sahitya academy award
-
'రంగనాథ'కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
కర్నూలు కల్చరల్/సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావును కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రంగనాథ రామచంద్ర 2018లో తెలుగులోకి అనువదించారు. ఈ రచనే పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను అకాడమీ 24 భాషల నుంచి ఎంపిక చేసిన అనువాద రచనలకు శనివారం అనువాద పురస్కారాలను ప్రకటించింది. అకాడమీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని అకాడమీ కార్యనిర్వాహక మండలి శనివారం ఇక్కడ సమావేశమై ఈ పురస్కారాల ఎంపికను ఆమోదించింది. ప్రతి భాషలో ముగ్గురి సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ఈ పురస్కారాలను సిఫారసు చేసింది. 2014 నుంచి 2018 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఎంపికకు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కార ఎంపికలో తెలుగు భాష నుంచి జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ జీఎస్ మోహన్, డాక్టర్ పాపినేని శివశంకర్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ వ్యవహరించారు. బాలల కోసం ఎన్నో రచనలు రామచంద్ర అన్నపూర్ణ, రఘునాథరావు దంపతులకు 1953 ఏప్రిల్ 28న ఆదోనిలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ (ఆంగ్లం), బీఈడీ చదివారు. ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి 2011లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రంగనాథ రామచంద్రరావు బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు. గొప్ప త్యాగం (కథల సంపుటి), ఎత్తుకు పైఎత్తు (కథల సంపుటి), సుచిత్ర, శ్రీరాఘవేంద్రస్వామి చరిత్ర, గవర్నర్ పిల్లి (వివిధ దేశాల జానపద కథలు), అద్భుత మంత్రం (వివిధ దేశాల జానపద కథలు), ‘తోక వచ్చె కత్తి పోయే ఢాం ఢాం ఢాం’ అనే పుస్తకాలు ప్రచురించారు. అంతేకాక.. గడుసు భార్య (జానపద కథలు), సింద్బాద్ సాహస యాత్రలు, గలివర్ సాహస యాత్రలు, అలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ పుస్తకాలు బాలల కోసం ప్రచురణకు సిద్ధంచేశారు. మరోవైపు.. తెలుగు, కన్నడ సాహిత్యాలకు వారధిగా ఉన్న రంగనాథ రామచంద్రరావు అనువాద సాహిత్యంలో కృషిచేస్తున్నారు. అనేక కలం పేర్లతో రచనలు రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు చేశారు. సూర్యనేత్ర, స్పప్నమిత్ర, రంగనాథ, మనస్విని, నిగమ, స్వరూపాదేవి తదితర కలం పేర్లతో ఇప్పటివరకు 300కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కథలు, 70కి పైగా సొంత కథలు అందించారు. ► కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తిరుగుబాటు, వడ్డారాధన, రాళ్లు కరిగే వేళ, పూర్ణచంద్ర తేజశ్వి, అంతఃపురం, అవధశ్వరి, వాగు వచ్చింది, మరిగే ఎసరు రచనలు అనువాదం చేశారు. ► దింపుడు కల్లం, నేనున్నాగా, మళ్లీ సూర్యోదయం ఈయన సొంత కథా సంపుటాలు. ► ఓ సంచారి అంతరంగం, అక్రమ సంతానం, మౌనంలో మాటలు, జోగిని మంజమ్మ, బుర్రకథ ఈరమ్మలు ఆత్మ కథలు. ► తేనె జాబిలి, ఘాచర్ త్యాగరత్న, ఓ రైతు కథ, భారతీపురం, తారాబాయి లేఖ, యానిమల్ ఫామ్, రాయల్ ఎన్ఫీల్డ్ ఈయన అనువాద నవలలు. ► ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడంతో పాటు పదుల సంఖ్యలో సాహిత్య పురస్కారాలను రంగనాథ రామచంద్రరావు అందుకున్నారు. చాలా ఆనందంగా ఉంది సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో రంగనాథ రామచంద్రరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనంతటికీ విద్యాబుద్ధులు నేర్పిన గురువులే కారణమన్నారు. అనంతకమలనాథ్ పంకజ్ హిందీ అధ్యాపకులు తనను అనువాదకులుగా తీర్చిదిద్దారన్నారు. ఆంగ్ల అధ్యాపకులు వడ్లమూడి చంద్రమౌళి సాహిత్యం, కథలపట్ల ఆసక్తి కలిగేలా చేశారన్నారు. ఆరో తరగతి నుంచే పుస్తకాలు చదవడంతో ఇంత సాహిత్య పరిజ్ఞానం కలిగిందన్నారు. ఆదోని లైబ్రరీ కూడా తన ఉన్నతికి ఎంతో ఉపయోగ పడిందన్నారు. ఎంత సాంకేతికతంగా అభివృద్ధి చెందినా పుస్తక పఠనంతో లభించే జ్ఞానం అపారమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలన్నారు. రంగనాథకు సీఎం జగన్ అభినందన సాక్షి, అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత, అనువాదకుడు రంగనాథ రామచంద్రరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు. -
‘నిఖిలేశ్వర్’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. తెలుగులో దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందిన నిఖిలేశ్వర్‌ను ఈ ఏడాది కేంద్రం సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాసకుగాను ఈ పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్. దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం అనే గ్రంథానికి గాను మొయిలీకి ఈ అవార్డు ప్రదానం చేశారు. నిఖిలేశ్వర్‌తో పాటు కన్నెగంటి అనసూయకు బాలసాహితీ పురస్కారం లభించింది. ఆమె రచించిన రచించిన "స్నేహితులు" లఘు కథల సంపుటికిగాను ఈ అవార్డు లభించింది. అలానే ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆమె రచించిన "మిలింద" లఘు కథల సంపుటికి అవార్డు లభించింది. విజేతలకు కేంద్ర సాహిత్య అకాడమీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం అందజేయనుంది. -
వేల్చేరుకు అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/శ్రీకాకుళం/ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు విశిష్ట పండితుడు, రచయిత, అనువాదకులు, విమర్శకులు ప్రొఫెసర్ వేల్చేరు నారాయణరావు ఎంపికయ్యారు. అకాడమీ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ 92వ సమావేశంలో వేల్చేరు నారాయణరావును ఈ ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు. ఆయన సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌కు ఎన్నికైన 14వ పండితుడని అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేల్చేరు నారాయణరావు తెలుగు సాహిత్య రంగానికి విశిష్ట సేవలు అందించారు. గరల్స్ ఫర్ సేల్ : కన్యాశుల్కం, ఏ ప్లే ఫ్రమ్ కొలొనియల్ ఇండియా, గాడ్ ఆన్ హిల్ : టెంపుల్ సాంగ్స్ ఫ్రమ్ తిరుపతి, టెక్స్చర్స్ ఆఫ్ టైమ్ : రైటింగ్ హిస్టరీ ఇన్ సౌత్ ఇండియా, హైబిస్కస్ ఆన్ ది లేక్ : ట్వంటీయత్ సెంచరీ తెలుగు పోయెట్రీ ఫ్రమ్ ఇండియా వంటి ఆంగ్ల పుస్తకాలు రాశారు. దక్షిణ భారత సాహిత్యాన్ని, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. జెరూసలేంలోని ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఆఫ్ హిబ్రూ యూనివర్సిటీలో, మాడిసన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ హ్యుమానిటీస్‌లో ఫెలోగా ఉన్నారు. అనువాద రచనలకు గాను ఆయన ఏకే రామానుజన్ బహుమతి అందుకున్నారు. అలాగే, రాధాకృష్ణన్ మెమోరియల్ పురస్కారాన్ని స్వీకరించారు. తెలుగు సాహిత్యాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువాదం చేసి తెలుగు భాష ఘనతను విశ్వవ్యాప్తం చేశారు. అలాగే, అనేక వర్శిటీలు ఆయన పుస్తకాలకు గుర్తింపునిచ్చి వాటి లైబ్రరీల్లో స్థానం కల్పించాయి. కాగా, ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై వేల్చూరి నారాయణరావు సంతోషం వ్యక్తంచేశారు. సాహితీరంగానికి వేల్చూరి విశేష కృషి : గవర్నర్ సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమి గౌరవ ఫెలోషిప్‌కు ఎంపికైన వేల్చూరి నారాయణరావును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. తెలుగు, సంస్కృత సాహితీరంగాల్లో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. సాహితీ పరిశోధన రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని శుక్రవారం ఓ ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. ఆంగ్లంలోకి అనువదించడం ద్వారా తెలుగు, సంస్కృత సాహిత్య గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేశారన్నారు. సీఎం జగన్ అభినందనలు వేల్చేరు నారాయణరావును సీఎం వైఎస్ జగన్ కూడా అభినందించారు. సాహిత్య రంగానికి ఆయన విశేష సేవలు అందించారని ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అనువాదాలు, సాహితీ పరిశోధన రంగంలో ఆయన విశేష కృషిచేశారని కొనియాడారు. ఫెలోషిప్‌కు ఆయన తగిన వ్యక్తి ఇదిలా ఉంటే.. వేల్చేరు నారాయణరావు ఈ అరుదైన ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై ప్రముఖ సాహితీవేత్తలు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు బోర్డు కన్వీనర్ శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్‌లు అభినందించారు. అలాగే, నారాయణరావు తెలుగు నుంచి ఇంగ్లి‹Ùకు చాలా అనువాదాలు చేశారని.. ముఖ్యంగా శ్రీశ్రీ మహాప్రస్థానం, గురజాడ కన్యాశుల్కాన్ని ఆంగ్లంలోకి అనువదించారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్య భూమిక వహించారని.. ఈ పురస్కారానికి ఆయన ఎంతైనా తగిన వ్యక్తి అని ప్రశంసించారు. సాహిత్య అకాడమీ ఫెలోషిప్.. దేశంలోని ఉద్ధండ సాహితీవేత్తలను మాత్రమే సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపికచేస్తారు. ఈ పురస్కారాలు ప్రకటించే ప్రతీసారి ఇరవై మంది లేదా అంతకు తక్కువ మందిని ఎంపిక చేస్తారు. 1968 నుంచి 2018 వరకు సుమారు వంద మంది వరకు ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. సాహిత్య అకాడమీ అవార్డు.. దేశంలోని సాహితీవేత్తలు రచించిన అత్యుత్తమ రచనలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. దేశం లో ని 24 ప్రధాన భాషల్లో మాత్రమే రచనలై ఉండాలి. గౌరవ ఫెలోషిప్‌లు ఎవరికి ఇస్తారంటే.. ఇది సాహిత్య రంగంలో విశేష కృషిచేస్తున్న వారికి సాహిత్య అకాడమీ అందించే అత్యున్నత పురస్కారం. భారత పౌరులు కాని వారిని మాత్రమే ఇందుకు ఎంపిక చేస్తారు. ఈ ఫెలోషిప్‌కు ఇప్పటివరకు 13మంది ఎంపికయ్యారు. వారు.. 1) కట్సూర కోగ (2015), 2) ప్రొ.కిమ్‌యాంగ్ షిక్ (2014), 3) డా. జిన్ దిన్ హాన్ (2014), 4) డా. అభిమన్యు ఉన్నుత్ (2013), 5) సర్ విఎస్ నైపాల్ (2010), 6) ప్రొ. ఆర్ఈ ఆషెర్ (2007), 7) డా.వాస్సిలిస్ విట్సాక్సిస్ (2002), 8) ప్రొ. ఇ.పి. చెలిషెవ్ (2002), 9) ప్రొ. ఎడ్వర్డ్ సి. డిమొక్ (1996), 10) ప్రొ. డేనియల్ హెచ్‌హెచ్ ఇంగాల్స్ (1996), 11) ప్రొ. కామిల్ వి.జ్వెలెబిల్ (1996), 12) ప్రొ.జి జియాంగ్ లిన్ (1996), 13) లియోపోల్డ్ సేదర్ సెన్‌ఘర్ (1974). 14వ వ్యక్తిగా ‘వేల్చేరు’ గుర్తింపు పొందారు. ఏలూరు టు అమెరికా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందిన వేల్చేరు నారాయణరావు 1933లో శ్రీకాకుళం జిల్లా అంబఖండి గ్రామంలో జన్మించారు. ఏలూరులోని మేనమామ ఇంటి వద్ద ఉంటూ ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకూ ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలో చదివారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ చేసి, ఏలూరు సీఆర్‌ఆర్‌లోనే అధ్యాపకునిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. -
మునిపల్లె రాజు కన్నుమూత
హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత మునిపల్లె రాజు (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు శనివారం హైదరాబాద్ సైనిక్‌పురిలోని స్వగృహంలో మృతి చెందారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన రాజు 1925లో జన్మించారు. తెనాలిలో బాల్యం గడిపారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజుకు కళలు, సాహిత్య విభాగంలో 2006లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన సాహితీ రంగంలో చేసిన కృషికి జ్యేష్ఠ లిటరసీ అవార్డు, శాస్త్రి మెమోరియల్ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయ అవార్డు(రెండుసార్లు) గోపీచంద్ అవార్డు, ఆంధ్ర సారస్వత సమితి తదితర అవార్డులను అందుకున్నారు. -
‘గాలిరంగు’ మీద ‘కామెంటరీ’
పురస్కార సాహితి పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాyì కీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? ‘నీ పెదవులు నీవి– మాట్లాడు/ నీ నాలుక నీది – మాట్లాడు నిటారైన నీ శరీరం నీది–మాట్లాడు/ నీ ఆత్మ ఇప్పటికీ నీదే– మాట్లాడు మరి! నీకున్న వ్యవధి స్వల్పకాలమే– అందుకే మాట్లాడవయ్యా! సత్యం ఇంకా బతికే ఉంది– అందుకే చెప్పేసెయ్! నీవేం చెప్పాలనుకున్నావో– అదంతా కక్కేసెయ్!’ – ఫైజ్ అహ్మద్ ఫైజ్ (‘భారత ఉపఖండ చరిత్ర’ నుంచి) ఈ సందేశాన్నీ, ఈ ఉద్దీపననీ ఒంట పట్టించుకున్న ఆధునిక తెలుగు కవితా క్షేత్రంలో అగ్రశ్రేణి కవి దేవీప్రియ. ‘గాలిరంగు’ ఆయన సృజనే. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆలస్యమైందే కానీ, అబ్బురమైనదేమీ కాదు. స్వేచ్ఛాప్రియులు ఎవరైనా త్యాగ నిరతిని వదులుకోలేరు. తమ బాధాతప్త హృదయాలకు దారిద్య్రమే బహుమానంగా వచ్చినా వెనుదీయరు. అలాంటి వ్యక్తిత్వం దేవీప్రియ సొంతం. ఆయన కవిత్వం మీద ముద్ర అలాంటిదే. రాజకీయ, సామాజిక, ఆర్థిక, తాత్త్విక కారణాలెన్నింటినో ఈ కవి శ్వాసించాడు. వాటికి స్పందించాడు. అయినా తనదైన దృక్కోణాన్ని కోల్పోకుండా దేవీప్రియ చేసిన అక్షర చాలనమే ‘గాలిరంగు’. దేవీప్రియ ఒకే కార్యక్షేత్రానికి పరిమితం కాలేదు. కవిత్వంతో పాటు కథ, పత్రికా రచన, చలన చిత్రాలు, చిత్రానువాదం ఆయన కలానికి పరిచయాలే. నేను సంపాదకునిగా పనిచేసిన ‘ఆంధ్రప్రభ’, ‘ఉదయం’ దినపత్రికలలో తొలిసారి (1982 నుంచి) రాజకీయాల మీద నిత్య వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియను ప్రారంభించినవారు దేవీప్రియ. అదే ‘రన్నింగ్ కామెంటరీ’. దీనికి వ్యంగ్య చిత్రం కూడా తోడై తెలుగు పత్రికారంగంలో వినూత్న పోకడగా అవతరించింది. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒజ్జబంతిగా అవతరించిన ‘ఉదయం’ ఆదివారం అనుబంధాలలో ‘సంతకాలు’ శీర్షికను కూడా దేవీప్రియ రమణీయంగా నిర్వహించారు. తెలుగువారైన పలువురు ముస్లిం కవులకు ఆయన మార్గదర్శకుడు. ఈ కవులంతా ‘వెతల మైదానంలో’ జీవిస్తూ కూడా తమ ‘తనాన్ని’, వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకున్నవారే. ఎంతగా ప్రణయ శృంగార కవిత్వానికి ఆకర్షితుడైనప్పటికీ గాలిబ్ ఒక జీవన సత్యాన్ని ఆవిష్కరించకుండా మాత్రం తప్పించుకోలేకపోయాడు. ‘మనిషి బాధ చైతన్యానికి నిదర్శన’మని చెప్పాడాయన. మరో మహాకవి ఖలీల్ జిబ్రాన్ మానవాళి వ్యథార్త జీవిత యథార్థ గాథను ఆవిష్కరిస్తూ ఇలా అన్నారు, ‘మీ కోసం పాడాను కానీ మీరు నర్తించలేదు/ మీ ముందు రోదించాను కానీ మీరెవరూ స్పందించలేద’ని. ఇందుకు కారణం –‘స్పందించలేకపోవడానికి కారణం– మీ ఆత్మలు ఆకలి బాధతో విలవిలలాడడమూ, ‘మీ హృదయాలు దాహంతో ఎండిపోవడమూ’ తప్ప మరేమీ కాదంటారాయన. ‘మానవ జీవితం మృత్యువుకన్నా బలహీనమైతే/ మృత్యువు సత్యానికన్నా బలహీనం కదా!’ అన్న మహోన్నత కవి ఖలీల్ జిబ్రాన్. ఈ తాత్త్విక చింతనకు చెందిన దేవీప్రియ కవితా సంపుటి ‘గాలిరంగు’ కూడా ఆ కోవలోనే జీవన సత్యాలను విప్పిచెప్పింది. అసలు ‘గాలిరంగు’ అన్న పదబంధమే ఒక వైచిత్రి. గాలికి వాసన సంగతేమో కానీ, రంగూ రుచీ ఉంటాయా! ఉంటాయనే అంటారు దేవీప్రియ. ఎలా? మనిషి ఆయువు ప్రాణవాయువు. కానీ ప్రాణవాయువును పీల్చినవారంతా మనుషులుగా బతకడం లేదు. మనుషులుగా ఉండడం లేదు కూడా. మనిషతనాన్ని అడ్డంపెట్టుకుని అడ్డదారులలో జొరబడేవారూ ఉన్నారు. సుగంధాలనూ, దుర్గంధాలనూ గాలే మోసుకురాగలదు. శ్రేష్టమైన పైరగాలీ, దుర్భరమైన పడమటి గాలీ, కొండగాలీ, అడవి గాలీ కూడా నిజమే. పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాడికీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ (ఆ ‘వాడు’ ఎవరో కాదు, దేవీ ప్రియే) గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? గాలికి అతడు వేసే రంగు ఎరుపా, తెలుపా, చిలకపచ్చా, ఆకుపచ్చా? ఆ రంగులు ఏవైనా గాలిబ్ అన్నట్టు, ‘మల్లెలు, గులాబీలు, చంపకవల్లులు పూస్తాయి. కానీ వసంతం రాకను ప్రకటించేవి రంగులే!’’ కానీ దేవీప్రియ ‘గాలిరంగునైనా ఊహించగలనుగానీ/ రానున్న రేపటి రూపే చూపుకందడంలేద’ని ఆక్రోశించాడు. ఎన్నో ఉత్ప్రేక్షలతో పేదవాడి బాధలను అక్షరబద్ధం చేసిన దేవీప్రియకి గాలి ఒక ప్రతీక. తన దేశ సామాన్య ప్రజాబాహుళ్యానికి డెబ్బయ్యేళ్ల తరువాత కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అంగలారుస్తున్న విషాదాన్ని చూసి కుపితుడైన దేవీప్రియ ఒక ప్రశ్నను సంధించాడు: ‘దేనికీ భయపడను/ జలపాతాల ధారలు పట్టుకుని/ఊగుతూ దూకుతూ అరణ్యాలు దాటినవాణ్ణి/ అల్లకల్లోలంగా ఉన్న ఈ దేశంలో సముద్రాలకున్న సంవేదన (అలల కల్లోలం) కూడా/ మన పౌర మానవుడికి లేదెందుకు?’’ అని! నిజమే, దేశంలో పౌర సమాజం ఎదగకుండా పాలక వర్గాలు రోజుకొక తీరున పౌర స్వేచ్ఛపైన, భావ ప్రకటనా స్వాతంత్య్రంపైన, భిన్నాభిప్రాయ ప్రకటనలపైన యుద్ధం ప్రకటిస్తున్నాయి. అదేమంటే రాజద్రోహం అంటున్నాయి. ‘క్షేమం అవిభాజ్యం అన్నందుకు’ జైళ్ల నోళ్లు తెరిపిస్తున్న సమయంలో పౌర సమాజం భీకరంగా విరుచుకుపడవలసిన రోజులివి. ఈ విషయాన్ని కనిపెట్టి ముందుగానే హెచ్చరించాడు ‘గాలి రంగు’ కవి: ‘ప్రవక్తలు పారిపోతారు/స్వాప్నికులు సిలువెక్కుతారు/నియంతలు త్యాగపురుషుల వెనుక శరణు తీసుకుంటారు/ రక్త పిపాసులు చేతిలో పుష్పగుచ్ఛాలతో తిరుగుతారు/ జాతి ఆకాంక్షలను కొందరు/ సముద్రాలకు ఆవల మర్రిచెట్టు తొర్రలలో దాచిపెడతారు/ పొలాల పురుగు మందు చావులూ/ ఆదివాసీ తిరుగుబాట్లదారులూ/ దగ్ధమవుతున్న అరణ్యాలూ, రగులుతున్న పర్వతశ్రేణులూ/ నవభారత నిర్మాణ నినాదాల కంటికి కనిపించవు/ వేదికలూ నివేదికల మధ్య/ ప్రశ్నలూ జవాబుల మధ్య నిరుపేద భారతం నలిగి నరకం అనుభవిస్తూ ఉంటుంది/ రామలీలా మైదానం ఒక్కటే/ జాతీయ ప్రత్యక్ష ప్రసారాల ప్రాధాన్యత అవుతుంది!’ అంతేగాదు, ‘మానవుడు ఎన్ని వైజ్ఞానిక విజయాలు సాధించినా, మాటలు నేర్చుకుని, లిపులు మార్చుకుని మరీ/ దేవుళ్లను సృష్టించుకున్నాం, నక్షత్రాలకు నామకరణం చేసి, గ్రహాలను విగ్రహాలుగా మార్చాం.../ కానీ, సోదరా! మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం’ అంటాడు దేవీప్రియ. అతను త్యాగానికీ, రక్తానికీ ఉన్నఅవినాభావ సంబంధాన్ని ‘అచరిత్ర’ కవితలో బలంగా ఆవిష్కరించాడు: ‘కురుక్షేత్ర రణరంగమైనా/ కల్వంగిరి దారైనా/ కర్బలా మైదానమైనా/ రక్తం ఒక్కటే! సెల్యులార్ జైలు ఉరికొయ్యలకి వేలాడినా/ ఉగాండా అడవుల్లో తిరగబడి నేలకొరిగినా/ నల్లమల అరణ్యాలలో స్మారక స్తంభాలై నిలిచినా/ త్యాగం ఒక్కటే.../ అయినా ఎవడు నమోదు చేస్తున్నాడు/ తరతరాలుగా తడి ఆరకుండా మెరుస్తున్న/ నెత్తుటి బడబానలాల మూల చరిత్ర..? ఏ హోమరు, ఏ వాల్మీకి/ ఏ వ్యాసుడు/ ఏ కంబడు/ ఏ నన్నయ/ రాశాడు, రక్తబీజాలు చల్లుకుంటూ/ ఇతిహాస ఊసర క్షేత్రాలలో/ మందార పాదముద్రలు వదిలి వెళ్లిన జన వీరులగాథ?’’ ఎంత ఎత్తు ఎదిగినా బాల్యాన్ని మరచిపోనివాడు దేవీప్రియ దృష్టిలో ధన్యజీవి. తన కవిత్వంలో చిన్నతనం, పల్లెతనం, గ్రామీణ చిహ్నాలూ, ప్రతీ కలూ, చిన్న చిన్న అనుభవాలు పదే పదే కనిపిస్తూండటానికి కారణం ఆ బాల్యమే. బహుశా అడివన్నా అతనికంత ఇష్టం. అయితే గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలిని రుచి మరిగిన వాడు, ఫ్యాన్ విసిరే చల్లగాలిలో శరీరాన్ని ఆరేసుకోవడానికి అలవాటు పడినవాడు ‘అడివి’ని ఎలా ఇష్టపడగలడు? ఈ ప్రశ్నకు దేవీప్రియ ఇచ్చిన సమాధానం– నేటి అజ్ఞాత వీరులైన విప్లవకారుల గురిం చిన విస్పష్ట ప్రకటనే. ఎందుకంటే, రేపటి ఆకాశానికి ఈ రోజునే పూచిన సూర్య పుష్పానివని కీర్తిస్తూ–చెప్పదలచుకున్న సత్యాన్ని దేవీప్రియ విప్పాడు: ప్రజలకోసం విప్లవకారులు చేస్తున్న త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకుని ‘నీ ముళ్ల ఒడిలో నా వాళ్లు విశ్రమించారు/ నీ చల్లని కనురెప్పల నీడలో/ నావాళ్లు సేదదీరారు/ నీ కొమ్మలే, నీ ఆకులే/ నీ గాలుల సాక్షిగా/ నావాళ్లు ఒరిగిపోయారు/ విల్లంబులూ, తుపాకులూ/ జారవిడిచారు/ అడివీ, నా అడివీ/ ఆ బాణాలు ఏరివుంచు/ ఆ ఆయుధాలు దాచివుంచు’ అని రహస్యంగా సందేశమిస్తాడు. రైతుకూలీల, శ్రమజీవుల శరీరం నిత్యమూ శ్రమ సంగీతాన్ని విని పిస్తూనే ఉంటుందంటాడు. అతనికి శబ్ద రహస్యం తెలుసు. తనను కమ్ముకున్న ‘రెండు నిధుల్నీ, రెండు విధుల్నీ’ కవి పేర్కొన్నాడు. ‘నాలుక మీద కవిత్వం/ తలమీద మాత్రం దారిద్య్రం’ అనేవి రెండు నిధులట. ‘నిత్య నిబద్ధం/ దారిద్య్ర విముక్తి యుద్ధం’ అనేవి రెండు విధులట. ఆంధ్రజాతి, అదే తెలుగు జాతి ఆంధ్ర/సీమ/తెలంగాణగా మూడు ముక్కలు, మూడు చెక్కలవడాన్ని దేవీప్రియ అదే ‘తెలుగు శాసనం’గా పేర్కొంటూ ‘పొలంగట్లు కూరాయి/ పెత్తందార్లు మారారు’ (గాలిరంగు) తప్ప శ్రమ జీవులైన రైతు, కూలీల నసీబులు మాత్రం మారలేదని ఆ ‘శాసనం’లో చిత్రించాడు దేవీప్రియ. మళ్లీ ఒక హంసపాదు పెట్టుకుని, పోనీలే ‘ఉద్వేగమో, ఉద్రేకమో చాలదని తేలింది’ కదా, ‘‘భాషకంటే బలమైనదొకటి శాసిస్తోంది కదా నీ ఊపిరిని/ ఏ ఒడ్డున ఎవరు నిలబడినా/ మనిషి తోటి మనిషి కోసం పోరాడనీ/ తెలుగు పలుగు/ తెలుగు లిపి/ సజీవ మానవ మహా శాసనం మీద చిరస్థాయిగా నిలిచిపోనీ’ అని దేవీప్రియ జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజీ మార్గం ఎంచుకున్నాడు. ఏది ఎలా ఉన్నా, కళింగ యుద్ధానంతరం శాంతి మార్గాన్ని ఎంచుకుని బౌద్ధ ధర్మాన్ని పాటించడానికి సిద్ధమైన అశోకుడిని ‘దేవానాంప్రియ’ (దేవతల ఆశీస్సులు పొందినవాడా) అని సంబోధించినట్టుగా మనం సహమానవులైన ప్రగతిశీల సారస్వతీయుల అభినందనలు అందుకుంటున్నందుకు ‘మానవానాంప్రియ– దేవీప్రియ’ అని ఆశీరాక్షతలు చల్లుదాం! (దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంగా) abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
‘భారత్ హిందువులది కాదు.. హిందుస్తానీలది!’
న్యూఢిల్లీ: దాద్రి ఘటనను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించాలని సాహిత్య అకాడెమీ అవార్డులను వెనక్కిచ్చిన రచయితలు బుధవారం డిమాండ్ చేశారు. ‘ఇక్కడ నివసించే హిందుస్తానీలందరిదీ ఈ దేశం. ఇది కేవలం హిందువుల దేశం కాదు. హిందుస్తానీలందరికీ రక్షణ కల్పించాలి. అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’ అని నయనతార సెహగల్ పేర్కొన్నారు. దాద్రి ఘటనపై ప్రధాని స్పందన చాలా పేలవంగా, బలహీనంగా ఉందని కన్నడ రచయిత శశి దేశ్‌పాండే వ్యాఖ్యానించారు. సాహిత్య అకాడెమీ అవార్డ్‌ను తిరిగిచ్చేస్తున్నట్లు బుధవారం కవి కేకే దారువాలా ప్రకటించారు. రాజకీయ కారణాలతోనే రచయితలు తమ పురస్కారాలను వెనక్కు ఇస్తున్నారని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ విమర్శించారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఏడాదిన్నర కిందట యూపీలోని ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు రచయితలు నిరసనగళం ఎందుకు వినిపించలేదని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. -
చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
-
చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. ఆయన రాసిన 'మన నవలలు - మన కథనాలు' అనే పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. 2014 సంవత్సరానికి గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్రముఖ రచయిత, విమర్శకుడిగా రాచపాళెం సాహితీ వర్గాల్లో సుపరిచితులు. రాయలసీమ సాహితీ ఉద్యమం, దళిత జీవనం, ఆంధ్రకవిత్వం, గురజాడ కథానికలు.. ఇలా పలు అద్భుత రచనలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైనందుకు తనకు సంతోషంగా ఉందని చంద్రశేఖరరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఆయన ప్రస్తుతం కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. తాను రాసిన విమర్శనాత్మక పుస్తకానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. అందులో నవలలు, కథానికలపై 24 వ్యాసాలున్నాయని తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా సాహిత్యంలో ఉన్న ఆయన 19 పుస్తకాలు ప్రచురించారు. ఇప్పుడు అవార్డు వచ్చిన మన నవలలు- మన కథలు పుస్తకాన్ని 2010లో రాశారు. 11 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. తెలుగులో సాహితీ విమర్శ సరిగా ఎదగలేదన్న విమర్శలకు ఈ అవార్డే సమాధానమని ఆయన చెప్పారు. -
ఒక మనిషి - ఒక ఇల్లు - ఒక ప్రపంచం
తెలుసుకోదగ్గ పుస్తకం: ‘జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన ధర్మం ఒకటే ఒకటుంది. ఏమిటో తెలుసా? ఎప్పుడూ సంతోషంగా ఉండు. అంతేరా కన్నా’ అని చెప్పేవారు మా నాన్న. నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను.... ‘ఒక మనిషి... ఒక ఇల్లు.. ఒక ప్రపంచం’లో ప్రధాన పాత్రధారి హెన్రీ తనని తాను ఆవిష్కరించుకుంటూ అన్న మాటలు ఇవి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్ తమిళంలో రచించిన సుప్రసిద్ధ నవల ఇది. ఈ నవల సాహిత్య అకాడమి పురస్కారం పొందింది. జయకాంతన్ రెండు వందలకు పైగా కథలు, నలభై నవలలు రాశారు. ఈ నవలను తెలుగులోకి జిల్లేళ్ళ బాలాజీ అనువదించారు. ఒక మంచి నవల జ్ఞాపకంలా జీవితాంతం వెంటాడుతుంది. దాని స్వభావాన్ని బట్టి విషాదాన్నో తాత్వికతనో మరో సుగంధాన్నో మోస్తూ ఉంటుంది. ఈ నవల అపారమైన సంతోషాన్ని మోసుకొస్తుంది. చదువుతున్నంత సేపూ ఈ ప్రపంచం మీద ఎనలేని నమ్మకం, మనుషుల పట్ల అంతులేని ప్రేమ కలుగుతాయి. ప్రధాన పాత్రధారుడు హెన్రీ గుర్తుకురాగానే మన మొహం మీద అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెలుస్తుంది. బక్క పలుచగా, నీలి కళ్లతో క్రీస్తులా ఉన్న అతన్ని దగ్గరకు తీసుకుని ముద్దాడాలనిపిస్తుంది. ప్రేమ, కామం, ద్వేషం ఇలాంటి విషయాలు ఏవీ లేకుండా ఇంతందంగా రాయడం జయకాంతన్కే సాధ్యం. కృష్ణరాజపురం ఒక అందమైన గ్రామం. సభాపతి పిళ్లై పండితుడు, ఊరి గుడి ధర్మకర్త కూడా. ఆయన భార్య ఇంటి మంగలి వాడితో లేచి వెళ్లిపోతుంది. ఈ విషయం ఊళ్లో వాళ్లకి తెలియక ముందే అతను ఊరు విడిచి మిలట్రీలో చేరుతారు. అక్కడ యుద్ధంలో ఆప్తమిత్రుణ్ని పోగొట్టుకుంటాడు. అతని భార్య దిక్కులేనిది కాకుండా ఉండేందుకు ఆమెతో సహజీవనం చేస్తూ రైల్వే షెడ్డులో దొరికిన కుర్రాణ్ని తెచ్చుకుని పెంచుకుంటాడు. ఆ కుర్రాడే ‘హెన్రీ’. మొదట తల్లి, తర్వాత తండ్రి చనిపోతారు. తండ్రి చనిపోతూ ఊళ్లో ఉన్న ఇల్లు, కొద్దిపాటి పొలం అతనికి వారసత్వంగా ఇస్తాడు. హెన్రీకి ఆస్తుల మీద వ్యామోహం లేదు కాని తన తండ్రి జ్ఞాపకాలతో పెనవేసుకున్న ఆ ఇంటిలో ఉంటే తనకి ఎంతో ఇష్టమైన తండ్రి లేని లోటు తీరుతుందని ఆ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఒక మనిషి తన పెంపుడు తండ్రి ఎప్పుడో ఊళ్లో వదిలేసిన ఒక ఇంటిని వెదుక్కుంటూ అందులో ఉండటం కోసం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అతని చుట్టూ ఏర్పరచుకున్న ఒక ప్రపంచం.. ఇది ఈ నవల సారాంశం. ఈ ప్రయత్నంలో తారసపడే పాత్రలు- ఇతనికి మొదటి నుంచి తోడుగా ఉన్న యువకుడు దేవరాజన్; అన్నగారు వదిలేసిన పొలాలను సంరక్షిస్తూ, తానొక ధర్మకర్తనని, ఎప్పుడు వారసుడు వస్తే, అతనికి ఆస్తి అప్పజెప్పాలనుకునే దొరైకణ్ణు; ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి వచ్చి ఆస్తి నాది అని ఋజువులు చూపించినపుడు, ఊళ్లోనే ఇంత కాలం తమ మధ్య ఉన్న వ్యక్తికి అన్యాయం జరిగిపోతోందేమోనని మథనపడ్డ ఊరి పెద్దలు; అందరికీ తలలో నాలుక లాగా ఉండే దేవరాజన్ అక్క... ఇలా హెన్రీ ప్రపంచంలో చేరిన ప్రతీపాత్ర, పిచ్చి పిల్లతో, సహా ఎంతో సంస్కారవంతంగా ఉంటాయి. ‘హెన్రీ పాత్ర చాలా ఐడియలిస్టిక్. ఇలాంటి మనిషిని మనం ఎప్పుడూ చూడలేదు. అయితే చూడగలరు.. చూడండి’ అని రచయిత తన ముందు మాటలో చెబుతాడు. ఎప్పుడు ఏ చిన్న విషాదానికో గుండె బరువెక్కినపుడు, మనసు కలత చెందినపుడు ఈ పుస్తకం తీసి చదవండి. మీ మీద మీకు విశ్వాసం, ఈ ప్రపంచం మీద అపారమైన నమ్మకం కలక్కపోతే అడగండి. - కృష్ణమోహన్‌బాబు -
చిన్ని మనసుల విజేత సుజాత
‘ఆటలో అరటిపండు’కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు హైదరాబాద్: కథలు... చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ రాయాలంటే..! అదో అక్షర యజ్ఞం. సరికొత్త ఆలోచనల పర్వం. అదీ చిన్నారులకు నచ్చేట్టు... మెదడుకు ‘ఎక్కేట్టు’... ఆసక్తి రేకెత్తించడమంటే అంత సులువు కాదు. సూటిగా... సుత్తి లేకుండా పదాల అల్లికలు అలా అలా అలల తీరులా సులువుగా సాగిపోవాలి. కాలక్షేపానికే కాకుండా... అంతర్లీనంగా వారికి మార్గనిర్దేశనం చేస్తూ... సన్మార్గంలో నడిపిస్తూ... స్ఫూర్తిని రగిలించాలి. అంతటి అద్భుతమైన శైలితో ప్రత్యేకత చాటుకున్న రచయిత డి.సుజాతాదేవి (60). ‘ఆటలో అరటిపండు’ కథల పుస్తకంతో చిన్నారుల మనసు గెలుచుకున్న సుజాత... ఈ ఏడాది ‘కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు’నూ దక్కించుకున్నారు. బాలసాహిత్యంపై ఆమె చేస్తున్న కృషికి లభించిన గౌరవం ఇది. ఈ సందర్భంగా సుజాతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సంస్కృతీ, సాంప్రదాయాలు, నైతిక విలువలు, మంచి, చెడులు... పిల్లలు తమ ప్రవర్తనను ఎలా ఉంచుకోవాలి? క్రమశిక్షణతో తమను తాము ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకొంటూ ఎలా ముందుకు సాగాలి?... ఇవే సుజాత కథావస్తువులు. 1980 నుంచి పిల్లల కథలు రాశారు. అడవిలో జంతువుల మధ్య సంభాషణలతో కథ నడిపిస్తూ... అంతర్లీనంగా అనేక సామాజిక విలువలను బోధిస్తూ రాసిన ‘ఆటలో అరటిపండు’ పుస్తకంలోని కథలు చిన్నారులను ఎంతో ఆకట్టుకున్నాయి. 25కు పైగా రచనలు... ‘కాకి-కోకిల, డాక్టర్ కొక్కొరొకో, అందరం ఒక్కటే, పర్యావరణనాన్ని పరిరక్షించుకోవాలి’ వంటి పుస్తకాలతో పాటు స్ఫూర్తిదాయకమైన ‘సుజలాం సుఫలాం’ నవల ఆమె కలం నుంచి జాలువారినవే. 25కు పైగా ఆమె రచనల్లో 18 పిల్లలవే. మొత్తం 576 మంది రచయితలు ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం పోటీపడ్డారు. వారందరిలో సుజాతకే పురస్కారం దక్కడం విశేషం. నిజానికి 1970 నుంచే ఆమె కథలు వివిధ పత్రికలు, రేడియోలో వచ్చేవి. గేయాల రూపంలో కథలు చెప్పడం ఆమెకున్న మరో ప్రత్యేకత. ఎన్నో పురస్కారాలు... రెండుసార్లు ఎన్సీఈఆర్టీ, మాడభూషి మెమోరియల్, నన్నపనేని బాల సాహిత్య పురస్కారం, కోడూరి లీలావతి స్మారక బహుమతి వంటివెన్నో అవార్డులు సుజాత అందుకున్నారు. ఏలూరు నుంచి వచ్చి.. బహుముఖ సేవలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సుజాత సొం తూరు. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. ‘ఆహ్వానం’ తెలుగు పాహిత్య పత్రిక, ఆంధ్రమహిళా సభ పబ్లికేషన్స్ విభాగం, సీపీ బ్రౌన్ అకాడమీల్లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె భర్త డాక్టర్ నారాయణరావు ఆడిటర్. ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మజ చిత్రకారిణి. రెండో అమ్మాయి అంజలి సైకాలజిస్ట్. మూడో కూతురు శైలజ వ్యాపార రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె చిన్నకూతురు దగ్గర నల్లగొండలో ఉంటున్నారు.