‘నేనింకా కలలు కంటున్నాను
నేనింకా నన్ను నేను తొలుచుకుంటున్నాను
నేనింకా అనుక్షణం దహనమవుతున్నాను
నేనింకా నిరంతరం మునిగి తేలుతున్నాను
పద్యం రాసిన ప్రతిసారీ
నేనిప్పటికీ భస్మమై మళ్లీ రూపొందుతున్నాను’’
– దేవిప్రియ
కవిత్వం కోసం తపన చెంది, దహించుకుపోయి, ‘గాలిరంగు’ల మూలాల్ని తెలుసుకుని, నిరంతరం కవిత్వమైపోగల మనిషి ‘దేవిప్రియ’. తన కవిత్వాన్ని చదరంగపు ఆటతో పోల్చుకుంటూ, ‘అక్షరాలు దేని గడిలో అవి పడిపోతాయి’ అంటూ, ‘గణితం, రసాయనం, అలంకారం కలిసిన ప్రతిసారీ ఒక నూతన పద్యం పుడుతుంది’ అంటూ తన కవితా ప్రక్రియ రహస్యాన్ని తాను తెలుసుకుని ఆవిష్కరించగల సత్తావున్న కవి దేవిప్రియ. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును పునాదిగా, భవనంగా, శిఖరంగా భావించుకుని మూడింటినీ ముద్దాడి రాగల త్రి‘కాలజ్ఞుడైన’ కవి అతను. అన్ని కాలాలలోకీ అలవోకగా ప్రయాణం చేయగల అనితర సాధ్యుడైన కవి.
కవిగా దేవిప్రియ ప్రయాణం మొదలైంది 60లలో. చిన్ననాడు పాఠశాల గురువులే పునాది గట్టిగా వేశారు. కళాశాలలో ‘కరుణశ్రీ’ దగ్గర నేర్చుకున్న పాఠాలు ఛందస్సు మీద కూడా గట్టి పట్టునీ, భాషా సంపదనూ అందించాయి. నేనూ, దేవిప్రియ యిద్దరం ఎ.సి. కాలేజీలో సహాధ్యాయులం కావటం వలన కవిగా ఆయన తొలి అడుగులను దగ్గర నుంచి చూశాను. రెండు మూడేళ్లు ఇద్దరం కలిసి నడక నేర్చుకున్నాం. ఆ నడకలోనే అర్థమైంది దేవిప్రియ చూపు లోతైనదని. బి.ఎ. మొదటి సంవత్సరంలో నేనూ, బీనా తరగతి గదిలో చేసే అల్లరిని నిశ్శబ్దంగా గమనించే దేవిప్రియ – అప్పటికింకా ఖాజా హుస్సేన్‌గానే మాకు తెలుసు – రెండవ సంవత్సరంలో ఒక ఛందోబద్ద కావ్యాన్ని, తన చేతిరాతతో ఉన్నదాన్ని నా చేతిలో పెట్టి చదవమన్నాడు. దేవిప్రియ కలం పేరుగా అప్పటికే పెట్టుకున్నాడు. రోజూ క్లాసులో ప్రశాంతంగా చిరునవ్వులు చిందించే ఈ పిల్లవాడికి ఇంత శక్తి సామర్థ్యాలున్నాయా అని ఆశ్చర్యపోయాం. ఇతను పెద్దయ్యాక తప్పక నారాయణరెడ్డిగారంతటి కవి అవుతాడు, అప్పుడు మనం ఇతని ఆటోగ్రాఫ్ కోసం పరిగెత్తాలి కదా అనుకున్నాం. ఇప్పుడే ఆటోగ్రాఫ్ తీసుకుందామా అని దురాశపడ్డాం.
మూడో ఏడాది దేవిప్రియ సుగమ్‌బాబుని తీసుకుని మా ఇంటికొచ్చాడు. అతని వెనకే కిరణ్‌బాబు. ఆ తర్వాత కమలాకాంత్‌ని పరిచయం చేశాడు. మన ఐదుగురం కలిసి కవితా సంకలనం ఒకటి తీసుకొద్దామన్నాడు. నాక్కాస్త భయం వేసినా సరేనన్నాను. ఆ వేసవి సెలవుల్లో ‘యుగ సంగీతం’ పైగంబర కవుల పేరుతో ప్రచురించాం. పరుచూరి రాజారాం ఆవిష్కరించారు. ఆ రోజులు చాలా సంచలనాలతో గడిచాయి. ఒకవైపు శ్రీకాకుళోద్యమంలో నా గురువులు, స్నేహితులు అమరులవుతున్నారు. ఇంకోవైపు, శ్రీశ్రీ షష్టిపూర్తి. ఇంకొన్ని నెలలకు విరసం ఆవిర్భావం. వీటన్నిటినీ నేనూ, దేవిప్రియ, సుగమ్‌బాబు కలిసి పంచుకున్నాం. మా ఇంట్లోని చిన్న లైబ్రరీ గదిలో గంటలు, గంటలు కరిగిపోయేవి మాటలతో, మౌనాలతో. విరసం సభలకు ఖమ్మం కూడా కలిసే వెళ్లాం. ఆ తర్వాత దేవిప్రియ మద్రాసు వెళ్లిపోయాడు. మళ్లీ ఎన్నో సంవత్సరాలకు 1985లో అనుకుంటా హైదరాబాద్‌లో కలిశాడు. చిన్నప్పటిలానే ఆప్యాయంగా నవ్వుతూ ‘‘ఏరా ఎలా వున్నావు’’ అని పలకరించేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది.
అప్పటికే దేవిప్రియ చాలా సాధించాడు. కవిగా ఎంతో పేరు. ‘అమ్మచెట్టు’ వంటి గొప్ప సంకలనం. ‘ప్రజాతంత్ర’ పత్రికకు సంపాదకుడిగా తన విలక్షణ శైలిని అందరికీ పరిచయం చేశాడు. శ్రీశ్రీని ఆత్మకథ రాయటానికి ఒప్పించటం, ఆయనతో వేగటం, రాయించి సంచలనాలను తట్టుకుని నిలబడటం మామూలు పని కాదు. అనంతమైన ఓరిమి దేవిప్రియలో ఉంది. దానితో పాటు అంతులేని అసహనం కూడా ఉంది. ఐతే ఎక్కడ ఎప్పుడు దేనికోసం ఓర్పు వహించాలో, ఎక్కడ ఎప్పుడు దేనికోసం అసహనం ప్రదర్శించాలో తెలుసుకునే వివేకం కూడా ఉంది. ఆ వివేకమే అతని జీవితాన్ని నడిపించిందనిపిస్తుంది నాకు.
‘ఉదయం’ వార్తాపత్రికలో కొన్నేళ్లపాటు రన్నింగ్ కామెంటరీ నిత్య నూతనంగా నడిపించటానికి సమాజం, రాజకీయాల పట్ల ఎంత అవగాహన ఉండాలి! ప్రజల పక్షమే నిలబడే తన రాజకీయ అవగాహనను, సామాన్య ప్రజలకు హాయిగా అర్థమయ్యేలా, వ్యంగ్యంగా, చురకలతో, చెణుకులతో, అతి చిన్న రూపంలో యిమిడ్చి అందించటం ఎంత కష్టమైన పని! ఆ పనిని సునాయాసంగా, ఇష్టంగా చేశాడు దేవిప్రియ. కొన్ని లక్షల మందిని కొన్నేళ్లపాటు ప్రతిరోజూ ఆలోచింపజేశాడు. దీనితోపాటు అద్భుతమైన పాటలు, కవితా సంకలనాలు, సినిమా ప్రయత్నాలు – తాను నిదానంగా ఉన్నట్టు కనిపిస్తూనే జీవితాన్ని పరిగెత్తించినవాడు దేవిప్రియ.
‘నీటిపుట్ట’ నుంచీ యెదురుచూస్తున్నాను. చివరకు ‘గాలిరంగు’కి అకాడెమీ అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిందంటే అవార్డుకి గౌరవం తెచ్చే రచయితల జాబితాలోనివాడు దేవిప్రియ. ఎలాంటి కవిత్వం దేవిప్రియది. ఎంత విశాలమైనది అతని కవితా దృక్పథం.
‘నాకు
ఆస్ట్రేలియా అబోరిజనుల
ఆదిమూలాలు కావాలి
దండకారణ్య సంతాన సంకేతాల
అంబుల పదునూ కావాలి
నాకు
పురాణ పురుషుల
పుట్టు పూర్వోత్తరాలు కావాలి
మానవ వికాస వనంలో
పురివిప్పి ఆడిన వసంత యామినుల
చెరిగిపోని పాదముద్రల జాడలూ కావాలి
నాకు
కరాచీ భూగర్భ
మురుగు సొరంగాలలో మునకలేస్తున్న
నిరుపేద ముస్లిముల విముక్తీ కావాలి
స్వాతంత్య్రం సాక్షిగా ఇంకా
తలమీద మానవ మలం మోస్తున్న
అణగారిన భారత హైందవ సంతానం
కళ్లనిండా ఆత్మగౌరవ ఆనందమూ కావాలి.
నాకు సకల జనుల సమస్త జాతుల
శాంతీ కావాలి
శాంతి కోసం
అనివార్యంగా జరిగే యుద్ధమూ కావాలి.’
శాంతిని, యుద్ధాన్ని నిరంతరం తన హృదయంలోంచి కవిత్వంలోకి అనువదించి మనకు యుద్ధం మీద, శాంతి మీద కూడా ప్రేమ కలిగేలా చేస్తున్న కవి దేవిప్రియ. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు దేవిప్రియకు ప్రకటించిన వేళ ఆయన మిత్రులందరూ ఆయన కంటే ఎక్కువగా ఆయన సహచరి రాజ్యలక్ష్మిని తల్చుకుంటారు. ఆమె ఉంటే ఆ సంబరమే వేరు. కానీ ఈ సంబరం తెలుగు కవిత్వానిది. కేవలం దేవిప్రియది కాదు. అతని మిత్రులదీ కాదు.
- ఓల్గా
యుద్ధం చేస్తూ శాంతిని కోరే కవి
Published Mon, Dec 25 2017 2:07 AM | Last Updated on Mon, Dec 25 2017 3:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment