ఇది నయనతార హిపోక్రసి కాదా?
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిపోతున్న మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, వాటి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌన వైఖరిని నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చివేస్తున్నానని ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ సగౌరవంగా ప్రకటించడాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె సాహిత్య అకాడమీ అవార్డును నిన్న, మొన్న తీసుకున్నది కాదు. 1986లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు.
అంతకుముందు సరిగ్గా రెండేళ్ల ముందు, అంటే 1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది సిక్కులను ఊచకోతకోశారు. అందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వానిదే. అందుకు నిరసనగా 1986లోనే తాను సాహిత్య అవార్డును అందుకోవడాన్ని నిరాకరించి ఉండాల్సింది. సెహగల్ అలా చేయలేదు.
1996, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వాంసానికి వ్యతిరేకంగానైనా సెహగల్ తన అవార్డును వెనక్కి ఇవ్వాల్సింది. అలా కూడా చేయలేదు. 2002లో గుజరాత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. ఆ పాపం నరేంద్ర మోదీదేనంటూ ప్రపంచవ్యాప్తంగా పత్రికలు కోడై కూశాయి. అప్పుడు కూడా సెహగల్ స్పందించలేదు. ఎందుకు?
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లను ప్రేరేపించడం దేశ రాజకీయాలకు కొత్త కాదు. అందుకు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అతీతం కాదు. మరి ఇంతకాలం సాహిత్య అకాడమి అవార్డు గురించి మాట్లాడని సెహగల్ ఇప్పుడు దాన్ని వెనక్కి ఇస్తానంటూ ప్రకటించడం ఆత్మవంచన (హిపోక్రసి) కాదా? ఇంతకాలం తాను పరిణతి చెందలేదని, ఇప్పుడు పూర్తి పరిణతి చెందడం వల్ల స్పందించానని ఆమె సమాధానం చెప్పుకుంటారా? అలా చెప్పుకుంటే అది ఆమెకే అవమానం.
1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సెహగల్ గట్టిగా పోరాటం జరిపారు. ‘పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్’ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. ఆ కారణంగానైనా ఆమె 1986లోనే అవార్డును తిరస్కరించి ఉండాల్సింది.
మరి, ఎందుకు చేయలేదు?...అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే, అవార్డు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధికారంలో ఉంది, ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు బీజేపి ప్రభుత్వం అధికారంలో ఉందన్న సమాధానమే కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు, సాహితీవేత్తలు పార్టీలబట్టి స్పందన మార్చుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ప్రపంచంలో తాను అన్నింటికన్నా ఆత్మంచననే ద్వేషిస్తానని ఎంగెల్స్ చెబుతారు. ఎందుకంటే, ఆత్మవంచనతో మాట్లాడేవారు సమాజానికి మిత్రులో, శత్రువులో, వారు స్వపక్షమో, వైరిపక్షమో అంచానా వేయలేమన్నది ఆయన అంచనా.