భాగ్యనగరంలో పోరాటాలు
భాగ్యనగరంలో పోరాటాలు
Published Wed, Sep 11 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
ఒక హీరో సినిమాకు ‘1’ అనే టైటిల్ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి. ముఖ్యంగా సదరు హీరోకి అంతటి సామర్థ్యం, ఆ టైటిల్‌ని తట్టుకునే ఇమేజ్ ఉండాలి. లేకపోతే... నవ్వులపాలే. కానీ ధైర్యంగా సుకుమార్ తన చిత్రానికి ‘1’ ‘నేనొక్కడినే’ అనే టైటిల్ పెట్టారు. ఆయనకు అంతటి ధైర్యం ఎక్కడ్నుంచీ వచ్చింది? ఈ ప్రశ్నకు సమధానం ఒక్కటే. ‘మహేష్‌బాబు’. ఈ టైటిల్ మహేష్‌ది అవ్వడం వల్లే ఇప్పటివరకూ ఎలాంటి విమర్శలు రాలేదన్నది నిర్వివాదాంశం.
వరుస విజయాలతో దూసుకుపోతూ, ‘దూకుడు’గా సినిమాలు చేస్తూ అందరితో ‘నంబర్‌వన్’ అనిపించుకుంటున్నారు మహేష్. వాణిజ్య ప్రకటనల పరంగా కూడా మహేషే అందరికంటే ముందున్నారు. అందుకే ఈ టైటిల్ మహేష్‌కి యాప్ట్ అని చెప్పక తప్పదు. టైటిల్‌కి, మహేష్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రం ఉండబోతోందని యూనిట్ వర్గాల భోగట్టా. ఓ అందమైన శిల్పాన్ని చెక్కుతున్నట్లుగా ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రాన్ని రూపు దిద్దుతున్నారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో పీటర్‌హెయిన్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు సుకుమార్.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనుందని తెలుస్తోంది. సుకుమార్, దేవిశ్రీ కలయికలో వచ్చిన గత చిత్రాలకు ధీటుగా ఈ ఆల్బమ్ ఉండబోతోందట. కీర్తి సనన్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు సమాచారం. మహేష్ తనయుడు గౌతమ్‌కృష్ణ బాలనటునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నాజర్, సయాజీ షిండే, కెల్లీ డోర్జీ, విక్రమ్ సింగ్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, నిర్మాణం: 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.
Advertisement
Advertisement