హంబర్ హాక్
కారు కొందరికి హోదా! కొందరికి అవసరం! మాసబ్‌ట్యాంకులో మా ఇంటి పక్క నవాబు గారుండేవారని చెప్పాను కదా! ఆయన కాంపౌండ్‌లో ఒక కారుండేది! జాకీలపై నిలపెట్టిన పాతకారు! ఓ రోజు, నాలుగు టైర్లను, బ్యాటరీని కిరాయికి తెప్పించారు! నడిచేందుకు వీలుగా కారును మరమ్మతు చేయించారు! దాచుకున్న షెర్వానీ దరించారు. దర్పంగా కూర్చుని, దర్జాగా డ్రైవ్ చేస్తూ డిన్నర్‌కు వెళ్లారు. జానపద కథలో రాకుమారిగా మారిన పేదరాలు‘సిండ్రెల్లా’ ఆనందాన్ని గుర్తుచేస్తూ : నబాబుగారు పార్టీనుంచి ఇంటిలోకి అడుగు పెట్టారు!
స్వంత కారును ఎవరు కోరరు? అవసరం కూడా కదా! హైద్రాబాద్ వచ్చిన తొలి నాళ్లలోనే కారు గురించి ప్రయత్నాలు చేశాను. ఇంగ్లండ్‌కు చెందిన రూట్స్‌గ్రూప్ తయారీ అయిన హంబర్ కారు సెకండ్ హ్యాండ్‌లో అమ్మకానికి ఉంది అని తెలిసింది. రెండవ ప్రపంచయుద్ధం పూర్తయ్యాక కొద్ది మంది వీఐపీలకోసం ప్రత్యేకంగా తయారైన 1946 మోడల్ హంబర్ హాక్ కారు! ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు 7వ నిజాం సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన కారు! ఆయన రాజ్‌ప్రముఖ్ హోదాలో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్‌గా జీవించే ఉన్నారు. అంతటి మహాశయుడు వినియోగించిన కారు! మరోమాట లేకుండా చెప్పిన ధరకు (రూ.3,200, అక్షరాలా మూడు వేలా రెండువందల రూపాయలు) వెంటనే కొన్నాను! నా కారును స్థానికులు మహా ఆరాధనాపూర్వకంగా చూసేవారు! చూడరా మరి! నిజాం కారు కదా! ఆ కారణం అర్థసత్యమేనని అంతకంటే మహత్తరకారణం ఉందని తర్వాత తెలిసింది!
నిజాం-విప్లవం-ప్రజాస్వామ్యం
హైద్రాబాద్ చరిత్రతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నా కారు గురించి అనేక విశేషాలు చెప్పేవారు! కొంచెం ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం! నిజాంను హతం చేయాలని ఒక విప్లవ సంస్థ తీర్మానించుకుందట! నారాయణరావ్ పవార్ అనే ఆర్యసమాజీకుడు ఇందులో సభ్యుడట. కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ సంస్థకు సలహాదారుడ ట!
నిజాం దారుషిఫాలోని తన మాతృమూర్తి సమాధిని సందర్శించుకోవడానికి కింగ్‌కోఠీ నివాసం నుంచి రోజూ నిర్ణీత వేళకు కారులో బయలుదేరుతాడని పవార్ బృందం నిర్ధారించుకుందట! 1947, డిసెంబర్ 4వ తేదీన నిజాం బయలుదేరిన కారుపై నారాయణరావ్ పవార్ బాంబు వేశారట! కారును ఓ ఇంట్లోకి మళ్లించిన డ్రైవర్ చాకచక్యంతో నిజాం బతికి బట్టకట్టాడని కొందరు, కాదు, కారు గట్టిదనం వల్లేనని మరికొందరూ చెబుతుండేవారు! నారాయణరావ్ పవార్‌ను 1948, సెప్టెంబర్ 18న ఉరితీయాలని కోర్టు తీర్పునిచ్చింది. సరిగ్గా ఒక్కరోజు ముందు నిజాం భారత ప్రభుత్వానికి లొంగి పోయాడు. పవార్ దీర్ఘకాలం (2010) జీవించారు. ఒక శరణార్థ్ధి నిన్నటి పాలకుడి కారుకి యజమాని కావడం ‘మిరకిల్ ఆఫ్ డెమొక్రసీ’ కదా!
అలా సాగనంపాను!
నా కారుకు బ్రేకులు పడేవి కాదు. అయినా, ఒక్క చిన్ని ప్రమాదమూ జరగకుండా డ్రైవ్ చేశాను. స్పేర్ పార్టులు సరిగ్గా దొరికేవి కావు. హంబర్ హాక్ సిటీలోనే కాదు స్టేట్ అంతా హాట్ టాపిక్ అయ్యింది! నా అవసరానికి ఉపయోగపడడం ముఖ్యం కదా! లాభం లేదని అమ్మకానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. నెల్లూరుకు చెందిన రామిరెడ్డి గారనే వ్యక్తికి కొన్నధరకి పైసా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా అమ్మేశాను!
ప్రజెంటర్ : పున్నా కృష్ణమూర్తి