రచయిత ఎలా బతకాలో అలా బతికాడు...
జయకాంతన్‌కు నలభై ఏళ్ల వయసు లోపలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడాయన ఒకచోట రాసుకుంటూ ‘ప్రపంచ కథాసాహిత్యంలో నేను ముఖ్యుణ్ణి’ అని చెప్పుకున్నాడు. అది అతివిశ్వాసం కాదు. ఆత్మవిశ్వాసమూ కాదు. తనను తాను తెలుసుకోవడం. ఆ మాటకొస్తే ఆ సంగతి పాఠకులకు కూడా తెలుసు. అవును. ప్రపంచ సాహిత్యంలో ఆయనొక ముఖ్య రచయిత.
తమిళులు తమవారిని గొప్పవారిగా తయారు చేసుకోరు. కాని వారి గొప్పతనం ఏమిటంటే తమవారిలోని గొప్పతనాన్ని వారు గుర్తిస్తారు. సాహిత్యంలో అడుగుపెట్టినప్పటి నుంచి జయకాంతన్ ప్రభావాన్ని తమిళులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా గుర్తించారు. ఆయన రచనలను ఆదరించారు. ‘ప్రొఫెషనల్ రైటర్‌గా ఒక మనిషి బతకొచ్చు అని నేను నిరూపించాను’ అని జయకాంతన్ అనగలిగారంటే అందుకు తమిళ పాఠకులు ఆయన పట్ల చూపిన ఆదరణే కారణం.
నాకు జయకాంతన్ 1975లో పరిచయం. నేరుగా కాదు. తన రచనల ద్వారా. అప్పుడు మా నాన్న మధురాంతకం రాజారాం జయకాంతన్ కథలను నేషనల్ బుక్‌ట్రస్ట్ కోసం అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఆయన సగం సగం చేసి పక్కన పెట్టిన అనువాదాలను నేను చదువుతుండేవాణ్ణి. అప్పుడు నా వయసు 18 ఏళ్లే అయినా ఒక పద్దెనిమిదేళ్ల వయసున్న కుర్రవాణ్ణి ఒక ఆరోగ్యవంతమైన సృజనా ప్రపంచంలోకి జయకాంతన్ ఈడ్చుకెళ్లిన తీరు నేను మర్చిపోలేను. ఆయనవి ‘షోయింగ్ స్టోరీస్’. అంటే కళ్లకు కట్టినట్టుగా రాసే రచయిత. అందువల్లే మా నాన్నను అనువాదం పూర్తి చేయమని వెంట పడి మరీ ఆ కథలను చదివేవాణ్ణి. అలా నేను చదివిన జయకాంతన్ మొదటి కథ ‘అగ్నిప్రవేశం’. ఇందులో వాన కురుస్తున్న రోజు ఒక కాలేజీ అమ్మాయికి ఒక డబ్బున్న వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు. కారు లోపల ఏం జరిగింది? అత్యాచారం జరిగిందా లేదా అనేది రచయిత చెప్పడు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మంచివాడు. అతడి లోపల ఉద్దేశం ఉంది. కాని గట్టిగా ప్రయత్నించాడో లేదో రచయిత చూపడు. కాని అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వస్తే, ఆ దిగువ మధ్యతరగతి ఇంటిలో, ఆ తల్లి రాద్ధాంతం చేయదు.
కూతురిని స్నానాల గదిలోకి తీసుకెళ్లి పెద్ద చెర్వ నిండుగా నీళ్లు కుమ్మరించి ‘నీకేం కాలేదుపో. నువ్వు పునీతవయ్యావు పో’ అంటుంది. ఈ కథనే విస్తరించి కొన్నాళ్లకు ఆయన ‘కొన్ని సమయాలు కొందరు మనుషులు’గా రాశాడు. విశేష ఆదరణ పొందింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరి కొన్నాళ్లకు ఈ నవలకే సీక్వెల్‌గా ‘గంగ ఎక్కడికి వెళుతోంది’ పేరుతో మరో నవల రాశాడు. జయకాంతన్‌ను చూసి ప్రతి రచయిత నేర్చుకోవలసింది అదే. ప్రయోగం. ఆయన నిత్య ప్రయోగశాలి. ఏ రోజైతే కొత్తది మానేస్తామో ఆ రోజున మనం నిర్జీవం అయ్యామని అర్థం.
జయకాంతన్ కథలన్నీ నాకు కంఠోపాఠం. ‘నేనున్నాను’, ‘గురుపీఠం’, ‘ఒక పగటివేళ పాసింజర్లో’, ‘నందవనంలో ఆండీ’, ‘చీకట్లోకి’, ‘అగ్రహారంలో పిల్లి’, ‘శిలువ’... ఆయన కథల్లో ‘మౌనం ఒక భాష’ అనే కథ ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లి, కూతురు ఒకేసారి గర్భవతులవుతారు. ఇందుకు తల్లి సిగ్గుతో చితికిపోతుంది. కూతురి ముందుకు ఎలా రావడం? అప్పుడు రచయిత సాంత్వనం పలుకుతాడు. ‘పర్లేదులేమ్మా... పనసచెట్టుకు మొదట్లో కూడా కాయలు కాస్తాయి... తప్పులేదు’ అంటాడు. ఆయన మరో కథ ‘బ్రహ్మోపదేశం’. అందులో జీవితాంతం మంత్రోచ్ఛారణ చేసిన ఒక బ్రాహ్మణుడు చివరకు తనకు మంత్రాలు రావని గ్రహించి, వాటి అసలైన అర్థాలు పరమార్థాలు అవసరాలు ఏమీ తెలియవని గ్రహించి, జంధ్యం తెంచి పడేసి అంతర్థానం అయిపోతాడు.
అలాంటి విప్లవాత్మకమైన కథలు జయకాంతన్ ఎన్నో రాశాడు. ఒక చెట్టును పెకలించి చూసినప్పుడు దాని కుదుళ్లతో పాటు మట్టిపెళ్లలు తేమ అంతా అంటుకుని దర్శనమిచ్చి నట్టుగా జయకాంతన్ ఏది రాసినా లోలోపలి నుంచి ఏదో పెళ్లగించి చూపినట్టుగా లోతుగా, విస్తృతంగా, దిగ్భ్రమగా ఉంటుంది. స్త్రీల గురించి, వారి చుట్టూ ఏర్పరచిన పవిత్రత గురించి పేరుకొని ఉన్న కొన్ని అభిప్రాయాలను బోర్లగించినవాడు జయకాంతన్. దాదాపు 200 కథలు, 25 నవలలు... ఇవిగాక వ్యాసాలు... సినిమా స్క్రిప్ట్‌లు... సినిమాకు దర్శకత్వాలు... ఎన్నని. మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువు లుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి.
ఆయన రచన ఆధారంగా వచ్చిన సినిమాని ఒకసారి టీవీలో చూసి ఇది ఏ నవల అనే అన్వేషణ సాగించాను. చివరికి అది ‘ఒక నటి నాటకం చూస్తోంది’ నవల అని తెలిసింది. మిత్రులు జిల్లేళ్ల బాలాజీ దానిని ‘కల్యాణి’ పేరుతో అనువాదం చేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు మరింత సంతోషం కలిగింది. అది పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా చెన్నైలో ఆయనను కలవాలని జిల్లేళ్ల బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి, నేనూ తిరుపతి నుంచి వెళ్లాం. ఆయన తన ఇంటి మూడో ఫ్లోర్ మీద టీస్టాల్ వంటి ఒక తాటిపాక వేసుకొని ఎక్కువ భాగం అక్కడే గడుపుతూ ఉన్నాడు. మేం వచ్చామని తెలిసి ఆ తాటిపాకలోనే కూచోబెట్టి కాసేపటికి లుంగీ, గళ్ల చొక్కా మీద వచ్చి కూచున్నాడు. అంత పెద్ద రచయిత అయినా మా స్థాయికి దిగి ఎన్ని కబుర్లు చెప్పాడో ఎంత సంతోషం పొందాడో చెప్పలేను. అయితే ఆయన అందరినీ రచయితలుగా గుర్తిస్తాడని చెప్పలేము. అన్నాదురై, కరుణానిధి వంటి మహామహులను కూడా వారు రచయితలే కాదు అని తేల్చి చెబుతాడాయన. ఆయనకు ఇష్టమైన కవి కన్నదాసన్. అయినప్పటికీ జయకాంతన్ ధోరణిని అందరూ స్వీకరించారు. ఆయన స్టైల్‌ని హీరో పాత్రలకు ఆపాదించారు.
జయకాంతన్‌వి పెద్ద పెద్ద మీసాలు. మాతో మాట్లాడుతున్నంత సేపు వాటిని మెలి తిప్పుకుంటూనే ఉన్నాడు. అయితే ఆ చేష్ట మాకు పొగరుగా, అహంకారంగా అనిపించలేదు. ముచ్చటగొలిపేదిగానే ఉంది. ఎందుకంటే మా ఎదురుగా ఉన్నది ఒక కథావీరుడు అని మాకు తెలుసు.
అవును. ఆయన కథావీరుడే.
ఇప్పుడే కాదు మరో వందేళ్లకు కూడా భారతీయ సాహిత్యంలో మనం మళ్లీ చూడలేని ఒక అరుదైన సాహితీ వీరుడు- జయకాంతన్.
- మధురాంతకం నరేంద్ర 9866243659
మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువులుగా...
ఏ రచయిత అయినా అలా జీవించాలి.