
సాంస్కృతిక దాడులు ప్రమాదకరం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి
మలికిపురం: భౌతికదాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాపించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ కవిత్వోత్సవంలో శనివారం నాటికి 1,620 మంది కవులు పేర్లు నమోదు చేరుుంచుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు అధికమయ్యాయన్నారు.
అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది భాష ఒక్కటేనన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఆరు భాషలున్నాయని, ఏడో భాషగా తెలుగు చేరేందుకు మన కృషి చాలా అవసరమన్నారు.