krishna murthy
-
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
భర్త కాదు.. మృగం.. భార్యను దారుణంగా..
సాక్షి, బెంగళూరు: వరకట్న వేధింపులకు మరో అబల బలైన ఘటన నెలమంగల తాలూకా భూసంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. శ్రుతి (29) తన భర్త క్రిష్ణమూర్తి చేతిలో హత్యకు గురైంది. శ్రుతి తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.18 లక్షలు వరకట్నం ఇచ్చి అట్టహాసంగా పెళ్లి జరిపించారు. అయితే వివాహం జరిగిన మూడు నెలలు మంచిగానే ఉన్న క్రిష్ణమూర్తి తరువాత అసలు రంగు బయటపెట్టాడు. మరింత వరకట్నం తీసుకురావాలని శ్రుతిని వేధించసాగాడు. క్రిష్ణమూర్తికి అతడి తల్లి లక్ష్మమ్మ, తండ్రి బైలప్ప ఇద్దరూ వంతపాడేవారు. ఈక్రమంలో సోమవారం రాత్రి కట్నం విషయంలో భార్యతో గొడవపడ్డ క్రిష్ణమూర్తి కత్తితో శ్రుతిని దారుణంగా పొడిచి హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. యంగ్ జర్నలిస్ట్ మృతి) -
అవినీతి సామ్రాట్టుకు మూడు పోస్టులు
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి బంధువయిన అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అండదండలతో ఏకంగా మూడు పోస్టుల్లో కొనసాగుతున్న సంబంధిత అధికారిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఓ ఐఎఫ్ఎస్ అధికారికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడం సంబంధిత విభాగాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే..గుంటూరులోని రాష్ట్ర అటవీ దళాల అధిపతి (హెచ్వోఎఫ్ఎఫ్) కార్యాలయంలో ఫారెస్ట్ యుటిలైజేషన్ అధికారి (ఎఫ్‌యూవో)గా పనిచేస్తున్న బీవీఏ కృష్ణమూర్తి అదనంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఆప్కాస్ట్) సభ్య కార్యదర్శిగానూ, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఏపీఎన్జీసీ) డైరెక్టర్ పోస్టుల్లో ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముడుపుల కోసం కిందిస్థాయి ఉద్యోగులను వేధిస్తున్నారని, ఒకే పర్యటనకు వేర్వేరు విభాగాల నుంచి టీఏ, డీఏ బిల్లులు పొందారని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ అధికారిపై తీవ్ర విమర్శలున్నాయి. సదరు అధికారిపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఇలా ఆరోపణలున్న అధికారిని వాస్తవంగా అయితే ఫోకల్ పోస్టులో ఉంచరాదు. లూప్లైన్లో పెట్టాలి. కానీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఏకంగా మూడు పోస్టుల్లో కొనసాగుతుండడం గమనార్హం. లంచం తీసుకుని ఉద్యోగాలిచ్చారు.. ఆరుగురికి ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్కరి నుంచి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ వసూలు చేశారని ప్రభుత్వానికి ఆయనపై ఫిర్యాదులు వెళ్లాయి. అలాగే హైదరాబాద్ నుంచి అమరావతికి బదిలీ అయిన సందర్భంగా రెగ్యులర్ పోస్టు అయిన ఎఫ్‌యూవో నుంచి ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్సు (టీటీఏ) తీసుకోవాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా అప్కాస్ట్ నుంచి డ్రా చేశారు. ఇక్కడైతే ఆయనే హెచ్‌వోడీ అయినందున నచ్చినంత తీసుకోవచ్చనే భావంతోనే ఇలా చేశారని ఆరోపణలొస్తున్నాయి. టెండర్లు లేకుండానే అప్కాస్ట్లో కావాల్సిన వారికి పనులు అప్పగించి నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు ఇస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో తాము ఇరుక్కుపోతామంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఆయనను ఇన్చార్జి పోస్టు నుంచి తప్పించకపోతే మూకుమ్మడిగా సెలవుపై వెళ్లాల్సి ఉంటుందని ఉన్నతాధికారులతోపాటు మంత్రికీ మొరపెట్టుకున్నారు. రూ.6 కోట్ల నిధులు మురిగి పోవాల్సిందేనా? రాజమండ్రిలో రీజనల్ సైన్స్ సెంటర్‌కు కేంద్రం ఏడాది క్రితం రూ.6 కోట్లు మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకూ ప్రహరీ కూడా నిర్మించలేదు. ఈ నిధులు మురిగిపోతాయని ఆ సంస్థ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆ అధికారిని తక్షణమే అప్కాస్ట్ ఇన్చార్జి పోస్టు నుంచి తొలగించాలంటూ ఒక ఎంపీ అటవీశాఖ మంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కాగా బీవీఏ కృష్ణమూర్తిపై వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా భారీ అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం వాస్తవమేనని..అందుకే విచారణకు ఆదేశించామన్నారు. ఈ అభియోగాలపై విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఐఎఫ్ఎస్ అధికారి శాంతిప్రియ పాండేని ఆదేశించామని చెప్పారు. ఇన్చార్జి పోస్టు నుంచి తప్పించాలి కృష్ణమూర్తిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించినందున నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి, వాస్తవాలు బయటకు రావడానికి వీలుగా ఆయనను అప్కాస్ట్ సభ్యకార్యదర్శి, ఏపీఎన్జీసీ డైరెక్టర్ అనే ఇన్చార్జి పోస్టుల నుంచి తక్షణమే తప్పించాలని ఆయా సంస్థల ఉద్యోగులు కోరుతున్నారు. ఆయన్ని పోస్టుల నుంచి తప్పించి విచారణ జరిపితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెబుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
అనంతపురం సెంట్రల్ : నగరంలోని జాతీయ రహదారిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కృష్ణమూర్తి(20) దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. జాతీయ రహదారిలో రుద్రంపేట, కళ్యాణదుర్గం రోడ్డు మధ్యలో ఆదివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రుద్రంపేటలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు కృష్ణమూర్తి మృతిచెందగా అతని స్నేహితుడు మహేష్, ఖాసీలకు తీవ్రగాయాలయ్యాయి. బొలోరో వాహనంను ఓవర్‌టెక్ చేస్తూ వచ్చిన ఖాసీ అనే వ్యక్తి కృష్ణమూర్తి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. రెండు బైకులు వేగంగా ఢీ కొనడంతో ఎగిరిపడ్డాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన సవేరా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
అతడి పేరు మానవత
వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి. ‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి.‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి. సుధ మరీ డల్ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫినూ, కాఫీలు తెప్పించింది. ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను. ‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను. మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది. ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది. ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది. అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి.గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు. వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు. ‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి.‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’ ‘‘మెడ్రాసు. మహల్కెళ్లాలి మా మామగారింటికి’’. ‘‘పెసిడెంటువాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు. ‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు’’ సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది. ‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు. పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటుకు మీరు మా గడప దొక్కుతారా?’’ అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుదాఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు’. ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు.‘‘అతడు వెళ్లిపోయాడా?’’ ‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి. రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పి ప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు. ‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు. ‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి. ‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు. సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’. మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి! సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది? రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. ‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. వర్షం అవిరామంగా కురుస్తోంది. మహల్ గ్రామం చుట్టూ వున్న కొండలపై మబ్బులు బద్దకంగా దొర్లిపోతున్నాయి. ‘‘ఏమైనా నువ్వు యిలా వొంటరిగా వచ్చేయడం ఏం సబబుగా లేదు తల్లీ. నీ అదృష్టం బాగుండి కారు చిత్తూరు దగ్గర ఆగిపోబట్టి రాత్రి ఏ హోటల్లోనో ఆగి సురక్షితంగా రాగలిగావు యిదే ఏ రిమోట్ ప్లేస్‌లోనో జరిగుంటే ఏమయ్యేదో నీకర్థం కాదు’’ ఉదయం నుంచీ మాధవి, సుధనలా మందలించడం ఎనిమిదోసారి. ‘‘జరిగినదానికి తానూ బాధపడుతోంది కదవే, వదిలెయ్’’ అక్కను విసుక్కున్నాడు కృష్ణమూర్తి. సుధ మరీ డల్ అయిపోవడం గమనించిన మాధవి పాతభవంతి నుంచి పనిమనిషి చేత టిఫినూ, కాఫీలు తెప్పించింది. ఇంతలో గేటు దగ్గరెవరో తారాడుతుండడం గమనించి ముందుకు నడిచాడు కృష్ణమూర్తి. ఆ ఆగంతకుడెవరో వచ్చి వరండా మెట్ల మీదే నిలుచున్నాడు. సుధ నిర్ఘాంతపోయింది. వర్షంలో ఎంతగా తడవొచ్చునో అంతగానూ తడిసి వున్నాడతను. ‘‘రాత్తిరి బిత్తరంలో దీన్ని మరిసిపొయ్యినారు, బంగారపు వస్తువుగద! తొందరపడతావుంటారని మద్దానమే బయల్దేరినా మద్దిన ఈ వాన మల్లా పనిపాటు చేసింది’’ తన చేతిలోని బంగారుగొలుసును సుధ చేతికిస్తూ ఆలస్యానికి సంజాయిషీ యిచ్చుకుంటున్నట్టుగా అన్నాడతను. మాధవి అయోమయంగా సుధకేసి చూసింది. ‘‘వస్తున్నప్పుడు కారు ట్రబులిచ్చిందని చెప్పానుగా. అప్పుడు యితనూ యింకా కొందరూ వెనుకనుంచీ త్రోసారు. అప్పుడు పడిపొయ్యుంటుంది’’ తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ అంది సుధ. ఏదో పనివున్నదానికి మల్లే లోపలకెళ్లి కాట్ మీద బోర్లాపడింది. ‘అసలేం జరిగిందని కృష్ణమూర్తి అతణ్ని అడిగేస్తాడు. హోటల్లో ఆగిపోయినట్టు కల్పించి చెప్పినదంతా అబద్ధమని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత తల ఎత్తి మాట్లాడగలదా? ఐనా యితడిలా దాపురిస్తాడని తానేం కలగందా? పేద్ద నిజాయితీపరుడిలా పట్టుకొచ్చాడు.’ గడిచిన భయంకరమైన రాత్రి గుర్తుకు వచ్చింది. ఆకాశం పగిలినట్టు కుండపోతగా వర్షం. ఏడుగంటలే అయినా అర్ధరాత్రిలా ఉంది. చిత్తూరు నుంచీ మహలుకెళ్లే రోడ్డుమీద హెడ్‌లైట్స్ వేస్తున్న వెలుతురు మరక ఆధారంగా కారు దూసుకుపోతూంది. అరగంటలో మహల్లో వుంటానన్న నమ్మకం వొక్కటే సుధకు ధైర్యం యిస్తోంది. ఆమె భయాందోళనలకు పతాక ఘట్టంలా కారు రోడ్డుకడ్డం పడివున్న తాటిచెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఏడవడానికి కూడా నోరు పెగలడం లేదు. ఇంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో పక్కనున్న మిట్టమీద ఒక గుడిసె కన్పించింది. అయిదారు నిమిషాల విచికిత్స అనంతరం తెగింపు తెచ్చుకుని కారు లాక్ చేసి, సెనగ చేలు కడ్డంగా నడిచి గుడిసె చేరుకుంది. కొత్తమనిషిని గుర్తు పట్టినట్టు దొడ్డిలోని మేకలు అరిచాయి. గడపకు కొంచెం అటువైపుగా నులకమంచం మీద పడుకున్న మనిషి కన్పించాడు బోర్లా పడుకుని. నేలమీద పెట్టిన గోధుమరంగు పుస్తకం జూసి చూరుకు వ్రేలాడుతున్న లాంతరు వెలుగులో ఏదో పద్యాల్ని కాబోలు కూనిరాగంతో చదువుకుంటున్నాడు. వణుకుతూ యింట్లోకి జొరబడింది సుధ. అతడు లేచి నిలుచున్నాడు. ఇరవైకి మించని వయసు. నల్లటి శరీరం. వుంగరాల జుత్తు. ‘‘కారు నిలిచిపోయింది’’ అప్పుడే మాటలు నేర్చిన పసిపిల్లలా అంది. అతడు రోడ్డుకేసి చూపు సారించాడు. కన్ను పొడుచుకున్నా కన్పించని చీకటి. ‘‘ఎక్కడినుంచి వొస్తావుండారు?’’ ‘‘మెడ్రాసు. మహల్కెళ్లాలి మా మామగారింటికి’’. ‘‘పెసిడెంటువాళ్లింటికా?’’ వచ్చిన మనిషెవరో అర్థంగావడంతో అతడు మంచం మీద దుప్పటి దులిపివేశాడు. ‘‘కూచోండి. వొరసం ఈ రాత్తరికి తగ్గేట్టు లేదు. దూరం పయానాలకు బొయ్యేటప్పుడు అడమనిషి వొంటిగా వొచ్చుండగూడదు’’ సుధ ఇంకా ద్వారం వద్దనే నిలబడి చీర కుచ్చిళ్లను, పమిటను పిండుకోసాగింది. ‘‘పెట్లో మా ఆడోళ్ల కోకలుండాయి. మీ గుడ్డలు ఆరేవరకూ అవి కట్టుకుందురా?’’ అని ప్రశ్నార్థకంగా జూసి, చెక్కపెట్టి మీదినుంచీ ట్రంకును దించి వున్నవాటిలో మంచి చీరను తీసి ఆమెకిచ్చాడు. సుధ తటపటాయించడం చూసి, ‘‘ఈ తేమగుడ్డల్లో తెల్లారగట్ల నానితే రేపు మద్దానానికి జరం ఖాయం’’ ఆమెకు ఏకాంతం కల్పించడం కోసం కాబోలు, రావిఆకుల మోపును తీసుకుని మేకల దొడ్డిలోకి పోయాడు. పొయ్యి ముట్టించి ఎసరు బెడ్తూ, ‘‘మేము మాలోళ్లము, మా యిండ్లలో మీరు భోజనం జేద్దురా’’ అని నవ్వుతూ ‘‘కారు నిల్సిపోంగా యిట్టొచ్చినారుగానీ– చెన్నపట్నం పుట్టిమునిగితే మటుకు మీరు మా గడప దొక్కుతారా?’’ అతడు తనకంటే రెండు మూడేళ్లయినా చిన్నవాడుగా వుండొచ్చు. కానీ ఆ మాట్లాడుతున్న తీరు తనకన్నా యిరవై ముప్పై ఏళ్లు పెద్దవాడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. మరో పది నిమిషాల్లో వంట పూర్తి చేసి అతడు సుధను భోజనాని కాహ్వానించాడు. బాగా ఆకలయిందేమో గబగబా అన్నం ముగించింది. సొమ్మసిల్లినట్టుగా మంచం మీద వాలిపోయింది. హఠాత్తుగా ఏ రాత్రివేళప్పుడో మెలకువ వచ్చింది. గుడిసె కప్పు ఈదురుగాలికి లేచిపోయేలా ఉంది. అతడు నేలమీద పడుకుని వున్నాడు. చిరుగుల చాప. కప్పుకోను దుప్పటి లేదు. నిద్ర పోతున్నాడా? నటిస్తున్నాడా? విద్యుదాఘాతం తిన్నదానిలా గజగజ వణికిపోయింది. దుప్పటిని గొంతువరకూ లాక్కుంది. ‘అతడు తలుచుకుంటే యింకేమైనా వుందా? భగవంతుడా, నిరపాయకరంగా తెల్లారేట్టు చూడు’. ఉదయం అతడు మరికొందరి సాయంతో చెట్టును అవతలికి లాగించేశాడు. అందరూ పది గజాలు తోయగానే కారు స్టార్టు అయింది. లాంఛనంగా కృతజ్ఞత చెప్పుతూ రెండు పది రూపాయల నోట్లను అతని చేతిలో కుక్కింది. అతడు వారిస్తూ ఏదో చెప్పబోయాడు. కారు స్టార్ట్ అయిన ఉత్సాహంలో ఆ మాటలను సరిగ్గా విన్పించుకున్నట్టు లేదు. ‘‘అతడు వెళ్లిపోయాడా?’’ ‘‘మా మామయ్య కష్టపడి సంపాదించిన సొత్తు కాబట్టి మళ్లీ చేతికొచ్చింది. కృష్ణతో అతనికేమన్నా ఇచ్చి పంపమని చెప్పాను. భోజనం చేసి ముగ్గురమూ క్యారమ్స్ ఆడుకుందాం’’ అంటూ సుధ చేయి పట్టుకుని బంగళా నుంచి పాత భవంతిలోకి లాక్కుపోయింది మాధవి.రాత్రి గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టిన తర్వాత వీధి తలుపు తెరుచుకుంది. కృష్ణమూర్తి ‘నాగయ్యా నాగయ్యా’ అని పిలుస్తూ వరండాలోకి వచ్చాడు. వెనుకనే వచ్చిన రాజమ్మ ‘నాగయ్య సందేళ కూతురింటికి పోయినాడయ్యా’ అంది. కృష్ణమూర్తి వీధిలైటు వేశాడు. వరండాలో మూల ఎవరో నిద్రపోతున్నారు. అతణ్ని లేపాడు. ‘ఏమయ్యా, నువ్వింకా మీ ఊరికి పోలేదా? వానలో అంతదూరం పోలేక పొయ్యుంటావు. నువ్విప్పుడు మల్లిమడుగు వెళ్లి– మునసామి తెల్సునా? అతడితో చెప్పిప్రెసిడెంటు వాళ్లింట్లో ఎవర్నో తేలు కరిచిందని ఈడ్సుకురా’’ అన్నాడు.‘‘తేలా? నాకు తెలవని తేలు వైద్దమా? కొత్తకోట పెద్ద చెంగయ్య మా నాయినే గదా. బాటరీ ఒకటి తేండి. మందాకు పెరుక్కొస్తా’’ అన్నాడు. ‘‘ఏ ఆకో, దొరుకుతుందా’’ అన్నాడు కృష్ణమూర్తి. ‘‘ఈడలేకపోతే మావూరికన్నా పొయ్యి పెరక్కరానా. అయిదు నిమిసాల్లో వస్తా సూడండి’’. వర్షంలో చీకట్లో కలిసిపోయాడు.సుధ, మాధవి చేతిలో పడివుంది. కాళ్లూ చేతులూ చల్లబడ్డాయి. ‘ఏమని బయల్దేరిందో– అన్నీ గండాలే’. మరో పది నిమిషాల్లో మందాకు కోసం పోయినవాడు తలుపులు త్రోసుకుని లోపలికొచ్చాడు. ఆకులు దంచి మందు తయారుచేసి సుధచేత మింగించాడు. కిరోసిన్ దీపంలో ఆకువాడ్చి కాలికి కట్టు కట్టాడు. పావు గంటకు సుధకు స్పృహ వచ్చింది. రాజమ్మ కళ్లు తుడుచుకుంటూ ఆకులు దంచిన చోట శుభ్రం చేయసాగింది. ‘ఇదేదో కాగితం ఆకుల్తో బాటు దంచేసుండావు సూడు’. పెడనవ్వు నవ్వి వీధిలోకి గిరవాటేశాడు. రూపాయి నోట్లున్న జేబులోనే మందాకు కోసుకొచ్చాడు. నోట్లు కూడా ఆకుల్తో బాటే దంచబడ్డాయి! సుధ దీనంగా అతడికేసి చూస్తూవుంది. ‘‘నాకేమైనా పెట్టాలనిపిస్తే ఇంత అన్నం పెట్టించండి. నిన్న పొద్దున తిన్న అన్నమే. ఈ వొరసం పున్నాన పగులంతా కోమిటోళ్ల సత్రంలో గొంతు కూసొనుంటి. రాత్తిరి మనింటికాడ ఎవురన్నా బయటికొస్తారేమోనని దీపాలు ఆర్పేదాకా సూస్తావుంటి. ఈ పొద్దు నాకూ నా మేకలకూ ఉపాసమే’’ అన్నాడు. చెళ్లుమని చెంపదెబ్బ కొట్టినట్టయింది సుధకు. అతడు యింత చేసినందుకు తానేం చేయగల్గింది? రాజమ్మ అతని ముందు విస్తరి వేసి అన్నం పెడుతోంది. తలవాల్చుకుని బురద బురదగా వున్న అరుగుపై మిడికాళ్ల మీద కూచొని వున్నాడతను. అంతవరకూ దూరంగా పడుకున్న కుక్క అతని దగ్గరికొచ్చి తోకాడించసాగింది. ‘‘చివరకు కుక్కకు పడేసినట్లు నీకు యింత అన్నం పడేస్తున్నాం గదా’’ భోరున ఏడ్చేస్తూ సుధ అతణ్ని డైనింగ్ హాల్లోకి లాక్కుపోయింది. మహేంద్ర -
నిదుర లేని కల
కవిత కలకు నిదురకు మధ్య కలబోత లేని కలత ఒక్కటి నేత్రాలవే చూపులే వేరు తల్లి కనులలో తడి కనులలో ఇసుక తుపాను అనుకుంటాం కానీ అక్కడెక్కడో అపుడెపుడో తచ్చాడుతూ ఉంటాం కానీ గతం ఎవరి ఆర్ట్ వారు వేసుకునే తెల్లని గోడ చెలిమె ఇగిరిపోయిన చెలిమి యొక క్రీడామైదానం సేఫ్ రిట్రీట్ తెలీనపుడు జ్ఞాపకమొక విష సంకేతం మో అన్నట్టు హృదయం ఒక మర్మాంగం ఎవర్నని హలో అంటాం అన్నట్టొరే సూపర్లేటివ్స్ ఎప్పుడూ చిత్తభ్రమనే ( కవి కృష్ణమూర్తి ) -
పోలీసుల అదుపులో నయీం మరో అనుచరుడు
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం మరో అనుచరుడు కృష్ణమూర్తి అలియాస్ కృష్ణను సిట్ పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. నయీం అండదండలతో కృష్ణమూర్తి ముంబాయిలో ఓ అపార్ట్మెంట్, హైదరాబాద్‌లో నాలుగు ఇళ్లు, భువనగిరిలో మరో ఇల్లు, హైదరాబాద్ శివార్లలో వ్యవసాయభూమలు సంపాదించినట్లు సమాచారం. కృష్ణ నయీం బంధువు సలేమా బేగంకు అత్యంత సన్నిహితుడని తెలిసింది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. -
'బాబుకు ఓటేసిన ఫలితం అనుభవిస్తున్నారు..'
చంద్రబాబుకు ఓటేసిన ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కృష్ణమూర్తి అన్నారు. ఆయన గురువారం విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పాలెపువలస, వల్లాపురం తదితర గ్రామాల్లో పర్యటించారు. బాక్సైట్ తవ్వకాలతో ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. బాక్సైట్ మైనింగ్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు, టీడీపీకి ఓటేసిన పాపం ప్రజలను వెంటాడుతోందని చెప్పారు. గనుల పేరుతో సీఎం చంద్రబాబు ప్రజల పొట్టకొడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవనాధారమైన కొండలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. వెంటనే బాక్సైట్ మైనింగ్ ఆపేయాలని డిమాండ్ చేశారు. -
'డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు'
కర్నూలు: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటన మేరకే తమపై కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలంతో పోలీసు కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అణిచేస్తామని గతంలో డిప్యూటీ సీఎం బహిరంగంగా ప్రకటన చేశారని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అందరిమీదా కేసులు పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల ఓ ఫ్లెక్సీ కాల్చారని ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని.. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్న ఆక్రోశంతో నాయకులను భయపెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా కేసులు బనాయిస్తుందన్నారు. అంతకుముందు భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారని.. ఇంతలోనే మళ్లీ కేసు పెట్టారన్నారు. తప్పుడు ఫిర్యాదుతోనే భూమాపై కేసు పెట్టారన్నాడు. ప్రభుత్వోద్యోగి మీద నేర పూరితంగా ఏమైనా చేస్తేనే సెక్షన్- 353 నమోదు చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎందుకలా చేశారని అడిగితే అరిచి ఏం చేద్దామనుకుంటాన్నావని నాగిరెడ్డిని ఏకవచనంతో సంబోధించారన్నారు. అరెస్టు చేయమంటావా అని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నాగిరెడ్డి కూడా దీటుగా మాట్లాడారే తప్ప వాళ్లను తిట్టింది లేదన్నారు. ప్రభుత్వం పెట్టే కేసులకు కర్నూలు జిల్లాలో ఏ నాయకుడూ, కార్యకర్తా కూడా భయపడరని తెలిపారు. కేసులకు భయపడే వాళ్లు ఈ జిల్లాలో రాజకీయాల్లో రారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాను అసెంబ్లీ హక్కుల తీర్మానాన్నిప్రవేశపెడతామన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టుపై శనివారం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. -
నిలదీద్దాం
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి ప్రజల బాగోగులు చూడాలన్న తపన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజల సమస్యలను గాలికొదిలేసి అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేస్తూ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష ఎకరాలలో రాజధాని ఎక్కడా నిర్మించలేదని రాజధాని పేరిట అక్రమాలు, అన్యాయాలకు పాల్పడేందుకే అధికారపార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు వంద వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చాక ఐదు సంతకాలు చేశారన్నారు. ఆరునెలలు కావొస్తున్నా వాటిలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రంలో 1.29 కోట్ల రైతు ఖాతాలు ఉంటే అందులో లక్షలోపు రుణం తీసుకొన్న ఖాతాలు 1.22 కోట్లు ఉన్నాయన్నారు. వీటన్నింటికీ రుణం మాఫీ చేయాలంటే రూ.88 వేల కోట్లు అవసరమైతే ప్రభుత్వం బడ్జెట్లో కేవలం ఐదువేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించిందన్నారు. దీన్నిబట్టే ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటో అర్థమవుతుందన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక అనేకమంది ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. వెరిఫికేషన్ పేరుతో 10 లక్ష ల పింఛన్లు, 23 లక్షల రేషన్‌కార్డులను తొలగించారని ఆరోపించారు. నేను మారానని చంద్రబాబు పదే పదే చెబితే నమ్మి ఓట్లేసిన రైతులను, డ్వాక్రామహిళలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లే కపోయినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉందన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 5వ తేదీ కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. చంద్రబాబు హామీలు నమ్మి దగాపడ్డ రైతులు, మహిళలు, పింఛన్‌దారులంతా భారీగా ధర్నాకు తరలివచ్చి ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాసీమ బాబు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు నిత్యానందరెడ్డి, పులి సునీల్‌కుమార్, ఎస్ఎండీ షఫీ, చల్లా రాజశేఖర్, ఖాజారహమతుల్లా, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరిపై ‘కోడ్’ ఉల్లంఘన కేసు
జఫర్‌గఢ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మినర్సింహ రైస్‌మిల్‌పై సోమవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో ఆక్రమంగా నిల్వ ఉంచిన బెల్లం, పట్టిక, మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై బండారి సంపత్ కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాగరం కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి బజ్జూరి పద్మ భర్త కృష్ణమూర్తికి చెందిన రైస్‌మిల్‌లో బెల్లం, మద్యం నిల్వ చేశారు. పక్కా సమాచారంతో మామునూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో బెల్లం, పట్టికతోపాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన బజ్జూరి ఆశోక్, బజ్జూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి బజ్జూరి పద్మపై కేసులు నమోదు చేశారు.అలాగే టీబీతండా సమీపంలోని మార్కెట్ యార్డ్ గోదాంపై కూడా పోలీసులు దాడులు నిర్వహించగా బెల్లంతోపాటు గుడుంబా లభ్య మైంది. అక్కడ ఎంపీటీసీ అభ్యర్థి పద్మ, కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి వాంకుడోత్ పద్మకు సంబంధించిన ఎన్నికల నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా దొరికాయి. ఈ పత్రాలు పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముద్రించి నట్లు పోలీసుల విచారణలో బయటపడడంతో బజ్జూరి ఆశోక్, కృష్ణమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి పద్మతోపాటు ఆర్పీ యాక్ట్ కింద కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి పద్మపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నం దున పార్టీ అభ్యర్థులతోపాటు వివిధ రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సింగానివారిపల్లి(గాండ్లపెంట), న్యూస్‌లైన్ : చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక ఇబ్బం దుల వల్ల అర్ధాంతరంగా చదువు ఆగి పోవ డంతో మండలంలోని సింగానివారిపల్లికి చెం దిన కృష్ణమూర్తి కుమార్తె జే.నరసమ్మ(18) ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్హెచ్ఓ నరసింహులు కథనం మేరకు.. నరసమ్మ కదిరిలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది పూర్తి చేసింది. రెండో ఏడాది కొనసాగించడానికి ఆర్థిక సమస్యలు అడ్డంకిగా మారడంతో తాను చదివిం చలేనని తండ్రి నచ్చజెప్పాడు. ఇదివరకే పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. మూడో వాడైన కొడుకు ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లి బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లింది. ఈ నేపథ్యంలో శుక్రవారం తన తండ్రి గొర్రెలు మేపడానికి వెళ్లగా, ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోని విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి నరసమ్మ మృతి చెందింది. -
పంచాయతీ అక్రమాలపై విచారణ
ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీలో చోటు చేసుకున్న అక్రమాలపై డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. పంచాయతీ కార్యదర్శి ఒమర్ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించా రు. వ్యాపారి జాఫర్‌ఖాన్ 2004లో పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ గది కోసం చెల్లించిన రూ.50వేలు జమ కాలేదని, మార్కెట్ కమిటీ చెల్లించిన పన్ను రూ.38,748 డీడీ సిబ్బంది వాడుకున్నారని, పంచాయతీ కార్యదర్శి అనుమతి లేకుండా ఓ ఇంటి పేరు మార్చారని, షాపింగ్ కాంప్లెక్స్ డిపాజిట్ రూ.లక్ష వివరాలు లేవని, వీటితోపాటు పలు అంశాలపై కార్యదర్శి ఫిర్యాదు మేరకు విచారణ సాగింది. గతంలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ రాజ్‌కుమార్, బిల్‌కలెక్టర్ సుధాకర్‌లను పిలిపించి విచారణ జరిపారు. సర్పంచ్ కోవ లక్ష్మి నిబంధనలకు విరుద్ధంగా నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని అంటున్నారని చేసిన ఫిర్యాదుపైనా విచారణ చేశారు. విచారణకు సర్పంచ్ కోవ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఒమర్ హాజరయ్యారు. తనపై అట్రాసిటీ కేసు బనాయిస్తానని సర్పంచ్ బెదిరించారని, ఇక్కడ తాను పని చేయలేనని కార్యదర్శి ఒమర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై డీఎల్పీవో శ్రీనివాస్‌రెడ్డి సర్పంచ్ లక్ష్మిని వివరణ కోరగా.. గిరిజన మహిళా సర్పంచ్ కావడంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ వివరాలు జిల్లా పంచాయతీ అధికారికి నివేదిస్తామని డీఎల్పీవో తెలిపారు.