Nayantara Sahgal
-
రమ్మని.. రావద్దని
డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన ఈ తొంభై ఏళ్ల రచయిత్రి.. గడప బయటి నుంచి బయటికే లిటరరీ ఇన్విటేషన్‌ని కూడా వాపస్ చేసి ఉండవలసింది. మాధవ్ శింగరాజు నయన్‌తార సెహగల్ ‘పాత నేరస్తురాలు’. అయితే ముఖ్య అతిథిగా ఆమెకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకునేందుకు ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన’ నిర్వహణ కమిటీ చెప్పిన కారణం పూర్తిగా వేరు. మరాఠీ సమ్మేళనానికి ఒక ఆంగ్ల భాషా రచయిత్రిని పిలవడం ఏమిటన్న అభ్యంతరాలు రావడంతో ఆహ్వానాన్ని రద్దు చేసినట్లు సమ్మేళనం వర్కింగ్ ప్రెసిడెంట్ రమాకాంత్ కోల్టే సంజాయిషీ ఇచ్చారు. రాజ్‌థాకరే కూడా అపాలజీ చెప్పారు. ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి’ అధినేత ఆయన. అయితే రాజ్‌థాకరే అపాలజీ చెప్పింది నయన్‌తార కు కాదు. సమ్మేళన నిర్వాహకులకు! ‘‘నయన్‌తారను ముఖ్య అతిథిగా పిలిచి, ఆమె చేత సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభింపజేయడాన్ని మావాళ్లు వ్యతిరేకించారు. అనవసరమైన వివాదాలను తప్పించడం కోసం.. మీ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న మావాళ్ల అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకురాక తప్పడం లేదు’’ అని ఆయన మృదువైన భాషలో వివరణ ఇచ్చారు. వాస్తవానికి సంజాయిషీ గానీ, వివరణగానీ ఇవ్వనవసరం లేనంత నిర్ణయాధికారం కలిగివున్న వాళ్లు కోల్టే, రాజ్‌థాకరే. అయినా ఇచ్చారు. మొదట నయన్‌తారను పిలవడమే తప్పు. పిలిచి, రావద్దనడం రెండో తప్పు. పిలుస్తున్నప్పుడు వాళ్లకు తప్పు అని తెలియదు. ముఖ్య అతిథిగా ఆమె ఏం మాట్లాడబోతున్నారో తెలిశాక తప్పు చేశామని వారికి అర్థమయింది. నియమం ప్రకారం సమ్మేళనంలో ప్రసంగించబోయేవారు తమ ప్రసంగ పత్రాలను మూడు రోజుల ముందుగానే కమిటీకి సమర్పించవలసి ఉంటుంది. నయన్‌తార అలా సమర్పించినప్పుడు మరాఠీలోకి తర్జుమా అయిన ఆమె ప్రసంగాన్ని చదివి, నిర్వాహకులు చేష్టలుడిగిపోయారు. మరాఠీ సాహితీ సమ్మేళనంలో ఆమె మోదీని విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు ప్రసంగ పాఠంలో బహిర్గతం అయింది. మహారాష్ట్రలోని యవత్మల్లో ఈ నెల 11న మొదలౌతున్న మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరవుతున్నారు. డయాస్ మీద ఆయన ఆ పక్కన కూర్చొని ఉంటే, నయన్‌తార ఈ పక్కన నిలబడి మోదీని, హిందుత్వను విమర్శిస్తూ మాట్లాడితే ఇబ్బంది ఫడ్నవిస్‌కే. పైగా నయన్‌తార మీద ‘పాత కేసులు’ చాలానే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న హిందుత్వ అసహనానికి నిరసనగా 2015లో ప్రభుత్వానికి అవార్డులు తిరిగి ఇచ్చేసిన కళాకారులకు స్ఫూర్తిప్రదాత నయన్‌తార. ఆమె తన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కు తిరిగి ఇచ్చేయడంతో మిగతావాళ్లు ఆమెను అనుసరించారు. మోదీ వచ్చాక దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయని బహిరంగంగానే విమర్శించిన తొలి రచయిత్రి కూడా నయన్‌తారనే. భావోద్వేగాల చెయ్యి పట్టుకుని వెళ్లిపోకుండా, భావోద్వేగాలనే తమ చూపుడు వేలితో నియంత్రించే వివేచనాపరులైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్యలను నయన్‌తార లాంటి ఒక నికార్సయిన రచయిత్రి ఖండించడం కూడా సహజంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. అలాంటి మనిషిని తీసుకొచ్చి డయాస్ ఎక్కించడం అంటే కొరివితో సొంత ప్రభుత్వం తల గోకినట్టే ఫడ్నవిస్‌కి. మరెందుకు నిర్వహణ కమిటీ మొదట నయన్‌తారకు ఆహ్వానం పంపినట్లు? ప్రస్తుతం జరగబోతున్నది 92వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం. నయన్‌తార సెహగల్ వయసు 91. సమ్మేళనం, సెహగల్ ఒక ఈడువాళ్లు. అయితే ఒక భాష వాళ్లు కాదు. నయన్‌తార పుట్టింది అలహాబాద్‌లో. ఆమె ఆలోచనలు పుట్టేది ఆంగ్లంలో. రాసేదీ ఆటోమేటిక్‌గా ఇంగ్లిష్‌లోనే. పుట్టుకతో ఒకవేళ ఆమె హిందీ మాట్లాడగలరనుకున్నా, ఆ భాషతో మళ్లీ మరాఠీలకు పేచీ. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నవల ‘రిచ్ లైక్ అజ్’ (1986) సహా నయన్‌తార రాసిన పదీపన్నెండు కూడా ఇంగ్లిష్ నవలలు. అదంతా కూడా జవహర్లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిట్ కూతురు కావడం వల్ల కూడా అబ్బిన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అయి ఉండొచ్చు. విజయలక్ష్మీ పండిట్ అప్పట్లో లండన్‌కు అతి ముఖ్యమైన దౌత్యవేత్త. అరవైలలో మహారాష్ట్రకు విజయలక్ష్మి గవర్నర్‌గా ఉండడం ఒక్కటే బహుశా నయన్‌తారకు మరాఠీలతో ఉన్న సంబంధం. ఇప్పుడు మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ఆమెకు ఆహ్వానం వచ్చినా అందుకు ప్రత్యేక కారణాలేమీ లేవు. ఒక పెద్ద రచయిత్రి. సాహిత్యంలో పేరున్న రైటర్. అంతవరకే. మోదీ మీద నేడు ఆమెకున్న కోపం, గతంలో ఇందిరాగాంధీ మీద కూడా ఉన్నదే. ఇందిర విధించిన ఎమర్జెన్సీని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. నయన్‌తార వ్యక్తులను కాకుండా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంటారు. అలా ఎత్తి చూపడం సాహితీ ధర్మం అని కూడా భావిస్తారు. ఇది తెలిసి కూడా ఆమెను ఆహ్వానించడం సాహితీ సమ్మేళనకర్తల తప్పయితే, తనను పిలుస్తున్నవారెవరో తెలిసి కూడా ఆహ్వానాన్ని అంగీకరించడం ఆమె తప్పనే అనుకోవాలి. డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన నయన్‌తార గడప బయటే లిటరరీ ఇన్విటేషన్‌ని వాపస్ చేసి ఉండాల్సింది. -
రాహుల్‌లో మార్పు కనిపిస్తోంది
* రాజకీయాల్లో కీలక భూమికకు రాహుల్ నిర్ణయం * ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ ప్రశంసలు చండీగఢ్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ బంధువైన నయనతార సెహగల్ ప్రశంసల వర్షం కురిపించారు. చండీగఢ్‌లో గురువారం జరిగిన నాలుగో సాహిత్య ఉత్సవాల్లో ఆమె మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక భూమికను నిర్వహించాలని రాహుల్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారని అన్నారు. రాహుల్‌పై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు ఆమెను ప్రశ్నించినప్పుడు సెహగల్ స్పందించారు. ‘తొలినాళ్లలో నేను కూడా అందరిలాగానే భావించాను. రాహుల్ రాజకీయాల్లో ఉండతగిన వాడు కాదని అనుకున్నా. అతను వేరే వృత్తిని స్వీకరించటం మంచిదని కూడా భావించాను. కానీ.. బిహార్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడిన తీరు ఎంతో అద్భుతంగా ఉంది. వాస్తవాలను ప్రజలముందుంచటంలో ఆయన విజయం సాధించారు. ఇక తాను పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. అంతకుముందు తెరవెనుక ఉండి యువజన కాంగ్రెస్‌ను వ్యవస్థీకృతం చేయటంపై దృష్టి సారించారు. ఇప్పుడు ఇక పెద్ద పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. ఆయనలో గొప్ప మార్పు కనిపిస్తోంది. ఇది చాలా మంచి, అనుకూల పరిణామం.’ అని సెహగల్ అన్నారు. దాద్రీలో ఇఖ్లాక్ హత్య ఘటన నేపథ్యంలో తాను అందుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె దారిలో ఇప్పటివరకు 75మందికి పైగా సాహిత్య కారులు, కళాకారులు, మేధావులు తమ అవార్డులు వెనక్కి ఇచ్చేశారు. తాను మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల నుంచి తీవ్రంగా ప్రభావితం అయ్యానని, తనకు రెండు సార్లు పార్లమెంటు సీటు ఇస్తామన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ తాను తిరస్కరించానని సెహగల్ తెలిపారు. తాను ఎన్నడూ అధికారాన్ని, ఆస్తుల్ని కోరుకోలేదని.. తన కథలకు కథాంశంగా దేశ రాజకీయాలు పనికివచ్చాయని ఆమె అన్నారు. -
నయనతారకు మద్దతుగా మరో కవి
న్యూఢిల్లీ : మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా అరుదైన పురస్కారాన్ని వెనక్కిచ్చిన రచయిత్రికి ఇపుడో మరో ప్రముఖ కవి జతకలిశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదాసీన వైఖరికి నిరసనగా సాహిత్య అవార్డును వెనక్కి ఇచ్చి, వార్తల్లో నిలిచిన ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ కు ఇపుడు మరో అవార్డు గ్రహీత, ప్రముఖ కవి అశోక్ వాజ్‌పేయి తన మద్దతును తెలియజేశారు. మోదీ మౌన వైఖరికి నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును కూడా వెనక్కి ఇచ్చివేస్తున్నానని ఆయక ప్రకటించారు. దాద్రి ఉదంతం తనను కలచి వేసిందన్నారు. లలిత కళా అకాడమీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అశోక్ వాజ్‌పేయి కవులు, రచయితలు స్పందించాల్సిన సమయమిది అని వ్యాఖ్యానించారు. మనకి మంచి వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఉన్నారు గానీ రచయితలు, అమాయక ప్రజలు హత్యకు గురవుతుంటే మౌనంగా ఉండం సబబు కాదన్నారు. తన సహచర మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యానాలు చేస్తుంటే ప్రధాని మోదీ వాళ్ల నోర్లు ఎందుకు మూయించలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంలో సెహగల్ లాంటి రచయిత్రికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సాహిత్య అకాడమీ, జాతీయ అకాడమీ కూడా స్పందించాలని కోరారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలబడిన వారిలో సెహగల్ ప్రముఖులు. పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె కూడా ఒకరు. అటు ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గి, నరేంద్ర దభోల్కర్ , గోవింద్ పన్సారే హత్యల సందర్భంగా కూడా ఆమె తన విమర్శలను ఎక్కుపెట్టారు. హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిని హత్య చేస్తున్న వారిని నిరోధించడంలో పాలకులు విఫలమవుతున్నారని మండిపడుతూ నయనతార సెహగల్ తన పురస్కారాన్ని వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇది నయనతార హిపోక్రసి కాదా?
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిపోతున్న మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, వాటి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న మౌన వైఖరిని నిరసనగా తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చివేస్తున్నానని ప్రముఖ రచయిత్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ సగౌరవంగా ప్రకటించడాన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె సాహిత్య అకాడమీ అవార్డును నిన్న, మొన్న తీసుకున్నది కాదు. 1986లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. అంతకుముందు సరిగ్గా రెండేళ్ల ముందు, అంటే 1984లో ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. వందలాది మంది సిక్కులను ఊచకోతకోశారు. అందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వానిదే. అందుకు నిరసనగా 1986లోనే తాను సాహిత్య అవార్డును అందుకోవడాన్ని నిరాకరించి ఉండాల్సింది. సెహగల్ అలా చేయలేదు. 1996, డిసెంబర్ ఆరవ తేదీన బాబ్రీ మసీదు విధ్వాంసానికి వ్యతిరేకంగానైనా సెహగల్ తన అవార్డును వెనక్కి ఇవ్వాల్సింది. అలా కూడా చేయలేదు. 2002లో గుజరాత్లో ముస్లింలకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి. ఆ పాపం నరేంద్ర మోదీదేనంటూ ప్రపంచవ్యాప్తంగా పత్రికలు కోడై కూశాయి. అప్పుడు కూడా సెహగల్ స్పందించలేదు. ఎందుకు? దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లను ప్రేరేపించడం దేశ రాజకీయాలకు కొత్త కాదు. అందుకు అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అతీతం కాదు. మరి ఇంతకాలం సాహిత్య అకాడమి అవార్డు గురించి మాట్లాడని సెహగల్ ఇప్పుడు దాన్ని వెనక్కి ఇస్తానంటూ ప్రకటించడం ఆత్మవంచన (హిపోక్రసి) కాదా? ఇంతకాలం తాను పరిణతి చెందలేదని, ఇప్పుడు పూర్తి పరిణతి చెందడం వల్ల స్పందించానని ఆమె సమాధానం చెప్పుకుంటారా? అలా చెప్పుకుంటే అది ఆమెకే అవమానం. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సెహగల్ గట్టిగా పోరాటం జరిపారు. ‘పీపుల్స్ యూనియన్ ఆప్ సివిల్ లిబర్టీస్’ సంఘం వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. ఆ కారణంగానైనా ఆమె 1986లోనే అవార్డును తిరస్కరించి ఉండాల్సింది. మరి, ఎందుకు చేయలేదు?...అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే, అవార్డు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధికారంలో ఉంది, ఇప్పుడు అవార్డు ఇచ్చేటప్పుడు బీజేపి ప్రభుత్వం అధికారంలో ఉందన్న సమాధానమే కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు, సాహితీవేత్తలు పార్టీలబట్టి స్పందన మార్చుకుంటే అది ఆత్మవంచనే అవుతుంది. ప్రపంచంలో తాను అన్నింటికన్నా ఆత్మంచననే ద్వేషిస్తానని ఎంగెల్స్ చెబుతారు. ఎందుకంటే, ఆత్మవంచనతో మాట్లాడేవారు సమాజానికి మిత్రులో, శత్రువులో, వారు స్వపక్షమో, వైరిపక్షమో అంచానా వేయలేమన్నది ఆయన అంచనా.