నిజంగా ఆశ్చర్యపోయా.. | Sakshi
Sakshi News home page

నిజంగా ఆశ్చర్యపోయా..

Published Sun, May 26 2024 5:48 AM

Sambasiva Reddy Appreciat Of AP Government

 హైదరాబాద్‌లో ఉన్న నాకు ఫోన్‌చేసి కరువు సాయం ఇచ్చారు

ఆర్బీకే సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు

సచివాలయాల పనితీరు బ్రహ్మాండంగా ఉంది

సిఫార్సుల్లేవు, అవినీతికి ఆస్కారమే లేదు

ఈ శతాబ్దంలోనే ఇదొక విప్లవాత్మక మార్పు

ప్రజలకు కావాల్సింది ఇలాంటి వ్యవస్థే

‘సాక్షి’తో నాబార్డు రిటైర్డ్‌ జీఎం పి.సాంబశివారెడ్డి

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు.. అవి అందిస్తున్న సేవల కోసం పత్రికల్లో చదవడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇవి అందిస్తున్న సేవలు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప విప్లవాత్మక మార్పు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు..’ అని నాబార్డు రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.సాంబశివారెడ్డి ప్రశంసించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా, పైసా భారం పడకుండా ఏపీ సచివాలయ వ్యవస్థ ద్వారా తాను పొందిన లబ్ధిని ఆయన స్వయంగా ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే..

ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయా..
మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సింగనమల మండలం తూర్పు నరసాపురం. స్వగ్రామంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోనే ఉంటున్న మా సోదరులు నా భూమిని సాగుచేస్తున్నారు. నేను బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించాను. నాబార్డులో వివిధ హోదాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి జనరల్‌ మేనేజర్‌గా 2013లో రాష్ట్ర విభజనకు ముందు రిటైరయ్యాను. కుటుంబంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.

మా స్వగ్రామానికి వెళ్లి దాదాపు దశాబ్దం దాటిపోయింది. గ్రామంలో విశేషాలే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మా సోదరులు, బంధువుల ద్వారా తెలుసుకుంటుంటాను. గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత నేను మా గ్రామానికి వెళ్లలేదు. అయితే, గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి వార్తా పత్రికలతోపాటు మా సోదరుల ద్వారా తెలుసుకున్నాను. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్ని పనులు గ్రామంలోనే అయిపోతున్నాయని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు. 

పంట ఉత్పత్తులను కూడా గ్రామంలోనే కొంటున్నారని మా బంధువులు చెప్పగా విన్నాను. పత్రికల్లో కూడా అప్పుడప్పుడూ చూస్తున్నాను. ఇది నిజమేనా.. ఇంత మార్పు వచ్చిందా.. అని అనుకున్నాను. కానీ, స్వతహాగా నాకు ఎదురైన అనుభవంతో ఆశ్చర్యపోయాను.

సిఫార్సుల్లేకుండా పరిహారం..
గత శనివారం నా ఖాతాలో రూ.34వేలు జమైంది. ఆశ్చర్యపోయాను.. ఎక్కడో ఉన్న నా వివరాలు తెలుసుకుని నాకు ఫోన్‌ చేశారు. ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఎలాంటి సిఫార్సులు లేవు.. ఎవరికీ రూపా­యి ఇవ్వలేదు. నేరుగా నా ఖాతాలో కరువు సాయం జమైంది. ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు చూస్తుంటే నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పుగా అభివర్ణించొచ్చు. గతంలో విపత్తులు సంభవించిన సందర్భాల్లో పరిహారం కోసం రైతులు ప్రభు­త్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయా­ల్సి వచ్చేది. అడిగినంత దక్షిణ సమర్పిస్తే కానీ పరిహారం చేతికి వచ్చే పరిస్థితులు ఉండేవి కావు.

కానీ, నేడు అవినీతికి తావులేకుండా సచివాలయ సిబ్బంది ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం. రైతులకు సంబంధించిన సేవలే కాదు.. పౌరసేవలు కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పొలిమేర దాటకుండానే సామాన్య పౌరులు పొందగలుగుతున్నారని తెలిసి నిజంగా సంతోష­మేసింది. ఇలాంటి వ్యవస్థ కదా ప్రజలకు కావాల్సింది. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి నా అభినందనలు.

నమ్మశక్యం కాని రీతిలో..
పోలింగ్‌ ముగిసిన తర్వాత ఒకరోజు తూర్పు నరసాపురం గ్రామ సచివాలయం నుంచి ఆర్బీకే సిబ్బంది (రాజారెడ్డి) ఫోన్‌చేశారు. మన సింగనమల మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. భూ యజమానికి కరువు సాయం జమవుతుంది. మీ ఆధార్‌ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పండని అడిగారు. 

ముందు నమ్మలేదు.. మీకు నా ఫోన్‌ నంబరు, వివరాలు ఎవరిచ్చారు అని ఆరాతీస్తే.. గ్రామంలో మీ సోదరులిచ్చారని బదులిచ్చారు. ఆ తర్వాత వారితో క్రాస్‌ చెక్‌చేసుకున్న తర్వాత నమ్మకం ఏర్పడింది. అయినా ఆదాయపు పన్ను చెల్లించే నాకెందుకు కరువు సాయం వస్తుందని అడిగాను. లేదు సర్‌.. కరువు సాయం పంపిణీకి పన్ను చెల్లింపునకు సంబంధంలేదని బదులిచ్చారు. అయినా నమ్మకం కలగలేదు. లేదు సర్‌ మీ పేరిట ఉన్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశనగ వేశారు. కరువు ప్రభావంతో పంట దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని మేం రిపోర్టు చేశాం.. అందుకే కరువు సాయం మంజూరైందని వివరించారు. ఆ తర్వాత సిబ్బంది అడిగిన ఇతర వివరాలు చెప్పాను.

Advertisement
 
Advertisement
 
Advertisement