
చిన్ని మనసుల విజేత సుజాత
‘ఆటలో అరటిపండు’కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: కథలు... చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ రాయాలంటే..! అదో అక్షర యజ్ఞం. సరికొత్త ఆలోచనల పర్వం. అదీ చిన్నారులకు నచ్చేట్టు... మెదడుకు ‘ఎక్కేట్టు’... ఆసక్తి రేకెత్తించడమంటే అంత సులువు కాదు. సూటిగా... సుత్తి లేకుండా పదాల అల్లికలు అలా అలా అలల తీరులా సులువుగా సాగిపోవాలి. కాలక్షేపానికే కాకుండా... అంతర్లీనంగా వారికి మార్గనిర్దేశనం చేస్తూ... సన్మార్గంలో నడిపిస్తూ... స్ఫూర్తిని రగిలించాలి. అంతటి అద్భుతమైన శైలితో ప్రత్యేకత చాటుకున్న రచయిత డి.సుజాతాదేవి (60). ‘ఆటలో అరటిపండు’ కథల పుస్తకంతో చిన్నారుల మనసు గెలుచుకున్న సుజాత... ఈ ఏడాది ‘కేంద్ర సాహిత్య అకాడ మీ అవార్డు’నూ దక్కించుకున్నారు. బాలసాహిత్యంపై ఆమె చేస్తున్న కృషికి లభించిన గౌరవం ఇది. ఈ సందర్భంగా సుజాతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సంస్కృతీ, సాంప్రదాయాలు, నైతిక విలువలు, మంచి, చెడులు... పిల్లలు తమ ప్రవర్తనను ఎలా ఉంచుకోవాలి? క్రమశిక్షణతో తమను తాము ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకొంటూ ఎలా ముందుకు సాగాలి?... ఇవే సుజాత కథావస్తువులు. 1980 నుంచి పిల్లల కథలు రాశారు. అడవిలో జంతువుల మధ్య సంభాషణలతో కథ నడిపిస్తూ... అంతర్లీనంగా అనేక సామాజిక విలువలను బోధిస్తూ రాసిన ‘ఆటలో అరటిపండు’ పుస్తకంలోని కథలు చిన్నారులను ఎంతో ఆకట్టుకున్నాయి.
25కు పైగా రచనలు...
‘కాకి-కోకిల, డాక్టర్ కొక్కొరొకో, అందరం ఒక్కటే, పర్యావరణనాన్ని పరిరక్షించుకోవాలి’ వంటి పుస్తకాలతో పాటు స్ఫూర్తిదాయకమైన ‘సుజలాం సుఫలాం’ నవల ఆమె కలం నుంచి జాలువారినవే. 25కు పైగా ఆమె రచనల్లో 18 పిల్లలవే. మొత్తం 576 మంది రచయితలు ఈసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కోసం పోటీపడ్డారు. వారందరిలో సుజాతకే పురస్కారం దక్కడం విశేషం. నిజానికి 1970 నుంచే ఆమె కథలు వివిధ పత్రికలు, రేడియోలో వచ్చేవి. గేయాల రూపంలో కథలు చెప్పడం ఆమెకున్న మరో ప్రత్యేకత.
ఎన్నో పురస్కారాలు...
రెండుసార్లు ఎన్‌సీఈఆర్‌టీ, మాడభూషి మెమోరియల్, నన్నపనేని బాల సాహిత్య పురస్కారం, కోడూరి లీలావతి స్మారక బహుమతి వంటివెన్నో అవార్డులు సుజాత అందుకున్నారు.
ఏలూరు నుంచి వచ్చి.. బహుముఖ సేవలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సుజాత సొం తూరు. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశారు. ‘ఆహ్వానం’ తెలుగు పాహిత్య పత్రిక, ఆంధ్రమహిళా సభ పబ్లికేషన్స్ విభాగం, సీపీ బ్రౌన్ అకాడమీల్లో అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె భర్త డాక్టర్ నారాయణరావు ఆడిటర్. ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి పద్మజ చిత్రకారిణి. రెండో అమ్మాయి అంజలి సైకాలజిస్ట్. మూడో కూతురు శైలజ వ్యాపార రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె చిన్నకూతురు దగ్గర నల్లగొండలో ఉంటున్నారు.