వాహ్... హైద్రాబాద్ వాహ్....
చెట్టు తొర్రలో పదడుగుల చదరపు గది. పిల్లలు హాయిగా ఆడుకునేంత స్థలం! 16వ శతాబ్దానికి చెందిన అటువంటి చెట్టొక టి గోల్కొండ కోట సమీపంలో నయాఖిల్లా దగ్గర ఉందని నగరంలో ఎందరికి తెలుసు. భారతీయ ఖైదీల కోసం బ్రిటిష్ పాలకులు అండమాన్‌లో కాలపానీ సెల్యులర్ జైల్ కట్టడానికంటే ఏభై ఏళ్ల ముందు 1858లో తెల్ల ఖైదీల కోసం కట్టిన సెల్యులర్ జైలు తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌కు నూరు గజాల దూరంలోనే ఉందని కూడా ఎక్కువ మందికి తెలీదు. నా నగరాన్ని చేపలతో నిండిన జలాశయంలా కళకళలాడేలా చేయి ప్రభూ అని ప్రార్ధించిన నిజాం పాలకులు నగరంలో వేయి జలాశయాలు నిర్మించారు. అవి ఏవి? ఎక్కడెక్కడుండేవి? ఇప్పుడు ఆచూకీ అయినా ఉందా!
బ్రిటిష్ పాలకులు కళాసంపదను తమదేశాలకు తరలించుకుపోతోన్న రోజుల్లోనే, అజంతా-ఎల్లోరాల పరిరక్షణకు నిజాం పాలకులు తీసుకున్న శ్రద్ధ, యూరోపు, పర్షియాలు పర్యటించి అక్కడి కళాత్మక వస్తువులను సేకరించిన సాలార్‌జంగ్ కళాభిరుచి తదితర అసంఖ్యాక ఆసక్తికర అంశాలను ‘హెరిటేజ్ హైద్రాబాద్’లో వివరించారు మల్లాది కృష్ణానంద్. పుస్తకం పేరును బట్టి ఇది కేవలం హైద్రాబాద్‌కు చెందినది అన్పించవచ్చు. వాస్తవానికి, హైద్రాబాద్ నగరాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని నాలుగు వందల సంవత్సరాల జాతీయ- అంతర్జాతీయ వైనాలు వైభవాలను ఈ పుస్తకం ఇతివృత్తంలో చూపారు. ఇప్పటి తమిళనాడు- కోస్తాంధ్ర- కర్నాటక-మహారాష్ట్ర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న చారిత్రక హైద్రాబాద్ పాఠకులకు పరిచయం అవుతుంది.
ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తోన్న కృష్ణానంద్ ఎక్కడ పనిచేసినా ఆయా ప్రాంతాల సాంస్కృతిక విశేషాలను వివరిస్తూ, వాటి పరిరక్షించాల్సిన అవసరాన్ని పత్రికల ద్వారా, పుస్తకాల ద్వారా పాఠకులకు, ప్రభుత్వానికీ సూచిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో హైద్రాబాద్‌కు సంబంధించిన దాదాపు నూరు సాంస్కృతిక ఔన్నత్యాలను తాజా ఇంగ్లిష్ పుస్తకం హెరిటేజ్ హైద్రాబాద్ అనే ముత్యాలసరంగా కూర్చారు. ఇండోపర్షియన్ నిర్మాణశైలికి కలికి తురాయిగా రూపొందిన కుతుబ్‌షాహీ, పైగా టూంబ్స్, నిజాం మ్యూజియం, ఉర్దూప్యాలెస్, గన్‌ఫౌండ్రీ, మహబూబియా కాలేజ్, షాహీ ఖజానా, ఫైర్‌టెంపుల్, సెయింట్‌జోన్స్ చర్చ్, చర్చిల్ బంగ్లా, తొలి పోస్టాఫీస్, పురానా పూల్, చింతచెట్టు తదితర అనేక చారిత్రక- సాంస్కృతిక అంశాలు ఇందులో ఉన్నాయి. ‘ఫలానా వారసత్వ కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఇలా ఉన్నాయి’ అని చెప్పి ఊరుకోకుండా వాటిని పరిరక్షించుకునేందుకు తీసుకోదగ్గ కనీస జాగ్రతలను పాఠకులకు, ప్రభుత్వానికి సూచించడం పుస్తకం విశేషం! హైద్రాబాద్ సందర్శకులు, హైద్రాబాద్‌లోనే నివసిస్తున్నవారు కూడా ఈ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తీరికను బట్టి ఒకోరోజు ఒకో ప్రాంతాన్ని చూసి ఆనందించవచ్చు.
పుస్తకం : హెరిటేజ్ హైద్రాబాద్ (ఇంగ్లిష్- అన్ని పేజీలూ రంగుల్లో)
రచయిత: మల్లాది కృష్ణానంద్
వెల : రూ. 599/- ప్రతులకు : 040-27860079
- పున్నా కృష్ణమూర్తి