సంగీతమే నా శ్వాస
సంగీత ప్రియుల మనసును దోచుకున్న ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతమే తన ప్రాణం, ఊపిరి అన్నారు. బుధవారం స్వగ్రామం వెదురుపాక వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన సంగీత ప్రస్థానాన్ని ఇలా వివరించారు.
మాండలిన్ శ్రీనివాస్ తొలిగురువు..
వయొలిన్ విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ వద్ద వయోలిన్ నేర్చుకున్నాను. నాన్న సత్యమూర్తి రచయిత కావడంతో నేను చిన్నప్పటి నుంచీ ఎస్పీ కోదండపాణి రీరికార్డింగ్ సెంటర్‌లోనే గడిపేవాడ్ని. రికార్డింగ్ సెంటర్‌లో ప్రతి అంశాన్ని ఆసక్తిగా గమనించేవాడ్ని. ఆ పరిశీలన ఇవాళ నాకు ఎంతో ఉపకరిస్తోంది.
మర్చిపోలేని అనుభూతి
నాకు సంగీతంపై ఆసక్తి పెంచిన అదే కోదండపాణి రికార్డింగ్ థియేటర్‌లో మొదటి పాటకు సంగీతాన్ని సమకూర్చడం మర్చిపోలేని అనుభూతి. అది కూడా నాకు ఇష్టమైన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ‘దేవి’ చిత్రానికి తొలి పాట పాడించడం సంతోషాన్నిచ్చింది.
నిర్మాతల కోరికతోనే...
ఐటమ్‌సాంగ్స్ చేయాలనేది నా కోరిక కాదు. నేను చేసిన ఐటమ్ సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ తో నిర్మాతలే అలా కోరుతున్నారు. వారి కోరికపైనే ప్రతి సినిమాకు ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్నాను. బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు కూడా ఐటమ్ సాంగ్ చేశాను.
నచ్చిన సబ్జెక్టు వస్తే నటిస్తా..
దర్శకుల ఒత్తిడి మేరకే కొన్ని సినిమాల్లో నటిం చాను. నన్ను హీరోగా పెట్టి సినిమాలు చేయాలని నిర్మాతలు అడుగుతున్నారు. నటన, సంగీ తంలో నా తొలి ప్రాధాన్యం సంగీతానికే. అయితే మనసుకి నచ్చిన సబ్జెక్ట్ వస్తే నటిస్తా.
రెండు భాషల్లో బిజీగా..
తెలుగు, తమిళం భాషల్లో బిజీగా ఉన్నాను. ఈ నెలాఖరుకు ‘లెజెండ్’ రీ రికార్డింగ్ పూర్తవుతుం ది. బెల్లంకొండ సురేష్ కుమారుడు వినయ్ హీరోగా చేస్తున్న సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నా ను. తమిళంలో అజిత్ ‘వీరమ్’ పెద్ద మ్యూ జికల్ హిట్. బ్రహ్మన్న సినిమాకు పని చేశాను.
రజనీకాంత్ మినహా..
రజనీకాంత్ మినహా దక్షిణాది ప్రముఖ హీరోలందరి సినిమాలకు సంగీతం ఇచ్చాను. రజనీ సినిమాకు కూడా పనిచేయాలని ఉంది. చేసిన ప్రతి హీరో, దర్శకుల తొలి చిత్రాలు సంగీత పరంగా సక్సెస్ కావడం సంతృప్తినిచ్చింది.
ఏదో చేయాలనుంది..
అమ్మమ్మ ఊరైన అమలాపురం, నాన్నగారి ఊరైన వెదురుపాక గ్రామాలకు ఏదైనా చేయాలని ఉంది. నా మనసులో కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. త్వరలో వాటిని అమలు చేస్తాను. దక్షిణ భారతదేశంలో పాప్ మ్యూజిక్‌కి ఆదరణ లేదు. హిందీ చిత్రసీమలో కూడా పాప్ మ్యూజిక్‌పై ఆదరణ ఇటీవల తగ్గింది. ఎప్పటికైనా ప్రపంచస్థాయి పాప్ మ్యూజిక్ ఆల్బమ్ చేయడం నా జీవితాశయం.