హరివిల్లు పరిమళించింది!
మనిషి మరణిస్తాడు. మనుషులు మరణించరు. ఈ సత్యం రాజ్యాలకూ వర్తిస్తుంది. యునెటైడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంతరించినా ఆ రాజ్యరమ అయిన సోవియట్ పుస్తక సాహిత్యం తెలుగులో సజీవంగానే ఉంది! ఇది అసంకల్పితమా? అప్రయత్నమా? కాదు! అనంతకాలం నుంచి విత్తనాలను రక్షిస్తోన్న అనిల్ బత్తుల వంటి గిరిజన హృదయం ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది!
సోవియట్ సాహిత్యంతో ఒక సాయంత్రం!
‘నా బాల్యాన్ని నాకు ఇచ్చేయ్’ అన్న కవి వాక్కు నిజమైతే ఎలా ఉంటుంది?
టైం మిషన్‌లో వెనక్కి పోతే ఎలా ఉంటుంది?
కనుమరుగై కనిపెంచిన పెద్దవారు ప్రత్యక్షమై ముచ్చట్లు పెడితే ఎలా ఉంటుంది?
ఉక్రెయిన్ జానపదగాథలూ, కుప్రిన్ రాళ్ల వంకీ కథలు, జమీల్యా, ఇకతియాండర్, నిత్యజీవితంలో భౌతికశాస్త్రం మనకళ్లముందు పరచుకుంటే ఎలా ఉంటుంది? గోర్కీ అమ్మ అనునయం మనలను తాకితే ఎలా ఉంటుంది? ‘అనిల్ బత్తుల’ ఫేస్‌బుక్ ఎకౌంట్‌లా ఉంటుంది!
రాముని స‘న్నిధి’చాలా సుఖము, అని త్యాగయ్య గుణగానం చేసినట్లుగా హిటాచీ సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న అనిల్ బత్తుల బ్యాంక్ అకౌంట్‌లో నిధి కంటే ఫేస్ బుక్ అకౌంట్‌లో తెలుగులో ప్రచురితమైన సోవియట్ పుస్తకాల నిధి ముఖ్యం అని సీరియస్‌గా కమిటైపోయాడు! తోట పువ్వులనడిగి ఏటి నవ్వులనడిగి అన్నట్లుగా తన వద్ద ఉన్న పుస్తకాలను సేకరించిన పుస్తకరాలను పీడీఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. ‘నిరుడు కురిసిన హిమసమూహాలను’ నిన్నటి తరం నెమరువేసుకుంటోంది. నేటి తరానికి వివరిస్తోంది. తమ అనుభవాలను పంచుకునేందుకు సోవియట్ సాహిత్యపు అభిమానులు లామకాన్‌లో ‘సోవియట్ సాహిత్యంతో ఒక సాయంత్రం’ ఏర్పాటు చేశారు. పిల్లా పాపలతో విచ్చేసిన పెద్దలు ప్రదర్శనకోసం ఉంచిన పుస్తకాలను స్పర్శించి (చదివేందుకు అనిల్ బత్తుల ఫేస్‌బుక్‌లో మాత్రమే లభ్యం కదా) ఆనందించారు. ‘చందమామ’ అందిన రోజులా సంతసించారు.
రష్యా విప్లవాన్ని విజయవంతం చేసిన ‘సత్యం’ (ప్రావ్దా) స్ఫూర్తితో, ప్రపంచ మానవాళికి శుభం పూయాలని అందుకు సాహిత్యం వాహిక కావాలని సోవియట్ ప్రచురణరంగాన్ని నిర్దేశించారని వడ్డేపూడి హనుమంతరావు, అట్లూరి అనిల్ తదితరులు గుర్తుచేసుకున్నారు. విశాలాంధ్రలో తాను కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో సోవియట్‌నుంచి అప్పుడే దిగిన పార్శిల్స్‌లో పుస్తకం తెరచి వాసన చూసిన వైనాన్ని ఉప్పల లక్ష్మణరావు తదితర అనువాదకులతో పనిచేయడాన్ని ఆర్టిస్ట్ మోహన్ గుర్తుచేసుకున్నారు.
బెంగళూరు నుంచి విచ్చేసిన మనసు ఫౌండేషన్ రాయుడు అనిల్ బత్తులకు తమ కంట్రిబ్యూషన్ సార్థకమైందన్నారు. ‘విల్డర్డ్’ పుస్తకంలో జీసస్ వర్ణచిత్రం ఇప్పటికీ తొణికిసలాడుతోందన్నారు ఆర్టిస్ట్ రమాకాంత్. తన చైతన్యానికి సోవియట్ పుస్తకాలే ప్రేరణలన్న ఎన్.వేణుగోపాల్ ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకునేందుకైనా ఈ పుస్తకాలను మళ్లీ చదవాలన్నారు. ఎంత పిచ్చి ఉంటే ఇంత మంచి పనిచేయాలి? అనిల్ బత్తుల వంటి పిచ్చివాళ్లు పెరగాలని ఆకాంక్షించారు శివాజీ! యస్, లాంగ్ లివ్ ద మాడ్‌నెస్! సోవియట్ సాహిత్యాన్ని ప్రచురించిన సంస్థ పేరు ‘రాదుగ’ (ఇంద్రధనుస్సు)! లామకాన్‌లో ఇంద్రధనుస్సు పరిమళించడంలో వింతేముంది!
- పున్నా కృష్ణమూర్తి