Jayakanthan
-
దేన్ని చూసుకుని రాయాలి?
ఏప్రిల్ 24న జయకాంతన్ జయంతి ప్రారంభంలో జయకాంతన్ బతకటానికి ఎన్నో రకాలైన పనులను చేశారు. వాటిలో -అ) వెచ్చాల కొట్లో పొట్లాలు కట్టే పని, ఆ) డాక్టర్ దగ్గర మెడిసిన్ కిట్ మోసే పని, ఇ) పిండిమిల్లులో పని, ఈ) అచ్చు యంత్రాల దగ్గర అక్షరాలు పేర్చే పని, ఉ) ట్రెడిల్మేన్గా, ఊ) వార్తాపత్రికలు అమ్మే పని, ఋ) పిండిమిషన్ విడి భాగాలు తయారుచేసే ఫౌండ్రీలో ఇంజన్లకు బొగ్గు వేసే పని, ౠ) సోపుల ఫ్యాక్టరీలో పని, ఎ) జట్కావాలాకు సహాయకుడిగా, ఏ) ప్రూఫ్ రీడర్‌గా, ఐ) పేకాట క్లబ్బులో పనివాడుగా, ఒ) సంపాదకుడుగా, ఓ) అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్‌గా, ఔ) కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పని... మొదలైనవి ఆయన ఎన్ని ఇబ్బందులెదుర్కొని జీవితంలో పైకొచ్చారో తెలియజేస్తాయి. ‘‘ఆ కాలంలో ‘హిట్లర్’ ప్రపంచంలోనే పేరు పొందిన వ్యక్తి . అయినప్పటికీ నేను హిట్లర్‌కు ఎనిమీని. అప్పుడు నాకు హిట్లర్ అంటే ఇష్టం లేకపోవటానికి కారణం - అతని మీసం. మా నాన్నా అదేలాగా మీసం పెట్టుకునేవారు. నాకు ఆయనంటే కూడా ఇష్టం లేదు. హిట్లర్ మీసాన్ని నాన్న పెట్టుకోవటం వల్ల నాన్నంటే ఇష్టంలేదా? లేక నాన్న మీసం హిట్లర్ పెట్టుకున్నందువల్ల హిట్లర్ అంటే ఇష్టంలేదా? అని స్పష్టంగా నాకు తెలియదు. ఆ కాలంలో నన్ను ఎంతగానో ఆకట్టుకున్న ఒకే ఒక వీర పురుషుడు స్టాలిన్. స్టాలిన్ మీసం ముందు ఈ హిట్లర్ మీసం ఓడిపోతుందని నేను పందెం కాసేవాణ్ణి’’ అనేవారు జయకాంతన్. (కాగా తమిళనాట సాహిత్య రంగంలో పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న రచయిత జయకాంతన్ ఒక్కరే!) ‘‘నాకు రాసేందుకు కుతూహలమూ, దానికి తగ్గ కారణాలూ ఉన్నాయి. నా రాతలకు ఒక లక్ష్యమూ ఉంది. నేను రాసేది పూర్తిగా జీవితం నుండి నేను పొందే జ్ఞాన ప్రభావమూ, నా ప్రత్యేక శ్రద్ధానూ! రాయటం వల్ల నేను సాధువుగా మారుతున్నాను. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల భాష వృద్ధి చెందుతుంది. అందుకోసమూ రాస్తున్నాను. రాయటం వల్ల నావాళ్లు సుఖమూ, లాభమూ పొందుతున్నారు. వాటి కోసమూ రాస్తున్నాను. భవిష్యత్కాల సమాజాన్ని ఎంతో గొప్ప స్థితికి తీసుకెళ్లటానికి సాహిత్యం అంటూ ఒకటి అవసరం కనుక రాస్తున్నాను. కలం ఎంతో బలమైనది. నా జీవన పోరాటంలో నేను ఎంచుకున్న ఆయుధం కలం. అందుకే రాస్తున్నాను. కలం నా దైవం’’ అంటారు జయకాంతన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో. 1990లో గోర్బచేవ్ పరాజయం చెంది, సోవియెట్ యూనియన్ ముక్కలైనపుడు, జయకాంతన్ ఎంతో కదిలిపోయారు. నిజమైన ఎందరో కమ్యూనిస్టుల్లాగే, సోవియెట్ స్నేహితుల్లా బాధపడ్డారు. 1993లో ఒక సభలో ఆయన మాట్లాడుతూ... ‘‘నేను రాయటం లేదు, ఎందుకు రాయటం లేదని అడుగుతున్నారు. నేనిక దేన్ని చూసుకుని రాయాలి? జీవితంలో దేన్ని కలగా కంటూ వచ్చామో, ఆశలు పెంపొందించుకుంటూ వచ్చామో, నమ్మామో ఆ విశాల సమాజమే, సోవియెట్ యూనియనే నాశనమై పోయిందే. ఇక నేను దేన్ని నమ్మాలి. దేన్ని ఉదహరించాలి. ఉండనీ... అదొక ఉన్నతమైన అబద్ధం. నాకది చాలు. ఇక తక్కినవాళ్లు రాయనీ...’’ అంటూ ముగించారు. జిల్లేళ్ళ బాలాజీ 9866628639 (సౌజన్యం: sirukadhai mannan J.K.100 ariya thagavalgal by Sabitha Joseph) -
చీకటి ఆలోచనల స్కానర్
‘‘ఇది పన్నెండేళ్ల క్రితం జరిగింది. దాంతో నా జీవిత అధ్యాయం ముగిసిపోయింది. నేను యిలా అనటం మోడరన్ కాలేజీ పిల్లవైన నీకు అర్థం లేని మాటలా అనిపించవచ్చు. బాయ్‌ఫ్రెండ్ ఉండటంలో, డేటింగ్ ఉండటంలో, ప్రీ మారిటల్ సెక్స్ ఉండటంలో ఘనత ఉంది. ఇవన్నీ సహజమైన విషయాలు అని భావించేటువంటి యుగంలో పుట్టిన నీకు యింత చిన్న విషయానికి జీవితం ముగిసిపోవడమా? అని ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని ప్రపంచంలో వారి వారి పరిధులను బట్టి నడుచుకునే మనుషులు కొందరుంటారు. లోకంలో రకరకాల పిచ్చివాళ్లుంటారు. ఎవరి పిచ్చి వారికి ఆనందమన్నట్లు, అటువంటి పిచ్చితనానికి బలైనవారిలో నేనొకదాన్ని.’’ ‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల్లో ముఖ్య పాత్ర గంగ తన గురించి మంజు అనే ఒక అమ్మాయితో అన్న మాటలు యివి. తమిళ రచయిత జయకాంతన్ నవల ‘శిల నేరంగళిల్ శిల మనిదరగళ్’కి తెలుగు రూపం ఇది. 1981లో నేషనల్ బుక్ ట్రస్ట్ కోసం మాలతీ చందూర్ దీన్ని అనువదించారు. ఆ రోజుల్లో సాహితీలోకంలో దుమ్మురేపి, స్త్రీ, పురుష సంబంధాలను గురించి కొత్త కోణాల్ని విప్పిచూపిన నవల. మనుషులు తమకన్నా బలహీనుల్ని లొంగదీసుకోవటం కోసం, విలువలు, కట్టుబాట్లు ఆయుధాలుగా చేసుకుంటారు. అప్పటికీ వాళ్లు లొంగకపోతే, చెడినవాళ్లనో, ప్రమాదకారులనో ముద్రలు వేసి, సమాజం పరిధి నంచి తరిమేయడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో బయటపడే తమ చీకటి కోణాలకి సంప్రదాయాల పేరుతో ముసుగు కప్పుతారు. ఒక వర్షపు సాయంకాలం అపరిచితుడిచే రేప్ చేయబడ్డ 17 ఏళ్ల గంగని, తల్లితో సహా బయటికి గెంటేస్తాడు అన్న. మేనమామ వరసైన ఒక పెద్ద మనిషి చేరదీసి, చదువు చెప్పించి, గంగ తన కాళ్లమీద తను నిలబడేలా చేస్తాడు. అయితే గంగ పట్ల అతని ఎజెండా అతనిది. వయసులో ఎంతో పెద్దవాడైన తను, ఆ అమ్మాయిని లొంగదీసుకుంటే, విషయం గుట్టుగా ఉంటుంది. ఎలాగో చెడిపోయింది, కాబట్టి ఆ అమ్మాయికి వేరే దారి లేదు. ఓ నాటకీయ పరిస్థితిలో గంగ, తనను రేప్ చేసినవాడిని కలుస్తుంది. భ్రష్టుడైన తన వల్ల ఆ అమ్మాయికి జరిగిన అవమానానికి అతడు బాధపడ్తాడు. ఆ అమ్మాయిని తన కూతురిలా భావిస్తాడు. విశాల భావాలున్న వాడిని చూసి, ఆ అమ్మాయికి పెళ్లి చేసి, తన పాపం కడుక్కుందాం అనుకుంటాడు. అయితే జీవితంలో ఎప్పుడూ చూడని ఆప్యాయత, ప్రేమ అతని నుంచి పొందిన ఆమెకి, అతనితో తప్ప జీవితం ఎవరితో వద్దనుకుంటుంది. అయితే పెళ్లి చేసుకుంటే గాని, తనను చూడను అన్న అతని ఆదేశాన్ని తిరస్కరించి, మనుషుల పట్ల, ప్రపంచం పట్ల ద్వేషం పెంచుకొని, ఆ కోపంలో తనను తాను దహించుకుని పతనానికి జారిపోతుంది. కథ ఏంటి అనే దాని కన్నా, ఆ పాత్రలు వేర్వేరు సమయాలలో విభిన్నంగా ప్రవర్తించే తీరు, వాటి స్వభావం, ఘర్షణ చదివేవారిని చాలా అలజడికి గురిచేస్తాయి. తెలీక జరిగిన తప్పుని, తన తెలివితక్కువతనంతో మహాపరాధంగా కూతురి జీవితం మీద రుద్ది, ఆమె బతుకుని దుర్భరం చేసిన తల్లి, చేరదీసిన దగ్గర్నుంచి, అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆ సంఘటనను గుర్తుచేస్తూ, ‘‘నువ్వు చెడిపోయావు. నీలాంటి వాళ్లని ఎవరో ఒకరు ఉంచుకోవటం తప్ప దారిలేదు’’ అంటూ తన కోరికను రుద్దడానికి ప్రయత్నించే మేనమామ వరసైన వెంకట్రామయ్యర్, ఇంట్లోంచి గెంటివేసిన, తన కాళ్ల మీద తాను నిలబడ్డం సహించలేని అన్న గణేశ్, తన సరదా ఒక అమ్మాయి జీవితాన్ని కుదిపేసిందని తెల్సి, ఏదైనా చేసి ఆ అమ్మాయిని ఓ ఇంటిదాన్ని చేసి, తన తప్పుని దిద్దుకోవాలని ప్రయత్నించిన ప్రభు, తండ్రికీ గంగకీ ఉన్న సంబంధాన్ని గౌరవంగా అంగీకరించిన కాలేజీ అమ్మాయి మంజు, ఇలా గంగ చుట్టూ ఉన్న ప్రతి పాత్ర, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని, ఒక్కోసారి మనల్ని పోలి భయపెడ్తాయి. ఈ నవలని తమిళంలో అదే పేరుతో దర్శకుడు భీమ్‌సింగ్ 1976లో సినిమాగా తీసి, డబ్బుల్ని, అవార్డుల్ని కూడా కొట్టేశారు. లక్ష్మి చాలా బాగా నటించిన సినిమా ఇది. అయితే గొప్ప నవలల్ని సెంటిమెంటల్ ట్రాష్‌గా ‘పవిత్ర ప్రేమ’ లాంటి ముగింపు ఇవ్వటం సినిమావాళ్లకే చెల్లుతుంది. మనుషుల్లోని చీకటి ఆలోచనల్ని స్కాన్ చేసే ఇలాంటి రచనలు మనల్ని మనముందే నగ్నంగా పెట్టి ప్రశ్నిస్తాయి. అందుకే, ఈ నవల అన్ని సమయాలలో అందరు మనుషుల్ని కలవరపరుస్తుంది. -కృష్ణ మోహన్‌బాబు ఫోన్: 9848023384 -
రచయిత ఎలా బతకాలో అలా బతికాడు...
