‘గాలిరంగు’ మీద ‘కామెంటరీ’ | Sahitya Academy Award for DeviPriya | Sakshi
Sakshi News home page

‘గాలిరంగు’ మీద ‘కామెంటరీ’

Published Tue, Dec 26 2017 12:25 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

Sahitya Academy Award for DeviPriya - Sakshi

పురస్కార సాహితి
పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాyì కీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా?

‘నీ పెదవులు నీవి– మాట్లాడు/ నీ నాలుక నీది – మాట్లాడు
నిటారైన నీ శరీరం నీది–మాట్లాడు/ నీ ఆత్మ ఇప్పటికీ నీదే– మాట్లాడు మరి!
నీకున్న వ్యవధి స్వల్పకాలమే– అందుకే మాట్లాడవయ్యా!
సత్యం ఇంకా బతికే ఉంది– అందుకే చెప్పేసెయ్‌!
నీవేం చెప్పాలనుకున్నావో– అదంతా కక్కేసెయ్‌!’
– ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ (‘భారత ఉపఖండ చరిత్ర’ నుంచి)

ఈ సందేశాన్నీ, ఈ ఉద్దీపననీ ఒంట పట్టించుకున్న ఆధునిక తెలుగు కవితా క్షేత్రంలో అగ్రశ్రేణి కవి దేవీప్రియ. ‘గాలిరంగు’ ఆయన సృజనే. ఈ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆలస్యమైందే కానీ, అబ్బురమైనదేమీ కాదు. స్వేచ్ఛాప్రియులు ఎవరైనా త్యాగ నిరతిని వదులుకోలేరు. తమ బాధాతప్త హృదయాలకు దారిద్య్రమే బహుమానంగా వచ్చినా వెనుదీయరు. అలాంటి వ్యక్తిత్వం దేవీప్రియ సొంతం. ఆయన కవిత్వం మీద ముద్ర అలాంటిదే. రాజకీయ, సామాజిక, ఆర్థిక, తాత్త్విక కారణాలెన్నింటినో ఈ కవి శ్వాసించాడు. వాటికి స్పందించాడు. అయినా తనదైన దృక్కోణాన్ని కోల్పోకుండా దేవీప్రియ చేసిన అక్షర చాలనమే ‘గాలిరంగు’.

దేవీప్రియ ఒకే కార్యక్షేత్రానికి పరిమితం కాలేదు. కవిత్వంతో పాటు కథ, పత్రికా రచన, చలన చిత్రాలు, చిత్రానువాదం ఆయన కలానికి పరిచయాలే. నేను సంపాదకునిగా పనిచేసిన ‘ఆంధ్రప్రభ’, ‘ఉదయం’ దినపత్రికలలో తొలిసారి (1982 నుంచి) రాజకీయాల మీద నిత్య వ్యంగ్య వ్యాఖ్యాన ప్రక్రియను ప్రారంభించినవారు దేవీప్రియ. అదే ‘రన్నింగ్‌ కామెంటరీ’. దీనికి వ్యంగ్య చిత్రం కూడా తోడై తెలుగు పత్రికారంగంలో వినూత్న పోకడగా అవతరించింది. పరిశోధనాత్మక జర్నలిజానికి ఒజ్జబంతిగా అవతరించిన ‘ఉదయం’ ఆదివారం అనుబంధాలలో ‘సంతకాలు’ శీర్షికను కూడా దేవీప్రియ రమణీయంగా నిర్వహించారు. తెలుగువారైన పలువురు ముస్లిం కవులకు ఆయన మార్గదర్శకుడు. ఈ కవులంతా ‘వెతల మైదానంలో’ జీవిస్తూ కూడా తమ ‘తనాన్ని’, వ్యక్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకున్నవారే. ఎంతగా ప్రణయ శృంగార కవిత్వానికి ఆకర్షితుడైనప్పటికీ గాలిబ్‌ ఒక జీవన సత్యాన్ని ఆవిష్కరించకుండా మాత్రం తప్పించుకోలేకపోయాడు. ‘మనిషి బాధ చైతన్యానికి నిదర్శన’మని చెప్పాడాయన. మరో మహాకవి ఖలీల్‌ జిబ్రాన్‌ మానవాళి వ్యథార్త జీవిత యథార్థ గాథను ఆవిష్కరిస్తూ ఇలా అన్నారు, ‘మీ కోసం పాడాను కానీ మీరు నర్తించలేదు/ మీ ముందు రోదించాను కానీ మీరెవరూ స్పందించలేద’ని. ఇందుకు కారణం –‘స్పందించలేకపోవడానికి కారణం– మీ ఆత్మలు ఆకలి బాధతో విలవిలలాడడమూ, ‘మీ హృదయాలు దాహంతో ఎండిపోవడమూ’ తప్ప మరేమీ కాదంటారాయన. ‘మానవ జీవితం మృత్యువుకన్నా బలహీనమైతే/ మృత్యువు సత్యానికన్నా బలహీనం కదా!’ అన్న మహోన్నత కవి ఖలీల్‌ జిబ్రాన్‌. ఈ తాత్త్విక చింతనకు చెందిన దేవీప్రియ కవితా సంపుటి ‘గాలిరంగు’ కూడా ఆ కోవలోనే జీవన సత్యాలను విప్పిచెప్పింది. అసలు ‘గాలిరంగు’ అన్న పదబంధమే ఒక వైచిత్రి.

గాలికి వాసన సంగతేమో కానీ, రంగూ రుచీ ఉంటాయా! ఉంటాయనే అంటారు దేవీప్రియ. ఎలా? మనిషి ఆయువు ప్రాణవాయువు. కానీ ప్రాణవాయువును పీల్చినవారంతా మనుషులుగా బతకడం లేదు. మనుషులుగా ఉండడం లేదు కూడా. మనిషతనాన్ని అడ్డంపెట్టుకుని అడ్డదారులలో జొరబడేవారూ ఉన్నారు. సుగంధాలనూ, దుర్గంధాలనూ గాలే మోసుకురాగలదు. శ్రేష్టమైన పైరగాలీ, దుర్భరమైన పడమటి గాలీ, కొండగాలీ, అడవి గాలీ కూడా నిజమే. పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు ఉన్నాయని ఈ కవి భావన. ఏటినీ నీటినీ నిలబెట్టేవాడికీ, నిప్పుని కూడా నీటిలో మండించే వాడికీ, ఏనుగుని తొండం మీద నడిపించేవాడికీ, ఎవరెస్టు పర్వతాన్ని చపాతీలా చాప చుట్టుగలిగిన వాడికీ; నీవూ నేనూ ఎవరూ చేయలేని పనులు చేయడానికి సంకల్పించిన వాడికీ (ఆ ‘వాడు’ ఎవరో కాదు, దేవీ ప్రియే) గాలికి రంగులద్దడం, ఆ రంగులను మనకు చూపడం పెద్ద పనా? గాలికి అతడు వేసే రంగు ఎరుపా, తెలుపా, చిలకపచ్చా, ఆకుపచ్చా? ఆ రంగులు ఏవైనా గాలిబ్‌ అన్నట్టు, ‘మల్లెలు, గులాబీలు, చంపకవల్లులు పూస్తాయి. కానీ వసంతం రాకను ప్రకటించేవి రంగులే!’’ కానీ దేవీప్రియ ‘గాలిరంగునైనా ఊహించగలనుగానీ/ రానున్న రేపటి రూపే చూపుకందడంలేద’ని ఆక్రోశించాడు. ఎన్నో ఉత్ప్రేక్షలతో పేదవాడి బాధలను అక్షరబద్ధం చేసిన దేవీప్రియకి గాలి ఒక ప్రతీక. తన దేశ సామాన్య ప్రజాబాహుళ్యానికి డెబ్బయ్యేళ్ల తరువాత కూడా సాంఘిక, రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం కోసం, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం అంగలారుస్తున్న విషాదాన్ని చూసి కుపితుడైన దేవీప్రియ ఒక ప్రశ్నను సంధించాడు: ‘దేనికీ భయపడను/ జలపాతాల ధారలు పట్టుకుని/ఊగుతూ దూకుతూ అరణ్యాలు దాటినవాణ్ణి/ అల్లకల్లోలంగా ఉన్న ఈ దేశంలో సముద్రాలకున్న సంవేదన (అలల కల్లోలం) కూడా/ మన పౌర మానవుడికి లేదెందుకు?’’ అని!

నిజమే, దేశంలో పౌర సమాజం ఎదగకుండా పాలక వర్గాలు రోజుకొక తీరున పౌర స్వేచ్ఛపైన, భావ ప్రకటనా స్వాతంత్య్రంపైన, భిన్నాభిప్రాయ ప్రకటనలపైన యుద్ధం ప్రకటిస్తున్నాయి. అదేమంటే రాజద్రోహం అంటున్నాయి. ‘క్షేమం అవిభాజ్యం అన్నందుకు’ జైళ్ల నోళ్లు తెరిపిస్తున్న సమయంలో పౌర సమాజం భీకరంగా విరుచుకుపడవలసిన రోజులివి. ఈ విషయాన్ని కనిపెట్టి ముందుగానే హెచ్చరించాడు ‘గాలి రంగు’ కవి: ‘ప్రవక్తలు పారిపోతారు/స్వాప్నికులు సిలువెక్కుతారు/నియంతలు త్యాగపురుషుల వెనుక శరణు తీసుకుంటారు/ రక్త పిపాసులు చేతిలో పుష్పగుచ్ఛాలతో తిరుగుతారు/ జాతి ఆకాంక్షలను కొందరు/ సముద్రాలకు ఆవల మర్రిచెట్టు తొర్రలలో దాచిపెడతారు/ పొలాల పురుగు మందు చావులూ/ ఆదివాసీ తిరుగుబాట్లదారులూ/ దగ్ధమవుతున్న అరణ్యాలూ, రగులుతున్న పర్వతశ్రేణులూ/ నవభారత నిర్మాణ నినాదాల కంటికి కనిపించవు/ వేదికలూ నివేదికల మధ్య/ ప్రశ్నలూ జవాబుల మధ్య నిరుపేద భారతం నలిగి నరకం అనుభవిస్తూ ఉంటుంది/ రామలీలా మైదానం ఒక్కటే/ జాతీయ ప్రత్యక్ష ప్రసారాల ప్రాధాన్యత అవుతుంది!’ అంతేగాదు, ‘మానవుడు ఎన్ని వైజ్ఞానిక విజయాలు సాధించినా, మాటలు నేర్చుకుని, లిపులు మార్చుకుని మరీ/ దేవుళ్లను సృష్టించుకున్నాం, నక్షత్రాలకు నామకరణం చేసి, గ్రహాలను విగ్రహాలుగా మార్చాం.../ కానీ, సోదరా! మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం’ అంటాడు దేవీప్రియ. అతను త్యాగానికీ, రక్తానికీ ఉన్నఅవినాభావ సంబంధాన్ని ‘అచరిత్ర’ కవితలో బలంగా ఆవిష్కరించాడు:

‘కురుక్షేత్ర రణరంగమైనా/ కల్వంగిరి దారైనా/ కర్బలా మైదానమైనా/ రక్తం ఒక్కటే! సెల్యులార్‌ జైలు ఉరికొయ్యలకి వేలాడినా/ ఉగాండా అడవుల్లో తిరగబడి నేలకొరిగినా/ నల్లమల అరణ్యాలలో స్మారక స్తంభాలై నిలిచినా/ త్యాగం ఒక్కటే.../ అయినా ఎవడు నమోదు చేస్తున్నాడు/ తరతరాలుగా తడి ఆరకుండా మెరుస్తున్న/ నెత్తుటి బడబానలాల మూల చరిత్ర..? ఏ హోమరు, ఏ వాల్మీకి/ ఏ వ్యాసుడు/ ఏ కంబడు/ ఏ నన్నయ/ రాశాడు, రక్తబీజాలు చల్లుకుంటూ/ ఇతిహాస ఊసర క్షేత్రాలలో/ మందార పాదముద్రలు వదిలి వెళ్లిన జన వీరులగాథ?’’

ఎంత ఎత్తు ఎదిగినా బాల్యాన్ని మరచిపోనివాడు దేవీప్రియ దృష్టిలో ధన్యజీవి. తన కవిత్వంలో చిన్నతనం, పల్లెతనం, గ్రామీణ చిహ్నాలూ, ప్రతీ కలూ, చిన్న చిన్న అనుభవాలు పదే పదే కనిపిస్తూండటానికి కారణం ఆ బాల్యమే. బహుశా అడివన్నా అతనికంత ఇష్టం. అయితే గార్డెన్‌ రెస్టారెంట్‌ చల్లగాలిని రుచి మరిగిన వాడు, ఫ్యాన్‌ విసిరే చల్లగాలిలో శరీరాన్ని ఆరేసుకోవడానికి అలవాటు పడినవాడు ‘అడివి’ని ఎలా ఇష్టపడగలడు? ఈ ప్రశ్నకు దేవీప్రియ ఇచ్చిన సమాధానం– నేటి అజ్ఞాత వీరులైన విప్లవకారుల గురిం చిన విస్పష్ట ప్రకటనే. ఎందుకంటే, రేపటి ఆకాశానికి ఈ రోజునే పూచిన సూర్య పుష్పానివని కీర్తిస్తూ–చెప్పదలచుకున్న సత్యాన్ని దేవీప్రియ విప్పాడు: ప్రజలకోసం విప్లవకారులు చేస్తున్న త్యాగాలను జ్ఞప్తికి తెచ్చుకుని ‘నీ ముళ్ల ఒడిలో నా వాళ్లు విశ్రమించారు/ నీ చల్లని కనురెప్పల నీడలో/ నావాళ్లు సేదదీరారు/ నీ కొమ్మలే, నీ ఆకులే/ నీ గాలుల సాక్షిగా/ నావాళ్లు ఒరిగిపోయారు/ విల్లంబులూ, తుపాకులూ/ జారవిడిచారు/ అడివీ, నా అడివీ/ ఆ బాణాలు ఏరివుంచు/ ఆ ఆయుధాలు దాచివుంచు’ అని రహస్యంగా సందేశమిస్తాడు. రైతుకూలీల, శ్రమజీవుల శరీరం నిత్యమూ శ్రమ సంగీతాన్ని విని పిస్తూనే ఉంటుందంటాడు. అతనికి శబ్ద రహస్యం తెలుసు. తనను కమ్ముకున్న ‘రెండు నిధుల్నీ, రెండు విధుల్నీ’ కవి పేర్కొన్నాడు. ‘నాలుక మీద కవిత్వం/ తలమీద మాత్రం దారిద్య్రం’ అనేవి రెండు నిధులట. ‘నిత్య నిబద్ధం/ దారిద్య్ర విముక్తి యుద్ధం’ అనేవి రెండు విధులట.

ఆంధ్రజాతి, అదే తెలుగు జాతి ఆంధ్ర/సీమ/తెలంగాణగా మూడు ముక్కలు, మూడు చెక్కలవడాన్ని దేవీప్రియ అదే ‘తెలుగు శాసనం’గా పేర్కొంటూ ‘పొలంగట్లు కూరాయి/ పెత్తందార్లు మారారు’ (గాలిరంగు) తప్ప శ్రమ జీవులైన రైతు, కూలీల నసీబులు మాత్రం మారలేదని ఆ ‘శాసనం’లో చిత్రించాడు దేవీప్రియ. మళ్లీ ఒక హంసపాదు పెట్టుకుని, పోనీలే ‘ఉద్వేగమో, ఉద్రేకమో చాలదని తేలింది’ కదా, ‘‘భాషకంటే బలమైనదొకటి శాసిస్తోంది కదా నీ ఊపిరిని/ ఏ ఒడ్డున ఎవరు నిలబడినా/ మనిషి తోటి మనిషి కోసం పోరాడనీ/ తెలుగు పలుగు/ తెలుగు లిపి/ సజీవ మానవ మహా శాసనం మీద చిరస్థాయిగా నిలిచిపోనీ’ అని దేవీప్రియ జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా రాజీ మార్గం ఎంచుకున్నాడు. ఏది ఎలా ఉన్నా, కళింగ యుద్ధానంతరం శాంతి మార్గాన్ని ఎంచుకుని బౌద్ధ ధర్మాన్ని పాటించడానికి సిద్ధమైన అశోకుడిని ‘దేవానాంప్రియ’ (దేవతల ఆశీస్సులు పొందినవాడా) అని సంబోధించినట్టుగా మనం సహమానవులైన ప్రగతిశీల సారస్వతీయుల అభినందనలు అందుకుంటున్నందుకు ‘మానవానాంప్రియ– దేవీప్రియ’ అని ఆశీరాక్షతలు చల్లుదాం!

(దేవీప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంగా)
abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement