‘చల్లగా బతకలేమా’!
ఇంటర్వ్యూ: ఎడ్విన్ తంబూ
జానపద సాహిత్యం-రామాయణ, భారతాలు ఏమి చెప్పాయో కొత్తగా చూస్తే మన సమస్యలకు పరిష్కారాలూ లభిస్తాయి.
‘ఉదయించేందుకు సూర్యుడు కవిత్వం కోసం ఎదురు చూస్తున్నాడు’ అని పలికిన కవి ఎడ్విన్ తంబూ. సింగపూర్ జనహృదయ జాతీయ కవి. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఎమిరిటస్ ఇంగ్లిష్ ప్రొఫెసర్ (గౌరవనీయ ఆచార్యుడు). ఇంగ్లిష్ ద్వారా సింగపూర్ ఆత్మను ప్రపంచ సాహిత్యంలో పలికించినవాడుగా అనేక జాతీయ-అంతర్జాతీయ పురస్కారాలందుకున్నారు. జనవరి 24 నుంచి మూడు రోజులు ఐదు వేదికలపై ముమ్మరంగా జరిగిన నాల్గవ హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొన్న వారిలో అష్టపదుల పెద్దాయన! తొలిరోజు ‘ఆషియానా’లో ‘వరల్డ్
ఇంగ్లిషెస్ : ఎ సింగపూర్ ఎక్స్‌పీరియన్స్’ అనే అంశంపై మాట్లాడారు. ఆ సందర్భంగా సంభాషణా సారాంశం...
జాతీయత తెలీదు! అంతర్జాతీయత!!
మన చుట్టూ ఉన్న వస్తుప్రపంచాన్ని చూస్తే పరాయి పాలన ముగిసిందనుకో గలమా? వస్తుప్రపంచం మారాలంటే భావనాప్రపంచం మారాలి. వ్యక్తిగా, జాతిగా తామేమిటో గుర్తించాలి! జాతీయతను తెలుసుకోకముందే అంతర్జాతీయవాదులమని భ్రమించడం ఎంత ప్రమాదకరం? ఇందుకు పూనుకోవాల్సింది రచయితలే కదా! ఈ సెమినార్‌లో నా గొంతు పొరబోయింది. వెంటనే నిర్వాహకులు లేబుల్డ్ వాటర్ బాటిల్ తెచ్చారు! ఎందుకది? నాకు అక్కర్లేదు. నేను ఇండియాకు వచ్చాను. ఇండియా అంటే ప్రపంచానికి శతాబ్దాలుగా లవంగాలు, ఏలకులు అందిస్తోన్న దేశం. నాకు కావాల్సింది ఇక్కడి సుగంధ ద్రవ్యాల మసాలా టీ! ప్చ్. ‘ఫెస్టివల్’ ద్వారా నేను చెప్పదలచుకున్నదీ ఇదే!
‘వెచ్చని’ స్వాగతం మనకేల?
ఇంగ్లిష్ ఒక భాష కాదు. అనేక భాషల సమాహారం. వలసపాలన వలన ప్రపంచంలో అనేక దేశాలకు ఇంగ్లిష్ పరిచయమై, వృద్ధి పొందింది. ఇప్పుడు అనేక దేశాలకు ఇంగ్లిష్ ఒక తప్పనిసరి భాష. స్వభాష కూడా. మంచిదే. ఆసియా దేశస్తులు ఒకరితో మరొకరు మాట్లాడుకోవాలన్నా ఇంగ్లిషే కదా సాధనం! ఆ భాష ద్వారా వ్యక్తం చేయాల్సింది మన జీవితాన్ని కదా? కలవరం కలిగించే విషయం ఏమిటంటే : నిన్నటి వలస దేశాలు రాజకీయ స్వతంత్రం పొందినప్పటికీ భాష విషయంలో విముక్తి చెందలేదు. మన రచనలు ఇప్పటికీ ‘వలస’కు పూర్వం వలసకు తర్వాత (ప్రి కలోనియల్-పోస్ట్ కలోనియల్) అంటున్నాయి. వలస పాలనను మనం ఎందుకు గుర్తించాలి? ‘జాతీయ ప్రభుత్వానికి పూర్వం- తర్వాత’ అనవచ్చు కదా! ఇంగ్లిష్ భాషను స్వంతం చేసుకునే క్రమంలో ఇంగ్లిష్ సంస్కృతిని అర్ధం చేసుకోవచ్చు. కాని, స్వంతం చేసుకోవాలా? పాతను బాగు చేద్దాం.
దాని అర్థం షేక్స్‌పియరిక్ ఇంగ్లిష్‌లోకి వెళ్లాలని కాదు. పరాయి పాలనకు చిహ్నాలను మనం నిలుచున్న నేల నుంచి పర్యావలోకన చేద్దాం. జానపద సాహిత్యం- రామాయణ, భారతాలు ఏమి చెప్పాయో కొత్తగా చూస్తే మన సమస్యలకు పరిష్కారాలూ లభిస్తాయి. ముందుగా స్వీయ సాహిత్యాన్ని అందరికీ అర్ధమయ్యే భాషలో అందు బాటులోకి తేవాలి. వాటిపై విభేదించాలి. చర్చించాలి. బహుళ భాషల, సంస్కృతుల సమాజమైన ఆధునిక సింగపూర్ యువత తమతమ పౌరాణిక, జానపద సాహిత్యం నుంచి కొత్తగా స్ఫూర్తిని పొందుతున్నారు. ‘వామ్ వెల్‌కం’ అని చలిదేశాల వారు స్వాగతిస్తారు. పుష్కలమైన ఎండను అనుభవించే మనం ‘కోల్డ్ వెల్‌కం’ అనాలి కదా! ‘చల్లగా బతుకు’ అనే పెద్దల దీవెనను మనసుకు పట్టించుకుందాం!
- పున్నా కృష్ణమూర్తి