ప్రక్షాళన | Funday story on trust on god | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన

Published Sun, Feb 2 2025 6:07 AM | Last Updated on Sun, Feb 2 2025 6:07 AM

Funday story on trust on god

‘ఆర్య బావ ఫోన్‌ చేశాడు నాన్నా, ఈవేళ మధ్యాహ్నం రెండుగంటల బస్సుకి వస్తున్నాడట!’బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుండగా అంకిత్‌ చెప్పిన విషయం వినగానే మనసులో చెప్పలేనంత అలజడి మొదలైంది. మేనల్లుడిని చూడబోతున్నానన్న ఆనందం ఒకవైపూ, జరిగిపోయిన సంఘటనల తాలూకు చేదు అనుభవాలు మరోవైపూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, నా ప్రమేయం లేకుండానే నా మనసు గతాన్ని తవ్వడం మొదలెట్టింది.పుట్టింటికొచ్చిన అక్క కాన్పు సవ్యంగా జరిగి బంగారంలాంటి మేనల్లుడు పుట్టాడని ఇంటిల్లిపాదీ సంతోషిస్తున్నంతలోనే పిడుగులాంటి వార్త! పొలంలో పనిచేస్తున్న బావని ఏదో విషప్పురుగు కుట్టడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మధ్య దారిలోనే ప్రాణాలు పోయాయని! నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు. అక్కైతే కబురు విన్న వెంటనే కట్టెలా బిగుసుకుపోయింది. అమ్మ శోకాలు మొదలెట్టింది. 

విషయం తెలిసి పరామర్శకి వచ్చిన చుట్టపక్కాలంతా ‘పుడుతూనే తండ్రి ప్రాణాలని మింగిన నష్టజాతకుడు’ అంటూ నా మేనల్లుడిని దూషిస్తుంటే వినలేకపోయాను. పసివాడిని హత్తుకుంటూ ‘ఆపండి! పసిపిల్లాడి మీద నిందవేయడానికి మనసెలా వస్తోంది’ అంటూ వాళ్ళందరి నోర్లూ మూయించింది నా భార్య సుజాత. ఆ తర్వాత నాతో ‘మీరు వెళ్లి ప్రయాణ ఏర్పాట్లు చూడండి’ అన్న సుజాత మాటలకు కర్తవ్యం తెలిసొచ్చి బయటకి కదిలేను. టాక్సీ మాట్లాడుకుని కుటుంబమంతా కలిసి బావ వాళ్ళ ఊరికి బయలుదేరాము.

భర్త శవాన్ని చూసి గుమ్మంలోనే కుప్పకూలిపోయింది అక్క. తనతో పాటే అమ్మ కూడా! అది చూసి, వయసులో చిన్నదైనా తనకి తానే పెద్దరికాన్ని ఆపాదించుకుని, బాధ్యతనంతా నెత్తిన వేసుకుంది సుజాత. దహన సంస్కారాలు పూర్తయ్యాక అక్కని, బాబుని తీసుకొని తిరిగొచ్చేశాము.బావ చనిపోయిన ఆరుమాసాలకి ‘రామం, ఒక్కమారు ఊరికి వెళ్లి మీ బావగారి ఆస్తి వ్యవహారాలు చక్కదిద్దుకుని రావాలిరా! ఆస్తిలో మీ బావ వాటాని నీ మేనల్లుడి పేరున రిజిస్టర్‌ చేయించుకునిరా’ అన్న అమ్మ మాటలకు ఆశ్చర్యపోయా!

‘అమ్మా! బావ వాళ్లకి ఆస్తిపాస్తులు ఏమున్నాయని మనం వాటాలు, పంపకాల గురించి మాట్లాడ్డానికి!’ అన్న నా మాటలకి, వెంటనే ‘అదేం మాటరా? ఇల్లూ, రెండెకరాల పొలమూ లేవూ! మా అత్తయ్యకి ఆయన ఒక్కడే మగసంతు కాబట్టి ఆ ఇంటి వారసుడిగా ఆ ఆస్తి మొత్తానికీ హక్కుదారు వీడేగా! మనం వెళ్లి అడగకపోతే మా అత్తగారు ఆస్తంతా మా ఆడపడుచులకి దోచిపెట్టేస్తుంది’ అంది అక్క.

