జిన్నా ప్రధానైతే దేశ విభజన ఆగేది!
‘‘దేశ విభజనను నివారించడానికి మహాత్ముడు ప్రథమ ప్రధానిగా జిన్నాను ప్రతిపాదించగా ఆయన అనుయాయులే దాన్ని వ్యతిరేకించారు’’. ఇటీవల హైదరాబాద్ వచ్చిన గాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీతో ఇంటర్వ్యూ సారాంశం.
కాలరేఖపై దేశం చేసే పయనంలో ‘రియర్ మిర్రర్’ ప్రయోజనం ఏమిటి? గతంలోకి జారుతున్న వర్తమానం కనిపిస్తుంది. భవిష్యత్తుపై ప్రభావం చూపగల వెనుకటి దృశ్యాలూ కనిపిస్తాయి. ‘అవర్ రిపబ్లిక్: ఫ్లాషెస్ ఫ్రం రేర్ వ్యూ మిర్రర్’ అనే అంశంపై మాట్లాడేందుకు రాజ్‌మోహన్‌గాంధీ హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు విచ్చేశారు. ఆయన మహాత్మాగాంధీకి తండ్రి వైపు, చక్రవర్తుల రాజగోపాలాచారికి తల్లి వైపు మనుమడు. రాజ్‌మోహన్ తన 16వ ఏట నుంచి రాజకీయ రచయిత. గతంలో రాజ్యసభ సభ్యునిగా, ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలలో రాజకీయ చరిత్ర ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జ్యూరీ మెంబర్‌గా సేవలందిస్తున్నారు. బహుగ్రంథ కర్త అయిన ఆయన శాంతిస్థాపన అనే తాతగారి ఆశయ సాధనకు తనదైన మార్గంలో కృషి చేస్తున్నారు. గత శనివారం ఆయన తన తాజా పుస్తకం ‘పంజాబ్: ఎ హిస్టరీ ఫ్రం ఔరంగజేబ్ టు మౌంట్ బాటెన్’ను కొన్న పాఠకులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ‘సాక్షి’తో మాట్లాడారు.
‘అహాల సంఘర్షణ’ విపరీతాలకు కారణం
వ్యక్తుల అహాల మధ్య సంఘర్షణ వల్లే దేశ చరిత్రలో విపరీతాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి భారత దేశానికి ప్రధానమంత్రిగా మహమ్మదాలీ జిన్నాను గాంధీజీ ప్రతిపాదించారు. నెహ్రూ, వి.పి.మీనన్ తదితరులు అందుకు అం గీకరించలేదు. గాంధీజీ వైఖ రిని సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తే, అవుననే అంటాను. దేశ విభజనను నివారించగలిగితే లక్షలాది మంది ఇరువైపులా హతమయ్యేవారు కాదు. వందల కోట్ల డాలర్ల ప్రజాధనం పరస్పర హననానికి ఆవిరయ్యేది కాదు.
రాజకీయ సమానత్వా న్ని ఆచరణలోకి తేవాల్సిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఎమర్జెన్సీ (1975-1977) రూపంలో నియంతృత్వాన్నీ చవిచూసింది. ఆ తర్వాత ప్రధాని పదవికి పోటీపడ్డ మొరార్జీదేశాయ్-చరణ్‌సింగ్-జగజ్జీవన్‌రామ్‌ల మధ్య ‘అహం’ కారణంగానే ‘జనతాపార్టీ’ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. వీపీ సింగ్-చంద్రశేఖర్-దేవీలాల్‌ల మధ్య అదే కథ పునరావృతం అయ్యింది. రాజకీయ ఆశయ సాధనకు వ్యక్తులు తమ అహాలను పక్కన పెట్టడం అవసరం. జిన్నాను ప్రధానిని చేయాలన్న మహా త్ముని ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన సహచరులు ‘గాంధీ ప్లాన్‌ను చిత్తుచేయడానికి అనుసరించాల్సిన ఎత్తుగడల’తో ఏకమయ్యారు. వారిని నిందించకుండా, వైఫల్యాలకు బాధ్యతవ హిస్తున్నాను అనే ఔదార్యం మహాత్మా గాంధీలో కనిపిస్తుంది.
దేశ విభజనను కమ్యూనిస్టులు కూడా ఆపలేకపోయారు. భగత్‌సింగ్ గొప్ప సాహసి. అభ్యుదయవాది. పంజాబ్‌లో అభ్యుదయ రచయితలు, కార్యకర్తలు ఎంద రో ఉన్నారు. కానీ భగత్‌సిం గ్, కమ్యూనిస్టుపార్టీల ప్రభా వం నిర్ణయాత్మక శక్తిగా లేదు. దేశం ఎలాగూ విడిపోతుంది. మనమూ పరిస్థితులకు అనుగుణంగా మారదామని కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఎక్కువ మంది భావించారు. దేశ విభజ నను వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ (ఖాన్ అ బ్దుల్ గఫార్ ఖాన్) ఇంగ్లిష్ పాలనలో 12 ఏళ్లు జైల్లో ఉంటే పాకిస్థాన్ ఏర్పడ్డాక అంతకంటే ఎక్కుకాలం జైల్లో ఉన్నారు! దేశ విభజనను వ్యతిరేకించిన కారణంగా ఆయన అనుచరు లు వందలాదిగా హత్యలకు గురయ్యారు!
బ్రిటిష్ పాలన మంచి చెడ్డలు!
‘లాభం’ కోసం సాగిన బ్రిటిష్ పాలనలో మం చి-చెడ్డలున్నాయి. న్యాయవ్యవస్థ ఏర్పాటు, రాష్ట్రాల పాలనాధికారం తదితర అంశాల్లో వా రు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించారు. కానీ, వారు భారతీయులకంటే తాము అధికులమని భావించారు. ఒక తెల్ల నిందితునిపై తీర్పు చెప్పేందుకు ఒక భారతీయ న్యాయమూర్తి అర్హుడు కాదు అని ‘లండన్‌టైమ్స్’ వం టి పత్రికలు అభిప్రాయపడ్డాయి. ఈ ‘ఆధిక్యతాభావం’ గురించి తెల్ల సమాజంలోనే చర్చసాగింది. ఆధిక్యతాభావం తెల్లవాడికి మాత్ర మే ఉన్నదా? మనం ఏర్పరచుకున్న ఆధిక్యతాభావాల మాటేమిటి!
ఒకరినొకరు తెలుసుకోవాలి!
దేశ విభజన నాటి ఘటనల గురించి చెప్పగలి గినంతగా దక్షిణాది రాష్ట్రాల గురించి చెప్పలేను. సైన్యంలో ప్రాంతాల వారీగా బెటాలి యన్లున్నాయి. వాటివల్ల సమస్యలున్నాయి. అనుకూలతలూ ఉన్నాయి. తమ ప్రాంతం, తమ భాష అనే అభిమానాన్ని తప్పు పట్టాల్సిందేముంది? తమ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, భాషను ప్రేమించని వారు దేశాన్నెలా ప్రేమిస్తారు? భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో ఏ సమూహానికి ఆ సమూహం విడిగా ఉంటోంది. అదీ ప్రధాన సమస్య. ముందుగా తామేమిటో ఆలోచించాలి. ఇతరులతో మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, అపోహలను గుర్తించాలి. తొల గించుకునేందుకు కృషి చేయాలి. దురదృష్టవశాత్తూ భారతీయులు ఒకరినొకరు తెలుసుకోవడంలో దారుణమైన అలసత్వాన్ని పాటిస్తున్నారు. రచయితలు ఈ ఆవశ్యకతను గుర్తించి తమ పాత్రను నిర్దేశించుకోవాలి.
- పున్నా కృష్ణమూర్తి