ఆయన దగ్గర నా నోరు పెగలదు
ఆయన దగ్గర నా నోరు పెగలదు
Published Thu, Sep 5 2013 1:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయ్. వాటిల్లో ముఖ్యమైనది ఏంటో తెలుసా? నేను కంపోజ్ చేసిన ట్యూన్‌ని మ్యాండలిన్ శ్రీనివాస్‌గారితో ప్లే చేయించుకోవాలని. అది సినిమా పాట కావొచ్చు. లేక ఏదైనా స్పెషల్ కాన్సర్ట్ కావొచ్చు. మ్యాండలిన్ శ్రీనివాస్‌గారు నా గురువు. మూడో తరగతి చదువుతున్నపుడు ఆయన శిష్యునిగా చేరాను. పదేళ్లు ఆయన దగ్గరే శిష్యరికం చేశాను. ఓ గురువుగా కాకుండా ఫ్రెండ్‌లానే ట్రీట్ చేసేవారు. చాలా చిన్నవయసులోనే విశ్వవిఖ్యాతిగాంచారాయన.
అయినా సింప్లిసిటీతోనే కనిపించేవారు. ఎక్కడా అతి, అతిశయం ఉండదు. మహా మహా విద్వాంసులే ఆయన ఇంటికొచ్చేవారు. మేమంతా నోరు వెళ్ల బెట్టుకుని చూస్తుండేవాళ్లం. ఆయనింటికి మా ఇల్లు చాలా దగ్గర. అలాగే ఆయన మనసుకి కూడా నేను చాలా దగ్గర. అప్పట్లో ఏ కచ్చేరీ చేసినా ఆయనకు నేనే ప్రధాన శిష్యుణ్ణి. మా ఎవ్వరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నో నేర్పించారు. నేను ఆయన దగ్గర విద్యతో పాటు చాలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వాన్ని నేను కూడా వంట బట్టించుకుంటున్నాను.
నేను ప్రపంచంలో ఎవ్వరితోనైనా ధైర్యంగా మాట్లాడగలను కానీ, గురువుగారి దగ్గర మాత్రం నా నోరు పెగలదు. నా ప్రతి సినిమా తొలి ఆడియో సీడీని ఆయన్ని కలిసి ఇస్తుంటాను. నా పాటలు నచ్చితే ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఆ మధ్య ఆయన చేసిన ఓ కచ్చేరీకి నేనూ వెళ్లాను. నన్ను చూడగానే ‘‘ ‘కెవ్వు కేక’ పాట భలే చేశావె’’ అంటూ ఆయన అంటే, ఆశ్చర్యమనిపించింది. అంత సరదాగా ఉంటారాయన. పండుగలకూ, నా పుట్టిన్రోజునాడూ గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేస్తుంటారు. అంతటి గొప్ప వ్యక్తికి నేనూ శిష్యుణ్ణయినందుకు ఎప్పటికీ గర్విస్తాను.
- దేవిశ్రీప్రసాద్
Advertisement