మాండలిన్ మూగబోయింది | Mandolin Shrinivas passes away in chennai | Sakshi
Sakshi News home page

మాండలిన్ మూగబోయింది

Published Sat, Sep 20 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

మాండలిన్ మూగబోయింది

మాండలిన్ మూగబోయింది

మాండలిన్ సంగీత వాయిద్యం మూగబోయింది. ఆ వాయిద్యానికి తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడిన కర్ణాటక సంగీతానికి తీరనిలోటు జరిగిపోయింది. మాండలిన్ శ్రీనివాస్‌గా విశ్వఖ్యాతి పొందిన ఉప్పలపు శ్రీనివాస్ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. దీంతో సంగీతలోకం కంటతడి పెట్టింది.
 
- అనారోగ్యంతో ఉప్పలపు శ్రీనివాస్ మృతి
- ప్రముఖుల సంతాపం
- ఆదివారం అంత్యక్రియలు?
తమిళసినిమా: మాండలిన్ శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ఈ నెల మూడవ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు మరో కాలేయ మార్పిడికి చికిత్స అందించారు. అయి నా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు.
 
బాలమేధావి: ఉప్పలపు శ్రీనివాస్ బాల సంగీత మేధా వి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరేళ్లలోనే సంగీత అభ్యసనకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు. తండ్రి మాండలిన్ సత్యనారాయణ. తమ్ముడు రాజేష్ కూడా ప్రముఖ మాండలిన్ వాయిద్యకారుడే. వీరికి ఒక సోదరి ఉన్నారు. చిన్నతనంలోనే శ్రీనివాస్ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. తనయుడి అభిరుచుకి తగ్గట్టుగా తండ్రి ప్రోత్సాహం లభించింది. ఆయన గురువు రుద్రరాజు సుబ్బరాజు వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించారు. శ్రీనివాస్ తొమ్మిదేళ్ల వయసులోనే మాండలిన్ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశారు.

ఆంధ్రరాష్ట్రంలో 1978లో వాయిద్యకారుడిగా రంగప్రవేశం చేశారు. శ్రీనివాస్ మద్రాసులో తొలిసారిగా సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మొదలు ఆయన మన దేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రు మెంట్‌తో కర్ణాటక సంగీతానికి కొత్త పుంతలు తొక్కిం చారు. విదేశీ వెస్ట్రన్ సంగీత కళాకారులు మైఖెల్‌బ్రూక్, జాన్‌మెర్‌లాగ్లిన్, నెగైల్ కొండి టైగన్, మైఖెల్ వైమన్ వంటి వారితో కలసి విదేశాల్లో పలు ప్రోగ్రామ్‌లు చేశారు. శ్రీనివాస్ కర్ణాటక సంగీతంలోనే కాదు హిందుస్థానీ సంగీతంలోనూ ప్రావీణ్యం గడించారు. హిందుస్థానీ క్లాసికల్ సంగీత కళాకారులు హరిప్రసాద్, చేరసియా, జాకీర్ హుస్సేన్ వంటి వారితో కలసి పనిచేసిన ఘనత శ్రీనివాస్‌ది.
 
సన్మానాలు, సత్కారాలు ఎన్నో
మాండలిన్ శ్రీనివాస్ అతి పిన్న వయసులోనే 1998లో పద్మశ్రీ అవార్డు వరించింది. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 1983లోనే బెర్లిన్‌లో జరిగిన జజ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్ కైవశం చేసుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవినలంకరించారు. సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, నేషనల్ సిటిజన్ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు ఇలా పలు అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ పలు కర్ణాటక సంగీత ఆల్బమ్‌లు చేశారు.
 
ప్రముఖుల సంతాపం
జాతీయస్థాయిలో పలువురు సంగీత విద్వాంసులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహ్మాన్, హరీష్ జయరాజ్, ఎస్.తమన్ తదితరులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు 1994 మే 27న యువశ్రీ అనే ఆమెతో వివాహమైంది. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2009లో భార్యభర్తలు విడిపోయి విడాకులు పొందారు. మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో జరగనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement