అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్‌  | Rajmohan Gandhi Article On George Floyd And USA | Sakshi
Sakshi News home page

అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్‌ 

Published Thu, Jun 11 2020 1:19 AM | Last Updated on Thu, Jun 11 2020 1:19 AM

Rajmohan Gandhi Article On George Floyd And USA - Sakshi

అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రస్తుత పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్‌–19 బారినపడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు.

ప్రస్తుతం భారతదేశంలో, అమెరికాలో కనిపిస్తున్న దృశ్యాల మధ్య అసంఖ్యాకమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల రాజధాని భూభాగాలకు ఆ పోలికల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. ఇక వాషింగ్టన్‌ డీసీ విషయానికి వస్తే అమెరికన్‌ సెనేట్‌లో దానికి కనీస స్థానం కూడా లేదు. ఇకపోతే ప్రతినిధుల సభలో ఉంటున్న దాని ఏకైక ప్రతినిధికి ఓటు హక్కు కూడా లేదు.  

జాతిపరమైన సమానత్వం కోసం అమెరికాలోని ప్రతి నగరంలో జరుగుతున్నట్లే, వాషింగ్టన్‌ డీసీ నగరంలోని జనం కూడా తన కళ్లముందే, తనకు బిగ్గరగా వినబడేటట్లు నిరసన ప్రదర్శనలు చేస్తుండటంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటుక తరువాత ఇటుకను పేర్చినట్లుగా, బ్యారికేడ్‌ తర్వాత బ్యారికేడ్‌ పెట్టినట్లుగా వైట్‌ హౌస్‌ వాస్తవ సరిహద్దులను విస్తరింపచేయడానికి ట్రంప్‌ ప్రయత్నించారు. అయితే మనం 2020వ సంవత్సరంలో ఉంటున్నందున ట్రంప్‌ అసహ్యకరమైన ప్రయాసను ప్రపంచం మొత్తం గమనించింది. శ్వేతసౌధం పక్కనే ఉన్న చర్చి ముందు ఫోటో దిగుతూ ట్రంప్‌ పొందిన దురవస్థ కానీ, తన భద్రత కోసం వైట్‌హౌస్‌ బంకర్‌లోకి దిగిపోవడం కానీ ప్రపంచం చాలాకాలంపాటు గుర్తుంచుకుంటుంది. ట్రంప్‌ అబద్దాలను ఎలా గుప్పిస్తారో (వాటిలో ప్రతి ఒక్కదాన్ని ట్రంప్‌ వీడియోనే ఖండించింది) ఉల్లాసకరంగా గమనించిన తర్వాత,  ట్రంప్‌ను పూర్తిగా విశ్వసించే వారు కూడా వైట్‌ హౌస్‌ బంకర్‌ని కేవలం తనిఖీ మాత్రమే చేశానని తాను చెప్పిన కథను నమ్మడానికి ఇబ్బందిపడ్డారనే చెప్పాల్సి ఉంటుంది. వచ్చే నవంబర్‌లో ట్రంప్‌ భంగపాటు, పతనం, బహుశా గద్దె దిగిపోవడం కూడా అమెరికాలో ఈరోజు ప్రధాన వార్త కాదు. సమానత్వం కోసం నేడు సాగుతున్న నిరసనల పరిమాణం, వాటి సర్వవ్యాపకత, అనంతత్వం, జాతిపరమైన వైవిధ్యత మాత్రమే నేడు అమెరికాలో అసలైన వార్తలుగా ఉంటున్నాయి. 

అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. నిరసన ప్రదర్శనలకు సంబంధించి నేను సూచించిన నాలుగు లక్షణాల్లో చివరి రెండింటికి మాత్రమే అత్యంత ప్రాధాన్యముంది. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్‌–19 బారిన పడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. నిరాయుధుడైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ని మినియాపోలిస్‌ అధికారి హత్య చేసిన దృశ్యాన్ని అయిదడుగుల దూరంలోనుంచి కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఆ తొమ్మిది నిమిషాల వీడియోను, 17 సంవత్సరాల యువతి డార్నెల్లా ఫ్రేజర్‌ చిత్రించింది. ఆ వీడియోను ఆమె పోస్ట్‌ చేసిన తర్వాతే అమెరికా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో  నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. దాని ప్రతిధ్వనులు ప్రపంచమంతా వినిపించాయి. ఆ నిరసనల క్రమంలో లూటీ, కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఆ వీడియోను చూశాక పీడితులైన నల్లజాతీయులకు వ్యతిరేకంగా నిరంతరం జరుగుతున్న అన్యాయంపట్ల రగిలిన ఆగ్రహానుభూతులే హింసాత్మక చర్యలకు కారణమయ్యాయి కానీ నిరసనకారుల్లో మెజారిటీ వాటికి ఆమోదం తెలపలేదన్నది వాస్తవం. కానీ నిరసనకారుల్లో చాలామంది న్యాయాన్ని గట్టిగా డిమాండ్‌ చేస్తూనే చాలావరకు శాంతియుతంగా మెలగాలని నిర్ణయించుకున్నారు. 

హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారి ముఖాలు, వారి నేపథ్యాలు, ఉద్దేశాల గురించి దర్యాప్తులో బయటపడవచ్చు. కానీ ఇలా హింసకు పాల్పడిన వారు సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుకున్నారనేందుకు ఎలాంటి సంకేతమూ లేదు. అశాంతిని కఠినంగా అణిచివేయడానికి మద్దతు సాధించడం కోసం కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటారా? ఇది నిజమే అయితే అలాంటివారు ఘోరంగా విఫలమైనట్లే లెక్క. తాను అమెరికా శాంతి భద్రతలు కాపాడే అధ్యక్షుడినని ట్రంప్‌ ప్రకటించడమే కాకుండా.. డెమోక్రాట్ల ఆధిపత్యంలో ఉన్న నగరాలు, రాష్ట్రాల్లో సాగుతున్న అరాచకత్వాన్ని అణిచివేయడానికి ఫెడరల్‌ సైన్యబలగాలను పంపడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. తన హెచ్చరికను నొక్కి చెప్పడానికా అన్నట్లుగా, ప్రస్తుత అమెరికా త్రివిధ దళాల జాయింట్‌ చెఫ్‌ల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జనరల్‌ మార్క్‌ మిల్లేని కూడా వైట్‌ హౌస్‌ పక్కనే ఉన్న దెబ్బతిన్న చర్చికి నడిచివెళ్లేటప్పుడు ట్రంప్‌ తన వెంట తీసుకుపోయారు.  

అయితే ట్రంప్‌ చేసిన హెచ్చరికను ట్రంప్‌ రక్షణమంత్రిగా రెండేళ్లు పనిచేసిన మాజీ మెరైన్‌ చీఫ్‌ జేమ్స్‌ మ్యాటిస్‌ తిప్పికొట్టారు. దేశానికి ఐక్యత అతిగొప్ప అవసరంగా ఉంటున్న తరుణంలో ట్రంప్‌ దేశాన్ని నిలువునా చీల్చివేస్తున్నాడని జేమ్స్‌ ఏకిపడేశారు. పాలనాపరంగా స్పందించాల్సిన అంశాన్ని సైనికపరం చేయాలన్న ఆలోచనను అమెరికా సైన్య మాజీ అధిపతులు కూడా వ్యతిరేకించారు. ట్రంప్‌తోపాటు చర్చికి నడుచుకుంటూ వెళ్లిన ప్రస్తుత రక్షణమంత్రి మార్క్‌ ఎస్పర్‌ కూడా ట్రంప్‌ హెచ్చరికకు మద్దతునివ్వకపోగా, అమెరికా సైన్యం జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పేశారు. 

అయితే కీలకమైన రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి జో బిడెన్‌ తనకంటే ముందు ఉన్నారని పోల్స్‌ సూచించిన రోజున ట్రంప్‌ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవలసి వచ్చింది.  

మళ్లీ నిరసన ప్రదర్శనల వద్దకు వెళదాం. అమెరికాలో ప్రస్తుత ప్రదర్శనలు 2019 చివరినెలలు, 2020 ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో కనిపించిన దృశ్యాలను నాకు గుర్తుకు తెచ్చాయి. కేంద్రప్రభుత్వం పౌరసత్వనిర్ధారణపై తీసుకొస్తున్న కొత్త చట్టం నుంచి ముస్లింలను పక్కకు పెట్టడాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని నగరాల్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున ముస్లింలతో కలిసి భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. 

భారత్, అమెరికాలకు సంబంధించి ఇతర రాజకీయ పోలికలు లేక లింకుల గురించి కూడా  సులువుగా ఆలోచించవచ్చు. ఉదాహరణకు అమెరికా వీధుల్లో ఈ రోజు జరుగుతున్న అహింసాత్మక నిరనసలు భారత్‌లో చాలా కాలం జరిగిన ఇదే రకమైన పోరాటాలను గుర్తు చేస్తున్నాయని భారతీయులు భావించవచ్చు. భారత్‌లో గాంధీ నిర్వహించిన కేంపెయిన్‌లనుంచి గ్రహించిన అంశాలనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ అతని అనుయాయులు నల్లజాతి హక్కుల ఉద్యమంలో ఉపయోగించిన విషయాన్ని కూడా భారతీయులు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ అమెరికా వీధుల్లో సమానత్వం కోసం ఇస్తున్న పిలుపుల్లో భారతీయుల స్వరాలు కూడా అక్కడక్కడా వినిపించవచ్చు. కానీ అమెరికాలోని ఇతర భారతీయులు హౌస్టన్‌లో ట్రంప్‌కి బ్రహ్మాండంగా స్వాగతమిచ్చారు. 

దీన్ని అలా పక్కనుంచండి. భారత్‌లో దళితులు, మైనారిటీలు ప్రతి నిత్యం ఘర్షిస్తున్న తీరు అమెరికాలో నల్లజాతీయులు అవిరామంగా సాగిస్తున్న ఘర్షణలకు ఏమాత్రం భిన్నంగా లేదు. అందుకే ఈ రోజు అమెరికాలో జరుగుతున్న ఘటనలనుంచి భారత్‌లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలు ప్రేరణ పొందవచ్చు. అయితే అదే సమయంలో రెండు దేశాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉంటున్నాయని కూడా గమనించాలి. జార్జి హత్యాఘటన నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలోని పలు నగరాలు పూర్తి ఆశావాదాన్ని కలిగివుండి, న్యాయంకోసం డిమాండ్‌ చేస్తున్న అన్ని రకాల జాతులకు చెందిన యువతీయువకులతో నిండి ఉంటున్నాయి. భారతదేశంలోని వీధులు మాత్రం ఇప్పటికీ భయకంపితులవుతున్న, ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులతో నిండి ఉంటున్నాయి. 

భారత్‌తో పోలిస్తే అమెరికాలోని యూనివర్సిటీలు, కోర్టులు, వార్తాపత్రికలు, టీవీ చానల్స్‌ వంటివి సమానత్వ హక్కును, వాక్‌ స్వేచ్ఛా హక్కును ఎత్తిపట్టాలంటూ డిమాండ్‌ చేయడంలో ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తున్నాయి. పైగా, అమెరికాలో నేడు తలెత్తిన తీవ్ర నిరసనల ధోరణి రేపు కూడా కొనసాగుతుందని గ్యారంటీ ఏమీ లేదు.అదే సమయంలో మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. నాణ్యత, పాలన అనేవి ఎంతో విలువైనవని, ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు. 


రాజ్‌మోహన్‌ గాంధీ  
వ్యాసకర్త ప్రొఫెసర్,ఇలినాయిస్‌ యూనివర్సిటీ,యూఎస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement