డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన ఈ తొంభై ఏళ్ల రచయిత్రి.. గడప బయటి నుంచి బయటికే లిటరరీ ఇన్విటేషన్‌ని కూడా వాపస్ చేసి ఉండవలసింది.
మాధవ్ శింగరాజు
నయన్‌తార సెహగల్ ‘పాత నేరస్తురాలు’. అయితే ముఖ్య అతిథిగా ఆమెకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకునేందుకు ‘అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన’ నిర్వహణ కమిటీ చెప్పిన కారణం పూర్తిగా వేరు. మరాఠీ సమ్మేళనానికి ఒక ఆంగ్ల భాషా రచయిత్రిని పిలవడం ఏమిటన్న అభ్యంతరాలు రావడంతో ఆహ్వానాన్ని రద్దు చేసినట్లు సమ్మేళనం వర్కింగ్ ప్రెసిడెంట్ రమాకాంత్ కోల్టే సంజాయిషీ ఇచ్చారు. రాజ్‌థాకరే కూడా అపాలజీ చెప్పారు. ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి’ అధినేత ఆయన. అయితే రాజ్‌థాకరే అపాలజీ చెప్పింది నయన్‌తార కు కాదు. సమ్మేళన నిర్వాహకులకు! ‘‘నయన్‌తారను ముఖ్య అతిథిగా పిలిచి, ఆమె చేత సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభింపజేయడాన్ని మావాళ్లు వ్యతిరేకించారు. అనవసరమైన వివాదాలను తప్పించడం కోసం.. మీ నిర్ణయానికి విరుద్ధంగా ఉన్న మావాళ్ల అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకురాక తప్పడం లేదు’’ అని ఆయన మృదువైన భాషలో వివరణ ఇచ్చారు.
వాస్తవానికి సంజాయిషీ గానీ, వివరణగానీ ఇవ్వనవసరం లేనంత నిర్ణయాధికారం కలిగివున్న వాళ్లు కోల్టే, రాజ్‌థాకరే. అయినా ఇచ్చారు. మొదట నయన్‌తారను పిలవడమే తప్పు. పిలిచి, రావద్దనడం రెండో తప్పు. పిలుస్తున్నప్పుడు వాళ్లకు తప్పు అని తెలియదు. ముఖ్య అతిథిగా ఆమె ఏం మాట్లాడబోతున్నారో తెలిశాక తప్పు చేశామని వారికి అర్థమయింది. నియమం ప్రకారం సమ్మేళనంలో ప్రసంగించబోయేవారు తమ ప్రసంగ పత్రాలను మూడు రోజుల ముందుగానే కమిటీకి సమర్పించవలసి ఉంటుంది. నయన్‌తార అలా సమర్పించినప్పుడు మరాఠీలోకి తర్జుమా అయిన ఆమె ప్రసంగాన్ని చదివి, నిర్వాహకులు చేష్టలుడిగిపోయారు. మరాఠీ సాహితీ సమ్మేళనంలో ఆమె మోదీని విమర్శించడానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు ప్రసంగ పాఠంలో బహిర్గతం అయింది. మహారాష్ట్రలోని యవత్‌మల్‌లో ఈ నెల 11న మొదలౌతున్న మూడు రోజుల అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరవుతున్నారు.
డయాస్ మీద ఆయన ఆ పక్కన కూర్చొని ఉంటే, నయన్‌తార ఈ పక్కన నిలబడి మోదీని, హిందుత్వను విమర్శిస్తూ మాట్లాడితే ఇబ్బంది ఫడ్నవిస్‌కే. పైగా నయన్‌తార మీద ‘పాత కేసులు’ చాలానే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న హిందుత్వ అసహనానికి నిరసనగా 2015లో ప్రభుత్వానికి అవార్డులు తిరిగి ఇచ్చేసిన కళాకారులకు స్ఫూర్తిప్రదాత నయన్‌తార. ఆమె తన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కు తిరిగి ఇచ్చేయడంతో మిగతావాళ్లు ఆమెను అనుసరించారు. మోదీ వచ్చాక దేశంలో ముస్లింలపై దాడులు పెరిగాయని బహిరంగంగానే విమర్శించిన తొలి రచయిత్రి కూడా నయన్‌తారనే. భావోద్వేగాల చెయ్యి పట్టుకుని వెళ్లిపోకుండా, భావోద్వేగాలనే తమ చూపుడు వేలితో నియంత్రించే వివేచనాపరులైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎం.ఎం. కల్బర్గీ, గౌరీ లంకేశ్‌ల హత్యలను నయన్‌తార లాంటి ఒక నికార్సయిన రచయిత్రి ఖండించడం కూడా సహజంగానే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది.
అలాంటి మనిషిని తీసుకొచ్చి డయాస్ ఎక్కించడం అంటే కొరివితో సొంత ప్రభుత్వం తల గోకినట్టే ఫడ్నవిస్‌కి. మరెందుకు నిర్వహణ కమిటీ మొదట నయన్‌తారకు ఆహ్వానం పంపినట్లు? ప్రస్తుతం జరగబోతున్నది 92వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం. నయన్‌తార సెహగల్ వయసు 91. సమ్మేళనం, సెహగల్ ఒక ఈడువాళ్లు. అయితే ఒక భాష వాళ్లు కాదు. నయన్‌తార పుట్టింది అలహాబాద్‌లో. ఆమె ఆలోచనలు పుట్టేది ఆంగ్లంలో. రాసేదీ ఆటోమేటిక్‌గా ఇంగ్లిష్‌లోనే. పుట్టుకతో ఒకవేళ ఆమె హిందీ మాట్లాడగలరనుకున్నా, ఆ భాషతో మళ్లీ మరాఠీలకు పేచీ. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నవల ‘రిచ్ లైక్ అజ్’ (1986) సహా నయన్‌తార రాసిన పదీపన్నెండు కూడా ఇంగ్లిష్ నవలలు.
అదంతా కూడా జవహర్‌లాల్ నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిట్ కూతురు కావడం వల్ల కూడా అబ్బిన ఆంగ్ల భాషా పరిజ్ఞానం అయి ఉండొచ్చు. విజయలక్ష్మీ పండిట్ అప్పట్లో లండన్‌కు అతి ముఖ్యమైన దౌత్యవేత్త. అరవైలలో మహారాష్ట్రకు విజయలక్ష్మి గవర్నర్‌గా ఉండడం ఒక్కటే బహుశా నయన్‌తారకు మరాఠీలతో ఉన్న సంబంధం. ఇప్పుడు మరాఠీ సాహిత్య సమ్మేళనానికి ఆమెకు ఆహ్వానం వచ్చినా అందుకు ప్రత్యేక కారణాలేమీ లేవు. ఒక పెద్ద రచయిత్రి. సాహిత్యంలో పేరున్న రైటర్. అంతవరకే. మోదీ మీద నేడు ఆమెకున్న కోపం, గతంలో ఇందిరాగాంధీ మీద కూడా ఉన్నదే. ఇందిర విధించిన ఎమర్జెన్సీని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.
నయన్‌తార వ్యక్తులను కాకుండా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంటారు. అలా ఎత్తి చూపడం సాహితీ ధర్మం అని కూడా భావిస్తారు. ఇది తెలిసి కూడా ఆమెను ఆహ్వానించడం సాహితీ సమ్మేళనకర్తల తప్పయితే, తనను పిలుస్తున్నవారెవరో తెలిసి కూడా ఆహ్వానాన్ని అంగీకరించడం ఆమె తప్పనే అనుకోవాలి. డెహ్రాడూన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్న నయన్‌తారకు ఇంతవరకు జరిగినదంతా చికాకు పరిచే విషయమే. ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమాన్ని నడిపిన నయన్‌తార గడప బయటే లిటరరీ ఇన్విటేషన్‌ని వాపస్ చేసి ఉండాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment