కర్నూలు కల్చరల్/సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావును కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వరించింది. కన్నడ రచయిత శాంతినాథ దేశాయి రచించిన ‘ఓం ణమో’ పుస్తకాన్ని రంగనాథ రామచంద్ర 2018లో తెలుగులోకి అనువదించారు. ఈ రచనే పురస్కారానికి ఎంపికైంది. 2020 సంవత్సరానికి గాను అకాడమీ 24 భాషల నుంచి ఎంపిక చేసిన అనువాద రచనలకు శనివారం అనువాద పురస్కారాలను ప్రకటించింది.
అకాడమీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని అకాడమీ కార్యనిర్వాహక మండలి శనివారం ఇక్కడ సమావేశమై ఈ పురస్కారాల ఎంపికను ఆమోదించింది. ప్రతి భాషలో ముగ్గురి సభ్యులతో కూడిన ఎంపిక కమిటీ ఈ పురస్కారాలను సిఫారసు చేసింది. 2014 నుంచి 2018 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఎంపికకు ప్రాతిపదికగా తీసుకుంది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం ప్రదానం చేస్తారు. ఈ పురస్కార ఎంపికలో తెలుగు భాష నుంచి జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్ జీఎస్ మోహన్, డాక్టర్ పాపినేని శివశంకర్, డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ వ్యవహరించారు.
బాలల కోసం ఎన్నో రచనలు
రామచంద్ర అన్నపూర్ణ, రఘునాథరావు దంపతులకు 1953 ఏప్రిల్ 28న ఆదోనిలో జన్మించారు. బీఎస్సీ, ఎంఏ (ఆంగ్లం), బీఈడీ చదివారు. ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి 2011లో రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రంగనాథ రామచంద్రరావు బాలల కోసం ఎన్నో రచనలు చేశారు. కొన్నింటిని పుస్తకాలుగా ప్రచురించారు. గొప్ప త్యాగం (కథల సంపుటి), ఎత్తుకు పైఎత్తు (కథల సంపుటి), సుచిత్ర, శ్రీరాఘవేంద్రస్వామి చరిత్ర, గవర్నర్ పిల్లి (వివిధ దేశాల జానపద కథలు), అద్భుత మంత్రం (వివిధ దేశాల జానపద కథలు), ‘తోక వచ్చె కత్తి పోయే ఢాం ఢాం ఢాం’ అనే పుస్తకాలు ప్రచురించారు. అంతేకాక.. గడుసు భార్య (జానపద కథలు), సింద్‌బాద్ సాహస యాత్రలు, గలివర్ సాహస యాత్రలు, అలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం, శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ పుస్తకాలు బాలల కోసం ప్రచురణకు సిద్ధంచేశారు. మరోవైపు.. తెలుగు, కన్నడ సాహిత్యాలకు వారధిగా ఉన్న రంగనాథ రామచంద్రరావు అనువాద సాహిత్యంలో కృషిచేస్తున్నారు.
అనేక కలం పేర్లతో రచనలు
రంగనాథ రామచంద్రరావు అనేక కలం పేర్లతో రచనలు చేశారు. సూర్యనేత్ర, స్పప్నమిత్ర, రంగనాథ, మనస్విని, నిగమ, స్వరూపాదేవి తదితర కలం పేర్లతో ఇప్పటివరకు 300కు పైగా వివిధ ప్రక్రియల్లో రచనలు, 250కు పైగా అనువాద కథలు, 140కి పైగా బాలల కథలు, 70కి పైగా సొంత కథలు అందించారు.
► కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తిరుగుబాటు, వడ్డారాధన, రాళ్లు కరిగే వేళ, పూర్ణచంద్ర తేజశ్వి, అంతఃపురం, అవధశ్వరి, వాగు వచ్చింది, మరిగే ఎసరు రచనలు అనువాదం చేశారు.
► దింపుడు కల్లం, నేనున్నాగా, మళ్లీ సూర్యోదయం ఈయన సొంత కథా సంపుటాలు.
► ఓ సంచారి అంతరంగం, అక్రమ సంతానం, మౌనంలో మాటలు, జోగిని మంజమ్మ, బుర్రకథ ఈరమ్మలు ఆత్మ కథలు.
► తేనె జాబిలి, ఘాచర్ త్యాగరత్న, ఓ రైతు కథ, భారతీపురం, తారాబాయి లేఖ, యానిమల్ ఫామ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈయన అనువాద నవలలు.
► ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడంతో పాటు పదుల సంఖ్యలో సాహిత్య పురస్కారాలను రంగనాథ రామచంద్రరావు అందుకున్నారు.
చాలా ఆనందంగా ఉంది
సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో రంగనాథ రామచంద్రరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఈ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనంతటికీ విద్యాబుద్ధులు నేర్పిన గురువులే కారణమన్నారు. అనంతకమలనాథ్ పంకజ్ హిందీ అధ్యాపకులు తనను అనువాదకులుగా తీర్చిదిద్దారన్నారు. ఆంగ్ల అధ్యాపకులు వడ్లమూడి చంద్రమౌళి సాహిత్యం, కథలపట్ల ఆసక్తి కలిగేలా చేశారన్నారు. ఆరో తరగతి నుంచే పుస్తకాలు చదవడంతో ఇంత సాహిత్య పరిజ్ఞానం కలిగిందన్నారు. ఆదోని లైబ్రరీ కూడా తన ఉన్నతికి ఎంతో ఉపయోగ పడిందన్నారు. ఎంత సాంకేతికతంగా అభివృద్ధి చెందినా పుస్తక పఠనంతో లభించే జ్ఞానం అపారమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలన్నారు.
రంగనాథకు సీఎం జగన్ అభినందన
సాక్షి, అమరావతి: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత, అనువాదకుడు రంగనాథ రామచంద్రరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ శనివారం ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment