సినిమా ఆడాలంటే..దమ్మున్న కథ కావాలి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడు. అందులో డౌటే లేదు. కానీ అది ఎంత మంచి కంటెంట్ అయినా సరే.. ప్రేక్షకులకు రీచ్ కాకపోతే అంతే సంగతి. అందుకే రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్, టీజర్లను విడుదల చేస్తూ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు మేకర్స్. రిలీజ్‌కు ముందు..రిలీజ్ తర్వాత కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించేంది సంగీతం అనే చెప్పాలి. పాటలు, నేపథ్య సంగీతం బాగుంటే చాలు సినిమా సగం హిట్టయినట్టే. అందుకే సంగీత దర్శకుల విషయంలోనూ నిర్మాతలు ఆచి తూచి అడుగేస్తారు. జానర్‌ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటారు.
ఇక ప్రేమ కథలకు పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). లవ్‌స్టోరీ చిత్రాలకు ఆయన అందించే పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. మెలోడీ అయినా మాస్ సాంగ్ అయినా.. హృదయాలను హత్తుకుంటాయి. తాజాగా తండేల్(Thandel) చిత్రానికి కూడా దేవి అలాంటి పాటలే అందించాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని పాటలు ఇప్పటికే సూపర్ హిట్‌గా నిలిచాయి. హైలేస్సో హైలెస్సా.. సాంగ్ అయితే అంతటా మార్మోగుతుంది. అలాంటి చాట్ బస్టర్స్ అందించిన దేవిశ్రీ.. ఈ సినిమాకు ఫస్ట్ చాయిస్ కాదట. అసలు ఈ చిత్రానికి అతన్ని తీసుకోవద్దని నిర్మాత అల్లు అరవింద్ అనుకున్నారట. బన్నీ చెప్పడంతోనే తండేల్ చాన్స్ డీఎస్పీకి వచ్చిందట. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అరవింద్ ఈ విషయాన్ని చెప్పారు.
దేవి సంగీతం వద్దని చెప్పాను
తండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిప్రసాద్‌ని పెట్టుకుందామని మా టీమ్ చెబితే నేను వద్దని చెప్పాను. ఎందుకంటే..పుష్ప2 సినిమా, మా సినిమా పనులు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. దేవి పుష్ప 2కి సంగీతం అందించడంలో బిజీగా ఉన్నాడు. అలాంటి వాడిని తీసుకుంటే మన సినిమాకు న్యాయం చేయలేడని టీమ్‌కి చెప్పాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకోవాలనుకున్నాం.
బన్నీ చెప్పడంతో..
దేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ల నాన్న(సత్య మూర్తి) నా స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. కానీ పుష్ప 2 లాంటి సినిమాకు పని చేస్తున్నప్పడు.. ఇంకో సినిమాకు న్యాయం చేయలేడేమో అనిపించింది. దేవిని వాళ్లే(పుష్ప టీమ్) లాగేసుకుంటారు. మాకు సమయం కేటాయించడు అనుకున్నాం. అయితే తండేల్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరి తీసుకోవాలనేది అర్థం కాలేదు. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో అల్లు అర్జున్‌కి ఈ విషయం చెప్పాను.
‘ఎవరి తీసుకోవాలో తెలియడం లేదు. దేవిని తీసుకుంటే.. మీరు(పుష్ప 2) ఇబ్బంది పెడతారు. అతన్ని తీసుకోవాలంటే నిన్ను(బన్నీ), దర్శకుడు(సుకుమార్) ఇలా అందరిని అడగాల్సి ఉంటుంది. అందుకే వేరే వ్యక్తిని చూద్దాం అనుకుంటున్నాను’అని చెప్పా. వెంటనే బన్నీ.. ‘దేవినే బెస్ట్ చాయిస్. లవ్‌స్టోరీలకు దేవిని మించినోడు లేడు..అతన్నే తీసుకోండి’ అని చెప్పాడు. దీంతో మేం దేవిని సంప్రదించాం’ అని అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, చందు మొండేటి దర్వకత్వంలో నాగచైనత్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment