బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఘాతుకం
మృతదేహాన్ని పెన్నానదిలో పడవేసిన వైనం
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది.
భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది.
ఆభరణాల కోసం..
ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు.
ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు.
ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్‌చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment