంట ఉన్నాను. ఓడ్ టు గురు: అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక గీతం రూపొందించాను. ఇది ఒక గురువుకి శిష్యుడు అంకితం చేసే పాట. అన్నయ్యగారిలో నేను ఏయే మంచి లక్షణాలు చూశానో, వాటినే పాట రూపంలో చూపబోతున్నాను. ఏ శిష్యుడైనా ఈ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా గురుదక్షిణగా చెల్లించుకునేలా ఉండేలా రూపొందిస్తున్నాను. ఇది ‘ఓడ్ టు గురు’ లాంటిది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పాట యూనివర్సల్‌గా ఉండాలి. ఏదో ఒక ప్రాంతీయ భాషలో చేయడం వల్ల దేశవ్యాప్తంగా అందరికీ చేరదు. అందువల్ల సంస్కృతంలో చేయాలని నిశ్చయించుకున్నాను. సంస్కృతంలో రచించగలిగే శక్తి నాకు లేదు కనుక, ప్రముఖ రచయిత, పండితులు అయిన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారితో రాయించుకున్నాను. అయితే పాటంతా నా సూచనల మేరకే ఆయన రచించి ఇచ్చారు. కీరవాణి రాగంలో...: అన్నయ్యకు కీరవాణి రాగం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ క్లాస్ అయిపోయాక ఆయనను మాండలిన్ మీద కీరవాణి రాగం వాయించమని అడిగేవాడిని. ఆయన ఆ రాగాన్ని భారతీయ, పాశ్చాత్య... బాణీలలో అలవోకగా వాయించి వినిపించేవారు. ఆ రాగానికి అన్నయ్యకు నాకు అలా ఒక కనెక్షన్ ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు నేను రూపొందించిన గీతాన్ని కూడా కీరవాణి రాగంలోనే స్వరపరిచాను. మేం రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ‘ద గ్రేట్ మాండలిన్’ అనే పేరుపెట్టాం. ఇందులో ద గ్రేట్ మాన్ అనీ, గ్రేట్ మాండలిన్ అనీ రెండూ చేరాయి. ఇందులో మాండలిన్ ప్రముఖంగా ఉపయోగించాం. కానీ ఎక్కువ సేపు గాయకుల గళాలే ఉంటాయి. ఈ రోజు ఈ కార్యక్రమానికి వస్తున్న గాయకులందరూ ఈ గీతం ఆలపిస్తారు. ఇంతటి సత్కారం ఇంతవరకు ఏ గురువుకూ జరగలేదు. శివోం అవార్డులు: అన్నయ్య కుటుంబ సభ్యులు సంగీతానికి సంబంధించి రెండు అవార్డులు ఇవ్వబోతున్నారు. సంగీతంలో ప్రముఖులైన విద్వాంసులకు, అలాగే ఇప్పుడిప్పుడే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి ప్రతిభను ప్రదర్శిస్తున్న చిన్నారులకు... ఈ అవార్డులు అందజేస్తారు. పెద్ద వారికి లక్ష రూపాయలు, కొత్తవారికి 50 వేల రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. ‘శివోమ్ శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ మ్యూజిక్’ అని అన్నయ్య ఒక సంస్థ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిలాషులకు ఆ సంస్థ ద్వారా పాఠాలు నేర్పేవారు. ఆయన ఎప్పుడూ ‘మ్యూజిక్ ఈజ్ డివైన్’ అనేవారు. అన్నయ్యగారు ఏ ఒక్క విద్యార్థి దగ్గర ఒక్క పైసా కూడా ఫీజు పుచ్చుకోలేదు. అందరికీ ఉచితంగానే నేర్పారు. మనం ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్లగానే, మన కళ్లలోకి చూసి ‘నీకు సంగీతమంటే ఇష్టం ఉందా’ అని అడిగేవారు. వాళ్ల భావాలను కళ్లతోనే కనిపెట్టేసేవారు! బియాండ్ హ్యూమన్ నా జీవితంలో నాకు ఇష్టులు ముగ్గురు... మైకేల్ జాక్సన్, ఇళయరాజా, అన్నయ్యగారు. అన్నయ్య కష్టమైన రాగాలు ఎంత అందంగా వాయిస్తారో, సులువుగా ఉండేవి కూడా అంతే అందంగా వాయించేవారు. ‘రఘుపతి రాఘవ రాజారాం’ ఆయనకు చాలా ఇష్టం. అన్నయ్య కాలం చేసినప్పుడు గురుదక్షిణగా 13వ రోజున నేను అదే వాయించాను. ఆయన బియాండ్ హ్యూమన్! ఆయన దేవుడు! అంతే! సంగీతం అంటే ఏమిటో చెప్పడానికి వచ్చారు! చెప్పారు! వెళ్లిపోయారు! -
ఇంత తొందరపడతారనుకోలేదు...
తల్లి జన్మనిస్తుంది. తండ్రి జీవాన్నిస్తాడు. అయితే.. జ్ఞానం లేని జన్మ, జీవం నిరర్థకాలు. మరి ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? గురువు ఇస్తాడు. గురుర్బ్రహ్మ.. గురుర్విష్ణు.. గురుర్దేవో మహేశ్వరః అన్నది అందుకే. శిష్యుని అభ్యున్నతే గురువుకి నిజమైన గురుదక్షిణ. అలాంటి గురువు దూరమైతే.. శిష్యుని వేదన వర్ణనాతీతం! ప్రస్తుతం సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదేవేదనలో ఉన్నారు. తన గురువు ‘మాండలిన్ శ్రీనివాస్’ మరణం వార్త షాక్ నుంచి దేవిశ్రీ తేరుకోలేకపోతున్నారు. ‘ఇది నిజం కాదు... ఓ పీడకల అయితే ఎంత బావుణ్ణో’ అంటూ తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు దేవిశ్రీ. తన గురుదేవుని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘సాక్షి’కి దేవిశ్రీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. ‘మాండలిన్ శ్రీనివాస్’గారి మరణవార్త తెలిసినప్పుడు ఎక్కడున్నారు? స్టేజ్ షోల నిమిత్తం యూఎస్‌లో ఉన్నాను. అప్పుడే శ్రీనివాస్ అన్నయ్యకు ఒంట్లో బాలేదు... హాస్పిటల్లో చేరారని తెలిసింది. తేరుకుంటారులే అనుకున్నాను. కానీ, ఈలోపు ఈ దుర్వార్త తెలిసింది. ఈ వార్త తెలిసి, శిష్యులమైన మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇక కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్క వ్యసనం లేని మనిషి ఆయన. భోజనం కూడా తక్కువే తీసుకుంటారు. పైగా... నెగటివ్‌గా ఆలోచించడం ఆయనకు తెలీదు. పక్కా పాజిటివ్ పర్సన్. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. నిజంగా ఆయన మరణం నమ్మలేని వాస్తవం. శ్రీనివాస్గారిని తొలిసారి ఎలా కలిశారు? నా తొమ్మిదేళ్ల వయసులో ఆయన్ను కలిశాను. అప్పుడు ఆయనకు ఇరవై ఏళ్లుంటాయి. అప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందాయనకు. చెన్నయ్‌లో మా వీధికి రెండు వీధుల అవతలే ఆయన ఇల్లు. నాకు ఎలాగైనా మ్యూజిక్ నేర్పించాలనేది అమ్మ కోరిక. ‘మాండలిన్’ శ్రీనివాస్ పక్కనే ఉన్నారని తెలిసి.. ఆయన దగ్గరకు తీసుకెళ్లింది. అలా ఆయనతో జర్నీ మొదలై పదేళ్ల పాటు సాగింది. ఈ ప్రయాణంలో ఎన్ని మరుపురాని సంఘటనలో. ఆయన దగ్గర ఫస్ట్ బ్యాచ్ మాదే. ఒక విద్యార్థిగా ఆయన దగ్గర మీరు గమనించిన గొప్పతనమేంటి? ఒకటని చెప్పలేను. సద్గురువు అంటే ఆయనే. ఆయన దగ్గర విద్య నేర్చుకున్నవాళ్లు వందలమందే ఉంటారు. కానీ... ఎవరి దగ్గరా నయా పైసా తీసుకోలేదు. నిజానికి ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకు ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్లు ఉంటారు. కానీ.. విద్యను డబ్బుతో కొలవడం ఏంటి? అంటారాయన. ఆయన దగ్గరున్న పదేళ్లలో ఏనాడూ ఆయన కోప్పడటం చూడలేదు నేను. శ్రుతి శుద్ధంగా వాయించకపోతే... ఏ గురువైనా కోప్పడతారు. కానీ.. అన్నయ్య అస్సలు కోప్పడేవారు కారు. ‘భలే వాయించావే.. అలా ఎలా వాయించావ్. నాక్కూడా నేర్పవా’ అనేవారు. ఆయన అలా అంటుంటే పకపకా నవ్వేవాళ్లం. అలా నవ్విస్తూ విద్య నేర్పేవారు. చిన్న వయసులోనే మీరు మ్యూజిక్ డెరైక్టరయ్యారు కదా. ఆయనెలా ఫీలయ్యారు? ఇంటర్లో ఉన్నప్పుడే మ్యూజిక్ డెరైక్టర్ అయిపోయా. అప్పుడు ఆయన ఆనందం మాటల్లో చెప్పలేను. నా ఆల్బమ్స్‌ని ఆయనకు వినిపించాలనే కోరిక ఉండేది. కానీ ధైర్యం చాలేది కాదు. కమర్షియల్ సాంగ్స్ కాకుండా.. దేవి, పౌర్ణమి, ఢమరుకం లాంటి ఆల్బమ్స్ వినిపించాలని నేను అనుకునేవాణ్ణి. ఓసారి ఆయన కచేరీ నుంచి వస్తుంటే ‘డమరుకం’ ఆల్బమ్ గురించి మాట్లాడబోయాను. ‘రింగ రంగ.. రింగ రంగ’ ఎక్స్ట్రార్డినరీగా కొట్టావే. బావుందా పాట’ అని తెగ మెచ్చేసుకున్నారు. నేను షాక్. అలాగే ‘గబ్బర్‌సింగ్’లో ‘కెవ్వు కేక’ పాటంటే ఆయనకు ఇష్టం. ఎప్పుడూ రాగ, తాళ, స్వరాలతోనే ఆయన సహవాసం. అంతటి బిజీలో కూడా నా ప్రతి ఆల్బమ్నీ వినేవారు. ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ‘మాతో గంట సేపు మాట్లాడితే... అందులో అరగంట నీ గురించే మాట్లాడతారయ్యా మీ గురువు’ అని. ఆ మాట విన్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలిగేది. మీరంటే ఎందుకాయనకు అంత అక్కర? నా అదృష్టం. ఒక్కోసారి క్లాసులకు లేట్‌గా వెళ్లేవాణ్ణి. అయినా కోప్పడేవారు కాదు. కచేరీ ఉన్నప్పుడు కూడా లేటయ్యేవాణ్ణి. అప్పుడు నా కోసం ఎదురుచూసేవారు. నన్నెప్పుడూ ఆయన శిష్యుడిగా చూడలేదు. తమ్ముడిగానే చూశారు. ఆయన సొంత తమ్ముడు రాజేశ్‌తో సమానమైన ప్రేమను పంచారు. నన్ను ‘ప్రసాద్’ అని పిలిచేవారు. ఫొటోగ్రఫీ అంటే నాకు చిన్నప్పట్నుంచీ ప్రాణం. పదిహేనేళ్ల క్రితం అనుకుంటా.. ‘అన్నయ్యా... నీ ఫొటో తీస్తాను’ అంటే ‘ఓకే’ అన్నారు. బ్లాక్ షర్ట్ వేసుకోమంటే వేసుకున్నారు. బ్లాక్ కర్టన్ ముందు నిలబెట్టి ఒక కాన్సెప్ట్ ప్రకారం ఫొటో తీశాను. అద్భుతంగా వచ్చింది. ఆ రీల్‌ని ఆయనకే ఇచ్చాను. నిజానికి అన్నయ్య దగ్గర చాలా విలువైన ఫొటోలే ఉన్నాయి. కానీ... నేను తీసిన ఫొటోని మాత్రం పెద్దది చేయించి తన ఆఫీస్ రూమ్‌లో పెట్టుకున్నారు. అంతటి ప్రేమను ఆయన నుంచి పొందగలగడం నా అదృష్టం. ఎన్ని వేల జన్మల పుణ్యమో అలాంటి గురువు నాకు దొరికారు. సంగీత దర్శకునిగా మీపై ‘మాండలిన్’ శ్రీనివాస్‌గారి ప్రభావం ఎంత వరకూ ఉంది? నా పాటలు వెస్ట్రన్ మూడ్‌లో అనిపించినా... ఎక్కడా మెలొడీని మాత్రం మిస్ చేయను. ఆ మెలొడీ నా గురువు పెట్టిన భిక్షే. ‘పౌర్ణమి’లో నా మ్యూజిక్ చూసి ‘క్లాసికల్ ఎప్పుడు నేర్చుకున్నారు’ అనడిగారు చాలామంది. ‘‘నేను ‘మాండలిన్’ శ్రీనివాస్ శిష్యుణ్ణండీ’’ అని సమాధానమిస్తే, నిర్ఘాంతపోయారు. ఏదిఏమైనా ‘మ్యూజిక్ డెరైక్టర్ దేవిశ్రీ’ అనిపించుకోవడం కంటే.. ‘మాండలిన్ శ్రీనివాస్ శిష్యుడు ప్రసాద్’ అని ిపిలిపించుకోవడంలోనే నాకు కిక్ ఉంది. చిన్న వయసులోనే ‘పద్మశ్రీ’ అందుకున్న ఘనత ‘మాండలిన్’ శ్రీనివాస్‌ది. మరి ఇప్పటివరకూ ఆయనకు పద్మభూషణ్ రాకపోవడం బాధ అనిపించలేదా? అవార్డులపై అన్నయ్యకి అస్సలు వ్యామోహం ఉండేది కాదు. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం చాలామంది మా పలుకుబడితో మీకు పద్మభూషణ్ ఇప్పిస్తామంటే... ‘వద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పేసేవారు. ‘శ్రోతలకు ఆనందాన్నిచ్చేంత సంగీతం నాకు వచ్చింది. ఇక పద్మభూషణ్ రాకపోయినా ఫర్లేదు’ అనేవారు. ‘మాండలిన్’ శ్రీనివాస్ అంటే ప్రఖ్యాత మాండలిన్ వాయిద్యకారుడని మాత్రమే చాలామందికి తెలుసు. ఆయన సాధించిన ఎచీవ్‌మెంట్స్ చాలామందికి తెలీదు. ప్రపంచదేశాలన్నీ ఆయన్ను ‘ఆనరబుల్ సిటిజన్’గా గుర్తించాయి. ఈ మధ్య యూఎస్‌కి పోగ్రామ్ పనిమీద వెళ్లిన మాకు అక్కడ చిన్న సమస్య తలెత్తితే... ఒక్క ఫోన్‌కాల్‌తో ఆ సమస్యని పరిష్కరించారాయన. కొన్నేళ్ల క్రితం బార్సిలోనాలో జరిగిన ఒలంపిక్ క్రీడలు ‘మాండలిన్’ శ్రీనివాస్‌గారి కాన్సెప్ట్‌తో ప్రారంభమయ్యాయి. అప్పుడే అక్కడ ‘యు.శ్రీనివాస్’ అని ముద్రించిన టీ షర్ట్‌లను కూడా పంచారు. ఇది భారతీయునిగా ఆయన సాధించిన పెద్ద విజయం. అంతేకాదు, ‘మాండలిన్’ శ్రీనివాస్ కచేరీ ఉందంటే... పనులన్నీ పక్కనపెట్టేసి మరీ కచేరీని ఎంజాయ్ చేసేవారు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్. రాజీవ్‌గాంధీ నుంచి నేటి మన ప్రధాని నరేంద్రమోడీ వరకూ అందరూ ఆయన అభిమానులే. ఇక ఆయనకు అవార్డులతో పనేంటి చెప్పండి. అయితే.. ఆయన సాధించిన ఎచీవ్మెంట్లనీ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత శిష్యుడిగా నాపై ఉంది. త్వరలోనే ఆ బాధ్యతను నిర్వర్తిస్తాను. ఒక్క సినిమాకైనా ఆయనతో మాండలిన్ వాయింపజేయాలని మీకనిపించలేదా? అయ్యో... అది నా చిరకాల వాంఛ. పైగా నేనడిగితే ఆయన కాదనరు కూడా. అయితే... ఏ సినిమా పడితే ఆ సినిమాకు ఆయన్ను అడగడం కరెక్ట్ కాదని... మంచి క్లాసికల్ టచ్ ఉన్న సినిమా వచ్చినప్పుడు అడగొచ్చులే... ఇప్పుడు తొందరేముంది అనుకున్నాను. కానీ.. ఆయనే తొందరపడిపోయారు. ప్రతి ఏడాదీ నా పుట్టిన రోజున మొదటి విషెస్ ఆయన నుంచే అందేవి. ఈ ఏడాది కూడా నేను యూఎస్‌లో ఉంటే వాట్సాప్ ద్వారా విషెస్ చెప్పారు. అన్నయ్యతో నా చివరి అనుభవం అది. నేను ఏ విషయంలోనైనా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఇంత అప్సెట్ అవ్వడం మాత్రం ఇదే. నా బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థంకావడంలేదు. నా దైవం నన్ను వదిలి వెళ్లింది అంతే (చమర్చిన కళ్లతో). - బుర్రా నరసింహ -
మోహ్ అప్‌నేహి రంగ్ రంగ్ మె రంగ్ దే..!
మాండలిన్‌పై సూఫీ గీతం! హరిహరన్‌తో వహ్వాలు అందుకున్న శ్రీనివాస్! ‘‘ఇక్కడ అస్తమించిన సూర్యుడు మరెక్కడో ఉదయిస్తాడు! శుక్రవారం చెన్నైలో నిశ్చలమైన మాండలిన్ శ్రీనివాస్ వేళ్లు మరెక్కడో వేళ్లూనుకుని సంగీత సుధలు పలికిస్తాయి! సరస్వతి ఆయన వేలి కొసలలోకి ప్రవహిస్తుంది కాబట్టే ‘హంసధ్వని’ మన చెవులకు సోకుతుంది! చూస్తూ ఉండండి.. మరేదో తంత్రీ వాయిద్యంతో ఆరేళ్లలో ‘కార్నెగీ హాల్లో’ ప్రపంచాన్ని విస్మయపరుస్తాడు’’ .. మాండలిన్ శ్రీనివాస్ వాద్యకచేరీని ప్రముఖ గాయకుడు హరిహరన్‌తో వీనులవిందుగా ఆలకించిన హైద్రాబాదీల మనోగతం అది! ఏ సందర్భంలో? పద్మవిభూషణ్, సంగీత్ మార్తాండ్ పండిట్ జస్రాజ్ తన తండ్రి, సోదరుల పేరుతో నెలకొల్పిన ‘పండిట్ మోతీరామ్ పండిట్ మణిరామ్ సంగీత్ సమారోహ్’ ఉత్సవాలలో పాల్గొనేందుకు మాండలిన్ శ్రీనివాస్ 2004లో నగరానికి విచ్చేశారు. శ్రీనివాస్ అంటే ఎవరు? సమకాలీన మొజార్ట్! సమకాలీన యహుది మెనుహిన్! మాండలిన్ పుట్టిన తర్వాత కర్ణాటక-హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన అనితరుడు! తూర్పుపడమరల గాయకులు, వాద్యవేత్తలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై పాల్గొన్నవాడు! జాన్ మెక్లగిన్ - గిటార్, జకీర్ హుసేన్-తబలా, సెల్వగణేష్-కంజీర, ఘటం.. శంకర్ మహదేవన్ గాత్రంతో యు. శ్రీనివాస్ మాండలిన్‌ను విని మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆయనను ప్రత్యక్షంగా చూసే అవకాశం విడుచుకుంటారా? శ్రీనివాస్‌ను వినేందుకు, చూసేందుకు సంగీతాభిమానులైన హైద్రాబాదీలు కిక్కిరిసి పోయారు. 2004, డిసెంబర్ 20వ తేదీ, మంగళవారం ఆహ్లాదకరమైన సాయంత్రం.. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమైన సంగీత సంగమం ప్రారంభమైంది. పద్మశ్రీ హరిహరన్’ ‘మోహము చెలిపై ముంచిన వాడా..’ తరహాలోని సూఫీ గీతాన్ని అందుకున్నారు! ‘‘మోహె అప్నెహీ రంగ్ మె రంగ్ దే రంగీలా తూ తో సాహెబ్ మొర మెహబూబ్ హి ఇలాయీ...’’ పాటవిని ప్రేక్షకులు పరవశులైనారు! మాండలిన్‌పై శ్రీనివాస్ విన్పించాలి. క్రీ.పూ. 3వేల సంవత్సరాలనాటి తంత్రీ వాద్యం అనేక రూపాలలో పరిణామం చెందుతూ పేర్లను మార్చుకుంటూ ‘మాండలిన్’ అనే పాశ్చాత్యపరికరంగా రూఢి అయిన తర్వాత తొలిసారిగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పలికించిన శ్రీనివాస్ సూఫీ గీతాన్ని ఎలా విన్పిస్తారు? చెవులు రిక్కించి ఉత్కంఠకు లోనైనారు రసహృదయులైన ప్రేక్షకులు! ఏమా అనుభూతి? ఆ శబ్దసౌందర్యానికి గాయకుడైన హరిహరన్ పులకించి పోయాడు. పలుమార్లు ‘వహ్వా’లను పలికారు. ప్రేక్షకుల సంగతి చెప్పాలా? బాలురు నృత్యం చేశారు! శ్రీనివాస్ ‘శిశుర్వేత్తి’ కదా! - పున్నా కృష్ణమూర్తి -
సంగీతం కన్నీరు పెట్టింది
సంగీతం కన్నీరు కార్చింది. మాండలిన్ శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించిన సినీ కళాకారులు, సంగీత కళాకారు లు దుఃఖంతో ఏడవడానికి కూడా గొంతు పె గలక మౌనంగానే రోదించారు. శ్రీనివాసన్ కుటుంబ సభ్యుల్లో మాత్రం శోకం కట్టలుతెంచుకుంది. శనివారం మాండలిన్ శ్రీనివాస్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించా రు. ఆయన్ను కడసారి చూసేందుకు పలువు రు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించా రు. నివాళులర్పించినవారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరి హరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు. సంగీత మహాన్: డ్రమ్స్ శివమణి మాట్లాడు తూ మాండలిన్ శ్రీనివాస్ కర్ణాటక సంగీత మహాన్ అని కొనియాడారు. కర్ణాటక సంగీతానికి ఖ్యాతి నార్జించి పెట్టిన లెజెండ్‌ను కోల్పోయామన్నారు. శ్రీనివాస్ తనకు చిన్న నాటినుంచి తెలుసన్నారు. అంతేకాదు ఆయన తన కు గురువుఅని అన్నారు. శ్రీనివాస్‌తో కలసి పలు కచేరీలు చేశానని తెలిపారు. ఈ సందర్భంగా డ్రమ్స్ శివమణి మాండలిన్ పార్థివదేహం వద్ద డ్రమ్స్ వాయిస్తూ కన్నీటి నివాళులర్పించారు. మూలస్తంభాన్ని కోల్పోయాం : దేశంలోని మాండలిన్ వాయిద్య కళాకారుల్లో నాలుగుస్తంభాల్లాంటి కర్ణాటక సంగీతకళాకారుల్లో ఒక స్తంభాన్ని కోల్పోయామని సంగీతదర్శకుడు శ్రీకాంత్‌దేవా అన్నారు. గౌరవం అనేది ఆయననుంచి నేర్చుకోవాలన్నారు. ఆయనతో కల సి ఒక సంగీత కచేరి చేయాలన్న సంకల్పం నెరవేరకుండానే శ్రీనివాస్ కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాం తి కలగాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు. నటి శోభన సంతాపం వ్యక్తం చేయలేనంతగా కంటతడి పెట్టారు. గాయకుడు హరిహరన్ బోరున ఏడ్చేశారు. దేవిశ్రీ ప్రసాద్ శ్మశానవాటికకు వెళ్లి మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీనివాస్ అభిమానులు కర్ణాటక సంగీత చక్రవర్తికి జోహార్‌అంటూ ఘోషిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో స్థానిక బెసెంట్నగర్లోని శ్మశానవాటికలో జరిగాయి. -
మాండలిన్ మూగబోయింది
మాండలిన్ సంగీత వాయిద్యం మూగబోయింది. ఆ వాయిద్యానికి తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడిన కర్ణాటక సంగీతానికి తీరనిలోటు జరిగిపోయింది. మాండలిన్ శ్రీనివాస్‌గా విశ్వఖ్యాతి పొందిన ఉప్పలపు శ్రీనివాస్ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. దీంతో సంగీతలోకం కంటతడి పెట్టింది. - అనారోగ్యంతో ఉప్పలపు శ్రీనివాస్ మృతి - ప్రముఖుల సంతాపం - ఆదివారం అంత్యక్రియలు? తమిళసినిమా: మాండలిన్ శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ఈ నెల మూడవ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు మరో కాలేయ మార్పిడికి చికిత్స అందించారు. అయి నా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. బాలమేధావి: ఉప్పలపు శ్రీనివాస్ బాల సంగీత మేధా వి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరేళ్లలోనే సంగీత అభ్యసనకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు. తండ్రి మాండలిన్ సత్యనారాయణ. తమ్ముడు రాజేష్ కూడా ప్రముఖ మాండలిన్ వాయిద్యకారుడే. వీరికి ఒక సోదరి ఉన్నారు. చిన్నతనంలోనే శ్రీనివాస్ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. తనయుడి అభిరుచుకి తగ్గట్టుగా తండ్రి ప్రోత్సాహం లభించింది. ఆయన గురువు రుద్రరాజు సుబ్బరాజు వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించారు. శ్రీనివాస్ తొమ్మిదేళ్ల వయసులోనే మాండలిన్ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశారు. ఆంధ్రరాష్ట్రంలో 1978లో వాయిద్యకారుడిగా రంగప్రవేశం చేశారు. శ్రీనివాస్ మద్రాసులో తొలిసారిగా సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మొదలు ఆయన మన దేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రు మెంట్‌తో కర్ణాటక సంగీతానికి కొత్త పుంతలు తొక్కిం చారు. విదేశీ వెస్ట్రన్ సంగీత కళాకారులు మైఖెల్బ్రూక్, జాన్మెర్లాగ్లిన్, నెగైల్ కొండి టైగన్, మైఖెల్ వైమన్ వంటి వారితో కలసి విదేశాల్లో పలు ప్రోగ్రామ్‌లు చేశారు. శ్రీనివాస్ కర్ణాటక సంగీతంలోనే కాదు హిందుస్థానీ సంగీతంలోనూ ప్రావీణ్యం గడించారు. హిందుస్థానీ క్లాసికల్ సంగీత కళాకారులు హరిప్రసాద్, చేరసియా, జాకీర్ హుస్సేన్ వంటి వారితో కలసి పనిచేసిన ఘనత శ్రీనివాస్‌ది. సన్మానాలు, సత్కారాలు ఎన్నో మాండలిన్ శ్రీనివాస్ అతి పిన్న వయసులోనే 1998లో పద్మశ్రీ అవార్డు వరించింది. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 1983లోనే బెర్లిన్‌లో జరిగిన జజ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్ కైవశం చేసుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవినలంకరించారు. సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, నేషనల్ సిటిజన్ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు ఇలా పలు అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ పలు కర్ణాటక సంగీత ఆల్బమ్‌లు చేశారు. ప్రముఖుల సంతాపం జాతీయస్థాయిలో పలువురు సంగీత విద్వాంసులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహ్మాన్, హరీష్ జయరాజ్, ఎస్.తమన్ తదితరులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు 1994 మే 27న యువశ్రీ అనే ఆమెతో వివాహమైంది. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2009లో భార్యభర్తలు విడిపోయి విడాకులు పొందారు. మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో జరగనున్నట్లు సమాచారం. -
నా హృదయం చలించింది: ఏఆర్ రెహ్మాన్
దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులలో మాండొలిన్ శ్రీనివాస్ ఒకరంటూ పలువురు సంగీత ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీనివాస్ మృతి విషయం విని తన హృదయం చలించిపోయిందని ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాండొలిన్ శ్రీనివాస్ (45) శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. కాలేయ సమస్య కారణంగా ఆయనను కొద్దిరోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఉదయం 9.30 గంటల సమయంలో శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన మరణానికి పలువురు సంగీత ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. Emotionally shaken to hear of Carnatic shining star Mandolin Shrinivasji's demise... May God bless him with happiness in the next world... — A.R.Rahman (@arrahman) September 19, 2014 U. Srinivas one of the finest musicians ever a true Earth Angel left us for his journey skyward .... you will be sorely missed . — Ehsaan Noorani (@EhsaanNoorani) September 19, 2014 The grt Mandolin exponent U Shrinivas is no more unfortunately. Ws gng thru a liver trnsplnt. Imprvd apparently. Bt succumbed tragically.RIP — Sonu Nigam (@sonunigam) September 19, 2014 -
శ్రీనివాస్ మృతికి మోడీ, వైఎస్ జగన్, బాబు సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిస్ శ్రీనివాస్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. సంగీతంలో మాండోలిసన్ శ్రీనివాస్ సేవలను ఆయన ఈ సందర్శంగా గుర్తు చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోడీ తన అధికారక ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ ...సంగీతానికి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలు చిరస్మరణీయమని మోడీ మరో ట్విట్ చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కాలేయ సమస్యతో శుక్రవారం ఉదయం చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు మాండోలిన్ శ్రీనివాస్ మృతి పట్లపై ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతాపం ప్రకటించారు. చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మాండోలిన్ శ్రీనివాస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం బాధాకరమన్నారు. -
మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత
-
ప్రముఖ విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత
చెన్నై: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్‌గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం. -
సంగీతమే నా శ్వాస
సంగీత ప్రియుల మనసును దోచుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతమే తన ప్రాణం, ఊపిరి అన్నారు. బుధవారం స్వగ్రామం వెదురుపాక వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన సంగీత ప్రస్థానాన్ని ఇలా వివరించారు. మాండలిన్ శ్రీనివాస్ తొలిగురువు.. వయొలిన్ విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ వద్ద వయోలిన్ నేర్చుకున్నాను. నాన్న సత్యమూర్తి రచయిత కావడంతో నేను చిన్నప్పటి నుంచీ ఎస్పీ కోదండపాణి రీరికార్డింగ్ సెంటర్లోనే గడిపేవాడ్ని. రికార్డింగ్ సెంటర్లో ప్రతి అంశాన్ని ఆసక్తిగా గమనించేవాడ్ని. ఆ పరిశీలన ఇవాళ నాకు ఎంతో ఉపకరిస్తోంది. మర్చిపోలేని అనుభూతి నాకు సంగీతంపై ఆసక్తి పెంచిన అదే కోదండపాణి రికార్డింగ్ థియేటర్లో మొదటి పాటకు సంగీతాన్ని సమకూర్చడం మర్చిపోలేని అనుభూతి. అది కూడా నాకు ఇష్టమైన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ‘దేవి’ చిత్రానికి తొలి పాట పాడించడం సంతోషాన్నిచ్చింది. నిర్మాతల కోరికతోనే... ఐటమ్‌సాంగ్స్ చేయాలనేది నా కోరిక కాదు. నేను చేసిన ఐటమ్ సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ తో నిర్మాతలే అలా కోరుతున్నారు. వారి కోరికపైనే ప్రతి సినిమాకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నాను. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు కూడా ఐటమ్ సాంగ్ చేశాను. నచ్చిన సబ్జెక్టు వస్తే నటిస్తా.. దర్శకుల ఒత్తిడి మేరకే కొన్ని సినిమాల్లో నటిం చాను. నన్ను హీరోగా పెట్టి సినిమాలు చేయాలని నిర్మాతలు అడుగుతున్నారు. నటన, సంగీ తంలో నా తొలి ప్రాధాన్యం సంగీతానికే. అయితే మనసుకి నచ్చిన సబ్జెక్ట్ వస్తే నటిస్తా. రెండు భాషల్లో బిజీగా.. తెలుగు, తమిళం భాషల్లో బిజీగా ఉన్నాను. ఈ నెలాఖరుకు ‘లెజెండ్’ రీ రికార్డింగ్ పూర్తవుతుం ది. బెల్లంకొండ సురేష్ కుమారుడు వినయ్ హీరోగా చేస్తున్న సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నా ను. తమిళంలో అజిత్ ‘వీరమ్’ పెద్ద మ్యూ జికల్ హిట్. బ్రహ్మన్న సినిమాకు పని చేశాను. రజనీకాంత్ మినహా.. రజనీకాంత్ మినహా దక్షిణాది ప్రముఖ హీరోలందరి సినిమాలకు సంగీతం ఇచ్చాను. రజనీ సినిమాకు కూడా పనిచేయాలని ఉంది. చేసిన ప్రతి హీరో, దర్శకుల తొలి చిత్రాలు సంగీత పరంగా సక్సెస్ కావడం సంతృప్తినిచ్చింది. ఏదో చేయాలనుంది.. అమ్మమ్మ ఊరైన అమలాపురం, నాన్నగారి ఊరైన వెదురుపాక గ్రామాలకు ఏదైనా చేయాలని ఉంది. నా మనసులో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. త్వరలో వాటిని అమలు చేస్తాను. దక్షిణ భారతదేశంలో పాప్ మ్యూజిక్‌కి ఆదరణ లేదు. హిందీ చిత్రసీమలో కూడా పాప్ మ్యూజిక్‌పై ఆదరణ ఇటీవల తగ్గింది. ఎప్పటికైనా ప్రపంచస్థాయి పాప్ మ్యూజిక్ ఆల్బమ్ చేయడం నా జీవితాశయం. -
ఆయన దగ్గర నా నోరు పెగలదు
నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయ్. వాటిల్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? నేను కంపోజ్ చేసిన ట్యూన్‌ని మ్యాండలిన్ శ్రీనివాస్‌గారితో ప్లే చేయించుకోవాలని. అది సినిమా పాట కావొచ్చు. లేక ఏదైనా స్పెషల్ కాన్సర్ట్ కావొచ్చు. మ్యాండలిన్ శ్రీనివాస్‌గారు నా గురువు. మూడో తరగతి చదువుతున్నపుడు ఆయన శిష్యునిగా చేరాను. పదేళ్లు ఆయన దగ్గరే శిష్యరికం చేశాను. ఓ గురువుగా కాకుండా ఫ్రెండ్‌లానే ట్రీట్ చేసేవారు. చాలా చిన్నవయసులోనే విశ్వవిఖ్యాతిగాంచారాయన. అయినా సింప్లిసిటీతోనే కనిపించేవారు. ఎక్కడా అతి, అతిశయం ఉండదు. మహా మహా విద్వాంసులే ఆయన ఇంటికొచ్చేవారు. మేమంతా నోరు వెళ్ల బెట్టుకుని చూస్తుండేవాళ్లం. ఆయనింటికి మా ఇల్లు చాలా దగ్గర. అలాగే ఆయన మనసుకి కూడా నేను చాలా దగ్గర. అప్పట్లో ఏ కచ్చేరీ చేసినా ఆయనకు నేనే ప్రధాన శిష్యుణ్ణి. మా ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నో నేర్పించారు. నేను ఆయన దగ్గర విద్యతో పాటు చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వాన్ని నేను కూడా వంట బట్టించుకుంటున్నాను. నేను ప్రపంచంలో ఎవ్వరితోనైనా ధైర్యంగా మాట్లాడగలను కానీ, గురువుగారి దగ్గర మాత్రం నా నోరు పెగలదు. నా ప్రతి సినిమా తొలి ఆడియో సీడీని ఆయన్ని కలిసి ఇస్తుంటాను. నా పాటలు నచ్చితే ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఆ మధ్య ఆయన చేసిన ఓ కచ్చేరీకి నేనూ వెళ్లాను. నన్ను చూడగానే ‘‘ ‘కెవ్వు కేక’ పాట భలే చేశావె’’ అంటూ ఆయన అంటే, ఆశ్చర్యమనిపించింది. అంత సరదాగా ఉంటారాయన. పండుగలకూ, నా పుట్టిన్రోజునాడూ గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేస్తుంటారు. అంతటి గొప్ప వ్యక్తికి నేనూ శిష్యుణ్ణయినందుకు ఎప్పటికీ గర్విస్తాను. - దేవిశ్రీప్రసాద్