నెహ్రూ విమర్శ..మధుర జ్ఞాపకం
మతం, భాష మనుషులను కలిపి ఉంచలేవని, సంస్కృతి మాత్రమే ఆ పని చేయగలదని నా జీవితం నేర్పింది. శరణార్థిగా ఇక్కడకు వచ్చిన నన్ను,నా కుటుంబాన్ని, లక్షలాది ఆశ్రీతులను భారతీయ సమాజం కొద్దిరోజుల్లోనే తమ వారిగా మలుచుకుంది. ఆంధ్రరాష్ట్రంలో అధికారిగా, పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో సమాచార-ప్రజాసంబంధాల డెరైక్టర్‌గా ఇక్కడి నా జీవితం నిత్యనూతనంగా గడిచింది.
తెలుగు-ఉర్దూ-హిందీ-ఇంగ్లిష్ భాషలలో ప్రముఖులతో వ్యాసాలు రాయించి ఆంధ్రప్రదేశ్ పత్రికను నాలుగు భాషల్లో తెచ్చాను. అప్పట్లో ప్రముఖ పత్రికలు ఇచ్చే పారితోషికాల కంటే అదనంగా ఆంధ్రప్రదేశ్ పత్రిక వ్యాసకర్తలు పారితోషికాన్ని పొందేవారు. నాలుగు భాషలకు వ్యాసకర్తలకు వెరసి, రూ.37 వేలు చెల్లించేవాళ్లం. ఆంధ్రప్రదేశ్ పత్రికను అప్పటి ఇతర పత్రికలూ ప్రశంసించేవి! విజయవాడలో బుక్
ఎగ్జిబిషన్స్ జరిగితే ఆంధ్రప్రదేశ్ పత్రిక తరఫున ఒక స్టాల్‌ను తీసుకున్నాం.
వామపక్షభావాల కేంద్రంగా ఉన్న విజయవాడలో కాంగ్రెస్ ప్రభుత్వపు పత్రికను ఆదరిస్తారా? అని మంత్రులు అనేవారు! భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరచడమే కదా ప్రజాస్వామ్యం అన్న అభిప్రాయాన్ని గౌరవించేవారు. పత్రికలో రాష్ట్ర మంత్రివర్గం ఫొటో ఒక్కటంటే ఒక్కటే ప్రచురించేవారం. మిగిలిన అంశాలన్నీ సామాజికమే! అలాంటి వాతావరణంలో ఒక విమర్శ గురించి ప్రస్తావిస్తాను !
నందికొండ-నాగార్జున సాగరం
వరదలను నివారించడం, కృష్ణానదికి ఇరుప్రాంతాలలోని మెట్ట ప్రాంతాలకు తాగు నీరు అందించడం, విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం తదితర బహుళార్థాలను సాధించేందుకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తలపెట్టారు. 1955 డిసెంబర్ 10న నల్లగొండ జిల్లాలోని పైలాన్‌లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
అప్పట్లో ఈ ప్రాజెక్ట్‌ను నందికొండ ప్రాజెక్ట్ అనేవారు. ఆంధ్రరాష్ట్రం-హైద్రాబాద్ స్టేట్ ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తొలినాళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌గా మార్చారు. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడే! బౌద్ధ ధర్మాన్ని, వజ్రయానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు! ఆధునిక మానవతా దేవాలయంగా తాను అభివర్ణించిన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణగతిని ప్రధాని నెహ్రూ ప్రత్యేకంగా గమనించేవారు.
శ్రామికుని ప్రమిద!
మహాత్మాగాంధీ ఆశించిన గ్రామస్వరాజ్యాన్ని సాధ్యం చేయాలనే తలంపుతో 1959 అక్టోబర్ 2న రాజస్థాన్‌లోని నాగూర్‌లో దేశంలో తొలి గ్రామ పంచాయతీ సమితిని ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. మరుసటి వారం విజయదశమి రోజున అక్టోబర్ 11న రాష్ట్రంలో తొలి పంచాయతీని షాద్‌నగర్‌లో ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం తనకెంతో ఇష్టమైన నాగార్జునసాగర్‌ను సందర్శించారు. అక్కడ ఆనకట్టను వాటర్ క్యూరింగ్ చేస్తోన్న ఒక శ్రామికుడిని ఆయన పలకరించారు. ఆ శ్రామికుడు నెహ్రూతో ‘ఇది నీవు వెలిగించిన దీపం’ అన్నారు. ఇతను ఏమంటున్నాడు ? అని నెహ్రూ ముఖ్యమంత్రి సంజీవరెడ్డిని అడిగారు.
‘ఇట్ వజ్ ల్యాంప్ లెటైన్డ్ బై యు’ అని సంజీవరెడ్డి ఇంగ్లిష్‌లో చెప్పారు! ఆ మాటను వింటున్నప్పుడు నెహ్రూ మోములో వెలిగిన దీపాన్ని నేను గమనించాను! శ్రామికుని గుండెలోతుల్లోంచి వచ్చిన మాట కదా! నా శరీరమూ పులకరించింది! ‘మనం మన జీవితాల్లో కొత్త దీపాలను వెలిగిస్తామా? లేక ఉన్న దీపాల వెలుగులను ఆర్పేస్తామా! మనం మన జీవితాలను కొత్త వెలుతురులు ప్రసరించడం ద్వారా అర ్థవంతం చేసుకోవాలి..’ అని నెహ్రూ వివిధ సందర్భాల్లో అన్నారు కూడా! సరే, ఆంధ్రప్రదేశ్ తర్వాత సంచికకు కంటెంటూ దొరికిందని నేను అదనంగా ఆనందించాను!
పీఎంవో నుంచి ‘దీపపు సెగ’!
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమూ సమాజ అభ్యుదయానికి తోడ్పడే ఎన్నెన్నో కొత్త కార్యక్రమాలను, ప్రాజెక్టులను చేపడుతోంది అనే భావంలో ‘ఎన్నో కొత్త దీపాలను వెలిగిస్తోంది’ అని ఒక ప్రకటనను కవితాత్మకంగా రూపొందించాను. ప్రధానమంత్రితో శ్రామికుడు అన్నమాటలను వగైరా..వగైరా ఉదహరించాను.
ఆంధ్రప్రదేశ్ పత్రికలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఆ ప్రకటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి ! ఒక రోజు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్ వచ్చింది. ఆయన కార్యదర్శి క్లుప్తంగా ఒక్కమాట అన్నారు. ఏమని ? ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ లైక్ టు యూస్ హిస్ నేమ్ ఇన్ అడ్వర్టయిజ్‌మెంట్ (ప్రధానమంత్రి తన పేరును ప్రకటనలలో వాడటాన్ని ఇష్టపడరు) అని!ఈ విమర్శ నా జీవితంలో మధురమైన అనుభవం!
ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి