నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు | Kendra Sahitya Akademi Bal Sahitya Award Chandrasekhar Azad | Sakshi
Sakshi News home page

నా జీవితం.. ‘అందమైన పూలతోట’ కాదు

Published Mon, Jun 17 2024 4:12 AM | Last Updated on Mon, Jun 17 2024 4:12 AM

Kendra Sahitya Akademi Bal Sahitya Award Chandrasekhar Azad

జీవిక కోసం ఎన్నో ఉద్యోగాలు  

చివరకు బాలసాహిత్యమే ప్రపంచమైంది 

ఆ నవలతోనే జీవితానికో మలుపు  

కమర్షియల్‌ కాదలచుకోలేదు 

సీరియస్‌ సాహిత్యాన్నే రాశాను 

కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డు గ్రహీత పి.చంద్రశేఖర అజాద్‌ 

తెనాలి: ‘నా జీవితం అందమైన పూలతోట కాదు.. జీవనం కోసం ఎన్నెన్నో చిరుద్యోగాలు చేశాను. అన్నింటిలోను అత్తెసరు సంపాదనే. చివరకు రచనా వ్యాసంగమే బాలసాహిత్య ప్రపంచంలో నిలబెట్టింది. గుర్తింపువచ్చాక వెనుదిరిగి చూసుకోలేదు. కథలు, నవలికలు, నవలలు, టెలీఫిలింస్‌తో బిజీ అయ్యాను. కమ్యూనిస్టు నేపథ్యం ఉండటంతో కమర్షియల్‌ కాదలచుకోలేదు. సీరియస్‌ సాహిత్యాన్నే చేశాను. 

సామాజిక సమస్యలతో కూడిన ఇతివృత్తాలతోనే సాహిత్య సృజన చేశాను. ఇప్పుడీ అవార్డుకు ఎంపికవటం సంతోషంగా ఉంది..’ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ బాలసాహితీవేత్త, నవలా రచయిత, కాలమిస్ట్, టెలీఫిలింస్‌ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రచ­యి­త పి.చంద్రశేఖర ఆజాద్‌ స్పందన ఇది. అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.  

చంద్రశేఖర అజాద్‌ స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల గ్రామం వెల్లటూరు. 1955 మే 24న జన్మించారు. తండ్రి పమిడిముక్కల లక్ష్మణరావు. అప్పట్లో కమ్యూనిస్టు యోధుడు. తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకెళ్లారు. కొడుక్కి స్వాతంత్య్రయోధుడు చంద్రశేఖర అజాద్‌ పేరు పెట్టారు. 

అజాద్‌కు ఏడేళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుంటూరులోని సీపీఎం కార్యాలయం ఆయన పేరుతోనే ఉంటుంది. రేపల్లెలో ఇంటర్‌ వరకు చదివిన అజాద్‌.. ఆ మరుసటిరోజే తెనాలిలోని బావగారి హోటల్లో పనికి కుదిరాడు. ఏ ఉద్యోగంలోను ఎక్కువకాలం చేయలేదు. నవభారత్‌ టొబాకోలో కొంతకాలం, తర్వాత మరికొన్నింటిలో పనిచేశారు. 

అపరాధ పరిశోధన.. నిలబెట్టింది  
ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే తనలోని భావాలను అక్షరాల్లోకి మార్చే ప్రయ­త్నం చేశారు అజాద్‌. వాటిని అప్పటి దినపత్రికలకు పంపేవారు. ఆరోజు­ల్లో ‘అపరాధ పరిశోధన’ మాసపత్రిక వచ్చేది. తన కథలు, నవలికలు పంపుతుండేవారు. ‘ఆ పుస్తకమే తనను రచయితగా నిలబెట్టింది..’ అని అజాద్‌ గుర్తుచేసు­కున్నారు. ‘ఆ పత్రికకు 16–17 నవలికలు, 40కి పై­గా కథలు రాశాను. అప్పటో­్లనే కథకు రూ.75, నవలికకు రూ.125 నుంచి రూ.150 చొప్పున ఇచ్చేవా­రు. 

చేసే ఉద్యోగంతో నెలకు రూ.180 వరకు వచ్చే­వి. అమ్మ విజయలక్ష్మి వాళ్లంతా తెనాల్లో ఉండే­వా­రు. ఆ డబ్బులు తీసుకుని అమ్మను చూడ్డానికి వెళే­్లవాడిని..’ అని చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ట్రే­­డింగ్‌ కార్పొరేషన్‌లో చేరారు. రోజుకు రూ.10 వే­త­­నం. సెలవులొస్తే అది కూడా ఉండేది కాదు. 19­74లో పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు. 1982 వర­కు నెలకొచ్చే వేతనం ఏనాడు రూ.180కి మించలే­దు.  

అందమైన పూలతోటకు మొదటి బహుమతి  
1983లో ఒక దినపత్రిక ఆధ్వర్యంలో నడుస్తున్న బాలల మాసపత్రిక బాలల నవలల పోటీని ప్రకటించింది. ‘అందమైన పూలతోట’ అనే నవలను రాసి పంపారు. తెలుగు బాలసాహిత్యంలో ఒక ప్రయోగాత్మకమైన ఆ నవలకు ప్రథమ బహుమతి, ఆరుద్ర భార్య రామలక్ష్మి రాసిన నవలకు ద్వితీయ బహుమతి వచ్చాయి. ‘మహదానందం కలగటమే కాదు.. ఆ నవలతో నా జీవితం మలుపు తిరిగింది..’ అన్నారు అజాద్‌. ‘అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి రచయితలు సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. 

నాలాంటి వర్ధమాన రచయితలకు ఖాళీలేదని అర్థమైంది. బాలసాహిత్యంలో అవకాశం ఉందనిపించటంతో అప్పట్నుంచి పిల్లలకోసం అంకితమయ్యాను..’ అంటారు అజాద్‌. విజయవాడ నుంచి వెలువడే ‘స్వాతి’ మాసపత్రికలో అవకాశమిచ్చారు. ‘మా హృదయం’ పేరుతో పదేళ్లలోపు పిల్లలకు అమ్మ, నాన్నతో మొదలుకొని వారికి సంబంధించిన మొత్తం 50 అంశాలను వారి భాషలో రాసిన సీరియల్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. స్వాతి మాసపత్రికల్లో ఆ సీరియల్‌ ఆఖరిది. 

అప్పట్నుంచి రచనలు వేగం పుంజుకున్నాయి.  
కట్‌చేస్తే.. ఇప్పటికి 85 నవలలు, 17 నవలికలు, 850కి పైగా కథలు రాశారు. కమ్యూనిస్టు నేపథ్యం కావటంతో సీరియస్‌ సాహిత్యమే చేశానంటారు అజాద్‌. సామాజిక అంశాలకు సంబంధించిన ఏదో ఒక సమస్యను చర్చించినవే అన్నీ. వందకుపైగా కథలు, 30కి పైగా నవలలు వివిధ బహుమతులు గెల్చుకున్నాయి. తెలిమబ్బుల ఛాయ, మనోప్రస్థానం, నగరంలో వెన్నెల నవలలకు వరుసగా మూడేళ్లు ఆటా, తానా బహుమతులు లభించాయి. 

విపరీత వ్యక్తులు, అహానికి రంగుండదు, ముక్తిపర్వం, దేవుడొచ్చాడు నవలలు కూడా గుర్తింపు పొందాయి. పిల్లల ప్రపంచం, నాన్నకో ఉత్తరం, మూ­డ్స్, ఎక్స్‌ప్రెషన్స్, ఇంప్రెషన్స్‌ పేరుతో దిన­పత్రికల్లో రాసిన కాలమ్స్‌ ప్రజాదరణ పొందాయి. గతంలో ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ‘నగ­రంలో వెన్నెల’ ఇప్పుడో సాహిత్య మాసపత్రికల్లో సీరియల్‌గా ఆరంభమైందని తెలిపారు అజాద్‌.  

ఆకర్షించిన బుల్లితెర  
మరోవైపు బుల్లితెర రంగం కూడా అజాద్‌ను ఆకర్షించింది. దూరదర్శన్‌లో ‘జీవనతీరాలు’ సీరియల్‌తో ఆరంభించి, రాధామధు, లయ, అడగక ఇచ్చిన మనసు, ఎదురీత సీరియల్స్‌తో మొత్తం ఐదువేల ఎపిసోడ్‌లకు రచనా సహకారం అందించారు. సామాజిక, మానవ భావోద్వేగాలకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను చర్చించారు. అజాద్‌ రచనా సహకారం అందించిన పాండవులు, అడవిపూలు, బోన్సాయ్, తమసోమా టెలీఫిలింస్‌కు మూడు స్వర్ణాలు, వెండి నంది వచ్చాయి. 

అడవిపూలు టెలీఫిలింకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలకుగాను వ్యక్తిగతంగా నంది బహుమతిని స్వీకరించారు. సరదా కోసం కొన్ని టెలీఫిలింస్, టీవీ సీరియల్స్‌లోను ఆయన నటించారు. ఉపాధికోసం గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రిలో ఉన్నపుడు కొన్ని సాంస్కృతిక సంస్థల నిర్వహణలోను పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement