uppalapu srinivas
-
మాండలిన్ శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
చెన్నై బీసెంట్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పార్థివదేహాన్ని కడసారి దర్శించుకున్న పలువురు ప్రముఖులు చెన్నై/సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ పార్థివదేహానికి చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు జరిగాయి. మాండలిన్ శ్రీనివాస్ శుక్రవారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కాలేయ సంబంధ అనారోగ్యంతో 45 ఏళ్ల పిన్నవయసులోనే కన్నుమూయడం తెలిసిందే. ఆయన భౌతికకాయానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూడడానికి పలువురు సినీకళాకారులు, సంగీత కళాకారులు, ఇతర ప్రముఖులు పెద్దఎత్తున తరలివచ్చారు. పిన్నవయసులోనే కానరాని లోకాలకు తరలిపోయిన ఆయన్ను తలుచుకుని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ‘నిజానికి ఉప్పలపు శ్రీనివాస్ అంటే చాలామందికి తెలియదు. మాండలిన్ శ్రీనివాస్ అంటే ప్రపంచమే గౌరవిస్తుంది. అంతటి ఘనకీర్తి, కిరీటాలు పొందిన శ్రీనివాస్ పిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మాండలిన్ శ్రీనివాస్ మరణం దేశంలోని సంగీత కళాకారులందరి మనసులను కలచివేసింది’ అంటూ ఆయన్ను స్మరించుకున్నారు. శ్రీనివాస్‌కు నివాళులర్పించిన వారిలో డీఎంకే కోశాధికారి స్టాలిన్, మాజీ మేయర్ సుబ్రమణియన్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, శ్రీకాంత్‌దేవా, గాయకులు శంకర్ మహదేవన్, హరిహరన్, డ్రమ్స్ శివమణి, నటి శోభన తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి సంతాపం మాండలిన్ శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతిభవన్ వర్గాలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీనివాస్ సోదరుడు రాజేష్ పేరిట రాసిన లేఖలో ‘‘మీ సోదరుడు శ్రీనివాస్ మృతి వార్త విని చాలా బాధపడ్డాను’’ అని పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో తన కచేరీలద్వారా దేశంతోపాటు విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారని, ఆయన మృతితో ఓ గొప్ప మాండలిన్ విద్వాంసుడిని కోల్పోయిందని రాష్ట్రపతి అన్నారు. శ్రీనివాస్ కుటుంబీకులకు సానుభూతి తెలియజేశారు. -
మాండలిన్ మూగబోయింది
మాండలిన్ సంగీత వాయిద్యం మూగబోయింది. ఆ వాయిద్యానికి తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడిన కర్ణాటక సంగీతానికి తీరనిలోటు జరిగిపోయింది. మాండలిన్ శ్రీనివాస్‌గా విశ్వఖ్యాతి పొందిన ఉప్పలపు శ్రీనివాస్ (45) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. దీంతో సంగీతలోకం కంటతడి పెట్టింది. - అనారోగ్యంతో ఉప్పలపు శ్రీనివాస్ మృతి - ప్రముఖుల సంతాపం - ఆదివారం అంత్యక్రియలు? తమిళసినిమా: మాండలిన్ శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా ఈ నెల మూడవ తేదీన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈయనకు కాలేయం చెడిపోవడంతో వైద్యులు మరో కాలేయ మార్పిడికి చికిత్స అందించారు. అయి నా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాండలిన్ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. బాలమేధావి: ఉప్పలపు శ్రీనివాస్ బాల సంగీత మేధా వి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆరేళ్లలోనే సంగీత అభ్యసనకు శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు. తండ్రి మాండలిన్ సత్యనారాయణ. తమ్ముడు రాజేష్ కూడా ప్రముఖ మాండలిన్ వాయిద్యకారుడే. వీరికి ఒక సోదరి ఉన్నారు. చిన్నతనంలోనే శ్రీనివాస్ సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. తనయుడి అభిరుచుకి తగ్గట్టుగా తండ్రి ప్రోత్సాహం లభించింది. ఆయన గురువు రుద్రరాజు సుబ్బరాజు వద్ద సంగీతంలో శిక్షణ ఇప్పించారు. శ్రీనివాస్ తొమ్మిదేళ్ల వయసులోనే మాండలిన్ వాయిద్యకారుడిగా అరంగేట్రం చేశారు. ఆంధ్రరాష్ట్రంలో 1978లో వాయిద్యకారుడిగా రంగప్రవేశం చేశారు. శ్రీనివాస్ మద్రాసులో తొలిసారిగా సంగీతోత్సవాల సందర్భంగా ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మొదలు ఆయన మన దేశంలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రు మెంట్‌తో కర్ణాటక సంగీతానికి కొత్త పుంతలు తొక్కిం చారు. విదేశీ వెస్ట్రన్ సంగీత కళాకారులు మైఖెల్బ్రూక్, జాన్మెర్లాగ్లిన్, నెగైల్ కొండి టైగన్, మైఖెల్ వైమన్ వంటి వారితో కలసి విదేశాల్లో పలు ప్రోగ్రామ్‌లు చేశారు. శ్రీనివాస్ కర్ణాటక సంగీతంలోనే కాదు హిందుస్థానీ సంగీతంలోనూ ప్రావీణ్యం గడించారు. హిందుస్థానీ క్లాసికల్ సంగీత కళాకారులు హరిప్రసాద్, చేరసియా, జాకీర్ హుస్సేన్ వంటి వారితో కలసి పనిచేసిన ఘనత శ్రీనివాస్‌ది. సన్మానాలు, సత్కారాలు ఎన్నో మాండలిన్ శ్రీనివాస్ అతి పిన్న వయసులోనే 1998లో పద్మశ్రీ అవార్డు వరించింది. 2010లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. 1983లోనే బెర్లిన్‌లో జరిగిన జజ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అత్యంత గౌరవప్రదమైన సంగీత రత్న అవార్డును శ్రీనివాస్ కైవశం చేసుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే తమిళనాడు రాష్ట్ర ఆస్థాన విద్వాంసుడుగా పదవినలంకరించారు. సనాతన సంగీత పురస్కార్, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, నేషనల్ సిటిజన్ అవార్డు, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు ఇలా పలు అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ పలు కర్ణాటక సంగీత ఆల్బమ్‌లు చేశారు. ప్రముఖుల సంతాపం జాతీయస్థాయిలో పలువురు సంగీత విద్వాంసులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు, ఏఆర్ రెహ్మాన్, హరీష్ జయరాజ్, ఎస్.తమన్ తదితరులు మాండలిన్ శ్రీనివాస్ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌కు 1994 మే 27న యువశ్రీ అనే ఆమెతో వివాహమైంది. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2009లో భార్యభర్తలు విడిపోయి విడాకులు పొందారు. మాండలిన్ శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో జరగనున్నట్లు సమాచారం. -
శ్రీనివాస్ మృతికి మోడీ, వైఎస్ జగన్, బాబు సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండోలిస్ శ్రీనివాస్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. సంగీతంలో మాండోలిసన్ శ్రీనివాస్ సేవలను ఆయన ఈ సందర్శంగా గుర్తు చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మోడీ తన అధికారక ట్విట్టర్లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ ...సంగీతానికి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలు చిరస్మరణీయమని మోడీ మరో ట్విట్ చేశారు. మాండోలిన్ శ్రీనివాస్ కాలేయ సమస్యతో శుక్రవారం ఉదయం చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు మాండోలిన్ శ్రీనివాస్ మృతి పట్లపై ప్రముఖులు సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతాపం ప్రకటించారు. చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న మాండోలిన్ శ్రీనివాస్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటం బాధాకరమన్నారు. -
మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత
-
ప్రముఖ విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ కన్నుమూత
చెన్నై: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ (45) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాండోలిన్ శ్రీనివాస్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. ఆయన 1969 ఫిబ్రవరి 28న జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపు శ్రీనివాస్ కాగా మాండోలిన్ శ్రీనివాస్‌గా ప్రసిద్ధి చెందారు. కళారంగంలో సేవలకు గానూ ఆయన రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అందుకున్నారు. చాలా ఏళ్ల క్రితమే మాండోలిన్ శ్రీనివాస్ కుటుంబం చెన్నైలో స్థిరపడింది. కాగా ఆయన అంత్రక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు సమాచారం.