జయకాంతన్‌కు నలభై ఏళ్ల వయసు లోపలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అప్పుడాయన ఒకచోట రాసుకుంటూ ‘ప్రపంచ కథాసాహిత్యంలో నేను ముఖ్యుణ్ణి’ అని చెప్పుకున్నాడు. అది అతివిశ్వాసం కాదు. ఆత్మవిశ్వాసమూ కాదు. తనను తాను తెలుసుకోవడం. ఆ మాటకొస్తే ఆ సంగతి పాఠకులకు కూడా తెలుసు. అవును. ప్రపంచ సాహిత్యంలో ఆయనొక ముఖ్య రచయిత. తమిళులు తమవారిని గొప్పవారిగా తయారు చేసుకోరు. కాని వారి గొప్పతనం ఏమిటంటే తమవారిలోని గొప్పతనాన్ని వారు గుర్తిస్తారు. సాహిత్యంలో అడుగుపెట్టినప్పటి నుంచి జయకాంతన్ ప్రభావాన్ని తమిళులు ఏ మాత్రం ఆలస్యం లేకుండా గుర్తించారు. ఆయన రచనలను ఆదరించారు. ‘ప్రొఫెషనల్ రైటర్‌గా ఒక మనిషి బతకొచ్చు అని నేను నిరూపించాను’ అని జయకాంతన్ అనగలిగారంటే అందుకు తమిళ పాఠకులు ఆయన పట్ల చూపిన ఆదరణే కారణం. నాకు జయకాంతన్ 1975లో పరిచయం. నేరుగా కాదు. తన రచనల ద్వారా. అప్పుడు మా నాన్న మధురాంతకం రాజారాం జయకాంతన్ కథలను నేషనల్ బుక్‌ట్రస్ట్ కోసం అనువాదం చేయడం మొదలుపెట్టారు. ఆయన సగం సగం చేసి పక్కన పెట్టిన అనువాదాలను నేను చదువుతుండేవాణ్ణి. అప్పుడు నా వయసు 18 ఏళ్లే అయినా ఒక పద్దెనిమిదేళ్ల వయసున్న కుర్రవాణ్ణి ఒక ఆరోగ్యవంతమైన సృజనా ప్రపంచంలోకి జయకాంతన్ ఈడ్చుకెళ్లిన తీరు నేను మర్చిపోలేను. ఆయనవి ‘షోయింగ్ స్టోరీస్’. అంటే కళ్లకు కట్టినట్టుగా రాసే రచయిత. అందువల్లే మా నాన్నను అనువాదం పూర్తి చేయమని వెంట పడి మరీ ఆ కథలను చదివేవాణ్ణి. అలా నేను చదివిన జయకాంతన్ మొదటి కథ ‘అగ్నిప్రవేశం’. ఇందులో వాన కురుస్తున్న రోజు ఒక కాలేజీ అమ్మాయికి ఒక డబ్బున్న వ్యక్తి లిఫ్ట్ ఇస్తాడు. కారు లోపల ఏం జరిగింది? అత్యాచారం జరిగిందా లేదా అనేది రచయిత చెప్పడు. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మంచివాడు. అతడి లోపల ఉద్దేశం ఉంది. కాని గట్టిగా ప్రయత్నించాడో లేదో రచయిత చూపడు. కాని అమ్మాయి ఏడుస్తూ ఇంటికి వస్తే, ఆ దిగువ మధ్యతరగతి ఇంటిలో, ఆ తల్లి రాద్ధాంతం చేయదు. కూతురిని స్నానాల గదిలోకి తీసుకెళ్లి పెద్ద చెర్వ నిండుగా నీళ్లు కుమ్మరించి ‘నీకేం కాలేదుపో. నువ్వు పునీతవయ్యావు పో’ అంటుంది. ఈ కథనే విస్తరించి కొన్నాళ్లకు ఆయన ‘కొన్ని సమయాలు కొందరు మనుషులు’గా రాశాడు. విశేష ఆదరణ పొందింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మరి కొన్నాళ్లకు ఈ నవలకే సీక్వెల్‌గా ‘గంగ ఎక్కడికి వెళుతోంది’ పేరుతో మరో నవల రాశాడు. జయకాంతన్‌ను చూసి ప్రతి రచయిత నేర్చుకోవలసింది అదే. ప్రయోగం. ఆయన నిత్య ప్రయోగశాలి. ఏ రోజైతే కొత్తది మానేస్తామో ఆ రోజున మనం నిర్జీవం అయ్యామని అర్థం. జయకాంతన్ కథలన్నీ నాకు కంఠోపాఠం. ‘నేనున్నాను’, ‘గురుపీఠం’, ‘ఒక పగటివేళ పాసింజర్లో’, ‘నందవనంలో ఆండీ’, ‘చీకట్లోకి’, ‘అగ్రహారంలో పిల్లి’, ‘శిలువ’... ఆయన కథల్లో ‘మౌనం ఒక భాష’ అనే కథ ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో తల్లి, కూతురు ఒకేసారి గర్భవతులవుతారు. ఇందుకు తల్లి సిగ్గుతో చితికిపోతుంది. కూతురి ముందుకు ఎలా రావడం? అప్పుడు రచయిత సాంత్వనం పలుకుతాడు. ‘పర్లేదులేమ్మా... పనసచెట్టుకు మొదట్లో కూడా కాయలు కాస్తాయి... తప్పులేదు’ అంటాడు. ఆయన మరో కథ ‘బ్రహ్మోపదేశం’. అందులో జీవితాంతం మంత్రోచ్ఛారణ చేసిన ఒక బ్రాహ్మణుడు చివరకు తనకు మంత్రాలు రావని గ్రహించి, వాటి అసలైన అర్థాలు పరమార్థాలు అవసరాలు ఏమీ తెలియవని గ్రహించి, జంధ్యం తెంచి పడేసి అంతర్థానం అయిపోతాడు. అలాంటి విప్లవాత్మకమైన కథలు జయకాంతన్ ఎన్నో రాశాడు. ఒక చెట్టును పెకలించి చూసినప్పుడు దాని కుదుళ్లతో పాటు మట్టిపెళ్లలు తేమ అంతా అంటుకుని దర్శనమిచ్చి నట్టుగా జయకాంతన్ ఏది రాసినా లోలోపలి నుంచి ఏదో పెళ్లగించి చూపినట్టుగా లోతుగా, విస్తృతంగా, దిగ్భ్రమగా ఉంటుంది. స్త్రీల గురించి, వారి చుట్టూ ఏర్పరచిన పవిత్రత గురించి పేరుకొని ఉన్న కొన్ని అభిప్రాయాలను బోర్లగించినవాడు జయకాంతన్. దాదాపు 200 కథలు, 25 నవలలు... ఇవిగాక వ్యాసాలు... సినిమా స్క్రిప్ట్‌లు... సినిమాకు దర్శకత్వాలు... ఎన్నని. మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువు లుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. ఆయన రచన ఆధారంగా వచ్చిన సినిమాని ఒకసారి టీవీలో చూసి ఇది ఏ నవల అనే అన్వేషణ సాగించాను. చివరికి అది ‘ఒక నటి నాటకం చూస్తోంది’ నవల అని తెలిసింది. మిత్రులు జిల్లేళ్ల బాలాజీ దానిని ‘కల్యాణి’ పేరుతో అనువాదం చేసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినప్పుడు మరింత సంతోషం కలిగింది. అది పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా చెన్నైలో ఆయనను కలవాలని జిల్లేళ్ల బాలాజీ, సుంకోజి దేవేంద్రాచారి, నేనూ తిరుపతి నుంచి వెళ్లాం. ఆయన తన ఇంటి మూడో ఫ్లోర్ మీద టీస్టాల్ వంటి ఒక తాటిపాక వేసుకొని ఎక్కువ భాగం అక్కడే గడుపుతూ ఉన్నాడు. మేం వచ్చామని తెలిసి ఆ తాటిపాకలోనే కూచోబెట్టి కాసేపటికి లుంగీ, గళ్ల చొక్కా మీద వచ్చి కూచున్నాడు. అంత పెద్ద రచయిత అయినా మా స్థాయికి దిగి ఎన్ని కబుర్లు చెప్పాడో ఎంత సంతోషం పొందాడో చెప్పలేను. అయితే ఆయన అందరినీ రచయితలుగా గుర్తిస్తాడని చెప్పలేము. అన్నాదురై, కరుణానిధి వంటి మహామహులను కూడా వారు రచయితలే కాదు అని తేల్చి చెబుతాడాయన. ఆయనకు ఇష్టమైన కవి కన్నదాసన్. అయినప్పటికీ జయకాంతన్ ధోరణిని అందరూ స్వీకరించారు. ఆయన స్టైల్‌ని హీరో పాత్రలకు ఆపాదించారు. జయకాంతన్వి పెద్ద పెద్ద మీసాలు. మాతో మాట్లాడుతున్నంత సేపు వాటిని మెలి తిప్పుకుంటూనే ఉన్నాడు. అయితే ఆ చేష్ట మాకు పొగరుగా, అహంకారంగా అనిపించలేదు. ముచ్చటగొలిపేదిగానే ఉంది. ఎందుకంటే మా ఎదురుగా ఉన్నది ఒక కథావీరుడు అని మాకు తెలుసు. అవును. ఆయన కథావీరుడే. ఇప్పుడే కాదు మరో వందేళ్లకు కూడా భారతీయ సాహిత్యంలో మనం మళ్లీ చూడలేని ఒక అరుదైన సాహితీ వీరుడు- జయకాంతన్. - మధురాంతకం నరేంద్ర 9866243659 మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఏ వైటాలిటితో ఆయన బయలుదేరాడో చివరివరకూ ఆయన దానిని కాపాడుకుంటూనే వచ్చాడు. బహుముఖాలుగా... వేయి బాహువులుగా... ఏ రచయిత అయినా అలా జీవించాలి. -
ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం
తెలుసుకోదగ్గ పుస్తకం: ‘జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన ధర్మం ఒకటే ఒకటుంది. ఏమిటో తెలుసా? ఎప్పుడూ సంతోషంగా ఉండు. అంతేరా కన్నా’ అని చెప్పేవారు మా నాన్న. నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను.... ‘ఒక మనిషి... ఒక ఇల్లు.. ఒక ప్రపంచం’లో ప్రధాన పాత్రధారి హెన్రీ తనని తాను ఆవిష్కరించుకుంటూ అన్న మాటలు ఇవి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్ తమిళంలో రచించిన సుప్రసిద్ధ నవల ఇది. ఈ నవల సాహిత్య అకాడమి పురస్కారం పొందింది. జయకాంతన్ రెండు వందలకు పైగా కథలు, నలభై నవలలు రాశారు. ఈ నవలను తెలుగులోకి జిల్లేళ్ళ బాలాజీ అనువదించారు. ఒక మంచి నవల జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడుతుంది. దాని స్వభావాన్ని బట్టి విషాదాన్నో తాత్వికతనో మరో సుగంధాన్నో మోస్తూ ఉంటుంది. ఈ నవల అపారమైన సంతోషాన్ని మోసుకొస్తుంది. చదువుతున్నంత సేపూ ఈ ప్రపంచం మీద ఎనలేని నమ్మకం, మనుషుల పట్ల అంతులేని ప్రేమ కలుగుతాయి. ప్రధాన పాత్రధారుడు హెన్రీ గుర్తుకురాగానే మన మొహం మీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెలుస్తుంది. బక్క పలుచగా, నీలి కళ్లతో క్రీస్తులా ఉన్న అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. ప్రేమ, కామం, ద్వేషం ఇలాంటి విషయాలు ఏవీ లేకుండా ఇంతందంగా రాయడం జయకాంతన్కే సాధ్యం. కృష్ణరాజపురం ఒక అందమైన గ్రామం. సభాపతి పిళ్లై పండితుడు, ఊరి గుడి ధర్మకర్త కూడా. ఆయన భార్య ఇంటి మంగలి వాడితో లేచి వెళ్లిపోతుంది. ఈ విషయం ఊళ్లో వాళ్లకి తెలియక ముందే అతను ఊరు విడిచి మిలట్రీలో చేరుతారు. అక్కడ యుద్ధంలో ఆప్తమిత్రుణ్ని పోగొట్టుకుంటాడు. అతని భార్య దిక్కులేనిది కాకుండా ఉండేందుకు ఆమెతో సహజీవనం చేస్తూ రైల్వే షెడ్డులో దొరికిన కుర్రాణ్ని తెచ్చుకుని పెంచుకుంటాడు. ఆ కుర్రాడే ‘హెన్రీ’. మొదట తల్లి, తర్వాత తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోతూ ఊళ్లో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అతనికి వారసత్వంగా ఇస్తాడు. హెన్రీకి ఆస్తుల మీద వ్యామోహం లేదు కాని తన తండ్రి జ్ఞాపకాలతో పెనవేసుకున్న ఆ ఇంటిలో ఉంటే తనకి ఎంతో ఇష్టమైన తండ్రి లేని లోటు తీరుతుందని ఆ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఒక మనిషి తన పెంపుడు తండ్రి ఎప్పుడో ఊళ్లో వదిలేసిన ఒక ఇంటిని వెదుక్కుంటూ అందులో ఉండటం కోసం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అతని చుట్టూ ఏర్పరచుకున్న ఒక ప్రపంచం.. ఇది ఈ నవల సారాంశం. ఈ ప్రయత్నంలో తారసపడే పాత్రలు- ఇతనికి మొదటి నుంచి తోడుగా ఉన్న యువకుడు దేవరాజన్; అన్నగారు వదిలేసిన పొలాలను సంరక్షిస్తూ, తానొక ధర్మకర్తనని, ఎప్పుడు వారసుడు వస్తే, అతనికి ఆస్తి అప్పజెప్పాలనుకునే దొరైకణ్ణు; ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి వచ్చి ఆస్తి నాది అని ఋజువులు చూపించినపుడు, ఊళ్లోనే ఇంత కాలం తమ మధ్య ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగిపోతోందేమోనని మథనపడ్డ ఊరి పెద్దలు; అందరికీ తలలో నాలుక లాగా ఉండే దేవరాజన్ అక్క... ఇలా హెన్రీ ప్రపంచంలో చేరిన ప్రతీపాత్ర, పిచ్చి పిల్లతో, సహా ఎంతో సంస్కారవంతంగా ఉంటాయి. ‘హెన్రీ పాత్ర చాలా ఐడియలిస్టిక్. ఇలాంటి మనిషిని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే చూడగలరు.. చూడండి’ అని రచయిత తన ముందు మాటలో చెబుతాడు. ఎప్పుడు ఏ చిన్న విషాదానికో గుండె బరువెక్కినపుడు, మనసు కలత చెందినపుడు ఈ పుస్తకం తీసి చదవండి. మీ మీద మీకు విశ్వాసం, ఈ ప్రపంచం మీద అపారమైన నమ్మకం కలక్కపోతే అడగండి. - కృష్ణమోహన్‌బాబు