ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం | Jayakanthan gets Sahitya Academy Award for Navel | Sakshi
Sakshi News home page

ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం

Published Sat, May 10 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం

ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం

తెలుసుకోదగ్గ పుస్తకం:  ‘జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన ధర్మం ఒకటే ఒకటుంది. ఏమిటో తెలుసా? ఎప్పుడూ సంతోషంగా ఉండు. అంతేరా కన్నా’ అని చెప్పేవారు మా నాన్న. నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను....
 
 ‘ఒక మనిషి... ఒక ఇల్లు.. ఒక ప్రపంచం’లో ప్రధాన పాత్రధారి హెన్రీ తనని తాను ఆవిష్కరించుకుంటూ అన్న మాటలు ఇవి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్ తమిళంలో రచించిన సుప్రసిద్ధ నవల ఇది. ఈ నవల సాహిత్య అకాడమి పురస్కారం పొందింది. జయకాంతన్ రెండు వందలకు పైగా కథలు, నలభై నవలలు రాశారు. ఈ నవలను తెలుగులోకి జిల్లేళ్ళ బాలాజీ అనువదించారు.
 
 ఒక మంచి నవల జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడుతుంది. దాని స్వభావాన్ని బట్టి విషాదాన్నో తాత్వికతనో మరో సుగంధాన్నో మోస్తూ ఉంటుంది. ఈ నవల అపారమైన సంతోషాన్ని మోసుకొస్తుంది. చదువుతున్నంత సేపూ  ఈ ప్రపంచం మీద ఎనలేని నమ్మకం, మనుషుల పట్ల అంతులేని ప్రేమ కలుగుతాయి. ప్రధాన పాత్రధారుడు హెన్రీ గుర్తుకురాగానే మన మొహం మీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెలుస్తుంది. బక్క పలుచగా, నీలి కళ్లతో క్రీస్తులా ఉన్న అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. ప్రేమ, కామం, ద్వేషం ఇలాంటి విషయాలు ఏవీ లేకుండా ఇంతందంగా రాయడం జయకాంతన్‌కే సాధ్యం.
 
 కృష్ణరాజపురం ఒక అందమైన గ్రామం. సభాపతి పిళ్లై పండితుడు, ఊరి గుడి ధర్మకర్త కూడా. ఆయన భార్య ఇంటి మంగలి వాడితో లేచి వెళ్లిపోతుంది. ఈ విషయం ఊళ్లో వాళ్లకి తెలియక ముందే అతను ఊరు విడిచి మిలట్రీలో చేరుతారు. అక్కడ యుద్ధంలో ఆప్తమిత్రుణ్ని పోగొట్టుకుంటాడు. అతని భార్య దిక్కులేనిది కాకుండా ఉండేందుకు ఆమెతో సహజీవనం చేస్తూ రైల్వే షెడ్డులో దొరికిన కుర్రాణ్ని తెచ్చుకుని పెంచుకుంటాడు. ఆ కుర్రాడే ‘హెన్రీ’.  మొదట తల్లి, తర్వాత తండ్రి చనిపోతారు.
 
 తండ్రి చనిపోతూ ఊళ్లో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అతనికి వారసత్వంగా ఇస్తాడు. హెన్రీకి ఆస్తుల మీద వ్యామోహం లేదు కాని తన తండ్రి జ్ఞాపకాలతో పెనవేసుకున్న ఆ ఇంటిలో ఉంటే తనకి ఎంతో ఇష్టమైన తండ్రి లేని లోటు తీరుతుందని ఆ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఒక మనిషి తన పెంపుడు తండ్రి ఎప్పుడో ఊళ్లో వదిలేసిన ఒక ఇంటిని వెదుక్కుంటూ అందులో ఉండటం కోసం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అతని చుట్టూ ఏర్పరచుకున్న ఒక ప్రపంచం.. ఇది ఈ నవల సారాంశం.
 
 ఈ ప్రయత్నంలో తారసపడే పాత్రలు- ఇతనికి మొదటి నుంచి తోడుగా ఉన్న యువకుడు దేవరాజన్; అన్నగారు వదిలేసిన పొలాలను సంరక్షిస్తూ, తానొక ధర్మకర్తనని, ఎప్పుడు వారసుడు వస్తే, అతనికి ఆస్తి అప్పజెప్పాలనుకునే దొరైకణ్ణు; ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి వచ్చి ఆస్తి నాది అని ఋజువులు చూపించినపుడు, ఊళ్లోనే ఇంత కాలం తమ మధ్య ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగిపోతోందేమోనని మథనపడ్డ ఊరి పెద్దలు; అందరికీ తలలో నాలుక లాగా ఉండే దేవరాజన్ అక్క... ఇలా హెన్రీ ప్రపంచంలో చేరిన ప్రతీపాత్ర, పిచ్చి పిల్లతో, సహా ఎంతో సంస్కారవంతంగా ఉంటాయి. ‘హెన్రీ పాత్ర చాలా ఐడియలిస్టిక్. ఇలాంటి మనిషిని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే చూడగలరు.. చూడండి’ అని రచయిత తన ముందు మాటలో చెబుతాడు. ఎప్పుడు ఏ చిన్న విషాదానికో గుండె బరువెక్కినపుడు, మనసు కలత చెందినపుడు ఈ పుస్తకం తీసి చదవండి. మీ మీద మీకు విశ్వాసం, ఈ ప్రపంచం మీద అపారమైన నమ్మకం కలక్కపోతే అడగండి.
 - కృష్ణమోహన్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement