Guardian news paper
-
సంచలనం: అడ్డదారిలో ఉబర్ క్యాబ్,వేల కోట్ల డాలర్ల నిధులు మళ్లింపు!
యాప్ ఆధారిత చౌక ట్యాక్సీ సేవల పేరుతో దశాబ్ద కాలం క్రితం (2009లో) కార్యకలాపాలు ప్రారంభించిన ఉబర్ .. అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా 30 పైచిలుకు దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో వ్యవస్థలను, రాజకీయ నేతలను మేనేజ్ చేసింది. డ్రైవర్లను వాడుకుంది. కార్మిక, ట్యాక్సీ చట్టాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు వేల కోట్ల డాలర్లు వెచ్చించి నేతలతో లాబీయింగ్ చేయడం మొదలుకుని, పన్నుల ఊసు ఉండని దేశాలకు లాభాలను మళ్లించడం, డ్రైవర్లను బలిపశువులను చేయడం వరకూ అన్ని అడ్డదారులూ తొక్కింది. ఇలా ఉబర్ పాటించిన తప్పుడు విధానాలను రుజువు చేసే డాక్యుమెంట్స్ లీకవడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. టెక్ట్స్ మెసేజీలు, ఈమెయిల్స్ రూపంలో ఉన్న వీటిని ఉబర్ ఫైల్స్ పేరిట అంతర్జాతీయంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల కన్సార్టియం అయిన ఐసీఐజే బైటపెట్టింది. గతంలో ప్రముఖుల అక్రమాస్తులను పనామా పేపర్స్ పేరిట బైటపెట్టి సంచలనం సృష్టించినది కూడా ఈ ఐసీఐజేనే కావడం గమనార్హం. 1,24,000 పైచిలుకు డాక్యుమెంట్స్ లీక్ కాగా వీటిలో 83,000 పైచిలుకు ఈమెసేజీలు, వాట్సాప్ మెసేజీలు ఉన్నాయి. ఉబర్ సహ–వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్ సారథ్యంలో 2013–2017 మధ్య కాలంలో ఉబర్ విస్తరణ గురించిన వివరాలు వీటిలో ఉన్నాయి. లింగ వివక్ష, లైంగిక వేధింపుల ఆరోపణలతో 2017లో కలానిక్ బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈ డాక్యుమెంట్లు తొలుత బ్రిటిష్ న్యూస్‌పేపర్ ది గార్డియన్‌కు, అక్కణ్నుంచి ఐసీఐజేకి అందాయి. యూరప్‌లో ఉబర్ తరఫున లాబీయిస్టుగా పనిచేసిన మార్క్ మెక్‌గాన్.. ఈ అక్రమాలను బైటపెట్టడంలో కీలకమైన ప్రజావేగుగా వ్యవహరించారు. యధేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. రైడ్ షేరింగ్ యాప్ ద్వారా చౌకగా ట్యాక్సీ సేవలను అందించే క్రమంలో ఉబర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు అనిపించినప్పటికీ.. వాస్తవానికి వ్యాపార విస్తరణ కోసం నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినట్లు ఉబర్ ఫైల్స్ ద్వారా వెల్లడైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సన్నిహితులైన వ్యక్తులు ఉబర్‌కు లాబీయిస్టులుగా పనిచేశారు. కంపెనీ మీద వస్తున్న ఆరోపణలపై విచారణ నిలిపివేయాలంటూ దర్యాప్తు సంస్థలను, కార్మిక .. ట్యాక్సీ చట్టాలను సవరించాలంటూ, డ్రైవర్ల బ్యాగ్రౌండ్ ధ్రువీకరణ నిబంధనలను సడలించాలంటూ అధికారులపై వారు ఒత్తిడి తెచ్చారు. యూరప్ తదితర మార్కెట్లలోనూ ఉబర్ ఇదే తరహా ధోరణిలో విస్తరించింది. అప్పటి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి ఎమాన్యుయెల్ మాక్రాన్ (ప్రస్తుత అధ్యక్షుడు), యూరోపియన్ కమిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నీలీ క్రోయెస్ వంటి వారు ఇందుకు సహకరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, మిగతా మార్గాలేవీ పనిచేయనప్పుడు విచారణ జరిపే దర్యాప్తు సంస్థలకు వివరాలను దొరకనియ్యకుండా చేసేందుకు ఉబర్ ‘‘కిల్ స్విచ్’’అనే స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించింది. సోదాల్లో కీలక ఆధారాలు అధికారులకు చిక్కకుండా ఇది ఆటోమేటిక్‌గా ఉబర్ సర్వర్లకు యాక్సెస్ నిలిపివేసేది. ఉబర్ ఇలా కనీసం ఆరు దేశాల్లో చేసింది. అలాగే, మిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులను ఎగ్గొట్టేందుకు ఉబర్ తనకు వచ్చే లాభాలను బెర్ముడా తదితర ట్యాక్స్ హేవెన్స్కు (పన్నుల భారం ఉండని దేశాలు) మళ్లించింది. ఔను తప్పే.. కానీ ఇప్పుడు మారాము.. తాజా పరిణామాలపై ఉబర్ స్పందించింది. గతంలో తప్పిదాలు జరిగిన సంగతి వాస్తవమేనని.. వాటిని సమర్థించుకోబోమని పేర్కొంది. ఆ తప్పిదాల ఫలితంగా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు ఉబర్ తెలిపింది. కొత్త సీఈవో దారా ఖుస్రోవ్షాహీ వచ్చాక గత అయిదేళ్లలో కంపెనీ పనితీరు పూర్తిగా మారిపోయిందని వివరించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 90 శాతం మంది .. దారా సీఈవోగా వచ్చాక చేరినవారేనని పేర్కొంది. పోటీ సంస్థలతో పాటు లేబర్ యూనియన్లు, ట్యాక్సీ కంపెనీలు మొదలైన వర్గాలతో చర్చలు జరిపేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు ఉబర్ వివరించింది. -
ఆపిల్ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు
శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్ తయారీదారు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్, బిజినేస్ డీల్స్‌ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దుమారం రేగడంతో ఆపిల్ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) గార్డియన్ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’ తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది. -
‘ఆల్ ద రెబెల్ ఉమెన్’: ఫెమినిజమ్ నూరేళ్ల ప్రయాణం!
‘తక్కువ చదివి ఎక్కువ తెలుసుకున్నాం’ అని పాఠకులు భావించే రచనలు ఎలా ఉంటాయి? ‘గార్డియన్ షార్ట్స్’ పేరిట గార్డియన్ పత్రిక ప్రచురిస్తోన్న ఈబుక్స్ చూడాల్సిందే. అనేక సామాజిక అంశాలపై క్లుప్తంగా సమగ్రంగా వివరాలు అందించే వ్యాస సంపుటులను గార్డియన్ సంస్థ ‘గార్డియన్ షార్ట్స్’గా ప్రచురిస్తోంది. ఆ వరుసలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ నేపథ్యంలో ‘ఆల్ ద రెబెల్ ఉమెన్ : ద రైజ్ ఆఫ్ ద ఫోర్త్ వేవ్ ఆఫ్ ఫెమినిజం (తిరగబడ్డ స్త్రీలందరూ : ఫెమినిజంలో ఎగసిన నాల్గవ కెరటం)’ అనే పుస్తకాన్ని (అమెజాన్‌లో రూ. 199) విడుదల చేసింది. ఇప్పటికే శరవేగంగా అమ్ముడుపోతున్న ఈ పుస్తకానికి రచయిత్రి ‘కిరా కొక్రన్’. ఈమె గతంలో గార్డియన్ మహిళల పేజీ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఫీచర్స్ రాస్తున్నారు. ఆ అనుభవంతో నూరేళ్ల ఫెమినిజాన్ని కిరా దర్శించి ఈ చిన్ని పుస్తకంగా వెలువరించారు. అందులో మిళితమైన జాతి- మత-ప్రాంత-కుల వివక్షతల పొరలనూ, వాటిని అధిగమించి తిరగబడ్డ వివిధ దేశాల, సమూహాల మహిళలను కిరా పాఠకులకు పరిచయం చేశారు. ఇంతకూ ‘నాల్గవ కెరటం’ స్థూలంగా ఏమి చెబుతోంది? 1913 జూన్ 4. పట్టపగలు. డ ర్బీ రేస్‌కోర్స్. పందెపు గుర్రాలు దౌడు తీస్తున్నాయి. ఇంతలో ఒక కలకలం. ప్రేక్షకుల్లోంచి ఒక స్త్రీ హటాత్తుగా ట్రాక్ మీదకు దూసుకువచ్చింది. పందెపు గుర్రాలలో నురగలు కక్కుతూ పరుగెడుతోన్న ఐదవ కింగ్‌జార్జ్ గుర్రానికి ఎదురు నిలిచింది. దూసుకుపోతున్న గుర్రం. దానిని నిలువరిస్తున్న స్త్రీ. ప్రాణాలు పోతూ ఉండగా ఎట్టకేలకు ఆమె విజయం సాధించింది. గుర్రం పడిపోయింది! అది చూసిన రాజుకు మాట పడిపోయింది. ఇంతకూ ఎవరామె? ఎమిలీ విల్డింగ్ డేవిసన్! ఎందుకంత సాహసం చేసింది? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో మహిళలకు ఓటు హక్కును డిమాండ్ చేసిన మిలిటెంట్ ఉద్యమకారిణి ఎమిలీ. ఆమె అంత్యక్రియల్లో ‘ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్’ ఉద్భవించింది. మహిళల రాజకీయహక్కులను సాధించిన ఎమిలీ డేవిసన్ (11 అక్టోబర్ 1872- 8 జూన్ 1913) స్త్రీవాదపు తొలితరంగం! ఇలా పడిన తొలి అడుగు ఆ తర్వాత అమెరికాలో మలి అడుగయ్యింది. కుటుంబంలో, సమాజంలో, పనిచేసేచోట, సంతానం కనే అంశంలో, ఆస్తి హక్కుల్లో సమానత్వం కావాలని 1960ల్లో అమెరికా నుంచి స్త్రీవాద ఉద్యమం ఆకాశానికి అంటింది. ఒకరకంగా ఆ ఉద్యమం స్త్రీవాదంలో రెండవ కెరటం. మూడోసారి? 1990ల్లో ఆసియా, మధ్యధరా దేశాలను ప్రభావితం చేస్తూ ఉవ్వెత్తున స్త్రీవాద ఉద్యమం ఎగసింది! ఇప్పుడు? నాల్గవ తరంగం ప్రపంచవ్యాప్తంగా ఎగసిపడుతోంది! ఢిల్లీ నిర్భయ ఉదంతం ఇందుకు ఉదాహరణ. స్త్రీలు ముఖ్యంగా యువత స్త్రీవాద చైతన్యాన్ని పరస్పరం ప్రసరింప చేసుకుంటున్నారు. ‘ఎవ్రీ డే సెక్సిజం’లాంటి ప్రాజెక్ట్‌ల ద్వారా ఆన్లైన్లో తక్షణం సమాచార మార్పిడి చేసుకుంటున్నారు. ప్రదర్శనలు చేస్తున్నారు. లింగవివక్షతపై ఎదుర వుతోన్న సమస్యలను గుర్తించి, న్యాయాన్ని కోరుతూ వినూత్న చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘కెరటాలు వెనక్కు వెళ్లవని, రెట్టించిన వేగంతో ముంచుకు వస్తాయని’ ధీర వనితలు నిరూపిస్తున్నారు. - పున్నా కృష్ణమూర్తి