కరిగిన స్వర్గం! చెదిరిన స్వప్నం!!
నిజాం రాచరికానికి చరమగీతం పాడాలని, రాజ్యాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. 1947 సెప్టెంబర్‌లో పార్టీ ఆమేరకు పిలుపునిచ్చింది. పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఆయుధాలను చేతబట్టాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లను లూటీ చేసి, సైనిక దళాలపై మాటు వేసి, భూస్వాముల నుంచి కైవసం చేసుకుని, వీలైన అన్ని మార్గాల్లో పార్టీ నేతలు ఆయుధాలు సొంతం చేసుకున్నారు. ‘దళాలు’ అనే ప్రత్యేక బృందాలు ఏర్పరిచారు. శ్రామికరాజ్యం సాధించే వరకూ లేదా తాము చనిపోయే వరకూ ఎత్తిన జెండా దించబోమని, పట్టిన ఆయుధం విడవబోమని దళసభ్యులతో ప్రమాణాలు చేయించారు.
అప్పటికి ఏడో నిజాం పాలిస్తున్నాడు. రజాకార్లు హద్దుల్లేని అమానుషకాండకు పాల్పడుతున్నారు. ఇది పోలీస్ యాక్షన్ పూర్వరంగం. ఈ దశలో తెలంగాణ సాయుధపోరాటపు అత్యున్నత దశ ఎలా ఉండేది? నల్లగొండ జిల్లాలో (ఇప్పటి నల్లగొండ జిల్లా కంటే విశాలమైనది) రెండు వేలకు పైగా గ్రామాలను కమ్యూనిస్ట్ పార్టీ ‘విముక్తం’ చేసింది. పార్టీని ‘సంగం’ అనేవారు. కార్యకర్తలను సంగపోల్లు అనేవారు. ‘సంగం’ ఆయా గ్రామాల్లో భూసంస్కరణలను అమలు చేసింది. రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేని రైతు కూలీలకు పంచింది.వ్యవసాయ కూలీల వేతనం పెంచారు.
కనీస మొత్తం చెల్లించే అవగాహనతో గీతకార్మికులకు తాటిచెట్లను అప్పగించారు. వ్యవసాయానికి ఉపకరించే చెరువులు, కాల్వలు, బావులు తవ్వేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పల్లెల్లో జలసిరి కళకళలాడింది. నాగళ్లు, ఎడ్లబండ్లు తయారు చేసుకునేందుకు అటవీభూముల నుంచి ఉచితంగా కలపను తీసుకునే హక్కును రైతులకు దఖలు పరచారు. ప్రజాకోర్టులు ఏర్పరచారు. వితంతు వివాహాలు జరిపించారు. రాత్రి పాఠశాలల ద్వారా వయోజనులకు అక్షరాలు నేర్పారు. ప్రపంచం గురించి గ్రామీణులకు తమదైన అవగాహన కలిగించారు. ఒక వినూత్న సాంఘిక, రాజకీయ చైతన్యం ! ఒక కొత్త కాంతి. ఒక కొత్త శాంతి. ఆహ్లాదభరిత వాతావరణం! గ్రామీణ ప్రాంతాల్లో విశాల భూభాగాన్ని కమ్యూనిస్ట్ పార్టీ (సంగం) తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. కొత్త ప్రాంతాల గ్రామీణులు వారిని బోనాలతో స్వాగతించారు. ఒక దశలో ‘అదిగో చూడు..’ అన్నట్లుగా ఎర్ర విప్లవం కనుచూపు మేరలో కన్పించింది!
పోరు బాటా? పొరబాటా!
అదే సమయంలో 1948లో ‘పోలీసు చర్య’ వచ్చింది ! మూడు రోజుల్లో పార్టీపై నిషేధమూ వచ్చింది. అప్పటికి కొందరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అజ్ఞాత వాసం నుంచి బయటకు వచ్చారు. ఇతరులు సంసిద్ధులవుతున్నారు! ఆ పరిస్థితుల్లో పోరాటాన్ని కొనసాగిద్దామని కొందరు, వద్దు ముగిద్దామని మరికొందరు భావించారు. భిన్నాభిప్రాయాలు తీవ్రతరం అవుతున్నాయి! ఉద్యమ క్షేత్రాల్లో అజ్ఞాతంలో ఉన్న వారిలో అనేకులు సాయుధపోరాటాన్ని విరమిద్దామని భావించారు. ఆ క్షేత్రానికి దూరంగా మైదాన ప్రాంతాల్లో నివసించేవారు కొనసాగిద్దామని భావించారు. కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అత్యున్నతమైనది. రణదివే పార్టీ ప్రధానకార్యదర్శి. ఆయన అభిప్రాయం ప్రకారం ‘ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగిరింది. ఎర్రజెండా ఎగరలేదు.
కాబట్టి భారత దేశం స్వేచ్ఛను పొందలేదు. జవహర్‌లాల్ నెహ్రూ అధికారమార్పిడి జరిగిన వలసదేశానికి మాత్రమే ప్రధానమంత్రి! వాస్తవానికి ఆయన ఆంగ్లో-అమెరికన్ ఏజెంట్! కాబట్టి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరే వరకూ తెలంగాణ కేంద్రంగా సాయుధ పోరాటం కొనసాగించాల్సిందే!’ ఈ వైఖరిని రణదివే సిద్ధాంతంగా పేర్కొనేవారు. బయటకు వచ్చిన వారు నిషేధం నేపథ్యంలో పార్టీ ఆదేశం మేరకు విధిగా లోపలికి వెళ్లారు. ఇదిలావుండగా రైతుకూలీల భావజాలంలో కూడా మార్పు వచ్చింది! ప్రజలు వ్యతిరేకించే జాగిర్దారీ వ్యవస్థను 1949 ఆగస్ట్‌లో గవర్నర్ జనరల్ రద్దు చేశారు. అప్పటికి ప్రజలు అనుభవిస్తున్న ఆస్తులపై హక్కులను నిర్ధారిస్తూ పౌరప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు పోరాటం చేయాలి? కొత్త ప్రభుత్వం సక్రమంగానే పాలిస్తోంది కదా! అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావించసాగారు! ఈ నేపథ్యంలో ఒక మహానాయకుడి అనుభవమూ ప్రస్తావనార్హమే!
‘చండ్ర’ను కప్పిన నివురు!
‘కంట నిప్పులను చెరగిన చండ్ర రాజేశ్వరయ్య’ అని ప్రజలు పాటలు కట్టి పాడుకునేవారు. నగర జీవితమే తప్ప గ్రామీణ ప్రపంచం గురించి తెలియని నిజాం పాలన పల్లెలను కల్లోలపరచింది. గ్రామీణ తెలంగాణకు కంటగింపుగా మారిన పాలనను కూలదోసేందుకు చండ్ర రాజేశ్వరరావు చూపిన సమరశీలత్వానికి ఉదాహరణ ఆ కితాబు! అప్పటి ముఖ్య నాయకుడు, తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు అయిన చండ్ర రాజేశ్వరరావు పోలీస్ చర్య అనంతరం మారిన పరిణామాలను ప్రత్యక్షంగా గమనించారు. ఉద్యమ ఉచ్ఛస్థితిలో కరీంనగర్ జిల్లాలోని దామెలకొండలో ఆయన అజ్ఞాతవాసం గడిపారు. అప్పట్లో గ్రామీణులు ఆయనను ఆరాధించారు. అలసి వచ్చిన చండ్రను ఒయాసిసులా సేదతీర్చేవారు. మారిన పరిస్థితుల్లో వారిలో వచ్చిన తేడాను ఆయన గమనించారు.
ఆశ్రీతుడికి అన్నం పెట్టే వారేరి? ఆకలి తట్టుకోలేక సమీపంలోని పొలం నుంచి కొన్ని మొక్కజొన్న కంకులను తుంచుకున్నారు. కాల్చుకుని ఆకలిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తోన్న గిరిజనులు చుట్టుపక్కల అలికిడిని సంశయాత్మకంగా గ్రహిస్తున్నారు.
ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించిన చండ్ర రాజేశ్వరరావు తక్షణం ఆ ప్రాంతం నుంచి మాయమయ్యాడు. క్షణ-శకలం ఆలస్యమైతే తనను చుట్టుముట్టిన భారత ప్రభుత్వపు సైన్యానికి బందీ అయ్యేవాడే! నిన్న దళాలను స్వాగతించిన గ్రామీణులే నేడు రావొద్దయ్యా అని ప్రాధేయపడుతున్నారు! నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణులకు రక్షణగా నిలచిన కామ్రేడ్లు, తమకు తాము రక్షణ కల్పించుకోలేకపోయారు! సైన్యం ధాటికి గ్రామీణుల నిస్తబ్దత! సో... వాట్ టు డూ? (అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నేత స్టాలిన్‌తో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం, వచ్చేవారం...)
ప్రజెంటేషన్:
- పున్నా కృష్ణమూర్తి