litalature
-
అడవి బిడ్డల వెతల గాథ.. ‘ఈతచెట్టు దేవుడు’
ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొరాపుట్ జిల్లా– అక్కడి కొండకోనల్లో బతుకులు వెళ్లమార్చే అడవిబిడ్డల వెతల గాథ ‘ఈతచెట్టు దేవుడు’. సుప్రసిద్ధ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్ మహంతి రాసిన ‘దాది బుఢా’ నవలను డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ‘ఈతచెట్టు దేవుడు’గా తెలుగులోకి అనువదించారు. ఇదివరకే ఈ నవల ‘ది ఏన్సెస్టర్’ పేరిట ఇంగ్లిష్‌లోకి అనువదితమైంది. ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా కొరాపుట్ జిల్లాలో కొంతకాలం పనిచేసిన గోపీనాథ్ మహంతి అక్కడి ఆదివాసీల జీవితాలను దగ్గరగా గమనించారు. లుల్లా అనే గ్రామంలోని గిరిజనుల బతుకులను, వాళ్ల వెతలను కళ్లకు కట్టే గాథ ఇది. లుల్లా గ్రామాన్ని అక్కడి గిరిజనులు విడిచిపెట్టి, మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు పాఠకులను కదిలిస్తాయి. ఒడియా భాషా సాహిత్యాలతో సుదీర్ఘ పరిచయం గల రచయిత్రి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ఈ నవలను మూలంలోని ఒరవడిని ఒడిసి పట్టుకుని అనువదించిన తీరు ప్రశంసనీయం. నవలలోని గిరిజనుల సంభాషణలకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని కళింగసీమ మాండలికాన్ని ఎంచుకోవడం సముచితం. – దాసు -
తెలంగాణ కవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ కవి, రచయిత నిఖిలేశ్వర్‌కు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2015–17 మధ్య ఆయన రాసిన అగ్నిశ్వాస కవితా సంపుటికి గాను ఈ పురస్కారం లభించింది. మొత్తం 13 రచనలు షార్ట్‌లిస్ట్ అవగా అగ్నిసాక్షి రచనతో నిఖిలేశ్వర్ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, తామ్ర పత్రం, శాలువాతో సత్కరిస్తారు. మిళింద సంక్షిప్త కథల పుస్తక రచనకు గాను ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్–2020 దక్కింది. ఈ పురస్కారం కింద రూ.50 వేల నగదు, తామ్ర పత్రం అందజేస్తారు. ఇక బాల సాహిత్య పురస్కారం ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయకు లభించింది. 2018లో ఆమె రచించిన ‘స్నేహితులు’అనే 15 సంక్షిప్త కథల సంకలనానికి ఈ పురస్కారం దక్కింది. దీని కింద రూ.50 వేల నగదు, తామ్రపత్రం అందజేస్తారు. (చదవండి: బతుకు పాఠాలు చదివిన రచయిత) అస్తిత్వాల ఆవిష్కరణ ‘మిళింద’ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపికైన ఎండ్లూరి మానస దళిత, స్త్రీవాద, లింగ, లైంగిక గుర్తింపులో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి పలు కథలు రాశారు. ఆమె ప్రముఖ రచయితలు ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతల కుమార్తె. నెల్లూరులో జన్మించిన మానస.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంటున్నారు. 2017లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సుబ్బు స్మారక పురస్కారం, 2020లో మాడభూషి పురస్కారం అందుకున్నారు. మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ‘విహంగ’కు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవిక ఘటనల ఆధారంగా పరిశుద్ధ పరిణయం, అంతిమం తదితర కథలు రాశారు. ‘‘అస్తిత్వం ప్రశ్నార్థకమైన ప్రతిచోట ఒక ఘర్షణ, ఒక పెనుగులాట కనిపిస్తుంది. అది తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా అనుభవించే స్వేచ్ఛ కోసం చేసేపోరాటం’’అంటూ అణచివేతను, వివక్షను ఎదుర్కొంటున్న అస్తిత్వాల ఆవిష్కరణే ‘మిళింద’కథల సంపుటి. అవార్డుకు ఎంపిక కావడంపై మానస సంతోషం వ్యక్తం చేశారు. అణచివేతకు, నిర్లక్ష్యానికి గురవుతున్న వర్గాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. పిల్లల సృజనకు పట్టంకట్టే ‘స్నేహితులు’ చిన్నారుల మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసే చక్కటి కథలతో తెలుగు సాహిత్యంలో తన ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయ. ఆమె రాసిన పిల్లల కథల పుస్తకం ‘స్నేహితులు’కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె ఏలూరులో కొంతకాలం పాటు లైబ్రేరియన్‌గా పనిచేశారు. లెక్చరర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఉంటున్నారు. తనకు అవార్డు రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.‘‘పిల్లల్లో సృజనాత్మకత లోపిస్తోంది. స్కూళ్లలో నీతి, నైతిక విలువలను బోధించడం లేదు. అలాంటి కథలు చెప్పే టీచర్లు కూడా కరువవుతున్నారు. బాల్యంలోనే పిల్లల జీవితాలు యాంత్రికంగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించే కథలు చెప్పాలి’’అని అనసూయ పేర్కొన్నారు. కలం నిఖిలేశ్వర్.. కవిత్వం సంచలనం సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించిన నిఖిలేశ్వర్ ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ పలు రచనలు, అనువాదాలు చేశారు. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్ అనేది ఆయన కలం పేరు. 1938 ఆగస్టు 11న నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని వీరవెల్లిలో జన్మించిన ఆయన.. 1960–64 మధ్య ఆర్మీలో సివిలియన్ స్కూల్ మాస్టర్‌గా, ఎయిర్‌ఫోర్స్‌లో క్లర్క్‌గా పనిచేnశారు. 1964–66 మధ్య గోల్కొండ పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. 1965–68 మధ్యకాలంలో మరో ఐదుగురు మిత్రులతో కలిసి తెలుగు సాహిత్యంలో పెను సంచలనం సృష్టించిన దిగంబర కవిత్వం మూడు కవితా సంపుటాలను వెలువరించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యుడిగా, కార్యదర్శిగా పనిచేశారు. అగ్ని శ్వాస.. పోరాటాల ధ్యాస ‘ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష, శ్రమజీవన పోరాటాల ధ్యాస.. అగ్నిశ్వాసకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఆనందంగా ఉంది. నిజానికి ఈ అవార్డు 10, 15 ఏళ్ల కిందే వచ్చి ఉంటే మరింత సంతోషంగా ఉండేది. సాహిత్య, సాంస్కృతిక రంగంలో నేను చేసిన కృషి, నిర్వహించిన క్రియాశీలక పాత్రకు తగినంత గుర్తింపు సమాజంలో ఎప్పుడో లభించింది. ఇప్పుడీ గుర్తింపు అదనంగా వచ్చి చేరినందుకు సంతృప్తి చెందుతున్నా. వ్యక్తిగతంగా నా కవిత్వం, రచనలు, సాహిత్యాన్ని విమర్శకులు అంతగా పట్టించుకోలేదన్న భావన నాకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా నా సాహిత్య కృషి ఉంది. ఇటీవల ఇంగ్లిష్‌లో ‘లైఫ్ ఎట్‌ది ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్’, హిందీలో ‘ఇతిహాస్ కె మోడ్ పర్’కవితా సంపుటాలున్నాయి. ఈ రచనలన్నింటిపై సరైన మదింపు జరగలేదు’’. - నిఖిలేశ్వర్, ప్రముఖ కవి ఏపీ సీఎం జగన్ అభినందనలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన నిఖిలేశ్వర్, కన్నెగంటి అనసూయను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. వారు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. -
రచయిత భాగ్యం
ఆంగ్ల రచయిత సోమర్సెట్ మామ్ ఒకసారి స్పెయిన్ చూడ్డానికి వెళ్లాడు. అక్కడున్న సమయంలోనే తన పుస్తకాలకు రావలసిన రాయల్టీ అందజేయబడింది. అంత డబ్బును ఏకమొత్తంలో తమ దేశానికి తీసుకుపోవడానికి స్పానిష్ చట్టం ఒప్పుకోదు. ఆలోచించి మామ్ ఓ నిర్ణయానికి వచ్చాడు. మాడ్రిడ్‌లోని అతి ఖరీదైన హోటల్లో బస చేశాడు. అక్కడున్నన్ని రోజులూ రాజభోగాలను అనుభవించాడు. చివరకు మొహం మొత్తింది. అప్పటివరకూ ఖర్చయినది చాల్లెమ్మనుకొని, హోటల్ మేనేజర్ దగ్గరకెళ్లి, ‘‘నేను గది ఖాళీ చేస్తున్నాను. బిల్లు వేయండి’’ అన్నాడు.అందుకా మేనేజర్ వినయాంజలి ఘటిస్తూ, ‘‘అయ్యా! తమవంటి గొప్పవారు మా హోటల్లో బస చేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మీరు మా హోటల్లో ఉన్నందువల్ల, మీ పేరు మీదుగా మా వ్యాపారం మామూలు కన్నా రెట్టింపైంది. మీరేమీ బిల్లు కట్టనవసరం లేదు.ఇకముందు మీరెప్పుడు స్పెయిన్ కొచ్చినా మా హోటల్లో ఉచితంగా బస చేయాలని కోరుకుంటున్నాం’’ అనేసరికి మామ్‌కు నోట మాట రాకపోయింది. అయినాల కనకరత్నాచారి -
చాల్స్ లాంబ్
ఇప్పుడు మనం ‘వ్యాసం’గా భావిస్తున్నది సాధారణంగా రాజకీయ వ్యాసమే. కానీ ఈ అర్థంలోకి స్థిరపడకముందు వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియ. 19వ శతాబ్దపు గొప్ప ఎస్సేయిస్టు చాల్స్ లాంబ్ (1775–1834). ఇంగ్లండ్‌లో జన్మించాడు. ఒంటరి పిల్లాడు. పదకొండేళ్లు పెద్దదైన అక్క, రచయిత్రి మేరీ లాంబ్ దగ్గర తొలుత చదువుకున్నాడు. చాలాకాలం ఈస్ట్ ఇండియా హౌజ్‌లో గుమస్తాగా పనిచేశాడు. మేరీతో కలిసి టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ రాశాడు. 1820లో ఏలియా అనే కలంపేరుతో ఒక లండన్ మేగజైన్‌కు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిల్లో జ్ఞాపకాల వెచ్చదనం, మేధో చమత్కారం, అంతరంగ కలబోత, కలగలిసి ఉంటాయి. ‘ఎస్సేస్ ఆఫ్ ఏలియా’ పేరుతో రెండు భాగాలుగా ఈ పుస్తకాలు వచ్చాయి. చాల్స్ కవి కూడా. అలాగే ఆయన ఉత్తరాలు కూడా సంకలనాలుగా వచ్చాయి. లాంబులు వర్ధిల్లాలనే ఆశయంతో ఇంగ్లండ్‌లో నెలకొల్పిన క్లబ్ ఒకటి 140 ఏళ్లుగా కొనసాగుతోంది. -
నా బిడియమే నన్ను కాపాడింది
గాంధీజీ తన ఆత్మకథను 1925–1929 వరకు గుజరాతీ భాషలో రాశారు. ఆంగ్లంలోకి మహదేవ్ దేశాయ్ అనువదించారు. దాని తెలుగు అనువాదంలోంచి మహాత్ముడికి ఉండిన స్టేజ్ ఫియర్ గురించి చెప్పే కొంతభాగం. సౌజన్యం: పి.రాజేశ్వరరావు, ప్రగతి పబ్లిషర్స్. అన్నాహార మండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకు హాజరవుతూ ఉండేవాణ్ణి. కానీ మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేది కాదు. డాక్టర్ ఓల్డ్‌ఫీల్డు యీ విషయం గమనించి ‘‘నీవు నాతో బాగా మాట్లాడతావు కానీ సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మగ తేనెటీగ అనే పేరు పెట్టవచ్చు’’ అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ వుంటాయి. కానీ మగతేనెటీగ తినడం తాగడమేగానీ పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమతమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కానీ నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి? నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనబడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కానీ యింతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది. నేను ఒకసారి వెంటసన్ అనే ఊరు వెళ్లాను. నా వెంట మజుందార్ కూడా వున్నారు. ‘‘ది ఎథిక్స్ ఆఫ్ డైట్’’ గ్రంథం రచించిన హోవర్డు గారు కూడా అక్కడే నివసిస్తున్నారు. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో రాసుకొని వెళ్లి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అలాచేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు ఠావు కంటే అది ఎక్కువగా లేదు. కానీ లేచి నుంచునే సరికి కళ్లు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్ నా కాగితం తీసుకొని చదివారు. ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గేసింది. నా అసమర్థతకు విచారం కూడా కలిగింది. ఆంగ్లదేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులైన మిత్రులకు హాల్‌బార్న్ రెస్టారెంటులో డిన్నర్ ఏర్పాటు చేశాను. ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడటం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించివేశాను. నన్నుయీ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్లిన తరువాత అక్కడ చాలావరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాణ్ణి. యిప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు.సామాన్యంగా అబద్ధం చెప్పడం, అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడే వారిని మనం చూస్తుంటాం. మేమంటే మేము అని అధ్యక్షుణ్ణి ఒత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంటుంది. యిలా మాట్లాడే వారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల నా బిడియం నన్ను కాపాడింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది. -
నీ మరణాన్ని నీవే చూస్తున్నప్పుడు...
‘నీ భార్యతో పాటు ఇంటి బయటకి వెళ్తావు. తోట మధ్యకు చేరుకున్నప్పుడు, టెన్నిస్ రాకెట్టు ఇంట్లో మరచిపోయావని ఆమెకి చెప్తావు. దానికోసం వెనక్కి వెళ్ళి,‘నీవు’ రాకెట్టుని పెట్టే ప్రవేశద్వారం వద్దున్న అల్మారాకి వెళ్ళకుండా, బేస్మెంటు వైపు దారి తీస్తావు. బయటే ఉన్న నీ భార్య, తుపాకీ శబ్దం విని, ఇంట్లోకి పరిగెత్తి నిన్ను పిలుస్తుంది. బేస్మెంట్ తలుపు తెరిచుందని గమనించి, కిందకెళ్తుంది. నీవు, రైఫిల్‌ని నీ కణత మీద పెట్టుకుని కాల్చుకున్నావని చూస్తుంది.’ మధ్యమ పురుషలో ఉండే ‘సూయిసైడ్’ నవల ప్రారంభం ఇది. యీ ఫ్రెంచ్ పుస్తకంలో ఉన్న మాటలు, 20 ఏళ్ళ క్రితం–తను పాతికేళ్ళకన్నా ఎక్కువ జీవించనని చాటి, తన 25వ ఏటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ఉద్దేశించి కథకుడు చెప్పినవి. మొదట్లో యధార్థ జీవితకథ అనిపించే నవల–20 పేజీల తరువాత కథకుని ఉనికి గురించిన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ‘నీవు బతికే ఉంటే నాకు అపరిచితుడివి అయి ఉండేవాడివి. మరణించిన తరువాత స్పష్టంగా కనిపిస్తున్నావు’ అన్న మాటలు, కథకునికీ ‘నీవు’కీ ఉన్న సంబంధాన్ని వివరించవు. అయితే, ‘నీ ఆత్మహత్యను వివరిస్తూ, కామిక్ పుస్తకపు పేజీ ఒకటి తెరిచి పెడతావు. నీ భార్య చేయి తగిలి, పుస్తకం మూసుకుపోతుంది. ఏ పేజీ నీ ఆత్మహత్యను ఉదహరించిందో, ఎవరికీ తెలియకుండా పోతుంది’ అన్న మాటలు ఆతృత హెచ్చిస్తాయి. ‘ఆమె నిన్ను తన చేతుల్లోకి తీసుకుని వెక్కుతూ, నీ మీదకి వాలుతుంది. నీ శరీరం చల్లబడ్డం గమనిస్తుంది... నీ అంతాన్ని నీవే యోచించి పెట్టుకున్నావు. నీ మరణానికి వెనువెంటనే, నీ శరీరం కనుక్కోబడే ఏర్పాట్లు చేసుకున్నావు. అదక్కడే కుళ్ళుతూ పడి ఉండటం నీకిష్టం లేకపోయింది’ అన్నలాంటి– నీవు జీవితపు ఉదంతాలను, అనుభూతులను, అలవాట్లను, వస్త్రధారణను, పడగ్గది వివరాలను – ఒకదానికొకటి సంబంధం లేకుండా చెప్పే కథనం కాబట్టి, కథకుడికి ‘నీవు’ గురించిన వ్యక్తిగత వివరాలు ఎలా తెలుసా!’ అన్న అనుమానం కలుగుతుంది. నవల ఆత్మహత్య అనే చర్యను ప్రశ్నించదు. కానీ, ఆ నిర్ణయం తీసుకున్న మనిషిని నిలదీస్తుంది. అయితే ఏ సమాధానమూ దొరకదు. యీ 104 పేజీల నవలికలో ఉన్న అధ్యాయాల చివర్న, నీవు కుండే ఇష్టాయిష్టాలు కనబడతాయి: ‘నవ్వు రక్షిస్తుంది. సంతోషం నిరాశ పరుస్తుంది. వార్తాపత్రికలు విసుగు పుట్టిస్తాయి’. ‘నీ మరణం తరువాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆమె శృంగారం జరుపుతున్నప్పుడు నీవు గుర్తుకొస్తావా! నీ పుట్టిన రోజున ఆమె ఏమిటి చేస్తుంది? నీ వర్ధంతి దినాన, నీ సమాధి మీద పూలు ఉంచుతుందా! ఇంకా నీ బట్టలు అట్టేపెట్టిందా?’ అన్న క్రూరమైన ప్రశ్నలు హృదయవిదారకంగా అనిపిస్తాయి. పుస్తకంలో కథకుడి వివరాలేవీ లేనప్పటికీ నవల వెనుక అట్టమీదున్న, ‘తన యీ చివరి పుస్తకపు అచ్చుప్రతి పబ్లిషరుకి ఇచ్చిన పది రోజులకి, రచయిత ఎద్వార్ద్ లేవే ఉరి వేసుకున్నాడు’ అన్న వాక్యాలే – నవలను పాఠకులు ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాయి. ‘నీవు’ అన్న పేరులేని వ్యక్తంటూ ఎవరూ లేరనీ, రచయితే తన రెండు పక్షాల వ్యక్తిత్వాలనీ సమర్థించుకుంటూ, అంతర్గత సంభాషణలు జరిపినవాడనీ అన్నవారు అనేకమంది. భయం పుట్టించే పుస్తకం కాదిది. జాలి కలిగించే ప్రయత్నం చెయ్యదు. వ్యాకులత, నిస్పృహతో బాధను విపరీతం చేయదు. వచనం సరళంగా, సాఫీగా ఉంటుంది. జాన్ సై్టన్, ఇంగ్లిషులోకి అనువదించిన యీ నవలికను 2011లో డాకీ ఆర్కైవ్స్ ప్రెస్ ప్రచురించింది. కృష్ణ వేణి -
తెలుగు సాహిత్యంలో చెరగని సంతకం రావిశాస్త్రి
–తెలుగువారికి అపూర్వ అక్షరసంపద అందించిన రావి శాస్త్రి –30న రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ఆవిర్భావం –రామతీర్థకు అవార్డు బహూకరణ కొన్ని రచనలు చదువుతున్నప్పుడు నవ్వు ఆపుకోవడం మనవల్లకాదు. మరికొన్ని ఇందుకు భిన్నంగా ఒకలాంటి విషాదంలో ముంచెత్తుతాయి. ఓ తెలుగు రచన చదువుతున్నంత సేపు పాఠకులకు నవ్వును, దుఃఖాన్ని, ఏకకాలంలో అనుభవంలోకి తీసుకురాగలిగిన రచయితల్లో రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనలేనని చెప్పాలి. ఆధునిక వచన సాహిత్యంలో ఆయనదొక ఆచార్యపీఠం. అయనొక కులపతి. రెండుమూడు దశాబ్దాల యువ రచయితలపై ఆయన రచనలు, వ్యక్తిగత ప్రభావం పడింది. ఇకపై మన సాహిత్యవీధులవలె విశాఖపట్నం వీధులు కూడా ఆయన లేని లోటు పూడ్చడానికి ఉత్తరాంధ్ర సన్నద్ధమైంది. కొన్ని దశాబ్దాలలో రావిశాస్త్రి సాహిత్యసష్టి తక్కువేమీ కాదు. సారోకథలు, సారా కథలు, ఖాకీ కథల వంటి కొన్ని వందల కథలు, రాజు–మహిషి, రత్తాలు–రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి వంటి నవలలు, నిజం, విషాదం,తిరస్కృతి వంటి నాటకాలు, ఇంకా ఎన్నో ఇతర రచనలు ఆయన తెలుగు వారికిచ్చి పోయిన సాహిత్య వారసత్వం. –విశాఖకల్చరల్ కళింగాంధ్ర మాండలిక రచనా చక్రవర్తి రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు సాహిత్యంలో ఆయన ఉండేడువంటి పేరుప్రఖ్యాతలు అనన్యమైనవి. విశాఖలో పుట్టిపెరిగిన రావిశాస్త్రిగారి గురించి ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవల దష్ట్యా రావిశాస్త్రి జ్ఞాపకాన్ని స్థిరస్థాయిగా ఉండేవిధంగా చేయాల్సిన బాధ్యత తెలుగు సాహితీ ప్రేమికులపై ఎంతైనా ఉంది. ముఖ్యంగా విశాఖ రచయితలకు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే రావిశాస్త్రి 95వ జయంతి రోజున (జూలై30న ) ఒక ప్రముఖ సాహితీవేత్తకు అవార్డు ఇవ్వాలనే సంకల్పం పుట్టింది. కొంతకాలం ఈ ఆలోచన నలుగుతున్నప్పటికీ రావిశాస్త్రి కుటుంబ సభ్యుడు (తమ్ముడు) రాచకొండ నరసింహ శర్మ, రావిశాస్త్రి కుమారుడు ఉమా కుమారశర్మ ముందుకు రావడంతో విశాఖలో ఉన్న సాహితీ ప్రముఖలంతా ‘రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్‌లో ఆచార్య చందు సుబ్బారావు, సాహితీ సురభి వ్యవస్థాపకుడు సాహితీవేత్త కల్యాణరామారావు, బహుభాషా సాహితీవేత్త, కేంద్ర సాహితి అకాడమీ అవార్డు గ్రహీత ఎల్.ఆర్.స్వామి, సాహితీవేత్త పి.జయశీలరావు, కవయిత్రి జగద్ధాత్రి తదితరులు సభ్యులు. సాహితీ మిత్రుల సహకారం చాలా గొప్పది విశాఖసాహిత్యమిత్రులతో కలసి నాన్నగారి ఆశయాన్ని ఆయన సాహిత్య గుళికల్ని సమాజానికి మరింత చేరువ చేసేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఏడాది భారత దేశంలో ఉన్న సాహిత్యసేవ చేసే సాహితీమిత్రులందరూ రావిశాస్త్రి అవార్డు పొందడానికి అర్హులే. రావిశాస్త్రి శతజయంతి మరో ఐదేళ్లలో రాబోతున్న ఈ తరుణంలో ఈ ట్రస్ట్ ఆవిర్భావం, అందుకు నగరానికి చెందిన సాహితీ మిత్రులు సహకరించడం ఈ ట్రస్టు ముందుకు కొనసాగుతుందని అభిలషిస్తున్నాను. –రాచకొండ ఉమా కుమార శాస్త్రి, ట్రస్ట్ నిర్వాహకులు అక్షర‘తీర్థం’..సముచిత సత్కారం నగరానికి చెందిన రామతీర్థ ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు,అనువాదకులు, ఆంధ్రాంగ్ల భాషల సాహితీవేత్త. సాహితీ సమావేశాల నిర్వాహకులు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రచయిత. ఆయనకు ‘రావిశాస్త్రి అవార్డు–2016’ ఇవ్వటం సముచితమని తెలుగు సాహిత్యలోకం ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది. –ఎల్.ఆర్.స్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సంతృప్తినిచ్చింది రావిశాస్త్రి 20 శతాబ్దాలు తెలుగు వచన సాహిత్యంలో మహా వటవక్షంలాంటివారు. ఇలాంటి చెట్ల కింద మొక్కలు మొలవని అంటారు కానీ..ప్రపంచ ధర్మంలో రావిశాస్త్రిగారి నీడలో తెలుగులో అనేకమంది కథకులు సమాజం గురించి,పేద బడుగు బలహీన జీవిత అవసరాల గురించి కళాత్మకంగా రాయడానికి ఎంతో స్ఫూర్తి పొందారు. అటువంటి రావిశాస్త్రి పేరిట ఒక ట్రస్ట్ ఏర్పడి, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తూ తమ తొలి ‘రావిశాస్త్రి అవార్డు–2016’ను నాకు ప్రకటించడం పట్ల నేను కూడా జీవిస్తున్న ఈ ఊరు, ఇక్కడి సాహిత్యలోకం నన్ను గుర్తించినందుకు ఒక సంతృప్తి ఉంది. ఈ స్ఫూర్తితో తెలుగు సాహిత్యానికి వెలుగు దివిటీలుగా మన ప్రాంతం నుంచి గత శతాబ్దంలో విస్తారమైన కృషి చేసిన సాహిత్యవేత్తల ప్రతిష్ట, ప్రయోజనం, ఇంకా ప్రజాపక్షంగా విశాలమయ్యేలా ఇది ఒక మంచి సందర్భంగా నేను భావిస్తున్నాను. ట్రస్ట్‌కు కతజ్ఞతలు. –రామతీర్థ, ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు ఆధునిక సాహిత్యాన్ని భుజాన వేసుకుని విశాఖలో ఆధునిక సాహిత్యాన్ని భుజానవేసుకుని మోస్తున్న రచయితల్లో రామతీర్థ ఒకరు. సమాజ హితానికే సాహిత్యం ఉపయోపగపడాలనే దీక్షాపరుడు. సామాజిక రచయితలైన శ్రీశ్రీ, రాచకొండ విశ్వనాథశాస్త్రి,ఆరుద్ర, సోమసుందర్, పురిపండా వారసత్వాన్ని కొనసాగించడానికి కషి చేస్తున్నవాళ్లలో ప్రధానమైన రచయిత. మంచి అనువాదాలు. సాహిత్యాన్ని విస్తృతమైన ప్రచారం కల్పించడానికి అహర్నిశలు కషి చేస్తున్నారు. స్వార్థం లేకుండా సాహితీ వ్యక్తుల ప్రాధాన్యత కోసం కృషి చేస్తూ, రచయితల్లో ఒక చైతన్యాన్ని నెలకొల్పడానికి నిర్విరామంగా పనిచేస్తున్నారు. విశాఖలో సామాజిక సాహిత్య వర్గానికి కొంత మేలు జరుగుతుందనే భావనతో రామతీర్థను ఎంపిక జరిగింది. –ఆచార్య చందు సుబ్బారావు, రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ సభ్యుడు నిరంతర చైతన్యశీలి రామతీర్థ సాహిత్యంలో నిరంతర చైతన్యశీలి. పాశ్చత్య సాహిత్యాన్ని కూడా బాగా చదివిన రచయిత. చదివి వదిలేయకుండా పాశ్యాత్యసాహిత్య ధోరణికి, భారతీయ సాహిత్యధోరణికి మధ్య గల తేడా, కారకాలను విశ్లేషించడం ఆయన ప్రత్యేకత. సాహిత్యోపన్యాసాలు చేస్తూ చైతన్య దీపికలను సిద్ధం చేస్తున్నారు. – కల్యాణ రామారావు, సాహిత్య సురభి వ్యవస్థాపక అధ్యక్షుడు రేపు రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ఆవిష్కరణ రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ తరఫున మొదటి రావిశాస్త్రి అవార్డు జూలై 30న విశాఖ పౌరగ్రంథాలయంలో జరిగే సభలో ట్రస్ట్ ఆవిర్భావం, అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్‌ను ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ప్రారంభించి ప్రముఖ కవి, సాహితీ విమర్శకుడు రామతీర్థకు ‘రావిశాస్త్రి–2016’ అవార్డును బహూకరిస్తారు.