‘ఆల్ ద రెబెల్ ఉమెన్’: ఫెమినిజమ్ నూరేళ్ల ప్రయాణం!
‘తక్కువ చదివి ఎక్కువ తెలుసుకున్నాం’ అని పాఠకులు భావించే రచనలు ఎలా ఉంటాయి? ‘గార్డియన్ షార్ట్స్’ పేరిట గార్డియన్ పత్రిక ప్రచురిస్తోన్న ఈబుక్స్ చూడాల్సిందే. అనేక సామాజిక అంశాలపై క్లుప్తంగా సమగ్రంగా వివరాలు అందించే వ్యాస సంపుటులను గార్డియన్ సంస్థ ‘గార్డియన్ షార్ట్స్’గా ప్రచురిస్తోంది. ఆ వరుసలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ‘ఆల్ ద రెబెల్ ఉమెన్ : ద రైజ్ ఆఫ్ ద ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజం (తిరగబడ్డ స్త్రీలందరూ : ఫెమినిజంలో ఎగసిన నాల్గవ కెరటం)’ అనే పుస్తకాన్ని (అమెజాన్‌లో రూ. 199) విడుదల చేసింది.
ఇప్పటికే శరవేగంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకానికి రచయిత్రి ‘కిరా కొక్రన్’. ఈమె గతంలో గార్డియన్ మహిళల పేజీ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఫీచర్స్ రాస్తున్నారు. ఆ అనుభవంతో నూరేళ్ల ఫెమినిజాన్ని కిరా దర్శించి ఈ చిన్ని పుస్తకంగా వెలువరించారు. అందులో మిళితమైన జాతి- మత-ప్రాంత-కుల వివక్షతల పొరలనూ, వాటిని అధిగమించి తిరగబడ్డ వివిధ దేశాల, సమూహాల మహిళలను కిరా పాఠకులకు పరిచయం చేశారు. ఇంతకూ ‘నాల్గవ కెరటం’ స్థూలంగా ఏమి చెబుతోంది?
1913 జూన్ 4. పట్టపగలు. డ ర్బీ రేస్‌కోర్స్. పందెపు గుర్రాలు దౌడు తీస్తున్నాయి. ఇంతలో ఒక కలకలం. ప్రేక్షకుల్లోంచి ఒక స్త్రీ హటాత్తుగా ట్రాక్ మీదకు దూసుకువచ్చింది. పందెపు గుర్రాలలో నురగలు కక్కుతూ పరుగెడుతోన్న ఐదవ కింగ్‌జార్జ్ గుర్రానికి ఎదురు నిలిచింది. దూసుకుపోతున్న గుర్రం. దానిని నిలువరిస్తున్న స్త్రీ. ప్రాణాలు పోతూ ఉండగా ఎట్టకేలకు ఆమె విజయం సాధించింది. గుర్రం పడిపోయింది!
అది చూసిన రాజుకు మాట పడిపోయింది. ఇంతకూ ఎవరామె? ఎమిలీ విల్డింగ్ డేవిసన్! ఎందుకంత సాహసం చేసింది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేసిన మిలిటెంట్ ఉద్యమకారిణి ఎమిలీ. ఆమె అంత్యక్రియల్లో ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ ఉద్భవించింది. మహిళల రాజకీయహక్కులను సాధించిన ఎమిలీ డేవిసన్ (11 అక్టోబర్ 1872- 8 జూన్ 1913) స్త్రీవాదపు తొలితరంగం! ఇలా పడిన తొలి అడుగు ఆ తర్వాత అమెరికాలో మలి అడుగయ్యింది. కుటుంబంలో, సమాజంలో, పనిచేసేచోట, సంతానం కనే అంశంలో, ఆస్తి హక్కుల్లో సమానత్వం కావాలని
1960ల్లో అమెరికా నుంచి స్త్రీవాద ఉద్యమం ఆకాశానికి అంటింది.
ఒకరకంగా ఆ ఉద్యమం స్త్రీవాదంలో రెండవ కెరటం. మూడోసారి? 1990ల్లో ఆసియా, మధ్యధరా దేశాలను ప్రభావితం చేస్తూ ఉవ్వెత్తున స్త్రీవాద ఉద్యమం ఎగసింది! ఇప్పుడు? నాల్గవ తరంగం ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతోంది! ఢిల్లీ నిర్భయ ఉదంతం ఇందుకు ఉదాహరణ. స్త్రీలు ముఖ్యంగా యువత స్త్రీవాద చైతన్యాన్ని పరస్పరం ప్రసరింప చేసుకుంటున్నారు. ‘ఎవ్రీ డే సెక్సిజం’లాంటి ప్రాజెక్ట్‌ల ద్వారా ఆన్‌లైన్లో తక్షణం సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. లింగవివక్షతపై ఎదుర వుతోన్న సమస్యలను గుర్తించి, న్యాయాన్ని కోరుతూ వినూత్న చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
‘కెరటాలు వెనక్కు వెళ్లవని, రెట్టించిన వేగంతో ముంచుకు వస్తాయని’ ధీర వనితలు నిరూపిస్తున్నారు.
- పున్నా కృష్ణమూర్తి