ఆశల వసంతం... నిస్పృహల శిశిరం | Sakshi Guest Column On NDA Alliance | Sakshi
Sakshi News home page

ఆశల వసంతం... నిస్పృహల శిశిరం

Published Tue, May 14 2024 3:54 AM | Last Updated on Tue, May 14 2024 3:54 AM

Sakshi Guest Column On NDA Alliance

అవినీతిపై యుద్ధం అని చెప్పి గెలిచిన ఎన్డీఏ కూటమి అవినీతిని అరికట్టలేకపోయింది. దానికి బదులు ఈ కూటమి పాలనా కాలంలో కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ పెరిగింది. ఇప్పుడు వారంతా మహా కోటీశ్వరులుగా మారారు. ఏడీఆర్‌ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. రాజ్యాంగాన్ని మార్చడం అనే విషయమూ ఎన్నికల కాలంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తాము రాజ్యాంగాన్ని మార్చబోమని అధికార పార్టీవారు స్పష్టం చేయవలసివచ్చింది.

‘‘తయారయ్యే ప్రతీ తుపాకీ, రంగంలో ఉన్న ప్రతీ యుద్ధనౌక, మనం ఉపయోగించే ప్రతీ రాకెట్టూ – ఆకలిదప్పులతో మలమల మాడుతున్న, మనం మాడ్చుతున్న పేదసాదల కష్టార్జితం నుంచి దోచుకున్నదే’’
– అమెరికా మాజీ అధ్యక్షుడు ఐజెన్‌హోవర్‌ విస్పష్ట ప్రకటన

‘‘నేటి భారతదేశంలోని లెజిస్లేటర్‌లలో 360 మంది నేర చరిత్రులేనని, 476 మంది కోటీశ్వరులని, ఒక అభ్యర్థి రూ. 5 వేల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారనీ, లోక్‌సభ నాలుగో విడత అభ్యర్థులపై తాజాగా ‘ఏడీఆర్‌’ (అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌) సాధికార నివేదిక వెల్లడించింది. మొత్తం 1,717 మంది పోటీ పడే అభ్యర్థుల్లో 1,710 మంది వాఙ్మూలాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.’’

ఏడీఆర్‌ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిçష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. కానీ మళ్లీ అదే ఎన్డీఏ ముఠా నినాదం – ‘వచ్చే అయిదేళ్ళు అవినీతిపై యుద్ధమే’నని! 

ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి ‘అవినీతిపై యుద్ధంలో’ సాధించిన విజయాలేమిటో మోదీ చెప్పగలరా? దేశ సమైక్యత అంటూనే దేశంలో విభజనకు ఎన్డీఏ అవకాశం కలిగేలా వ్యవహరిస్తోంది. ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రేఖకు ప్రస్తుత కేంద్రం వ్యవహారశైలి దారి తీస్తుందనేది కొందరి వాదన.

వేలాది గుజరాత్‌ దళిత పేదసాదలపై దారుణ హత్యాకాండకు కారకులైన నాటి బీజేపీ నాయకులు ఆ ఉన్మాద చరిత్రను దాచడానికి ప్రయత్నిస్తూ సుప్రీంకోర్టు విచారణను సహితం పక్కదారులు పట్టించారు. అయినా బీజేపీ–ఆరెస్సెస్‌ కూటమిగా ఉన్న ఎన్డీఏ ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు’ పచ్చి అబద్ధమాడుతూ ఇప్పుడు తాజాగా సరికొత్త ఎదురుదాడికి సాహసిస్తోంది. పైగా, ‘భారత రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ కూడా మార్చలేరని’ తాజాగా ప్రధాని మోదీ బాహాటంగా ‘కోతల’కు దిగడం అత్యంత హాస్యాస్పదం! 

నిజానికి మనకు మోదీ హయాంలో రాజ్యాంగం అమలులో ఉందానిపిస్తోంది. ఉంటే, విదేశీ ‘పెగసస్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా దేశ యువకులను వేధించడానికి భారత పాలకులు సాహసించేవారు కాదు! రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్‌ తను రూపొందించిన రాజ్యాంగాన్ని ఏదో తానే మార్చేయబోతున్నట్టు మోదీ ఊహించుకుని అంబేడ్కర్‌ సహితం దాన్ని మార్చలేరని ‘ట్విస్టు’ ఇచ్చారు! పైగా ‘నేనింతవరకు ఈ స్థాయికి ఎదగడానికి సాయపడిన రాజ్యాంగానికి రుణపడి ఉన్నానని’ మరో ట్విస్టు ఇచ్చారు! 

బీజేపీ నాయకుల్లో కొందరు 400 లోక్‌సభా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామనే ప్రకటనలు ఇవ్వడం, దానిపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు లేవడం తెలిసిందే. అందుకే మోదీ రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరని ప్రకటించాల్సి వచ్చింది.

మనకో గొప్ప సామెత ఉంది – కంపు నోటి వాడు సంపాదిస్తే, కమ్మని నోటి వాడు ఎగేసుకుపోయాడని! తన సమకాలీన సమాజంలోని అంతరాల దొంతర్లను, అకృత్యాలను, అన్యాయాలనూ, మౌఢ్యాన్నీ చాటలతో చెరిగి ప్రజల సుఖదుఃఖాలకు అద్దంపట్టిన ఇంగ్లండ్‌ మహా రచయిత చార్లెస్‌ డికెన్స్‌ ‘రెండు మహానగరాలు’ అన్న రచనలో చెప్పిన మాటలు నేటికీ చిరస్మరణీయాలే! అపార దేశ సంపద మధ్యనే దారుణమైన దారిద్య్రం తాండవమాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా సగటు మనిషి జీవితం దుర్లభం కావడం, కేవలం కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య అమాంతం పెరిగి మహా కోటీశ్వరులుగా మారిపోవడం చూస్తున్నాం. అందుకే డికెన్స్‌ మహాశయుడు తన కాలం నాటి ఇంగ్లండ్‌ పరిస్థితులను వర్ణించిన మహా వాక్యాలను తిలకించండి:

‘‘అవి ఎంతో మంచి రోజులు. అలాగే అవి పరమ చెడ్డ రోజులు కూడా. అది జ్ఞానంతో కూడిన వివేచనా యుగం, అయినా అది మూర్ఖపు యుగం కూడా. అది విశ్వసించదగిన శకం, కానీ అది నమ్మలేని యుగం కూడా. అది అంధకారాన్ని చీల్చగలిగిన క్రాంతికి అరుదైన సమయం కూడా. అయినా అది అంధకారానికి ప్రతీక కూడా. అది ఆశల వసంతకాలం, కానీ అది నిరాశా నిస్పృహల శిశిరం కూడా. అన్నీ మా కళ్లముందే పరుచుకుని ఉన్నాయి, అయినా మా కళ్లముందు ఉండవు!’’

విచిత్రమైన విషయం ఏమంటే– రాజ్యాంగాన్ని ఏదో అంబేడ్కర్‌ మార్చదలచినట్టు ‘భావించి’ ఒకవేళ ‘మార్చుదామనుకున్నా మార్చలేడ’ని, అలాగే ఎన్డీఏ–ఆరెస్సెస్‌ కూటమి మార్చుదామనుకున్నా మార్చలేదనీ ప్రకటించిన ఎన్డీఏ నాయకుడు ‘నేనీ స్థితికి (ప్రధాని పదవికి) వచ్చానంటే నన్నీ ఉన్నత స్థితికి తీసుకొచ్చింది రాజ్యాంగమే’నని ప్రకటించుకోవడం వింతలలో వింతగా ఉంది. కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లెవరూ  ఫాసిస్టుల చేతుల్లో దాన్ని పెట్టి, భ్రష్టు పట్టించరు గాక పట్టించరు. మహాకవి జాషువా ఇవాళ కాదు, దశాబ్దాల క్రితమే ‘హైందవ నాగరాజు’ నీడల్ని పసికట్టి భారంగా ఒక సత్యాన్ని చాటాడు. ‘స్వాతంత్య్రంబును సర్వసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో, ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!’

ఈ ప్రశ్నలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు, ఎంతసేపటికీ దళితుల ఖాతాలు మార్చడం తప్ప, ఉమ్మడి సొత్తులో వారి ఖాతాలు ఈ రోజుకీ మెరుగుపర్చింది లేదు. ఎందుకంటే జాతి వివక్షా విధానంలో, కులం కుళ్లు అంతర్భాగమనీ, ఇండియాలో వర్గమూ, వర్ణమూ అవినాభావ సంబంధం కలిగి, కుల సమస్యగా, వర్ణ వివక్షా సమస్యగా మనిషి ఉనికినీ, ఉసురునూ, ఉపాధినీ దెబ్బతీసే వికృత సమస్యగా ఉంది. ఇదే విషయాన్ని 50 స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 300 మంది కార్యకర్తలతో కలిసి ఒక ఫోరమ్‌గా ఏర్పడి ‘దర్బన్‌’ సభకు 18 పేజీల డాక్యుమెంట్‌ను సమర్పించారు. 

ఇది ఫోరమ్‌ స్థాయిలో సర్వాంగీకారం పొందిన పత్రం. ఈ దర్బన్‌ సభలో  ‘పరివార్‌’ ప్రభుత్వ ప్రతినిధి పాల్గొని ‘కుల సమస్య’ దర్బన్‌ సభ ఎజెండాలోకి రాకుండా, వర్ణ వివక్షను పెంచి పోషిస్తున్న అమెరికా, తదితర పాశ్చాత్య రాజ్యాల అండతో సమస్యను దాటవేశారు. అలా బీజేపీ ఈ దాటవేతలో ‘జయప్రద’మయింది! చివరికి ఇప్పుడు మన దేశంలో ‘బీజేపీ పరివార్‌’ ప్రభుత్వం ఏ స్థాయికి ఎదిగిపోయింది? దేశ బడ్జెట్‌లు, బిల్లులు శాసన వేదికలో సరైన చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఆమోదించి ముద్ర వేసుకోవడమే! నేర చరిత్ర గల అభ్యర్థులను డబ్బు కోసం కక్కుర్తిపడి పాలక పక్షం సహా దాదాపు అన్ని పక్షాలూ (కొన్నే మినహాయింపులు) ఆశ్రయించి, ఆమోదించడం! ఇదీ మన శాసన వేదికల, అభ్యర్థుల చరిత్ర, భాగోతం!

వివేకానందుడు, హరిదాస్‌ విహారిదాస్‌ దేశాయ్‌కి చికాగో నుంచి లేఖ రాస్తూ ఇలా అన్నారు: ‘అణగారిపోతున్న అసంఖ్యాక నిరుపేద కష్టజీవుల రక్త మాంసాలపై ఆధారపడి విద్యావంతుడై, కులాసా జీవితం గడిపే ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహిగా పరిగణించాలి. మన సంస్కర్తలు అసలు ‘జబ్బు’ ఎక్కడుందో చూడరు. విగ్రహాల వల్ల లాభం లేదు. హిందువనీ, ముసల్మాన్‌ అనీ, క్రిస్టియన్‌ అనే పేర్ల చాటున ఆ మతాల పదఘట్టన కింద కకావికలమవుతున్న ప్రజా బాహుళ్యం... ధన సంచులున్న వాడి పాదాల కింద శాశ్వతంగా పడి నలిగి పోవడానికే తాము పుట్టామన్న భావనకు గురి కారాదు. విగ్రహాలు ఉంటాయో, ఊడతాయో, కులాలు మంచివా, చెడ్డవా ప్రశ్నలు మనకు అనవసరం. పేదల మనస్సుల్లో భావవ్యాప్తి జరిగిన మరుక్షణం, మిగతా కార్యాచరణను వారే పూర్తి చేస్తారు!’

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement