కొత్త సందర్భంలో రాయలసీమ కథ
ఏ సామాజిక సందర్భంలో పుట్టిన సాహిత్యం ఆ సామాజిక ఉద్యమానికే వెన్నుదన్నుగా నిలిచిన క్రమమే మనకు తెలుసు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పుట్టిన రాయలసీమ సాహిత్యం, అదే సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకిస్తూ సాగడం మన సమాజంలోనే ఒక కొత్త సందర్భం!
జనవరి 23, 24 తేదీలలో రాయలసీమ మహాసభ, రాయలసీమ అస్తిత్వ రచయితల వర్క్‌షాపును నిర్వహించింది. అనంతపురంలో రెండు రోజులు నాలుగు పెడలు( విభాగాలు)గా జరిగిన ఈ వర్క్‌షాపులో సమైకాంధ్య్ర ఉద్యమ సందర్భంలో వచ్చిన రాయలసీమ సాహిత్యం గురించి విశ్లేషించినారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో బైటపడిన రాయలసీమ ఆకాంక్షలు కథ, కవిత్వం, పాట, వ్యాసం అనే ఈ నాలుగు ప్రక్రియలలోకి కొత్త వస్తువుల్ని ఎట్లా ప్రవేశపెట్టగలిగాయో పరిశీలించినారు. ఈ వర్క్‌షాపునకు తెలంగాణ నుండి గోరటి వెంకన్న, అంబటి సురేంద్ర రాజు, సిద్ధార్థ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకావడం విశేషం!
ఏ సామాజిక సందర్భంలో పుట్టిన సాహిత్యం ఆ సామాజిక ఉద్యమానికే వెన్నుదన్నుగా నిలిచిన క్రమమే మనకు తెలుసు. కానీ, సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో పుట్టిన రాయలసీమ సాహిత్యం, అదే సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకిస్తూ సాగడం మన సమాజంలోనే ఒక కొత్త సందర్భం!
కాదేదీ ఒక స్థిర బిందువు అని బాలగంగాధర తిలక్ అన్నట్లూ- కాలంతోపాటు ప్రాంతీయ అస్తిత్వాలూ, వాటి పరిధులూ మార్పుకు లోనవుతుంటాయి. ఈ చారిత్రక అవగాహన వల్లే రాయలసీమ రచయితలూ మేధావులూ ప్రత్యేక తెలంగాణను సమర్థించినారు. 1800 సంవత్సరంలో నిజాం ప్రభువు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలను ఇంగ్లీషు వారికి దత్తత ఇవ్వకుండా ఉండి ఉంటే, దత్త మండలాలని పిలువబడిన నేటి రాయలసీమ అసలు ఉనికిలోనే ఉండేది కాదుగదా అని గుర్తు చేసినారు. 1953లోనే మనం ఆంధ్ర రాష్ట్రం కోసం లక్షలాది మన తెలుగుసోదరులను కర్ణాటకలోనూ, తమిళనాడులోనూ వదిలేసి రాలేదా? అని ప్రశ్నించినారు.
సుగాలీ కుటుంబం, ఇరువురు యాత్రికులు, భగీరథ ప్రయత్నము... వంటి కథలతో 95 ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్న రాయలసీమ ప్రాదేశిక కథలో వెనుకబాటుతనం ప్రధానాంశం అయితే, రాయలసీమ కొత్త సందర్భం కథలో ఆ వెనుకబాటుతనానికి వెనకాల పనిచేసిన రాజకీయ కారణాలు ప్రధానాంశం.
డా॥కె.సుభాషిణి కథ ‘ధృతరాష్ర్టుని కౌగిలి’ ధ్వన్యాత్మకంగా సాగుతుంది. ఈ కథలో త్రిలింగ రాజ్యం 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కూ, మొరుసునాడు రాయలసీమ ప్రాంతానికీ మారుపేర్లు. త్రిలింగ రాజ్య సామంతరాజులందరూ రాయలసీమకు చెందిన వీరశేఖర మహారాజును తమ నాయకునిగా ఎన్నుకుంటారు. తమప్రాంతం వాడైన వీరశేఖర మహారాజు పట్టాభిషేకాన్ని చూడటానికి రాయలసీమ ప్రజలు కోస్తాంధ్రకు బయలుదేరతారు. కోస్తాంధ్రలో అడుగుపెట్టినప్పటి నుంచి, కోస్తాంధ్రకూ రాయలసీమకూ మధ్య జీవన ప్రమాణాలలో గల అంతరం అనుభవానికి వచ్చి విభ్రాంతికి లోనవుతారు. కోస్తాంధ్ర ఎద్దులు పచ్చగడ్డి మేస్తుంటే, రాయలసీమ ఎద్దులకు ఎండుగడ్డే గతి. అక్కడ పూడిక తీసిన చెరువులు జలకళతో మెరుస్తుంటాయి. ఇక్కడ అతీగతీ లేని చెరువులు ఎండి పాడైపోయి ఉంటాయి. అందరూ త్రిలింగ దేశ ప్రజలమే కదా! కాని కోస్తాంధ్రులు చేసుకున్న పుణ్యమేమి? రాయలసీమ చేసుకున్న పాపమేమి? అనే ప్రశ్నలకు ఈ కథలో రెండు సమాధానాలు లభిస్తాయి. ఒకటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు తీసుకొచ్చిన తరువాత రాయలసీమకు ఇచ్చిన నీటి వాగ్దానాలను వమ్ముచేయడం. రెండవది, కోస్తాంధ్రలో ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 123. రాయలసీమలో 52 మాత్రమే! ఈ నంబరు గేము నేపథ్యంలో రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు కోస్తాంధ్ర ఎమ్మెల్యేల మీద ఆధారపడక తప్పని రాజకీయ పరిస్థితి!
జి.వెంకటకృష్ణ కథ ‘పోగొట్టుకున్నది’ రాయలసీమ నీళ్ల కోసం జరగాల్సిన ఉద్యమం హైదరాబాదు కోసం జరగడాన్ని తప్పుపడుతుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణాపెన్నార్ డ్యాముకు అప్పటి కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపి ఉన్నింది. ఆ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు 400 టీఎంసీల నీళ్లు లభిస్తాయి. 40 లక్షల ఎకరాలకు ఆరు తడి నీళ్లు అందుతాయి. అటువంటి సందర్భంలోనే కోస్తాంధ్రులు తెలివిగా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం లేవదీసినారు. ఆ ఉద్యమాన్ని రాయలసీమ పెద్దలైన పప్పూరు రామాచార్లు వంటి వారు వ్యతిరేకించినారు. తమతో పాటు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కలిసివస్తే కృష్ణానీళ్ల మీద రాయలసీమకే మొదటి హక్కు ఉంటుందని నమ్మబలికినారు. శ్రీబాగ్ ఒడంబడిక మీద సంతకాలు కూడా చేసినారు. కానీ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందేమిటి? కృష్ణా పెన్నార్ డ్యాముకు బదులు నాగార్జునసాగర్ కట్టుకున్నారు. నాగార్జునసాగర్ నీళ్లు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు పరిమితమయినాయి.
సమైక్య ఉద్యమకారులు తుంగభద్రలోకి నడుంలోతున దిగి నినాదాలు ఇస్తుండటంతో ఈ కథ మొదలవుతుంది. చయ్ ఛోడేంగే నయ్ ఛోడేంగే హైదరాబాద్ నయ్ ఛోడేంగే అని వారి నినాదం. ఆ దావలో ఒక రైతు పోతూ పోతూ ఆగి, సమైక్య ఉద్యమ లీడర్‌కి కొన్ని ప్రశ్నలు వేస్తాడు.
‘ఈ తుంగభద్ర నీళ్లు యాటికి పోతాయన్నా?’
‘కృష్ణానదిలోకి పోతాయి’
‘కృష్ణానది నుంచీ..?
‘శ్రీశైలం డ్యాంలోకి పోతాయి’
‘శ్రీశైలం నుంచీ యాటికి పోతాయన్నా’
‘నాగార్జునసాగర్‌లోకి పోతాయి’
‘నాగార్జునసాగర్ నుంచీ..?’
‘కాలువల్లో పడి పొలాల్లోకి పోయి పంటలు పండిస్తాయి’.
‘ఎవరి పంటలు?’
‘మన సమైక్యాంధ్ర రైతులవి’
‘ఆ రైతుల్లో మన రాయలసీమోల్లు ఎవురన్నా ఉండారా అన్నా?’ - అయోమయంలో పడతాడు ఆ సమైక్యాంధ్ర లీడరు. ‘యాడో ఉండే హైదరాబాద్‌ను నయ్ ఛోడేంగే అంటాండారే! మల్ల ఈడుండే నీల్లని మాత్రం హమ్ కైసే ఛోడేంగే అన్నా?’
తుపాకీ గుండు మాదిరి తగిలే ఈ ముగింపు వాక్యమే పాఠకునికి కళ్లు తెరిపిస్తుంది.
డా॥ఎం.హరికిషన్ కథ ‘జై తెలంగాణ’. వీరేశం స్కూలు హెడ్మాస్టరు. ఉరుకుందప్ప అతని మిత్రుడు. ఇద్దరు ఒక పెళ్లి కార్యం మీద బైరాపురం పోతారు. కెనాల్ ఎగువన మిరప, పత్తి పంటలతో భూములు కళకళలాడుతుంటాయి. ఆ భూములు తమ ఊరి వాళ్లవే అనీ, గుంటూరోళ్లు గుత్తకు చేస్తున్నారనీ చెప్పాడు ఉరుకుందప్ప. మా ఊరోళ్లు ఉత్త సోమరిపోతులు అని కూడా చెప్తాడు. కెనాల్ దిగువన పంటలు వాడిపోతుంటాయి. కెనాల్ ఎగువన ఉన్న కాలనీ వాళ్ళు అధికారుల నోళ్లల్లో డబ్బులు కొట్టి, రాత్రిళ్లు పైపులు పెట్టి నీళ్ళు లాగేసుకుని మంచిపంటలు పండించుకుంటారనీ, అందుకే కెనాల్ దిగువన పంటలు ఎండిపోయినాయనీ తెలుస్తుంది. నీటి రుచి తెలియనివాడు నీటిదొంగగా మారలేడు. సమైక్యాంధ్ర వైపు నిలవాల్సిన రచయిత తెలంగాణ పక్షం ఎందుకు వహించినాడో కూడా ఇక్కడ అర్థమవుతుంది.
జి.ఉమామహేశ్వర్ ‘జలపాఠం’ మాంత్రిక వాస్తవికత రూపంతో నడిచిన కథ. ఇందులో హఠాత్తుగా కృష్ణా నది మాయమైపోతుంది. ఈ నది మాయమైపోయినప్పుడు, రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణల రాజకీయాలూ, మనోభావాలూ ఎట్లుంటాయి అనేది కథ. రాయలసీమ రాజకీయాలకు వస్తే - జిల్లాకు 100 టీఎంసీలు (1972 వ్యవసాయ ప్లానింగ్ కమిషన్ ప్రకారం) ఇవ్వవలసిన ప్రభుత్వం ఐదు, పదీ టీఎంసీలతో రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ చెంచాడు నీళ్ల కోసం రాయలసీమలో - జిల్లాకూ జిల్లాకూ మధ్య నీటి యుద్ధాలు. ఒక నియోజకవర్గంలోనే మండలాల మధ్య నీటి యుద్ధాలు. ఈ నీటి యుద్ధాలలోనే తమ ప్రాంతం కోసం తొడగొట్టి ఓట్లు దండుకునే రాజకీయ నాయకులు కృష్ణానది మాయంకాగానే అయోమయంలో పడతారు. కథ చివర కృష్ణానది పోయి పోయి సరస్వతిని చేరుతుంది. ఎందుకొచ్చావ్ కృష్ణా అని సరస్వతి ఆప్యాయంగా అడిగితే - మనం ఉన్నాం కాబట్టి ఈ మనుషులు జీవిస్తారనుకున్నాను. కానీ మనకోసమే గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్నారు. అందుకే నీ మాదిరి అంతర్వాహినిగా మిగిలిపోతాను అంటుంది.
మల్లెల నరసింహమూర్తి, సడ్లపల్లి చిదంబర రెడ్డి వంటివారు కొత్త సందర్భం కవిత్వం రాస్తున్నారు. సురేశ్, రామాంజనేయులు వంటి వారు కొత్త సందర్భం పాటలు రాస్తున్నారు. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం, ఎస్.ఎం.బాషా, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణస్వామి వంటివారు కొత్త సందర్భం వ్యాసాలు రాస్తున్నారు. వీరు కాలపు మాళిగలో ఇరుక్కున్న రాయలసీమ చరిత్రనీ, సంస్కృతినీ, తవ్వితీస్తున్నారు. వీరికి రాయలసీమ మహాసభ అక్షర జేజేలు పలుకుతూ ఉంది.
బండి నారాయణస్వామి
8886540990