‘అది చెప్పేదీ నిజమేరా, దాని ఆడపడుచులిద్దరూ ఉంటున్నది ఆ ఇంట్లోనే కాబట్టి మాయమాటలతో తల్లిని బుట్టలో వేసుకుని ఆస్తి కాజేయగలరు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే బయలుదేరు’ ఆర్డర్‌ వేసింది అమ్మ. మరుసటి రోజే బావ వాళ్లూరికి ప్రయాణమయ్యాను.

వాళ్ళింట్లో నన్ను సాదరంగా రిసీవ్‌ చేసుకున్నారు. అక్కడ కూర్చున్న మూడుగంటల్లో నా మనసు ఆ కుటుంబ స్థితిగతులని అంచనా వేస్తూనే వుంది. పెచ్చులూడుతున్న గోడలూ, పై పెంకుల మధ్యనుండి తొంగి చూస్తున్న మబ్బుతునకలూ, వాటిగుండా కిందకి జారుతున్న వానచినుకులూ, ఇంకా ఆ అక్కాచెల్లెళ్ళ చిరుగుల బట్టలూ.. ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనంలో బాలమిత్ర కథలో చదువుకున్న కుచేలుని దైన్యస్థితి కళ్ళెదుట నిలిచినట్టనిపించింది. ఉన్న ఆ రెండు ఎకరాల్లో పండుతున్న కొద్దిపాటి పంట ఆ ఇంటి జరుగుబాటుకీ, ఇంకా మంచాన ఉన్న బావ తల్లి వైద్యానికే అరకొరగా సరిపోతోందేమో!

భోజనాల అనంతరం ఆ పెద్దావిడ ‘కట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని పెళ్ళైన ఏడాదిలోపే పెద్దల్లుడు నా కూతురిని పుట్టింటికి పంపించేస్తే, రెండు మాసాల్లో డబ్బులు సమకూర్చి అక్కని కాపురానికి పంపుతానమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు’ అంటూ నాకు ధైర్యం చెప్పిన మీ బావ తొందరపడి వెళ్ళిపోయాడు. పాతికేళ్లు నిండిన చిన్నదాన్నేమో కట్నం ఇవ్వలేమన్న కారణంతో పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. నేను బతికుండగా దీని పెళ్లి చూస్తానో, లేనో’ అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. 

ఆ  మాటలకి ‘అధైర్యపడకండి. మీరనుకున్నవన్నీ తప్పకుండా జరుగుతాయి’ అంటూ ఓదార్చాను. బావ బాధ్యతలను పంచుకోని మాకు వాళ్ళ ఆస్తిలో హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదనిపించడంతో ఆ విషయం ఎత్తకుండానే సాయంత్రానికల్లా ఇంటికి తిరిగొచ్చేశాను. ఒట్టి చేతులతో నేనలా వెనక్కొచ్చేయడం అమ్మకి, అక్కకి బొత్తిగా నచ్చలేదు. సుజాత మాత్రం ‘మంచి పని చేశారు. ఏ దిక్కూలేని ఆ కుటుంబాన్ని బాధపెట్టడం మనకి శ్రేయస్కరం కాదు’ అంది.

రెండేళ్ళ తర్వాత మాకూ బాబు పుట్టాడు. అంతదాకా ‘బాబూ’ అని పిలుస్తున్న నా మేనల్లుడికి ‘ఆర్య’ అనీ, నా కొడుక్కి ‘అంకిత్‌ ’ అనీ నామకరణం చేసి, ఇద్దరినీ రెండు కళ్ళలా చూసుకోసాగాం. వాళ్ళిద్దరూ బావామరుదులే అయినప్పటికీ రామలక్ష్మణుల్లా ఉండేవారు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ నా ఒక్కడి జీతంతో ఇల్లు గడవడం కష్టమవుతుండడంతో కుట్టుపనులు చేస్తూ, చిన్న క్లాసు పిల్లలకి ట్యూషన్లు చెప్తూ చేదోడు వాదోడుగా నిలిచింది సుజాత. 

ఆర్య పదవ తరగతి ఫస్ట్‌ క్లాసులో పాసయ్యాడు. ఇంటర్లో కామర్స్‌ తీసుకుంటానన్న రోజున, అక్కయ్య ‘లెక్కల సబ్జెక్టు తీసుకుని ఇంజినీరింగు చేస్తే లక్షల్లో సంపాదన వుంటుంది. జీవితంలో త్వరగా పైమెట్లు ఎక్కొచ్చు’ అంటూ వాడిపై ఒత్తిడి పెట్టింది. ‘పిల్లలకి ఆసక్తిలేని చదువులని వాళ్ళపై రుద్దడం మంచిది కాదు అక్కయ్యా! వాడికిష్టమైన కామర్సు చదివి, ఆపైన బ్యాంకు పరీక్షలు రాసి, పెద్ద ఉద్యోగంలోనే స్థిరపడతాడులెద్దూ’ అంటూ నచ్చజెప్పి వాడిని కామర్సు గ్రూపులో చేర్పించాను.

ఆ తర్వాత రెండేళ్లకి అంకిత్‌ పదవ తరగతి పూర్తయింది. నాకు విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూర్లోని బడికి బదిలీ అయింది. పిల్లల చదువులూ, వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా కుటుంబాన్ని విజయవాడలోనే పెట్టి, నేనొక్కడినే వెళ్లాను. ఆర్యని డిగ్రీ కాలేజీతోపాటు బ్యాంకు పరీక్షల కోచింగ్‌ సెంటర్లోనూ చేర్చాను. అలాగే అంకిత్‌ని వాడి ఇష్టప్రకారం ఇంటర్‌ సైన్సు గ్రూపులో చేర్పించి, ఎంసెట్‌ కోచింగులో పెట్టాను. 

ఏడాదిన్నర కాలం ఏ సమస్యలూ లేకుండా గడిచిపోయింది. ఆ తర్వాత నేను తిరిగి విజయవాడకి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటుతో అమ్మ చనిపోవడం మా అందరికీ పెద్ద షాక్‌! దానికి మించిన దుర్వార్తని మరో ఆరునెలల్లో వినాల్సి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు.ఆ దుర్దినాన.. అల్మారా అంతా కిందా మీదా చేస్తున్న నన్ను చూసి ‘దేనికోసమండీ, అంతలా వెతుకుతున్నారు?’ అడిగింది సుజాత.

‘అంకిత్‌ ఇంజినీరింగ్‌ అడ్మిషన్‌ ఫీజుకి డబ్బులు తక్కువ పడుతున్నాయి. అవసరాలకెప్పుడూ ఆదుకునే షావుకారు, ఈమారు పెద్దమొత్తంలో వ్యవహారం కాబట్టి హామీ కింద ఇంటి దస్తావేజులు కావాలంటున్నాడు. వాటి కోసం వెతుకుతున్నాను’ అన్నాను.‘ఆ మధ్యెప్పుడో అత్తయ్యగారు, వదినగారు ఆ పత్రాలని తీసుకున్నారండీ. మళ్లీ ఇక్కడ పెట్టారో, లేదో! ఉండండి, వదినగారిని అడుగుతాను’ అని సుజాత అంటుండగానే అక్కడికి వచ్చిన అక్కయ్య ‘ఏమిటిరా, ఎన్నడూ లేనిది దేని గురించో ఒకటే హైరానా పడుతున్నారు?’ అడిగింది.

‘ఇంటిపత్రాల కోసం అక్కయ్యా ..’ అని చెబుతుండగానే ‘అవి నా పెట్టెలో భద్రంగా ఉన్నాయిలే గాని, వాటితో నీకేం పనిరా ఇప్పుడు?’ అక్కయ్య మాటలకి నా ప్రాణం లేచొచ్చింది.‘హమ్మయ్య, ఇంటి దస్తావేజులు ఎక్కడికీ పోలేదన్నమాట. అవి కనబడకపోయేసరికి కంగారేసింది అక్కా. నీ మేనల్లుడి ఇంజినీరింగ్‌ అడ్మిషన్‌ ఫీజు కోసం ఇంటిని షావుకారు వద్ద తాకట్టు పెట్టక తప్పడం లేదక్కా’ అన్నాను.

నా మాటలకి అక్కయ్య కళ్ళలో తారసలాడిన కలవరపాటు నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపైన కొద్దిసేపు అక్కయ్య ఏమీ మాట్లాడకపోవడంతో నాలో ఆందోళన పెరిగింది. ఆ తర్వాత మెల్లగా ‘అది కాదురా తమ్ముడూ, అమ్మ చనిపోయే కొద్ది మాసాల ముందు ఈ ఇంటిని నీ మేనల్లుడి పేరిట రాసింది. తండ్రిలేని పిల్లాడికి ఏ క్షణాన ఏ అవసరమొస్తుందోనన్న జాగ్రత్తతో అమ్మ అలా చేసిందిరా’ అన్న అక్కయ్య మాటలకి నేను, సుజాత దిగ్భ్రాంతి చెందాము.

‘అమ్మ అలా చేసిందా? ముందుగా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా..’ నా మాట పూర్తి కాకుండానే ‘ఏమోరా, అవన్నీ నాకు తెలియదు’ అనేసి అక్కయ్య వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోతుంటే నేనూ, సుజాతా చేష్టలుడిగిపోయాము. ఇద్దరి మనసుల్లోనూ అగ్నిపర్వతాలు బద్దలవసాగాయి! 

నా మేనల్లుడిని నా కొడుకుతో సమానంగానే కదా చూశాను. వాడికి తండ్రి లేని లోటు రానిచ్చానా? నేను గానీ, సుజాతగానీ ఎన్నడైనా అక్కని, ఆర్యని పరాయివాళ్ళుగా చూశామా? నా జీతమంతా ఈ కుటుంబం కోసం, పిల్లల చదువుల కోసమే కదా వెచ్చించాను. అమ్మకివన్నీ తెలియవా? పోనీ అమ్మకు ఆలోచన లేకపోయింది అనుకున్నా.. అక్కయినా అమ్మని వారించి ఉండాల్సింది కదా! 

సర్లే , జరిగిందేదో జరిగిందనుకుని సర్దిచెప్పుకుందామనుకున్నా, కనీసం ఇప్పుడైనా ఇంటిపత్రాలని తెచ్చిచ్చి ‘ఇల్లు ఎవరి పేరున ఉంటే ఏమిట్రా, వెళ్లి కుదువ పెట్టి డబ్బులు తీసుకురా’ అనాలి కదా అక్కయ్య! మరిదేమిటి, అలా  వెళ్ళిపోయింది? మనసంతా భారమవగా నిస్సత్తువగా మంచంపై కూర్చుండిపోయాను. నాకే ఇంత బాధగా ఉంటే, మెట్టినింట్లో ‘అందరూ నా వాళ్లే’ అనుకుంటూ నిస్వార్థంగా అందరితో కలిసిపోయిన సుజాతకు ఇంకెంత బాధగా ఉందో! 

ఆ ఆలోచనతో గభాల్న తలెత్తగా.. కళ్ళనీళ్ళతో కనిపించిన సుజాతని చూసి చలించిపోయాను. లేచి తన భుజం చుట్టూ చేతులు వేసి మంచంపై కూర్చోపెట్టాను. ‘బెంగపెట్టుకోవద్దు సుజా.. నా పీఎఫ్‌లో కొంత డబ్బుంది. అలాగే నా స్నేహితుడు మూర్తిని అడిగితే తప్పకుండా సాయం చేస్తాడు. నువ్వేం దిగులు పెట్టుకోకు’ అంటూ భరోసా ఇచ్చాను.

నా మాటలు వింటూనే సుజాత భోరున ఏడ్చేసింది. ఏ పరిస్థితుల్లో అయినా చలించకుండా, దృఢంగా ఉండే సుజాత అలా ఏడుస్తుంటే మరింత దగ్గరకి పొదువుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాను. దుఃఖభారం ఉపశమించే దాకా తనని అలాగే ఏడవనిచ్చాను. కొంతసేపటికి తేరుకున్న సుజాత ‘నేను బాధపడుతున్నది మనవాడి చదువు గురించి కాదండీ! అదేమంత పెద్దవిషయమని? నా నగలను కుదువపెట్టినా, లేదా వాటిని అమ్మేసినా ఆ అవసరం జరిగిపోతుంది. 

కాని, ఇన్నేళ్లుగా మనతోనే మసలుతున్న సొంత మనుషుల మనసుల్లో ఎటువంటి ఆలోచనలున్నాయో తెలుసుకోలేకపోయానే అని బాధేస్తోంది. మన అనుకున్నవాళ్ళే ఇంతలా మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానండీ! మనది కాని ఈ ఇంట్లో ఉండేందుకు నాకెంత మాత్రం మనస్కరించడం లేదు. మీతో పాటు వచ్చేస్తానండీ’ అంది దీనంగా.

‘అలాగే సుజా, ఇంజనీరింగ్‌ అడ్మిషన్‌ పూర్తిచేసి వాడ్ని హాస్టల్లో చేర్పించిన తర్వాత మనిద్దరం కలిసి ఊరు వెళ్ళిపోదాం. కాకపోతే నాదొక విన్నపం.. ఈ విషయాలను పిల్లల చెవిన వేసి నిష్కల్మషమైన వారి మనసుల్ని పాడు చేయొద్దు. దీన్ని ఇక్కడితోనే మర్చిపోదాం, ప్లీజ్‌’ అన్నాను తన రెండుచేతులూ పట్టుకుని. సరే అన్నట్టుగా తలూపింది సుజాత. ఆ తర్వాత అక్కకీ, నాకూ మధ్య మాటలూ, రాకపోకలూ ఆగిపోయాయి. పిల్లలు మాత్రం ఎప్పటిలాగే ఫోనుల్లో మాట్లాడుకుంటున్నారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆర్యని చూసేందుకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది.

‘మావయ్యా..’ అంటూ పాదాలను తాకిన ఆర్య కరస్పర్శకి ఆలోచనల నుండి బైటకొచ్చి వాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాను. ‘ఇన్నాళ్ళకి ఈ మావయ్యని చూడాలనిపించిందటరా’ అన్నాను కళ్ళు చెమ్మగిల్లుతుండగా.‘అదేం మాట మావయ్యా? ఎన్నోసార్లు నీ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చేయాలనిపించేది, కాని ఉద్యోగం తెచ్చుకునేదాకా నీ దగ్గరికి రావద్దని నువ్వు షరతు విధించావని అమ్మ గట్టిగా చెప్పింది. అందుకే నీ మాట దాటకూడదని చెప్పి ఇంతదాకా ఆగాను. బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుకి నేను సెలెక్టయినట్టుగా తెలియగానే ఆ మాట నీకు చెప్పాలని వచ్చేశాను మావయ్యా. మరో నెలలో ట్రైనింగ్‌కి వెళ్ళాలి’ అంటూ నా నోట్లో మైసూరుపాకు కుక్కాడు ఆర్య.

అదే ఊపులో వంటింట్లోకి వెళ్లి ‘అత్తయ్యా’ అంటూ సుజాతను రెండు చేతులతో చుట్టేశాడు. వాడి పట్ల సుజాతదీ మాతృవాత్సల్యమే కాబట్టి జరిగినవన్నీ మర్చిపోయి వాడిని దగ్గరికి తీసుకుంది.‘ట్రైనింగ్‌ పూర్తయాక పోస్టింగు విజయవాడలోనే ఇస్తారనుకుంటా. అప్పటికి మావయ్యక్కూడా విజయవాడకి బదిలీ అయిపోతే మళ్ళీ అందరం మునుపట్లాగే ఒక్కచోటే ఉండొచ్చు కదత్తయ్యా’కల్లాకపటం లేని వాడి మాటలకు మా కడుపు నిండిపోయింది.ఆ వేళ భోజనంలో అన్నీ తనకిష్టమైన ఆదరువులే ఉండడం చూసి ‘అత్తా, ఈ రుచి ఇంకెక్కడా దొరకదు’ అంటూ ఆవురావురని ఆరగించాడు. 

ఆ తర్వాత అంకిత్‌తో కలిసి ఊరు చూసేందుకు వెళ్తూ ‘మావయ్యా , ఇది మీకివ్వమని ఇచ్చింది అమ్మ’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్‌ కవరుని నా చేతిలో పెట్టాడు. నేనూ,  సుజాతా ఆశ్చర్యంతో ముఖముఖాలు చూసుకున్నాము. తెరిచి చూస్తే అందులో సీల్‌ చేసిన పెద్ద ఎన్వలప్, ఒక ఉత్తరం కనిపించాయి. ముందుగా ఉత్తరం తెరిచి చదవడం మొదలెట్టాను..‘తమ్ముడూ!  ఎన్నడూ లేనిది అక్క నుండి ఉత్తరం ఏమిటాని ఆశ్చర్యపోతున్నావు కదూ! నీ ఎదుట నిలబడి మాట్లాడేందుకు ముఖం చెల్లకే ఈ లేఖ. 

తండ్రిలేని ఆర్యకి భవిష్యత్తులో ఏదైనా లోటు జరుగుతుందేమోనన్న అర్థంలేని శంకతో, అంతకు మించిన ధనాశతో అమ్మని ప్రేరేపించి, చేయకూడని తప్పే చేశాను. బావ చనిపోయిన నాటినుండి నన్నూ, నీ మేనల్లుడినీ ఇంట్లో పెట్టుకుని సొంత తల్లిదండ్రుల్లా ఆదరించిన నీకూ, సుజాతకూ ఆజన్మాంతం రుణపడి ఉండవలసింది పోయి విశ్వాసహీనంగా ప్రవర్తించాను. ఆ పాపమే ఈనాడు నన్ను క్యాన్సర్‌ రూపంలో దహించేస్తోంది.’

‘క్యాన్సర్‌’ అన్న మాట చదువుతూనే కొయ్యబారిపోయాను. అది చూసి సుజాత గభాల్న నా చేతిలోని ఉత్తరం లాక్కుని పైకి చదివింది..‘నమ్మకద్రోహం చేసిన నన్ను, తోబుట్టువే కదాని మంచి మనసుతో నువ్వు  క్షమించేసినా,  పైనున్న ఆ భగవంతుడు శిక్షించక మానడుగా! బ్లడ్‌ క్యాన్సర్‌తో నాకు ఆ భగవంతుడు సరైన శిక్షే విధించాడు. అందుకు బాధ లేదు. కాని, నీ మేనల్లుడిని ఒంటరిని చేసి వెళ్తున్నానే దిగులు మాత్రం తొలిచేస్తోంది. ఇన్నాళ్ళూ తండ్రిలేని లోటు తెలీకుండా పెంచిన నువ్వూ , సుజాతా ఇకపై వాడికి తల్లి లేని లోటూ తీరుస్తారని ఈ జీవితానికి మిగిలిన ఊరట! 

ఈ ఉత్తరంతో పాటున్న మరో కవర్లో నీ పేరిట మార్పించిన ఇంటి దస్తావేజులున్నాయి. ఈ  చివరి క్షణాల్లోనైనా నా తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి సదా కృతజ్ఞురాలిని. చిన్న కోరిక తమ్ముడూ! నా  చివరి రోజులని మీ సమక్షంలో సంతోషంగా గడపాలనుందిరా! నా తప్పుల్ని మన్నించి నన్ను ఆదరిస్తారన్న కొండంత నమ్మకంతో నీ మేనల్లుడి వెనకాలే మరో బస్సు పట్టుకుని బయల్దేరుతున్నాను. కానీ మీకు నా మొహాన్ని చూపించే ధైర్యం చాలక మన కులదైవమైన వేణుగోపాలస్వామి కోవెలకి వెళ్తున్నాను. మిమ్మల్ని చూడాలని, మీ నీడన చేరాలని మనసు ఆరాటపడుతోంది. నాకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు కదూ! ఇట్లు  మీ అక్కయ్య!’ 

ఉత్తరంలో చివరి అక్షరాలు వింటూనే ఒక్క ఉదుటున వేణుగోపాలస్వామి ఆలయం వైపు వెళ్ళాను, నాతోపాటే సుజాత కూడా! అక్కడ మాకోసం ఎదురు చూస్తూ ధ్వజస్తంభం వద్ద నిలబడ్డ అక్కను చూసి పోల్చుకోలేకపోయాను. చిక్కిశల్యమైంది. మాకు కన్నీళ్లాగలేదు. మమ్మల్ని చూసి భోరుమని ఏడుస్తున్న అక్కయ్యను దగ్గరకు తీసుకున్నాం. ‘మహాపరాధం చేశాను. ఫలితంగా ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోతున్నాను’ అంటున్న అక్కయ్య నోటికి తన చేతిని అడ్డు పెట్టింది సుజాత.

‘మీకేం కాదు. సైన్సు చాలా అభివృద్ధి చెందింది. అన్ని జబ్బులనూ నయం చేయలేకపోయినా, తీవ్రతను తగ్గించి, ఆయుర్దాయాన్ని పొడిగించే మందులనైతే కనిపెడుతూనే వున్నారు. ధైర్యంగా వుండండి. పదండి ఇంటికి వెళ్దాం’ అంది సుజాత.‘అవును అక్కయ్యా! నీకేం కాదు’ అని నేనంటూండగానే అక్కయ్య సెల్‌ మోగింది. ఫోన్‌ తీసిన అక్కయ్య.. నిలబడే ఓపిక లేక అక్కడే మెట్లపై కూర్చుంది. ఫోన్‌ తెరపై‘డాక్టర్‌ సునీల్‌’ అన్న పేరు కనబడగానే ఆత్రంగా ఆ ఫోన్‌ అందుకుని ‘డాక్టర్‌ గారూ! మా అక్కయ్య ఆరోగ్యం ఎలా వుందో వివరంగా చెప్పండి ప్లీజ్, నాకు చాలా కంగారుగా వుంది’ అన్నాను.

‘మీ అక్కయ్య టెస్టు రిపోర్టులని నిన్ననే మరో స్పెషలిస్ట్‌కి చూపించాం. ఆయన మీ అక్కయ్యకి వచ్చింది బ్లడ్‌ క్యాన్సర్‌ కాదనీ, కేవలం బ్లడ్‌ డిజార్డర్‌ మాత్రమేనని కచ్చితంగా చెబుతున్నారు. అయినా చివరి తీర్పు కోసం ఒక్కసారి మీ అక్కయ్యని ముంబై క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి తీసుకెళ్ళి, మరోమారు బోన్‌ మ్యారో టెస్ట్‌ చేయిస్తే మంచిది’ చెప్పాడు డాక్టర్‌. 

ఆ మాట వింటూనే ‘మా చెవుల్లో్ల పాలు పోశారు డాక్టర్‌ గారూ! రేపే ముంబైకి తీసుకెళ్ళి పరీక్షలు చేయిస్తాను. థాంక్యూ’ అని ఫోన్‌ పెట్టేసి, ‘చూశావా అక్కయ్యా! నీకే జబ్బూ లేదు. అనవసరంగా భయపడిపోయి మమ్మల్నీ భయపెట్టావు’ అన్నాను హాయిగా నవ్వేస్తూ.‘పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. బహుశా, ఇదంతా నా మనసుని ప్రక్షాళనచేసి, నన్ను మీ వద్దకి చేర్చేందుకు ఆ జగన్నాటక సూత్రధారి ఆడించిన నాటకమేమో!’ అంటూ రెండు చేతులూ ఎత్తి భగవంతునికి మోకరిల్లింది అక్కయ్య. ఆమె మాటలకి బలం చేకూరుస్తున్నట్లుగా అప్పుడే గుళ్ళో గంట మోగింది. 

‘శుభం! సాక్షాత్తూ ఆ వేణుగోపాలస్వామే అభయమిచ్చాడు, ఇంకేం భయం లేదు’ అన్న సుజాత మాటలకి అందరి మనసుల్లోని ఆందోళనా మటుమాయమవగా ఆనందంగా ఇంటికి బయల్దేరాం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement