
– సుజాతా వేల్పూరి
పి.శ్రీదేవి రాసిన నవల ‘కాలాతీత వ్యక్తులు’లోని ఇందిర చాలా వినూత్నమైన పాత్ర అని నేను అనుకుంటాను. నవల చదివిన వారు ఇందిరను అంత సులువుగా మర్చిపోలేరు. ఇంకా చె΄్పాలంటే ఎప్పటికీ మర్చిపోలేరు. రచయిత్రి ఆ పాత్రను అలా తీర్చిదిద్దింది. ‘ప్రకాశం, ఇది కాదు బతికే విధానం, ఇంతకంటే బాగా బతకాలి‘ అని ఇందిర చెప్పే డైలాగ్ విన్నాక ఇందిరను తల్చుకుంటే భయం వేస్తుంది. ఇందిరను తల్చుకుంటే ధైర్యం వస్తుంది. ఇరవయ్యేళ్ళ వయసుకు తగని బరువు మోసే ఆ పిల్ల ఒక్కచోట కూడా కన్నీళ్ళు పెట్టుకోదు. పైగా ‘నేను బలపడి, మరొకరికి బలమివ్వాలనుకునే తత్వం నాది‘ అని అనగలిగే సాహసి.
‘అందరం ఒక్కలాంటివాళ్లమే! అడుగు లేని పడవలం! ఏదో అలా ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం! అలాగని గడియ గడియకీ కాళ్ళు చాపి ఏడవటం నా వల్ల కాదు’ అంటుందామె. కృష్ణమూర్తి ఇందిరను పెళ్ళి చేసుకుంటున్నపుడు కూడా ‘పెళ్ళి నా జీవితంలో ఒక భాగం మాత్రమే! నీతో ఎంతదూరం రమ్మన్నా వస్తాను కానీ ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. నా అవసరాలను గౌరవించడం నేర్చుకుని నన్ను నా ఇష్టం వచ్చినట్లు ఊపిరి పీల్చుకోనివ్వు’ అని ఆ రోజుల్లోనే తన పర్సనల్ స్పేస్ తనకుండాలని చెప్తుంది.
‘నీ ఆయుర్దాయం ఎంతో అన్నిరోజులూ నిండుగా బతుకు! నిర్భయంగా బతుకు! రోజుకు పదిసార్లు చావకు. ఈ ప్రపంచంలోని వికృతాన్నీ, వికారాన్నీ అసహ్యించుకో! ఆశలూ, స్వ΄్నాలు, అనురాగాలు అన్నీ పెంచుకో! కానీ వాటికి శస్త్రచికిత్స అవసరమైనపుడు నిర్దాక్షిణ్యంగా కత్తిరించి అవతల పారెయ్’ అనే ఇందిర నేటికీ మనకు అవసరమైన పాఠం చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఇందిర స్త్రీలాగా ప్రవర్తించదు. సగటు మనిషిలాగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రవర్తనలో ప్రేమ, కోపం, ఆవేశం, లౌక్యం, దుఃఖం, నిరాశ, నిర్లిప్తత, స్వార్థం అన్నీ ఉంటాయి. అన్నీ జీవితం ప్రసాదించినవే! ‘పాతివ్రత్యం, అర్పించుకోడాలు... వంటి నాన్సెన్స్‌ని ఫెడీమని కాలితో తన్నే ఇందిర’ అని డాక్టర్ చంద్రశేఖర్ రావు గారు ప్రస్తావించే ఇందిర డ్రామా చెయ్యదు, సహజంగా ప్రవర్తిస్తుంది. అందులో స్త్రీలకుండే బలం కనిపిస్తుంది. అందుకే ఇందిర నాకిష్టం.
Comments
Please login to add a commentAdd a comment