సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ కవి, రచయిత నిఖిలేశ్వర్‌కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2015–17 మధ్య ఆయన రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటికి గాను ఈ పురస్కారం లభించింది. మొత్తం 13 రచనలు షార్ట్‌లిస్ట్ అవగా అగ్నిసాక్షి రచనతో నిఖిలేశ్వర్ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో సత్కరిస్తారు. మిళింద సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్–2020 దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందజేస్తారు. ఇక బాల సాహిత్య పురస్కారం ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు లభించింది. 2018లో ఆమె రచించిన ‘స్నేహితులు’అనే 15 సంక్షిప్త కథల సంకలనానికి ఈ పురస్కారం దక్కింది. దీని కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు. (చదవండి: బతుకు పాఠాలు చదివిన రచయిత)
అస్తిత్వాల ఆవిష్కరణ ‘మిళింద’ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపికైన ఎండ్లూరి మానస దళిత, స్త్రీవాద, లింగ, లైంగిక గుర్తింపులో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి పలు కథలు రాశారు. ఆమె ప్రముఖ రచయితలు ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతల కుమార్తె. నెల్లూరులో జన్మించిన మానస.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంటున్నారు. 2017లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సుబ్బు స్మారక పురస్కారం, 2020లో మాడభూషి పురస్కారం అందుకున్నారు.
మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ‘విహంగ’కు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవిక ఘటనల ఆధారంగా పరిశుద్ధ పరిణయం, అంతిమం తదితర కథలు రాశారు. ‘‘అస్తిత్వం ప్రశ్నార్థకమైన ప్రతిచోట ఒక ఘర్షణ, ఒక పెనుగులాట కనిపిస్తుంది. అది తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా అనుభవించే స్వేచ్ఛ కోసం చేసేపోరాటం’’అంటూ అణచివేతను, వివక్షను ఎదుర్కొంటున్న అస్తిత్వాల ఆవిష్కరణే ‘మిళింద’కథల సంపుటి. అవార్డుకు ఎంపిక కావడంపై మానస సంతోషం వ్యక్తం చేశారు. అణచివేతకు, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. పిల్లల సృజనకు పట్టంకట్టే ‘స్నేహితులు’ చిన్నారుల మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసే చక్కటి కథలతో తెలుగు సాహిత్యంలో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయ. ఆమె రాసిన పిల్లల కథల పుస్తకం ‘స్నేహితులు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె ఏలూరులో కొంతకాలం పాటు లైబ్రేరియన్‌గా పనిచేశారు. లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఉంటున్నారు. తనకు అవార్డు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.‘‘పిల్లల్లో సృజనాత్మకత లోపిస్తోంది. స్కూళ్లలో నీతి, నైతిక విలువలను బోధించడం లేదు. అలాంటి కథలు చెప్పే టీచర్లు కూడా కరువవుతున్నారు. బాల్యంలోనే పిల్లల జీవితాలు యాంత్రికంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే కథలు చెప్పాలి’’అని అనసూయ పేర్కొన్నారు.
కలం నిఖిలేశ్వర్.. కవిత్వం సంచలనం
సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించిన నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ పలు రచనలు, అనువాదాలు చేశారు. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్ అనేది ఆయన కలం పేరు. 1938 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని వీరవెల్లిలో జన్మించిన ఆయన.. 1960–64 మధ్య ఆర్మీలో సివిలియన్ స్కూల్ మాస్టర్‌గా, ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్‌గా పనిచేnశారు. 1964–66 మధ్య గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. 1965–68 మధ్యకాలంలో మరో ఐదుగురు మిత్రులతో కలిసి తెలుగు సాహిత్యంలో పెను సంచలనం సృష్టించిన దిగంబర కవిత్వం మూడు కవితా సంపుటాలను వెలువరించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. అగ్ని శ్వాస.. పోరాటాల ధ్యాస ‘ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శ్రమజీవన పోరాటాల ధ్యాస.. అగ్నిశ్వాసకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. నిజానికి ఈ అవార్డు 10, 15 ఏళ్ల కిందే వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేది. సాహిత్య, సాంస్కృతిక రంగంలో నేను చేసిన కృషి, నిర్వహించిన క్రియాశీలక పాత్రకు తగినంత గుర్తింపు సమాజంలో ఎప్పుడో లభించింది. ఇప్పుడీ గుర్తింపు అదనంగా వచ్చి చేరినందుకు సంతృప్తి చెందుతున్నా. వ్యక్తిగతంగా నా కవిత్వం, రచనలు, సాహిత్యాన్ని విమర్శకులు అంతగా పట్టించుకోలేదన్న భావన నాకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా నా సాహిత్య కృషి ఉంది. ఇటీవల ఇంగ్లిష్‌లో ‘లైఫ్ ఎట్‌ది ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్’, హిందీలో ‘ఇతిహాస్ కె మోడ్ పర్’కవితా సంపుటాలున్నాయి. ఈ రచనలన్నింటిపై సరైన మదింపు జరగలేదు’’.
- నిఖిలేశ్వర్, ప్రముఖ కవి
ఏపీ సీఎం జగన్ అభినందనలు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన నిఖిలేశ్వర్, కన్నెగంటి అనసూయను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. వారు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment