తోపుడు బండి... చాలా పరిచయం ఉన్న రవాణా సాధనం!. ఇప్పుడు సాహిత్యాన్ని మోయడానికి సిద్ధమవుతోంది.. నెక్లెస్‌రోడ్.. పీపుల్స్ ప్లాజా ప్లాట్‌ఫామ్ నుంచి నేడే ప్రయాణం.. సారథి... షేక్ సాదిఖ్ అలీ
సాదిఖ్ అలీ పూర్వాశ్రమంలో జర్నలిస్ట్. చిన్నప్పటి నుంచే సాహిత్యమంటే మక్కువ. ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే నంది తిమ్మన ‘పారిజాతాపహరణం’ చదివారు. దాంతో ప్రబంధాల మీద ప్రేమ పుట్టింది. ఆ పిచ్చే ఇంటర్‌కొచ్చేసరికి గాలిబ్‌ను పరిచయం చేసింది. ఇంకో వైపు శ్రీశ్రీ మహాప్రస్థానాన్నీ చేతిలో పెట్టింది. అక్కడితో ఆగక డిగ్రీలో షెల్లీ, కీట్స్, బైరన్‌ల గొడవనూ వినిపించింది. అంతేనా అంటే కాదు మరింకా ఉన్నాయంటూ తిలక్, కృష్ణశాస్త్రి సాహిత్యం మీది మోహాన్ని తను ప్రేమించిన అమ్మాయి (భార్య) ఉషకు ప్రేమలేఖల రూపంలో తర్జుమా చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటారు. ‘ఆ రోజుల్లో కవిత్వపు పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే వారిని కవిగా, మేధావిగా గౌరవించేవారు. ఇప్పుడు ఆ గౌరవాన్ని బంగారానికి తొడుగుతున్నారు. కవిత్వానికి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ సాహిత్య ప్రక్రియకు నాటి మహర్దశను మళ్లీ కల్పించాలి. అందుకే ఈ తోపుడు బండిని ఎంచుకున్నా’ అని చెబుతారు సాదిక్ అలీ.
అసలీ ఐడియా ఎలా వచ్చింది?
కవిత్వాన్ని బతికించుకోవాలనే తన తపనకు కవి యాకూబ్ స్ఫూర్తయితే.. తోపుడుబండి ఆలోచనకు మొన్న హైదరాబాద్, విజయవాడల్లో జరిగిన బుక్‌ఫెయిర్స్ ప్రేరణ అంటారు ఆయన. పదేళ్లుగా క్షీణదశలో ఉన్న కవిత్వాన్ని కాపాడుకోవడానికి ఫేస్‌బుక్‌లో ‘కవిసంగమం’ పేరుతో యాకూబ్ చేస్తున్న కృషి తనను కదిలించింది. కవిత్వాన్ని బతికించడానికి యాకూబ్ చేస్తున్న ఒంటరి పోరాటంలో తనూ భాగస్వామిని కావాలని అప్పుడే అనిపించింది సాదిక్‌కి. దానికి తోడు కిందటేడాది చివర్లో ఇటు హైదరాబాద్, అటు విజయవాడలో జరిగిన బుక్‌ఫెయిర్లో కవిత్వపు పుస్తకాలకు ఉన్న డిమాండ్.. ఆయన ఆలోచనను ఆచరణలో పెట్టేలా చేసింది. ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో స్టాల్ నెంబర్ 88, విజయవాడ బుక్ ఫెయిర్‌లోని స్టాల్ నంబర్ 161లో కవిత్వపు పుస్తకాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఫలానా పుస్తకం ఉందా అంటూ అడిగి మరీ కొన్న పాఠకులే కాదు ఫలానాది చదవండంటూ మేమిచ్చిన సలహా మేరకు ఆ పుస్తకాన్ని కొన్న వారూ ఉన్నారు. అప్పుడు అనిపించింది నాకు.. కవిత్వానికి ఆదరణ తగ్గలేదు. అది అచ్చయిన పుస్తకాలే పాఠకులకు అందట్లేదు. అలాంటి మంచి పుస్తకాలను పాఠకుల వాకిళ్ల ముందుకు తీసుకెళ్తే..?! అన్న ఆలోచన వచ్చింది. తిరుగు ప్రయాణంలోనే నా స్నేహితుడితో అన్నాను.. ‘వేణు.. (వాసిరెడ్డి వేణుగోపాల్) తోపుడుబండిలో కూరగాయలు, పళ్లు అమ్మినట్లు కవిత్వపు పుస్తకాలను అమ్మితే ఎలా ఉంటుంది’ అని. ప్రొసీడ్ అంటూ వెన్ను తట్టాడు వేణు. అట్లా తోపుడు బండి తయారైంది’ అని ఆ ఐడియా నేపథ్యాన్ని వివరించారు ఆయన.
ఎక్కడ అమ్ముతారు..
ఈ ప్రశ్నకు.. ‘నేనే వీధి వీధి తిరుగుతూ అమ్ముతాను. ఇది నాకు ఓ యజ్ఞంలాంటిది’ అని సాదిఖ్ చెబుతారు. ‘నేటి నుంచి రోజూ హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులన్నీ తిరుగుతాను. అచ్చు రూపంలో మంచి కవిత్వాన్ని పంచుతాను అందరికీ’ అంటారు. ‘ఈ బండితో రెండు తెలుగు రాష్టాల్లోని ఊరూవాడా తిరుగుతాను. మంచి కవిత్వం కొనండీ.. చదవండీ అని’ చెప్తానంటున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లోని తన పోస్ట్‌లు చూసి ఖమ్మం, కర్నూల్, కరీనంగర్, నిజామాబాద్‌లాంటి పట్టణాల నుంచి చాలా రెస్పాన్స్ వస్తోందని చెప్పారు. ‘ఈ తోపుడుబండి కాన్సెప్ట్ యంగ్‌రైటర్స్‌కి ఓ భరోసా కావాలి. కవిత్వం రాయాలనుకునే రైటర్స్ పుస్తకాలను అచ్చువేసుకుంటే అమ్మి పెడ్తాను.. లేదా అచ్చువేయడానికైనా సిద్ధమే’అంటారు. అయితే ‘ఏది పడితే అది.. ఎలా పడితే అలా.. రాసేస్తే కవిత్వం అయిపోదు.. మంచి కవిత్వం రాయండి.. పాఠకులకు అసలైన కవిత్వపు రుచిని చూపించండి’ అంటూ కవులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
- శరాది
కవిత్వం.. కొందాం రండి!
Published Sun, Feb 22 2015 4:14 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement